Wednesday, May 10, 2023

 

https://youtu.be/O8xdNj-J4A8

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:ఖరహర ప్రియ

అన్నపానాదులూ అన్నీ నీవె అన్నమయ్యకు
బంధుమిత్రాదులు అన్నీ నీవె త్యాగయ్యకూ
తపించారు బ్రతుకంతా  నీ కృపా దృక్కులకై
తరించారు గానామృతపాన చిత్తోన్మత్తులై

వేంకటేశ నాకందించు భక్తిసుధాంబుధి బిందువైనా
వెతను దీర్చి ఆదరించు అవసాన దశయందైనా

1.నాస్తికుడిని కాలేను ఆస్తికుడిగా నే మనలేను
సంశయాల సుడిలో చిక్కి బిక్కుబిక్కుమంటున్నాను
ఉంటేగింటే చేదుకో నరకమంటి ఈ ఊబి నుండి
సంకటాల్లొ ఆదుకో  కనికరముతొ నా తోడుండి

వేంకటేశ నాకందించు భక్తిసుధాంబుధి బిందువైనా
వెతను దీర్చి ఆదరించు అవసాన దశయందైనా

2.తన్మయంగ నిన్ను తలిస్తే పరవశించి పోతావు
ఆర్తిగా నిన్ను పిలిస్తే తక్షణమే అరుదెంచేవు
విశ్వాసమె నీకు ముఖ్యం నమో విశ్వపాలకా
శరణాగతి కోరామంటే కరుణింతువు దీనరక్షకా

వేంకటేశ నాకందించు భక్తిసుధాంబుధి బిందువైనా
వెతను దీర్చి ఆదరించు అవసాన దశయందైనా

 

https://youtu.be/VgcyX_OlO_s

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:రీతి గౌళ(మిక్స్)

అమ్మ కమ్మని భావన
అమ్మ చల్లని దీవెన
అమ్మ మనసే మెత్తన
అమ్మకిదే గీతార్చన

1.అమ్మతొ ప్రేగు బంధము
అమ్మ ఒడే ఆనందము
అమ్మే మనతొలి నేస్తము
అమ్మే మన నిజ దైవము

2.అమ్మ చూపిన త్రోవలో
అమ్మ మమతల రేవులో
అనునిత్యం  అమ్మ  సేవలో
బ్రతుకంతా అమ్మ తావులో

 

https://youtu.be/cMD9_gJ2Nqs

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

వెనక తిరిగి చూసుకుంటే పెదాలపై చిరునగవు
పునశ్చరణ చేసుకుంటే జీవితం సుఖదుఃఖాల నెలవు
అరవయేళ్ళ నా గతంలో అనుభూతులెన్నో
తీపి చేదు కలగలసి అనుభవాలు ఇంకెన్నెన్నో

1.సాధించింది ఏముంది కుటుంబాన్ని సాకడమే
పోగుచేసుకున్నది లేదు కవితల పొడ సోకడమే
తెలిసి మాత్రం ఎవ్వరికీ చేయలేదు నేనే కీడు
ఎరుగక మిము నొప్పిస్తే జాలితొ మన్నించుడు

2. వదిలించుకోవాలిక ఒకటొకటిగ బంధాలు
నెరవేర్చ యత్నించాలి ఎడతెగని బాధ్యతలు
నాతోనేను గడిపేస్తూ సాగాలిక నా…లో…లోకి
నేనెవరో గ్రహించి చేరాలిక ఆ స్వామి సన్నిధికి

 

https://youtu.be/dr8nu-esflg

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:బృందావన సారంగ

నా మనము నీవై అనుక్షణము
నీ మనము నేనై అనుదినము
మన మనములు వేరై మనము
దాంపత్యాన ఆధిపత్యం నీదన్నా నాదన్నా మనమేమనము

1.నా నిర్లక్ష్యాన్ని నవ్వుతొ నువ్వు సహిస్తూ
నీ సారథ్యాన్ని హాయిగ నేనూ భరిస్తూ
ముడులు మూడైనా మన జీవిత రథం
ముప్పై మూడేళ్ళైనా సాగుతోంది ఆనందపథం

2.ఆకాశంలో సగమంటే అసలేఒప్పను నేను
సంసారంలో సారం నీవని తప్పక చెప్పుదును
మోసేది నేనైనా నీవే జీవన మార్గదర్శివి
నామ్ కెవాస్తే నేనైనా నీవే కాపురాదర్శివి