Monday, March 15, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అలసట తొలగించే మలయ పవన అనుభూతి

అలకను మానిపించె అనునయ స్పర్శరీతి

ఆహ్లాదం ప్రసరించే పూర్ణేందు మాలతి

ఉల్లాసం కలిగించే సమ్మోహన స్నేహగీతి

నీ ముఖమే అపూర్వ దివ్య బ్రహ్మ కమలం

ఇందిందిరమై గ్రోలెద పుష్కల పుష్ప మరందం


1.ప్రత్యూష కిరణాల హాయిగొలుపు వెచ్చదనం

చిన్ననాటి అమ్మచేతి గోరుముద్ద కమ్మదనం

తొలిప్రేమ ప్రియురాలి అధరాల తీయదనం

పారమార్థ సాధకమౌ ప్రశాంతధ్యానసదనం

అలౌకికానంద దాయకం నీ దివ్య వదనం

వీక్షణ మాత్రాన ధన్యం అనన్యం నా జీవనం


2.నడివేసవి పగటి పూట దాహార్తికి చలివేద్రం

నిశ్చలమౌ నిర్మలమౌ పావనమౌ పాల సంద్రం

కవిగాయక ఉత్ప్రేరక నిత్య పరమ మంత్రం

ఆహారనిద్రా అవ్యయాన్వయ ఏకైక సూత్రం

సౌందర్య లహరియై ఒప్పారెడు నీ ఆననం

పరవశమే కలిగించెడి అద్భుతమౌ ఇంధనం


తెల్లవారదు నాకు నువ్వులేక

పొద్దుపోనెపోదు నువ్వురాక

ఏ పూట గడవదు నీ ఊసులేక

నా కాలు నిలవదు నిన్ను కలవక

ఓ నేస్తమా నా సమస్తమా

అస్తమానమూ నీదేలే నా ధ్యాస

ఆస్తమాలా నువువినా కష్టమే నా శ్వాస


నీకు నేనెంత ముఖ్యమో కాదో

నువ్ లేక బ్రతుకు నాకెంత చేదో

వస్తేరానీ నాకే ఏ అపవాదో

కలనెరవేరనీ కనీసం నీదో నాదో

ఓ నేస్తమా నా సమస్తమా

అస్తమానమూ నీదేలే నా ధ్యాస

ఆస్తమాలా నువువినా కష్టమే నా శ్వాస


మూడునాళ్ళే కదా జీవితం

ముచ్చటగా సాగనీ స్నేహితం

ఉండనీ నీగుండెలో ఓ మూలన

గత జన్మ వాసనే తీరుతీరున

ఓ నేస్తమా నా సమస్తమా

అస్తమానమూ నీదేలే నా ధ్యాస

ఆస్తమాలా నువువినా కష్టమే నా శ్వాస

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువ్వక్కడ-నేనిక్కడ

నిను కలవడానికి చోటెక్కడ

మనిషిక్కడ మనసక్కడ

నా బింకాలన్నీ కప్పల తక్కెడ


1.కలవాలనీ నినుకలవాలనీ

నను నీ రెప్పలపై కలగా వాలనీ

తలవాలనీ ననునీవానిగ తలవాలనీ

కలలోనైనా నీ ఒడిలో నా తల వాలనీ


2.  మోయనీరేయినీ  మోయని హాయినీ

కరిగించగా సరసాల నీ గుండె రాయినీ

అందని ఆనందాలనే ఇక నాకందనీ

పొందని పొందునే నీవల్ల నను పొందనీ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


 నీ పని నువు చేయి హరా సరా

నను చేసుకోనీయి నా పని తీరా

నా జోలికి రాబోకు  ఆటంక పరుస్తూ

మాటిమాటికీ మనసును చంచలింపజేస్తూ

వరములిచ్చు మాటన్నది నీ పరిధి

కర్తవ్యపాలనయే నాకేకైక విధి


1.జన్మలు కర్మలు పుణ్యపాప ఫలములు

ఎవరికెరుక ఎవరని కర్తలు దాతలు

ఇప్పటికిప్పుడే వేసేయి నేరాలకు శిక్షలు

ప్రక్షాళన గావించి దయచేయి మోక్షము

నీకు చెప్పుడెందుకు తెలవదా ఆ మాత్రము

నిను కోరుడెందుకు తీర్చేవా ప్రతి ఆత్రము


2.పూజలు వ్రతాలు యజ్ఞయాగాదులు

చేస్తేనే ఔతాయా సార్థకాలు జీవితాలు

బదులుకు బదులిస్తే పక్కా వ్యాపారము

ఆత్మ పరమాత్మల బంధమెలా అక్షరము

వికసించనీ నాలో సహస్రార కమలము

అపుడే నే చేరగలను భవసాగర తీరము