Tuesday, September 27, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆచ్ఛాదన లేని నీ పాదాలు

అలా చూస్తూండిపోతె చాలు

నీ మంజుల మంజీర నాదాలు

ఉత్తేజ పరిచేను నా నరనరాలు


1.నీ అందాల ఆ మువ్వల పట్టీలు

నా మది నే దోచేసే జగజ్జెట్టీలు

పసిడి వన్నెలొలికే ఆ అందియలు

నా పసి మనసుకవే అప్పచ్చులు


2.నీ పదాల ఘల్ ఘల్మనే గజ్జెలు

స్వరవిరులే సరిగొన్న పూ సజ్జలు

రవ్వల జిలుగుల నీచరణ శింజినీలు

రమణీయ కమనీయ మనోరంజనీలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కవనవనంలో విరబూసిన పూవును

వాసనలంటూ గాఢత విరజిమ్మను

వర్ణాలు విరివిగా కనులకు వెదజల్లను

రెక్కల లాలిత్యం ఏమాత్రం ఎరుగను

నేనొట్టి గడ్డిపువ్వును పేలవమైన నవ్వును


1.ఏ చేయో నను కోయగ కోమలి కొప్పున నిలవాలనీ

ఏ గాలో నను మోయగ శ్రీ రాముని చరణాల వాలనీ

మహనీయల గళసీమన మాలగానైనా అలరారాలనీ

మట్టిలో మట్టిగ వొట్టిగ నే వసివాడి కడకిక నేలరాలనీ

నేనొట్టి రాతి పువ్వును పేలవమైన నవ్వును


2. ఎన్నడూ తోటమాలి పోయనే పోయడు నీరు

దారిన వెళ్ళే దానయ్యలు సైతం నను పట్టించుకోరు

జీవశ్చవమై  నేనెవరికీ ఏ మాత్రం కొఱగాని తీరు

పేరుకే విరినై నిస్సారంగా ఆవిరినై బ్రతుకే కడతేరు

నేనొట్టి రాలు పువ్వును  పేలవమైన నవ్వును

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉంటే మూఢునిగా ఉండనివ్వు

లేదంటే తత్త్వం బోధపడనివ్వు

భోగిలా మసలుతుంటె  యోగిలా మార్చేవు

యోగిలా మనబోతే మది చంచల పరిచేవు

అటో ఇటో కానీక ఆటుపోటులెందుకిలా

అనంత పద్మనాభా ఇంతలా పరాచికాలా


1.దశావతారాలనెత్తి శ్రమించినావు

దర్పాన్విత దైత్యులనే దునుమినావు

శేష తల్పాన హాయిగ విశ్రమించినావు

నా బ్రతుకున ఒడుదుడులు రచించినావు

అటో ఇటో కానీక ఆటుపోటులెందుకిలా

అనంత పద్మనాభా ఇంతలా పరాచికాలా


2.నోరు తెరిచి అడిగానా పొందే సౌఖ్యాలని

కోరి తెచ్చుకున్నానా పొగిలే దుఃఖాలని

అవధి లేని భవజలధిన మునకలేస్తున్నాను

ముంచు దాటించు నిన్నే నమ్ముకున్నాను

అటో ఇటో కానీక ఆటుపోటులెందుకిలా

అనంత పద్మనాభా ఇంతలా పరాచికాలా