Wednesday, September 30, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎన్నిపూనుకొన్నాయో నన్ను మలవడానికి

ప్రభావమెంత చూపాయో కవిగ దిద్దడానికి

ననుగన్న తల్లిదండ్రులు వేంకటలక్ష్మీ అంజయ్యలు

నేపుట్టిన మా ఊరు ధర్మపురీ గోదావరీ

నను దయజూచిన పురవేల్పు నరహరీ


ఈమాత్రపు కవనానికి ఇవే మూలతరువులు

ఈ ప్రాభవ భవనానికి ఇవే కదా పునాదులు


1.పౌరాణికశ్రేష్ఠ లక్ష్మీకాంత శాస్త్రి తాత ప్రేరణ

అభినవపోతన శ్రీమాన్ వరదాచార్యుల దీవెన

సినారె ఎన్ గోపి ఇనాక్ గార్ల ప్రశంసా చేతన

సాహితీ బంధుమిత్రులందరి హార్దిక అభినందన


ఈమాత్రపు కవనానికి ఇవే మూలతరువులు

ఈ ప్రాభవ భవనానికి ఇవే కదా పునాదులు


2.సంగీతజ్ఞాని కొంటికర్ల నర్సయ్యగారి ఆలంబన

పాటకు బాణీలు కూర్ప రామయ్య శంకర్ సార్ల ఆదరణ

వెన్నుదన్నైన మా లక్ష్మణ్ సాయి స్నేహభావన

స్వరకల్పన నెరుగుటలో స్ఫూర్తిదాతల వితరణ


ఈమాత్రపు కవనానికి ఇవే మూలతరువులు

ఈ ప్రాభవ భవనానికి ఇవే కదా పునాదులు


*సాహితీ బంధుమిత్రుల స్పందనలకు సదా వినమ్ర ప్రణామాలు💐😊🌹🙏*

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంత సొబగులాడివే బాలామణి

అందమైన ఈర్ష్య పడునె అలివేణి

లేతచివురు రెమ్మవే పూతకొచ్చిన కొమ్మవే 

పదహారు ప్రాయాన పరువాల పుత్తడిబొమ్మవే

పదహారణాల తెలుగింటి ముద్దుగుమ్మవే

చక్కనమ్మవే చక్కెరశిల్పమంటె నీవే నమ్మవే


1.ముంగిలికే ముచ్చటౌ సంక్రాంతి రంగవల్లివి

గుమ్మానికి వన్నెలీను మావితోరణానివి

అందెలసందడితో ఇల్లంతా తిరుగాడే హరిణివి

సాంప్రదాయ తరుణివి నిండు కుంకుమ భరిణిని

పదహారణాల తెలుగింటి ముద్దుగుమ్మవే

చక్కనమ్మవే చక్కెరశిల్పమంటె నీవే నమ్మవే


2.పరికిణీ పేరణీ ఓణీ సింగారమొలికె నీతొ నీలవేణీ

ఉయ్యాలలూగ మెరిసెను నీ పదాల పారాణి

నీవున్న చోట నిత్యమూ పండగే పూబోణి

నడిమింట నడయాడగ నీవేలే మహారాణి

పదహారణాల తెలుగింటి ముద్దుగుమ్మవే

చక్కనమ్మవే చక్కెరశిల్పమంటె నీవే నమ్మవే