Tuesday, August 18, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మల్లె ఎంత మంచిదో
పల్లె పడుచు పిల్లలాగ
మల్లె ఎంత చక్కనిదో
పసిపాప నవ్వులాగ
తనువు తనువంతా శ్వేతకాంతి
తన మనసు తావే ప్రశాంతి

1.వనాల్లోను మనగలిగేను అడవి మల్లి
చేలలోన సాగుబడౌను బొండు మల్లి
చెట్టులాగ ఎత్తెదిగేను బొడ్డు మల్లి
మేడమీది కెగబాకేను తీగమల్లి
నవశకపు నాందౌతుంది తొలిరేయిలోన
ఉత్ప్రేరకం తానౌతుంది దాంపత్యాన

2.ముళ్ళతో గాయ పరచదు గులాబిలాగ
బురుదతో మకిల పరచదు కమలంలాగ
భయమే కలిగించదు మొగలిపొదల లాగ
చపలచిత్తయే కాదు సూర్యకాంతి విరిలాగ
మూరెడంత దండౌతుంది ప్రియురాలి జడలోనా
నిలువెత్తు మాలౌతుంది స్వామి వారి మెడలోనా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చెప్పాలి ఏదో ఒకటి
విప్పాలి గుట్టే గుండెది
ఎన్నాళ్ళని మోస్తుంది ఎనలేని అనురాగం
ఎన్నేళ్ళని దాస్తుంది వలపు సరాగం
పల్లవించాలి ప్రేమ గీతపు పల్లవి
కలిసి కదలాలి చరణయుగ్మ యుగళి

1.నీదీ నాదీ ఒకటే మతం అభిమానయుతం
 అభిమతమేదైనా సరే పరస్పరం సమ్మతం
నాదీ నీదీ ఒకటే యోగం తావేలేదు అభియోగం
ఎన్నడు కూడదు కలలోనైనా మనకు వియోగం
ప్రేమైక లోకంలో ఏకైక జంట మనం
నిరంతరం ఫలించే కలల పంటే మనం

2.అలవోకగా అమరాలిగా బ్రతుకంతా ఆహ్లాదాలు
పేనవేయగా నిజమౌనుగా  ఇరువురి హృదయాలు
నీవు మురళీ రవం ప్రియా నేను  బృందావనం
నీవు తులసీదళం చెలీ తూచేవునన్నే తులాభారం
నీకు సదా నేనే సఖా జన్మదాసీనే
నీకు సఖీ నేనే కట్టు బానిసనౌతానే
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాలిపోతున్నాయ పండుటాకులు
కాలిపోతున్నాయి నిండు బ్రతుకులు
పసివారికైనా తప్పుటలేదు ఖనన గోతులు
వయసూ వరుసా లేదు నిత్యం రగిలే చితులు
కరోనా మహమ్మారి కాటుకు బలియై
తగు జాగ్రత్తలకే స్వయంగా వెలియై

1.లాక్ డౌన్ ఎత్తివేత పచ్చజెండా కాదు
ప్రజా జీవనం కొనసాగ దండన లేదు
అడుగు తీసి అడుగు వేస్తే ఏమరుపాటు తగదు
అజాగ్రత్త మూలంగా మూల్యం తప్పదు
అదినిండు ప్రాణమనీ చెప్పక తప్పదు

2.పెండ్లీ పేరంటాలు కరోనాకు ప్రతినిధులు
విందులు వినోదాలు మహమ్మారి వ్యాపకులు
గుమిగూడిన జనవాహిని చేటు దేశానికి
కాలుకదపనప్పుడే రక్ష ఇల్లు దేహానికి
తప్పనిసరైతె తప్ప కదులు అత్యవసరానికి