Saturday, January 23, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సంకటములు బాపరా వేంకటాచలపతి

ఆపదమ్రొక్కులవాడా అలమేలు మంగాపతి

ఎంతగానొ చేసితి నీ   గుణగణాల సన్నుతి

వింతదేమొగాని నిన్ను మెప్పించగ విఫలమైతి


1.పలుమార్లు పొగిడితి సైచక నే తెగిడితి

చలనమే కనరాని శిలవైతివ శ్రీపతి

అన్నమయ్య చేసుకున్న పున్నెమేమిటో మరి

పురంధరునికీ అంతటి భాగ్యమెలా శ్రీహరి

అజ్ఞాన కృతదోషములన్ని మన్నించరా

సుజ్ఞాన మార్గానికి నను మళ్ళించరా


2.తాయిలాల నడుగులాగ మాయలొముంచేవు

ఐహిక వాంఛలపై మోహాన్ని పెంచేవు

వీలైనంతగా మమ్ముల దూరంగా ఉంచేవు

తాత్కాలిక సుఖాలకై పరుగెత్తించేవు

పక్షివాహన నా లక్ష్య మింకనీవేనురా

సాక్షాత్కరించి నాకు మోక్షపదము నీయరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంత చెప్పినా ఒడవని రామాయణం

ఎంత వగచినా మారని భారతం

ఇంటింటా ఉన్నదే ఈ భాగోతం

ఇలా కూడ ఉండేదే జీవితం


1.గిల్లికజ్జాలు చిరుచిరు కలహాలు 

ఎంత కీచులాడినా వీడని మోహాలు

ఎవ్వరూ ఇవ్వకూడదు ఉచితసలహాలు

సంసారాలు అంటేనే నాకం నరకం తరహాలు


2.పగలంతా పగలౌతూ యుద్ధభేరీలు

రాత్రైతే  సంధి కోరుతు కాళ్ళబేరాలు

మనసు మనసుకు చేరువకాని వింతదూరాలు

లోకులకోసం వేసుకొనెటి  ముసుగుల మమకారాలు