Wednesday, February 5, 2020

కన్నతల్లి కడుపుకోత ఎవరికి తెలుసు
కన్నతండ్రి గుండె మంట ఎరిగినదెవరు
రుధిర సాగరాలే ఎగసీపడుతున్నాయి
అగ్నిపర్వతాలే బ్రద్దలౌతున్నాయి

1.శ్రీరాముడి వనవాసం పధ్నాలుగేళ్ళు
పాండవుల అజ్ఞాతం పన్నెండు నెల్లు
తీరలేని ఆవేదన బ్రతికినన్నాళ్ళూ
వరదలై పొంగేను రోజూ ఆపినా ఆగని కన్నీళ్ళు

2.మొక్కులెన్ని మొక్కినా దక్కని ఫలితం
ముడుపులెన్ని కట్టినా కరుణించడు దైవం
వైద్యులంత చేతులెత్తి నిస్సహాయులైనారు
మందులు మంత్రాలూ బూదిలొ పన్నీటి తీరు

3.ఎన్ని జరగలేదు జగతిలో అద్భుతాలు
ఎంతమంది నోచలేదు నమ్మలేని మహిమలు
ఓదార్పులు ఆర్పలేవు ఎదలోని కార్చిచ్చును
లేపనాలు మాపలేవు మనసుకైన గాయాలను

నిజమే బాగుంది ఊహకంటే వెంటనీవుంటే
ఎరుగనంటి నీవులేనిదేదైనా స్వర్గమంటే
అలా గాలివీచినా ఏటి అలను తాకినా
నిన్నుమించి ఉండదు ఆ అనుభూతి
తుషారం కురిసినా ప్రభాతం మెరిసినా
చలించదే నువ్వువినా నామతి
ఇవ్వవే సమ్మతి నీ ప్రేమనే గతి
చెరిగిపోదెన్నడూ నీ స్మృతి

1.గోదావరి ఇసుక తెన్నెలు
విహరించిన పుట్టిదొన్నెలు
పడమటి చెంగావి వన్నెలు
చెంగల్వల తలపించు కన్నులు
ఎలా మరచిపోగలనే ఆ తీపిజ్ఞాపకాలు
ఎలా మరలపొందేనో మనవైన లోకాలు
ఇవ్వవే సమ్మతి నీ ప్రేమనే గతి
చెరిగిపోదెన్నడూ నీ స్మృతి

2.మబ్బుననే రంగవల్లులు
అడ్డోచ్చే నీలి ముంగురులు
ఎగదోయగ గాజుసవ్వడులు
ఎదదోయగ నడుమున వడులు
తదేకంగ నిన్నే చూస్తూ నేను కరిగిపోయాను
తదేవలగ్నం కుదరకనే నేను మరిగిపోయాను
ఇవ్వవే సమ్మతి నీ ప్రేమనే గతి
చెరిగిపోదెన్నడూ నీ స్మృతి