Friday, August 12, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పురిటి నొప్పులు -పుడమి తల్లికి 

వానకారున-చినుకు పడితే

కలల పంటయె-కవుల జన్మకి 

పొత్తమొక్కటి -అచ్చు పడితే


నిండి ఉంది -లోకమంత

ఆనందమే -నందించగ

ఆత్మ బంధులె-మనుజులంతా

అనురాగ సుధనే-పంచగ


1ఎంచి చూడగ దొరకదా 

మంచి ఎందైనా!,

దృక్పథాలే సజావైతే

ఎందుకిక ఏ మందైనా


పైమెరుగుల అందమెందుకు

ప్రేమించక హృదయ మందైనా

వెగటు పుట్టదా రోజూ తినగ 

కమ్మని షడ్రుచుల విందైనా


2.నిర్మించుకోవలె మనకుమనమె

మనమున కలల సౌధమే

గుర్తించి గురుతుంచుకోవలె

మేధోజలధి అగాధ నిధులే


ఎంత ఎదిగితె మాత్రమేమి

ఒదుగు సూత్రమెరుగక

సంపదెంతో సొంతమైనా

శాంతి పొందక చింతయేనా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అన్న ఎడల అనురాగం-చెల్లి పట్ల మమకారం

అక్కతోటి అనుబంధం-తమ్ముడంటె లాలనం

అనుభూతులు పంచే-ఆత్మీయతలు పెంచే

అపురూప బాంధవ్యం రక్షాబంధనం

ఆనందోత్సవం రాఖీ పూర్ణిమ సంబరం


1.ప్రేగు పంచుకున్న రక్త సంబంధము

ఆటపాటల  బాల్య స్నేహ బంధము

సహపాఠీలుగా పోటీపడిన ఆ చందము

వింతగా విధి కలిపిన అనూహ్య బంధము

అనుభూతులు పంచే-ఆత్మీయతలు పెంచే

అపురూప బాంధవ్యం రక్షాబంధనం

ఆనందోత్సవం రాఖీ పూర్ణిమ సంబరం


2.ఎంతటి కష్టమొచ్చినా అండగనిలిచేది

ఏ అవసరమొచ్చినా తోడుగ నడిచేది

బలము బలగమనే భరోసా ఇచ్చేది

ఇంటికి ఆడపడుచే కళాకాంతి తెచ్చేది

అనుభూతులు పంచే-ఆత్మీయతలు పెంచే

అపురూప బాంధవ్యం రక్షాబంధనం

ఆనందోత్సవం రాఖీ పూర్ణిమ సంబరం