Monday, December 21, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వలపుకు ప్రతిబంధకమే కాదు వయసు

నిత్య యవ్వనంతో చెలగును మనసు

అనుభవాన దొరికిన స్త్రీ అనుభూతులు

పలవరించి మురిసిన మధురస్మృతులు

జీవితం ఎప్పటికీ నవరసభరితం

సరసం విరసం సమపాళ్ళై సమ్మిళితం


1.సౌందర్యోపాసనే పూర్వజన్మ సుకృతం

సౌందర్యారాధనే అపురూప అవకాశం

సౌందర్య పోషణ అనవరతమౌ ఘోరతపం

సౌందర్య లహరితొ తరియించట తథ్యంతథ్యం

జీవితం ఎప్పటికీ నవరసభరితం

సరసం విరసం సమపాళ్ళై సమ్మిళితం


2.సుందరమౌ వదనమే సుదతికి వరం

శరీర సౌష్ఠమే తోయజాక్షికి అదృష్టం

హోయలొలికెడి నడకలు అదనపు సొత్తు

ప్రియవచనములే పడతిజల్లెడి మత్తు

జీవితం ఎప్పటికీ నవరసభరితం

సరసం విరసం సమపాళ్ళై సమ్మిళితం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:హిందోళ వసంతం


శుభంకరా శివ శంకరా

శంభోహరా గంగాధరా

నమఃపార్వతీ పతయే శశిధర

జయజయ జయజయ రాజేశ్వర

జయహే కాశీ విశ్వేశ్వరా జయహే రామలింగేశ్వరా


1.చమరించిన నా నయనమ్ములలో

తరగక ఊరెను సలిల ధారలు

సంతతధారగ  అభిషేకించగ

ఎంచుకుంటివా నను పరమ శివా

సరిపోవేమో నా ఆశ్రువులని 

సందేహించకు  సాంబశివా

నా చివరి  రుధిర బిందువు సైతం

అర్పణ జేసెద నీకే రుద్రా


2.అవధరించు నను నువు ధరించగా

నా చర్మము గలదు చర్మాంబరధరా

పరవశించగా నువు వసించగా 

నా మానసమే కైలాసమాయెగా సదాశివా

నీ నాట్య వేదికగ నా చిత్తము చేకొను

తకిట తధిమియని నా మదము నణచగా

కరకమలములే సమర్పించెద  ప్రియమారగా

సరగున బ్రోవగ సన్నుతించెద మహాదేవా

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎదుటి మనసు గాయపరచు ఆగ్రహమది ఎందుకు

నీ ఎదకే ముప్పుతెచ్చు ఆవేశమెందులకు

ఎవరిమీది కోపమో పరుల ఎడల ఎందుకు

అసహాయత ఆవరించ వృధా అరుపులెందుకు

ఇదే మన ఖర్మమని భరించక

ఇందుకే మనమున్నదని సహించక


1.తెలివైనవాడు అమాయకుణ్ణి

ధనికుడు కడు పేదవాణ్ణి

బలవంతుడు బలహీనుడిని

యజమాని సేవకుడిని

అడుగుడుగున వంచనతో ముంచుతున్నా

ప్రతిసారి మోసగించి దోచుకున్నా

ఇదే మన ఖర్మమని భరించక

ఇందుకే మనమున్నదని సహించక


2.చిన్న చేపను ఓ పెద్దచేప మ్రింగు రీతి

ఆ పెద్దచేపను మరో పెద్దచేప మ్రింగడమే లోకనీతి

మోసపోవడం జీవితంలో ఓ భాగమై

అనునిత్యం అంతర్మధన దౌర్భాగ్యమై

ఘర్షణతో నిరంతరం జ్వలించినా

వాదనతో అనవరతం వచించినా

ఇదే మన ఖర్మమని భరించక

ఇందుకే మనమున్నదని సహించక

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువ్వే కారణం నీ నవ్వే కారణం

నా ఎద గుమ్మాన అనునిత్యం నీ జిలిబిలి పలుకుల తోరణం

నీ చూపుల వెన్నెలతో నా వెతలన్నీ నివారణం


1.నువ్వే కాదన్నావంటే మరణమె నాకు శరణం

నీతో నాబ్రతుకంటే ఈ జన్మకే విశేషణం

నీవంటూ లేకపోతే నాకేది దిక్కూదివాణం

నాజీవితాన నువు కాలుమోపినదే శుభతరుణం


2.ప్రేమకు ప్రణయానికి మనమే ప్రమాణం

మనసుకు మనసుకు జరిగినదే మనకళ్యాణం

సహనశీలతే నీకు అపురూప ఆభరణం

ఆదర్శమైన గృహిణిగా ఎందరికో నువ్వే ప్రేరణం

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


గులాబి చెప్పింది గుడ్మాణింగ్

మల్లిక చెప్పింది మనసారా మాణింగ్

మందారం తెచ్చింది అందాల మాణింగ్

పున్నాగ అందించింది ఫ్రెష్ నెస్ మాణింగ్


1.నందివర్దనంతో నవ్వుల మాణింగ్

పారిజాతాల పరిమళ మాణింగ్

బంతిపూలతో బంగారమే మాణింగ్

చేమంతి పూలంటి మాటామంతి మాణింగ్


2.నిద్రగన్నేరంటి గమ్మత్తు మాణింగ్

తంగేడు పూలంటి రంగారు మాణింగ్

చంపకాలంటి ఈ చైతన్య మాణింగ్

ఉత్పలాలంటి కడు ఉత్తేజ మాణింగ్



తీరిపోతె ఏముంది కోరిక

నిస్సారమే ఈ జీవనం ఇక

ఫలించినంత అంతటిదే వేడుక

అసంతృప్తిలోనె ఉంది భవితవ్య దీపిక

వేంకటరమణా నేనేంటో నీకే ఎరుక

కరుణాభరణా నన్నుద్ధరించు జాగు సేయక


1.మితిమీరిన సుఖములనే బడసి

మతినైనను నిను నిలపనైతి అరసి

గతినీవే అన్యమెరుగ దయగను శ్రీపతి

ద్యుతినీవే అంధకార బంధురమవ నా ఋతి

వేంకటరమణా నేనేంటో నీకే ఎరుక

కరుణాభరణా నన్నుద్ధరించు జాగు సేయక


2.అలసినాను బ్రతుకున పరుగిడి పరుగిడి

ఎండమావులైన ఐహిక బంధాల పాలబడి

నొచ్చినప్పుడే నీ శరణుజొచ్చితి భయపడి

వెతల కాన్కలిచ్చైనా  మరువనీకు పొరబడి

వేంకటరమణా నేనేంటో నీకే ఎరుక

కరుణాభరణా నన్నుద్ధరించు జాగు సేయక