Saturday, April 30, 2022

 https://youtu.be/nDZPaoOfXf4?si=gXtGlK6cRYfUyKIG


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మల్లెపూలకు ముళ్ళున్నా నే నమ్మగలను 

మకరందం చేదని అన్నా ఒప్పుకోగలను

చందమామ నల్లబడినా నే బాధపడను

పికము గొంతు నాలా మారినా విస్తుపోను

నువు కరుణజూడవంటే విశ్వసింతునా వేంకటేశ్వరా

నువు కావగ రావంటే నేనోర్తునా మా రమేశ్వరా

నారాయణ గోవిందా నమో వాసుదేవా

శ్రీవత్సాంకిత హే ముకుంద పాహి మాధవా


1. తీయగా మార్చగలవు ఉప్పునీటి బావిని

చల్లగా చేయగలవు మండుటెండ కాయు రవిని

ఇంపుగా చేర్చగలవు గాలికి పారిజాత తావిని

అన్నమయగ దయజూతువు శరణన్న ఈ కవిని

చిత్రమే కదలవంటె ఆర్తుల మొరలు విని

వింతయే నెరవేర్చవంటె భక్తుల మనవిని

నారాయణ గోవిందా నమో వాసుదేవా

శ్రీవత్సాంకిత హే ముకుంద పాహి మాధవా


2.దరిజేరావు ఎదిరిచూచు శబరి అనునయానికి

లాలించావు  ఉడతనైనా చిరుసాయానికి

వరమిచ్చావు కుబ్జకు తగు సమయానికి

సారథివైనావు కిరీటికి అని ధర్మ విజయానికి

న్యాయమా నను పరికించగా ఈ ప్రాయానికి

భావ్యమా నను దూరం చేయగా ఆరోగ్యానికి

నారాయణ గోవిందా నమో వాసుదేవా

శ్రీవత్సాంకిత హే ముకుంద పాహి మాధవా

Thursday, April 28, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నాకిచ్చుడేమి వద్దు బులిపిచ్చుడింక వద్దు

కాంతా కనకాలనసలు ఎరవేయగా వద్దు

నిన్నడుగుడు వదిలేసా ఆ చెడుగుడు మానేసా

సమర్పించ సిద్ధపడ్డా నా బ్రతుకు నీ పదాల వద్ద

అత్రి పుత్రా అనసూయ సూనా గురుదేవ దత్త దిగంబరా

అనఘా ప్రియా లీలాలోలా  త్రిమూర్తి రూప చిదానంద భవహరా


1.నాయిలాలు నీకడ నాలుగు వేదాలు

ఇంద్రియాలు మదముడిగి నీకు అధీనాలు

అరిషడ్వర్గాలెపుడూ నీకామడ దూరాలు

చేర్చగలవు సులువుగా భవసాగర తీరాలు

అత్రి పుత్రా అనసూయ సూనా గురుదేవ దత్త దిగంబరా

అనఘా ప్రియా లీలాలోలా  త్రిమూర్తి రూప చిదానంద భవహరా


2.కార్తవీర్యార్జుని గర్వభంగ మొనర్చావు

సురముని గణములను అబ్బర పర్చావు

అవధూతగ  అడుగడుగున దర్శనమిచ్చెదవు

గురు పరంపరకు నీవు ఆదిమూలమైనావు

అత్రి పుత్రా అనసూయ సూనా గురుదేవ దత్త దిగంబరా

అనఘా ప్రియా లీలాలోలా  త్రిమూర్తి రూప చిదానంద భవహరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తూగుతున్నావన్నది నన్ను లోకం

నేను తాగడమే ఎరుగనోణ్ణి అన్నది సత్యం

కమ్మేసిందన్నది జనం బొత్తిగా నన్ను మైకం

మత్తుమందు ముట్టనోణ్ణి అన్నది వాస్తవం

నిన్ను తలుచుకున్న అన్ని సమయాల్లొ నెచ్చలీ

నిన్ను కలుసుకున్నప్పుడల్లా నా మనోహరి


1.పిచ్చి పిచ్చిగీతలేవేవో గీస్తుంటానట

పచ్చి పచ్చి రాతలేవేవో రాస్తుంటానట

రచ్చరచ్చగా చిందేసి తెగ ఆడేస్తుంటానట

ఇఛ్ఛారీతిగ ఏ పాటలో ఆగక పాడుతానట

నా కన్నుల్లో నింపుకున్నా నిన్ను మాత్రమే

నా హృదయంలో దాచుకున్నా నీ చిత్రమే


2.పిచ్చుక గూళ్ళేవో కడుతుంటానట

సీతాకోక చిలుకల్ని పడుతుంటానట

పచ్చాని చిలుకలతో ముచ్చటలాడేనట

వెచ్చదనంకై వెన్నెల జలకాలాడెదనట

నీ కోసమే వెచ్చించానంతే నా జీవితం

నా ప్రేమను చేసేసా ప్రేయసీ నీకు అంకితం


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


హద్దు తప్పింది ముద్దరాల నా బుద్దే

వద్దు వద్దన్న వినకుంది ఈ పొద్దె

ముద్దంటు వద్దకొస్తే నన్నాపొద్దె

మద్దులొలుకు అందాల్ని ఇంకిత చేపొద్దే


1.కన్నుల్తొ కహానీలు చెప్ప బుద్ధి

చూపుల్తొ బాతాఖానీ వేయబుద్ది

ముక్కు జున్నుముక్కలాగ కొరక బుద్ది

పెదాల ఐస్ఫ్రూట్ ని చప్పరించ బుద్ది


2.చెంపల్ని చెంపల్తొ ఆన్చబుద్ధి

చెవులకున్న జూకాల్ని మీటబుద్ది

మెడవంపులో ఊపిరినొదల బుద్ధి

చుబుకాన్ని మునిపంట నొక్క బుద్ధి


3.ఎదమీద తలవాల్చి సేదదీర బుద్ధి

పిడికిట్లొ నడుముని ఇముడ్చ బుద్ధి

నాల్కెతో నాభిలోతు కొలువ బుద్ధి

మొత్తంగ ఇద్దరం ఒకటవ్వ బుద్ధి

Wednesday, April 27, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పట్టించుకుంటే వెంట పడుతున్నమంటరు

పట్టించుకోకుంటే లోన బెంగపడుతుంటరు

చిక్కొచ్చి పడ్డదే ఈ చక్కని చుక్కలతొ

చిక్కిపోక తప్పదు ఆ చిక్కనైన దృక్కులకు


1.సోగ కన్నులతో చేస్తుంటారు సైగలను

సొట్ట బుగ్గలతో వేయిస్తారు లొట్టలను

పంటినొక్కులతొ తెప్పిస్తారు తిప్పలను

మూతి విరుపులతొ కలిగిస్తారు ముప్పులను


2.పరేషాన్ చేస్తారు పదేపదే పైట సవరింపుతో

తమాషానే చూస్తారు చీర నాభి అమరింపుతో

మషాలా గుప్పిస్తారు గుంభనాల పలవరింపుతో

నిషా ఎక్కేలా చూపిస్తారు అందాలు చిలకరింపుతో

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా కవితకు కంటకం నీ ఎడబాటు

నా పాటకు సంకటం నిన్నుగనని లోటు

పదపదమున కదలలేక నా కలపు తడబాటు

ఏ క్షణమూ నను వదలక నీ తలపుల చొరబాటు

పరిచయమైతివేల గుండెను మండించ

ప్రేమను కురిపించవేల కలలను పండించ


1.కలిసిన మన అభిరుచులు కలిపెనులే మనసులు

కలవరమొందిగా ఊరటనిచ్చె నీ ప్రియ వచనములు

అలసిన తరుణాన వింజామరలాయే నీ చిరునగవులు

నీకదలిక నీమెదలిక నా కవనపు మేలి బిగువులు

చెలిమిని చేసితివే నా స్ఫూర్తిదాతగా

వేదన రేపితివే వరమీయని దేవతగా


2.నీవు మాత్రమెరుగవనా నా ఊపిరి నీవని

నా హృదయ చలన సూత్రమై మారితివీవని

కవిత సంగతేమొ గాని జీవితమిక దుర్భరము

సడలుతోంది నువు లేని బ్రతుకుఎడల నిబ్బరము

నీ చేతిలొ నా మనుగడ నిష్కమణ

చేయబోకె నెచ్చెలి నన్ను నిరాదరణ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిన్ను దీవించాలి నింగి దేవతలంతా

శతమానం భవతియని

ఆశీర్వదించాలి సకల మానవులంతా

చిరంజీవ చిరంజీవాయని

అందించాలి బంధుమిత్రులు శుభాకాంక్షలు

వర్ధిల్లాలి దినదినమూ ఆయురారోగ్యాలు

పుట్టినరోజు శుభాకాంక్షలివిగో హరీష్  భరద్వాజ

పెద్దల దీవెనాక్షతలివిగో గొల్లపెల్లి వంశ తేజ


1.నరదృష్టి పడకుండా నరసింహుడు కాచనీ

పరఘాత సోకకుండా  పరమేశుడు సాకనీ

అండగా ఉండనీ కొండగట్టు ఆంజనేయుడు

నిను ముందుకు నడపనీ వర  సిద్ది వినాయకుడు

పుట్టినరోజు శుభాకాంక్షలివిగో హరీష్  

పెద్దల దీవెనాక్షతలివిగో గొల్లపెల్లి వంశ తేజ


2.మనస్థైర్య మీయనీ నీకు శ్రీ మణికంఠుడు

నవ్వులు చిగురింనీయనీ షిరిడి సాయినాథుడు

సిరులతొ తులతూగనీయనీ శ్రీ మహాలక్ష్మి

మేధకు బలమీయనీ మాతా బాసర సరస్వతి

పుట్టినరోజు శుభాకాంక్షలివిగో హరీష్  భరద్వాజ

పెద్దల దీవెనాక్షతలివిగో గొల్లపెల్లి వంశ తేజ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మూగయే నాకన్నా ఎంతో మేలు

నిను పాడని నాగొంతు కంతను పోలు

నీపదములు నేనొదలను అమ్మా శారదా

నీపదముల సాధనలో తరించనీ నను సదా


1.మృదు మార్ధవ గళమునకై  

మరిమరి నే జన్మిస్తా

మధుర గాత్ర మరయగనే

తక్షణమే మరణిస్తా

ప్రాధేయపడితినమ్మా నిన్ను పదేపదే

పలుచన చేసితివే పరితపించ నామదే


2.కారునలుపు నీయనుంటివి

కోయిల గళమును వరమిచ్చి

గాయాలే చేయనుంటివి

వేణువుగా నన్నే మలచి

ఉరితీగలు భరింతును వీణగ నను మార్చివే

ఊపిరి నర్పింతును గొంతులొ సుధ చేర్చవే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంతటి వాడినని ననింతగ జేసినావు

అంతరంగమెరిగి నటుల ఆశలు దీర్చినావు

పొంతనలేదునా పనితనముకు ఫలితముకు

ఉన్నతంగ ఉంచినావు చింతనురానీక నా చెంతకు

శ్రీకాంత శ్రీహరి వేంకటాచలపతి

సతతము నే  నిలిపెద నిన్నే నా మతి


1.తండ్రివి నీవయి నను నడిపించినావు

తప్పులు చేసినపుడు దండించినావు

నాగుండెను నీదండలొ గుచ్చి మెడలొ వేసినాను

అండదండ నీవేయని దండిగ నిను నమ్మినాను

కొండెక్కి నినుజేరెద కొండలరాయా

కొండెక్కనీయకు నాభక్తి డంబునీయ


2.చిరునవ్వును నాటితే సిరుల పూలు పూసినావు

సాయమునందీయగ ఎందరికో బంధువుజేసినావు

సిద్దపరచు నా బుద్దిని సత్కర్మలు చేయునట్లు

పద్దులనెంచని మంచివిద్దెనీయి నీపదములు చేరునట్లు

ఇచ్చినదంతా నీదే స్వామి నీ ఇచ్ఛమేరకు

నచ్చినట్లు నను నడుపు చివరిశ్వాస వరకు

Friday, April 22, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చంపేంత క్రూరమా ప్రేమంటే

చచ్చేంత దైన్యమా ప్రేమంటే

కుదిరెనా జతగా చేరాలి ఆరాధిస్తే

చెదిరినా హితమునే కోరాలి ప్రేమిస్తే

ప్రేమంటే ఇష్టము  

కానేకాదు నికృష్టము ఇదిస్పష్టము

ప్రేమంటే సంతుష్టము

చేయవలదు సంక్లిష్టము కానీకు భ్రష్టము

ప్రేమంటే అదృష్టము


1.మనసు చూరగొనడం

మమత పంచుకొనడం

అనురాగమంటె ఆశించకపోవడం

వలపు దాచి ఉంచడం

వేచి వేచి ఉండడం

మరుజన్మకైనా నోచుకొనగ తపించడం

ప్రేమంటే ఆపారమైన ఇష్టము

ప్రేమంటే సంతుష్టము అదృష్టము


2.వెంటాడి వేధించడం

బ్రతిమాలి యాచించడం

ఒప్పుకోనప్పుడు ఆసిడ్ పోసెయ్యడం

బెదిరించి భయపెట్టడం

నమ్మించి వంచించడం

వాడుకొని ఆడుకొని పీకలు కోసెయ్యడం

ప్రేమ కాదు పైశాచికత్వము

ప్రేమ కాదు వెర్రి వైరాగ్యము

Thursday, April 21, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నయనాలు రాస్తాయి చూపులతో ప్రేమ లేఖలు

అధరాలు గీస్తాయి ముద్దులతో ప్రణయ రేఖలు

నీ అందచందాల్లో గతమెరుగని ప్రబందాలు

నీ హావభావాల్లో అపూర్వమైన  కావ్యాలు

ప్రేయసి నీవేలే నిలువెత్తు గ్రంథాలయం

పరువాల రాశీ నీఎదనే మన్మథాలయం


1.నీ నీలి కురుల భాష్యం శృంగార నైషధం

నీ అధర మకరందం విరహ బాధకు ఔషధం

నువు చెంత ఉన్నంత కాళిదాసు శాకుంతలం

నువు లేనివేళంతా మనసు అతలాకుతలం

ప్రేయసి నీవేలే నిలువెత్తు గ్రంథాలయం

పరువాల రాశీ నీఎదనే మన్మథాలయం


2.  అగుపింతురు నీలోనే అష్టవిధ నాయికలు

వగపు మించి ఆలపింతురు జయదేవ గీతికలు

నీ విలాసమందున ద్యోతకమౌ హరవిలాసం

నీవుంటే జీవితమంతా శాశ్వతమౌ వసంతమాసం

ప్రేయసి నీవేలే నిలువెత్తు గ్రంథాలయం

పరువాల రాశీ నీఎదనే మన్మథాలయం


PIC COURTESY: SRI Agacharya Artist

 

https://youtu.be/Xi6Cy-vTu-0?feature=shared

రచన,స్వరకల్పన&గానం:డారాఖీ


నా ప్రతి అవయవం సాంబశివం

నా కాయం పరమశివ మయం

నా ప్రాణం నాజీవం సదా శివం

దేహాత్మ భావరహితమై శివోహం శివోహం 

శివోహం శివోహం శివోహం అహరహం

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


1.మదము నదిమితె నాశిరం శివశంకరం

ముదము నోచని నాకనులు గంగాధరం

అదుపుతప్పెడి నా నాల్క నాగేశ్వరం

మధువులొలుకని నా గళం గరళధరం

శివోహం శివోహం శివోహం అహరహం

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


2.మమకార మయమై నా మనసు రాజేశ్వరం

స్వార్థపూరితమై నా తలపు అరుణాచలేశ్వరం

సాయమెరుగని నా కరద్వయం కాశీ విశ్వేశ్వరం

సరిదారినెరుగని నా పదయుగళి కేదారేశ్వరం

శివోహం శివోహం శివోహం అహరహం

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాటకు ప్రాణం పోయుదమా

పాడుతు ఎదలే మీటుదమా

ఆహ్లాదమొలికే రాగముతో

సాంత్వన పలికే భావనతో


1.శ్రుతిలో లయలో సమతుల్యతతో

అలతి అలతి పద ప్రాస రమ్యతతో

శ్రవణపేయమై లలిత గేయమై

రసికుల నలరించు రీతిగా

ఓలలాడగ మురిపించు గీతిగా


2.పల్లము పారే ఏరుగా పల్లవి తీరై

ఉల్లము పొందే హాయికి మారు పేరై

చరణాలు వడివడి సాగెడి రాదారై

ఎలుగెత్తి మైమరచి ఆలపించి

సహానుభూతితో పలవరించి


3.కోయిల కమ్మని పాటకు దీటుగ

జుమ్మను తుమ్మెద నాదపు సాటిగ

మార్ధవమే రంగరించి మాధురి మేళవించి

ప్రకృతిగా మేను పరవశించ

సుకృతిగా మనసు పులకరించ

Wednesday, April 20, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వర పుత్రులు శ్రుతి గాత్రులు

స్వర ద్రష్టలు గళ శ్రేష్టులు

అంగడిలో దొరకదు మాధుర్యము

సాధనతో అబ్బదు ఆ మార్ధవము

జన్మజన్మల పుణ్యమే ఆ అదృష్టము

అమ్మలాలి మధురిమే ఆ సుశ్రావ్యము


1.సహజమైన గమకాలు అమరడం

గొంతు నుండి తేనెవాన కురవడం

రాగతాళాలతో రమ్యత రాటుదేలడం

భావనతో మమేకమై గాన మొలకడం

జన్మజన్మల పుణ్యమే ఆ అదృష్టము

అమ్మలాలి మధురిమే ఆ సుశ్రావ్యము


2.అపాత్ర దానమని తలచవద్దు దైవం

వృధాగ మారనేల అపురూప పాటవం

ఎలుగెత్తి పాడితే శంఖానికి పరాభవం

మనోధర్మ సంగీతంతో గీతానికి ప్రాభవం

జన్మజన్మల పుణ్యమే ఆ అదృష్టము

అమ్మలాలి మధురిమే ఆ సుశ్రావ్యము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వీడికి మూడు నామాలు వాడికి మూడు నేత్రాలు

ఎంచిచూడబోతె సామ్యాలు ఇద్దరివొకటే సూత్రాలు గోత్రాలు

లీలామానుష వేషధారి ఒకడు

భోలా శంకర నటరాజు ఒకడు

మొక్కుతున్నా వాళ్ళనెపుడు లెక్కలేనన్ని మొక్కులు

తీర్చుకుంటె దిక్కులేదిక నాకున్న చిక్కులు


1.నది అంటే ఇష్టం వాడికి

కడలంటే ఇష్టం వీడికి 

నీరంటే ప్రీతే ఇద్దరికి

గిరులలో ఉనికి వాడికి

గిరులంటే తేలిక వీడికి

మొత్తానికి భూమే నచ్చును ఇరువురికి


2.కన్నులో నిప్పులు వాడికి

కడుపున జఠరాగ్ని వీడికి

అగ్గి ఎడల మొగ్గే ఇరువురికి

వాయువై లోనికి వీడు

ఆయువే తీయును వాడు

పంచ ప్రాణ వాయువులే ఉభయులు


3.విశ్వాకాశపు వ్యాపి వాడు

విశ్వాంతరాళ రూపి వీడు

శూన్యమంత ఆవరించిన శక్తి రూపులు

పంచభూతాలుగా వాడు

పంచప్రాణాలుగా వీడు

ద్వయతత్త్వాలూ ఒక్కడే ద్వయరూపీ అద్వైతుడే

Tuesday, April 19, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏకల్లె వచ్చి మేకల్లె గుచ్చుతారు

ఉండనీకి జాగనిస్తె పండ మంచమడుగుతారు

తిన్న ఇంటి వాసాల్నే లెక్కపెట్టుతారు

అక్రమంగ చొరబడితూ దేశామాక్రమించుతారు

నమ్మరాదు బాబోయ్ అసహనమనే వాదులను

నమ్మరాదు నమ్మరాదు ముసుగు చాటు మూకలను


1.ఉన్నచోట ఉండరు అన్నిట్లో తలపెడతారు

కావాలని రెచ్చగొట్టి రచ్చ రచ్చ చేస్తుంటారు

తమలాగ మారని వారికి బతుకు హక్కులేదంటారు

పచ్చనింట్లొ చిచ్చుబెట్టి తమలోకి లాక్కుంటారు

నమ్మరాదు బాబోయ్ అమ్మరొమ్ము గుద్దేవాళ్ళను

నమ్మరాదు పాలుత్రాగి విషం చిమ్ము ద్రోహులను


2.ఉసురు తీసుకుంటారు మూగజీవాలది

కసిగ మసిని పూస్తారు తమ అభిమతాలది

లోకువే ఘనసమూహాలు లౌక్యజగతిలో

ఐక్యతే కొరవడిపోతే అపఖ్యాతి భవితలో

నమ్మరాదు బాబోయ్ నవ మానవ మర్కటాలను

నమ్మరాదు సవాళ్ళతో సఖ్యత త్రెంచే

ముష్కరాలను

Monday, April 18, 2022

 వగలే సింగారమాయే

వగరే నయగారమాయే

వగపు నాకు స్వీకారమాయేమి

వలపు మాట బంగారమాయేమి


ఓ గోపిక పరికించకు నా ఓపిక

ఓపలేను నినుగనక ఓ క్షణమిక


1.అల్లనేరేడు పళ్ళ నీ కళ్ళ మీదనే నాధ్యాస

నోరూరే బూరెల చెక్కిళ్ళ మీద నాకెంతో ఆశ

పనసతొనలు నీ పెదాలు ఉవ్విళ్ళూరించేను ఆ మిసమిస

చెఱకు గడలొ మాధుర్యం- నీ రసన గ్రోల నా రసన నస


ఓ గోపిక పరికించకు నా ఓపిక

ఓపలేను నీ విరహపు తీక్షణ యిక


2.దాహం తీర్చగ అందించు ముందు పాలకుండలు

ఆ వెనకే సిద్ధపరచు సేదదీర ఉబ్బెత్తు ఇసుక దిబ్బలు

నడుమన నాకిష్టం మెత్తనీ మడతల మీగడలు

తేనె నాస్వాదించగ కడుపొక్కిలి దక్కగ రగడలు


ఓ గోపిక పరికించకు నా ఓపిక

ఓపలేను నీ ఎడబాటు నిరీక్షణయిక

Sunday, April 17, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒకే వైపు నీ యోచన

అదే పనిగ నీ యాచన

ఓపలేని తీపి యాతన

నీ పిలుపు వలపే నాకు చేతన


1.ఏ దే మై పోయినా

కాలం తో నే పోరినా

కత్తిమీద సాము నాకుగ కోరినా

కన్నీటి మడుగే మరి ఏమారినా


2.సమయం సహకరించక

నాకేటూ మనస్కరించక

డోలాయమానమాయెనా ఎద ఇక

విధే తీర్చునొకనాడు  మన వేడుక

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీవు నాకే సొంతము-జీవితపర్యంతము

నీతో అనుబంధము-పూర్వజన్మ సంబంధము

ఈగైనావాలకుండా నిను కాచుకుంటా

నీకాలు కందకుండా నే చూసుకుంటా

నీసర్వహక్కులు నావే నీ బరువు బాధ్యత నాదే

నా ఆస్తిపాస్తివి నీవే చెలీ నా జాన్ దోస్తువు నీవే


1సూర్యకిరణం నిన్నుతాకినా ఓర్వలేను ఓ క్షణమైనా

మలయపవనం నిన్ను సోకినా తాళలేను ఓ నా మైనా

గుండెలోన దాచుకుంటా ఎవ్వరికీ చిక్కకుండా

నా మనసుగ మార్చేస్తా పరులకు ఇక దక్కకుండా

ఈ మాత్రం  ప్రేమ ఉంటే ఆ మాత్రం అసూయ సహజం

నీవంటి చెలి ఆలైతేనో స్వార్థమవద ఒంటి నైజం


2.దేవతలా ద్యోతకమవుతే నీ ఎడల భక్తే జనులకు

యోగినిలా దర్శనమిస్తే ఆరాధన యతులకు మునులకు

నే రాసే ప్రతిగీతంలో నిను స్తుతిస్తు వర్ణన చేస్తా

నా కవితలొ పదములను హృదయంలొ ముంచిరాస్తా

ఈ మాత్రం నను కరుణిస్తే ఆమాత్రం సేవచేయనా

నీలో నేనైక్యమైపోయి అద్వైతపు భావమందనా

Saturday, April 16, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏడు జన్మల తోడు ఏడు కొండలవాడు

ఎడబాయని మిత్రుడు శ్రీ శ్రీనివాసుడు

ఎలమి అలమేలుతో కూడి చెలఁగెడివాడు

ఏకాదశి వ్రతమున్నచాలు ప్రీతిజెందెడివాడు

ఏడేడు లోకాలకాప్తుడు భవతాప హరుడు


గోవిందుడు గోవిందుడు సుందరాకారుడు

గోవిందుడు గోవిందుడు భక్తమందారుడు


1.ఏనాడు ఏ పాపమే రీతిచేసేమో

ఏచోట ఏదోషమెందకొనరించితిమో

ఎక్కడకు వెళితేమి దక్కదేమాత్ర పుణ్యము

ఎక్కినంతనె గిరులు ముక్తి బొందుట తథ్యమ


గోవిందుడు గోవిందుడు కరుణాంతరంగుడు

గోవిందుడు  గోవిందుడు భవసాగర నౌకా సరంగుడు


2.ఎదుట స్వామి కనబడితే ఎదకెంతో మోదము

ఎన్నగ  ఎవరి తరము పన్నగశాయి చరితము

ఏకాగ్రచిత్తమే స్వామిని చేర్చెడి ఋజు మార్గము

ఎరిగి మెలిగినంత జనులు పొందగలరు మోక్షము


గోవిందుడు గోవిందుడు అరవింద నేత్రుడు

గోవిందుడు గోవిందుడు శరణాగత త్రాణుడు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువ్వేమో బిజీ బిజీ

నా మదిలో గజిబిజి

నిను చూడక పడలేను పరిస్థితులతో రాజీ

నను బుజ్జగించ  జూసి అలసె -మా ఇంటి సన్నజాజి


1.పున్నమి నాడే నింగిలో నిండు జాబిలి

నీ శశివదనాన నిరతము వెన్నెలే నాచెలి

తాళజాల నువులేక ఈ మండు వేసవి

నీవు నాతావునుంటే చిరుగాలి విరితావి

నువ్వేమో నల్లపూస

నాకేమో నీదే ధ్యాస


2.వనమున మంజులము సౌరభము గులాబి

రసనకు కడుమధురము కమ్మదనము జిలేబి

అదికన్నా ఇదితిన్నా ఔనన్నా కాదన్నా నీదే తలపు

ఎన్ని ఉన్నా నీవులేక గడుపుట గగనమే ప్రతిమాపు

నీకు నేను మామూలే

నువ్వు పంచప్రాణాలే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఉదయరవిచంద్రిక


ఇంటింటి దేవుడు మాయింటి దేవుడు

యుగయుగమందునూ కనిపించు దేవుడు

శ్రీరామ భక్తుడు మా వీరాంజనేయుడు

కొండగట్టులోనా కొలువై యున్నాడు

గుండెగుండెలోనూ స్థిరవాసముంటాడు


వందనాలు వందనాలు అంజనానందన

సుందరాకాండ ధీర మాకు ఆనందమీయర


1.త్రేతాయుగములో సీతారాములకు వారధియైనాడు

ద్వాపరమందున పార్థుని రథమునకు కేతనమైనాడు

రామ భజన వినిపించిన తావేదైనా ప్రత్యక్షమౌతాడు

రోమరోమ మందున రాముని నిలుపుకొన్న పవనాత్మజుడు

శ్రీరామ భక్తుడు మా వీరాంజనేయుడు

కొండగట్టులోనా కొలువై యున్నాడు

గుండెగుండెలోనూ స్థిరవాసముంటాడు


వందనాలు వందనాలు అంజనానందన

సుందరాకాండ ధీర మాకు ఆనందమీయర


2.పెదవులపై రామ స్మరణ ఎప్పుడూ తప్పనివాడు

హృదయములో శ్రీ రాముని ప్రతిష్ఠించుకున్నవాడు

సూర్యుడినే పండుగా మ్రింగేసిన ఘన శూరుడు

సిందూర ధారణతో సీతమ్మను అలనాడు అబ్బురపరచిన వాడు

శ్రీరామ భక్తుడు మా వీరాంజనేయుడు

కొండగట్టులోనా కొలువై యున్నాడు

గుండెగుండెలోనూ స్థిరవాసముంటాడు


వందనాలు వందనాలు అంజనానందన

సుందరాకాండ ధీర మాకు ఆనందమీయర

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కనులలో ఏదో తెలియని కసి ఉంది

మనసునే మరీ మరీ ఉసి గొలుపుతోంది

అందం మాత్రమే నీ సూత్రంకానే కాదు

నీ ఆకర్షణ ఎవ్వరినైనా చిత్తు చేయకపోదు

 

1.కన్నులనొదిలెయ్ కురులదే కట్టిపడేసే ఘనత

ముంగురులేమో లేమా నీ ముక్కుపుడుకదే గొప్ప

పెదవుల పాత్రా తక్కువె కాదు చూపుకె ఆరును నా మోవి

అధరాలటుంచి మత్తులొ ముంచును నీ

మేని తావి


2.దబ్బపండు ఛాయ ఒళ్ళు అబ్బా… అనిపించు

పట్టులాంటి ప్రతితావు తనువును తాకు

తపనే పెంచు

తమలపాకు తలపించే పాదాలు ఎంతో మురిపించు

అణువణువున ఆమని సొబగే అనవరతం నీలో

వికసించు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


విరి బుట్టలో కూర్చున్న ఓ బుట్టబొమ్మ

పలువన్నెలు రువ్వుతున్న పూలకొమ్మ

ఏడు రంగులున్న నింగి సింగిడి నీవమ్మా

సప్తవర్ణ సంకీర్ణ శ్వేత కిరణమే నీవమ్మా


1.నా సప్తవ్యసనాల సంకలనం నువ్వు

సప్తస్వరాల సమ్మిళితం గలగల నీ నవ్వు

సప్తమహా ఋషులైనా దాసులౌదురంటె నమ్ము

సప్తగిరీశుని చలవతో నను నీవాడినవనిమ్ము


2.సప్తపదే నడవగ నీతో పదే పదే మదికోరే

సప్తతాళాలలో హృదయం నీకై సందడి చేసే

సప్త సముద్రాలొకటైనా మారదు నా తీరే

సప్త ముక్తిధామాలే ఇల నీవుగ సమకూరే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నవ భారత నిర్మాత-రాజ్యాంగపు నిర్ణేత

బహుజనులకు వెలుగిచ్చిన దివ్యజ్యోతి

సబ్బండవర్గాల ఆశాజ్యోతి అసాధారణ ప్రజ్ఞాజ్యోతి

నేడు అంబేద్కర్ మహాశయుని జయంతి

యుగాలు మారినా చెదరదు ఆయన ఖండాంతర ఖ్యాతి


1.అట్టడుగు వర్గంలో జనియించినా

వెనకడుగేవేయలేదు ఏనాడు

అంటరానితనం వింతరోగమంటూ

సమాజానికెదురొడ్డి నిగ్గదీసినాడు

ఉన్నత చదువులు చదివి దేశానికె వన్నె తెచ్చినాడు

గాంధీజీ ఎదుటనిలిచి తన తత్వం తెలిపినాడు


2.ప్రపంచాన అతి పెద్దదైన 

రాజ్యాంగం పొందుపరిచాడు

హక్కులు బాధ్యతలను విధిగా 

దేశ పౌరులకేర్పరచినాడు

కులమత రహితమైన సమాజానికై పోరు సలుపినాడు

అసాధ్యాలనెనన్నొ సుసాధ్యాలుగా మలచిచూపినాడు

Wednesday, April 13, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గాలిమోటరెక్కిస్తా

సంద్రాలు దాటిస్తా

దునియ మొత్తమంతున్న

దుబాయికే తోల్కపోత

రాయే రాయే నా రంగసాని

సూసినాంక కాకెమరి పరేషాని

రాయే రాయే నా రంగసాని

కొత్తగా సూపిస్తా జీవితాన్ని


1.బంగారుగాజులని సంబరంగ కొనిపెడ్తా

రవ్వల నకిలేసుని మెడలో దిగబెడ్తా

కాళ్ళకు ఘలుఘల్లు గజ్జలనే చేపిస్తా

నడుముకు ఒడ్డాణపు నగనే పెట్టేస్తా

చమకు చమకంటూ మెరిసే 

చీరలెన్నొ నీకు ఇనాంగ నేనిస్తా

రాయే రాయే నా రంగసాని

రాలుగాయివే నా ఇంటి రమణి


2.ఖజ్జూరపు చెట్టంటి దీవులను జూపిస్తా

బుర్జు ఖలీఫా బిల్డింగును ఎక్కిస్తా

ఎన్నడూ  నువ్వు తినని రుచులన్ని

కమ్మ కమ్మగ నీకు కడుపార తినబెడ్తా

ఒంటెల బండిగట్టి ఎడార్లో తిప్పిస్తా

మన జంట అందంతొ జనాల్నే మెప్పిస్తా

రాయే రాయే నా రంగసాని

మస్తుగుంటది జిందగి నీతోని


PIC courtesy: Agacharya Artist

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తలమునకలుగా నీవు నీ పనులలో

నీ తలపులే ఊపిరిగా నే తపనలో

నీ మనసులో ఏమున్నదో ఎరిగించవు

నా ఎదలయ ఏమంటున్నదో గ్రహించవు

ఎలాచావనే నీతో నను మరి'చావనే వెతతో


1.తొలిచూపులోనే నాదానివిగా భావించాను

నన్నాదేశించే వేదానివిగా తలదాల్చాను

అనుక్షణం నీవే నా మోదానివిగా తలపోసాను

నను నడిపించే మేధావినిగా ఆరాధించాను

ఎలా చావనే నీతో నను విడిచావనే దిగుల్తో


2.మాటతప్పుతుంటావు మాటిమాటికీ ఎందుకో

బాస మరచిపోతావు పదేపదే ఎందుకో మరెందుకో

సాధ్యమో అసాధ్యమో ఈ జన్మకి మన కలయిక

కాలం కరుగుతుంటే నా ఓపికనే కరిగే కల ఇక

ఎలా చావనే నీతో -   బ్రతుకన్నా చావనే భావనతో

Tuesday, April 12, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మానవ అవతారమెత్తిన అమ్మోరువో

నిండైన దైవత్వం నింపుకున్న దేవేరివో

కదలదు నా దృష్టి క్షణమైన నీనుండి

కరుణించావు నేకన్న కలలు పండి


1.తిలకము మీద చూపు సారించునంతలో

కనులే చేసేను కనికట్టులేవో

నయనాల మత్తులో మునిగిపోయేంతలో

అధరాల అరుణిమే రేపేను ఆకర్షణలేవో

సాక్షాత్తునీవే సౌందర్య లహరివే

ప్రత్యక్షమైన అపర పరమేశ్వరివే


2.ముక్కెర ఒక్కటే కొక్కెము వేసేను చిక్కగ నా దృక్కులకు

చక్కని నీ నగవే హాయిని గొలిపేను మిక్కిలి హృదయముకే

పంచభూతాత్మికవు ప్రపంచ ఏలికవు

శాంతించిన కాళికవు ఆనందపు గుళికవు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సూదంటురాళ్ళు చక్కని నీ కళ్ళు

చూసేకొద్ది పుట్టు ఎదలో ఎక్కిళ్ళు

కవి తల వెలిసే కవితల పుట్టిళ్ళు

స్వప్న సౌధాలకే అందాల లోగిళ్ళు

దనివారదు నిను గాంచ రేయింబవళ్ళు


1.కొత్తగా చూస్తున్నా కలువలకున్న ముళ్ళు

విస్తుపోతున్నా  మీనాలాయే నీలొ నర్తించే నెమళ్ళు

గులాబీలు పూస్తున్న  చిత్రమైన చెక్కిళ్ళు

అంతలోనె నవ్వుతుంటె బుగ్గల వింత సొట్టళ్ళు

దనివారదు నిను గాంచ రేయింబవళ్ళు


2.నడుమొంపులోనా సెలయేటి పరవళ్ళు

నాభి కనగ సహకరించు దోపిన కుచ్చిళ్ళు

ఆరావళి మేరుగిరుల ఇరుపక్కల ఆనవాళ్ళు

మంటలేక చలికాగగ బాహుబంధ నెగళ్ళు

దనివారదు నిను గాంచ  రేయింబవళ్ళు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పలుకనీ పలుకనీ పలుకని నా నాలిక

పలుకనీ పలుకనీ పలుకలేని గొంతుక

పలుకనీ పలుకనీ భవతారకమౌ నీ మంత్రాలిక

పలుకనీ  సదా పరవశమొలికించెడి నీ నామాలిక

పలుకీయమనుట పలుకనీయమనుట

ఔతుందా స్వామీ గొంతెమ్మకోరిక


1.పలుకనీ నా పలుకులు నిను స్మరియించగా

పలుకనీ నా తలపులు నిను స్ఫురియించగా

పలుకనీ నా చూపులు నిను స్పృశియించగా

పలుకనీ నా పలుకులు నేనిక తరియించగా

పలుకీయమనుట పలుకనీయమనుట ఔతాయా స్వామీ హిరణ్యాక్షవరములిక


2.పలుకనీ నా పలుకులు నీపై తేనియలొలుకగా

పలుకనీ నా పలుకులు నీ మేన గంధము చిలుకగా

పలుకనీ నను నిన్నే మనోవాక్కాయ కర్మలలో

పలుకనీ  నిన్నే అజన్మమొందుదాక జన్మజన్మలలో

పలుకీయమనుట పలుకనీయమనుట 

ఔతుందా స్వామి త్రిశంకు స్వర్గమంటి బ్రాతిక

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గోవిందనాముడు సుందర వదనుడు

అరవింద నేత్రుడు నిజ భక్తవరదుడు

ఎందుగానరానివాడు డెందమందె ఉంటాడు

సందుదొరికితెచాలు బంధనాలు వేస్తాడు

వందనాలు వందనాలు ముకుంద మురారికి

సాష్టాంగ వందనాలు శంఖ చక్రధారికి


1.ఉన్నచోట ఉండనీయడు తిన్నగా యోచించనీయడు

ఎండమావుల వెంట పరుగులు తీయిస్తాడు

 రాయిలాగ ఉలకడు పలకడు రాలుగాయి కొండల రాయుడు

రాగద్వేషాల వలలొ చిక్కుబడగజేస్తాడు

వందనాలు వందనాలు ముకుంద మురారికి

సాష్టాంగ వందనాలు శంఖ చక్రధారికి


2.మాయలెన్నొ చేస్తాడు మత్తులోన ముంచేస్తాడు

చెడ్డదార్లు తొక్కేలా మనల మభ్య పెడతాడు

మా దొడ్డ మారాజు మా వడ్డికాసులవాడు

దీనులకిల దిక్కైన ఆపద మొక్కులవాడు

వందనాలు వందనాలు ముకుంద మురారికి

సాష్టాంగ వందనాలు శంఖ చక్రధారికి

Wednesday, April 6, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎక్కడో చూసినట్టు ఉంటుంది

ఎప్పుడో కలిసినట్టు ఉంటుంది

స్మృతిపథం నుండి మాయమౌతుంది స్నేహితం

మెదడు అట్టడుగుపొరల్లో నిక్షిప్తమౌతుంది నేస్తం

తాజాదనం కోల్పోయి వాడిపోతుంది సోపతి

ఎదగని ఒక పిందెలాగా రాలిపోతుంది చెలిమి


1.మైత్రీవనంలో నిత్యం పూలెన్నొ పూయించాలి

రకరకాల పూలమొక్కలు ప్రేమగా పెంచాలి

ఏ తెగులు పట్టకుండా జాగ్రత్తగ పోషించాలి

తగినంత నీరందించి ఎదిగేలా చేయాలి

ఏమరుపాటన్నది  ఏపూటకు తోటకి చేటే

గాలికి వదిలేసామంటే చెడిపోవుట పరిపాటే


2.పలుచూపుల ముళ్ళున్నా గులాబిలా విరియాలి

నాగులతో హానిఉన్నా నవ్వుల మల్లెలు రువ్వాలి

గుడిలోకో గుండె పైకో చేరాలని మరి కోరాలి

మొక్కనుండి విడివడకున్నా తావిగా వ్యాపించాలి

తేటి కొరకు మకరందం దాచి దాచి ఉంచాలి

మనసులోని భావావేశం స్నేహితులకె కద పంచాలి

Monday, April 4, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చెరుగుతుంది చేవ్రాలు

చెప్పకనే వీడ్కోలు

ముందో కాసింత వెనకో ఏ ఊహకందకా

మురిపించి మూన్నాళ్ళు

చెరిపేసి ఆనవాళ్ళు

కనుమరగౌతుంది కవిత ఎవరికీ చెందకా


1.రేపు మాపు వాయిదాలే

రేపుతాయి  గాయాలే

అర్థోచిత కథలకైనా

అర్ధాంతర ముక్తాయింపులె

ఇల్లు దిద్దుకోవాలి దీపమున్నప్పుడే

ఎదకు హత్తుకోవాలి ఎదురు పడినప్పుడే


2.గెలుపన్నది లేని చోట

అందరిదీ ఓటమి బాటే

మనకైతే ఏమీ కాదని

ఎగిరి పడుట పరిపాటే

మనసువిప్పి చెప్పాలి సంశయించకా

మరిదొరకదు మరుక్షణం తరుణం మించనీక

Friday, April 1, 2022


https://youtu.be/1kchGwkDQpk


మంజుల గీతమొకటి వినిపించవే పికమా

మంగళ వాద్యమై రవళించునట్లుగా

మల్లెలూ జాజులను కురిపించు పూవనమా

పరిమళాలు విరజిమ్మవె మలయ పవనమా


స్వాగతాలు పలుకవే ఋతురాజుకు

వత్సరాది ఉగాది నేటి పండుగ రోజుకు

శుభములు కూర్చనున్న శుభకృతుకు

సుఖముల నొసగనున్న కాల దేవతకు


1.నిన్న మొన్న గతకాలపు చింతను మరవమని

చేసిన తప్పిదాలతో గుణపాఠం నేర్వమని

రానున్న కాలానికి రాశిఫలం శుభమస్తేయని

అరు రుచుల ఆస్వాదన జీవిత పరమార్థమని

చెప్పకనే చెబుతోంది ఆమని ఎరుగమని

అక్కున చేర్చుకొని పంచనుంది ప్రేమని


2.నెలకు మూడు వానలుగా రైతుకు బాసటగా

బడుగు బ్రతుకు మూడుపూవులారుకాయలుగా

యువతకు చైతన్య స్ఫూర్తి ఇనుమడించినట్లుగా

మహిళకు స్వావలంబన సమకూర్చునట్లుగా

అరుదెంచెను అదిగదిగో  ఆమని

కొనితెచ్చెను కానుకగా చైత్రపు శోభని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం: హంసానంది


నా గార్వమంతా నీదగ్గరే

నా అల్గుడంతా నీ ముందరే

తల్లివి నీవుకాక పరులెలా భరిస్తారు

అమ్మవు నువ్వు కాక అక్కునెవరు జేర్చెదరు

జగదంబా శాంభవీ కైమోడ్పులివె గొనవే

నా ఏడ్పులు నిట్టూర్పులు ఇకనైనా మాన్పవే


1.కడుపే నింపెదవో నా ఆకలి చంపెదవో

బ్రతుకంతా పస్తులుంచి నను పరికించెదవో

అడిగినదిచ్చెదవో ఆశలు త్రుంచెదవో

అప్పచ్చులేవో చూపి సముదాయించెదవో

జగదంబా శాంభవీ కైమోడ్పులివె గొనవే

నా ఏడ్పులు నిట్టూర్పులు ఇకనైనా మాన్పవే


2.సుధనే పోసెదవో వ్యధనే తీర్చెదవో

మదిలో నిండుకున్న గుబులే ఆర్పెదవో

శిఖరము చేర్చెదవో ఫకరే నరికెదవో

పరమ పదము నందించి నందింప జేసెదవో

జగదంబా శాంభవీ కైమోడ్పులివె గొనవే

నా ఏడ్పులు నిట్టూర్పులు ఇకనైనా మాన్పవే