Sunday, November 7, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:రేవతి


ఈశ్వరా పరమేశ్వరా విశ్వేశ్వరా

నశ్వరమౌ ఈ దేహము పై నాకెందుల కింతటి వ్యామోహం

రామేశ్వరా రాజేశ్వరా భీమేశ్వరా

విశ్వసిస్తినిను  త్రికరణశుద్ధిగ భస్మము చేయర నాలో అహం


1.కాలకాల హే కామారి కామేశ్వరా

నలిపేయర హర బలీయమై నను కబళించే కామాన్ని

ఫాలనేత్ర ప్రభు గరళకంఠ గంగాధరా

కట్టడి సేయర అట్టుడుకుతు నా విజ్ఞత చెరిచే క్రోధాన్ని


2.మహాదేవ నమో భోలాశంకర మహేశ్వరా

నాదీ అన్నది  ఏదీలేదిట వదిలించర నా లోభాన్ని

జటాఝూట జంగమదేవర చoద్రమౌళీశ్వరా

భవబంధాలలొ బంధీనైతిని సడలించర నా మోహాన్ని


3.సాంబ సదాశివ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరా

విర్రవీగి నేగర్వించగ అణిచివేయరా నామదిలోని మదాన్ని

వైద్యనాథ జయ మల్లికార్జున త్రయంబకేశ్వరా

పరుల ఉన్నతిని భరించలేను హరించు నాలో మత్సరాన్ని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుండెలోన గుచ్చుకుంది గులాబి ముల్లు

మనసు నిండిపోయేలా కురిసింది ప్రేమ జల్లు

లేలేత పెదాలే రెక్కలుగా నవ్వు పువ్వు విచ్చుకుంది

అప్సరసల అందాలను అంగాంగం పుణికి పుచ్చుకుంది


1.వసంత వన్నెలనే వలపన్నింది

కోయిల తానై పాటే వలపనింది

మనసునే మల్లెమాలగా మార్చి నా ఎద నలరించింది

పలుకుల తేనెలనే వడ్డించి పసందైన విందుల నిచ్చింది


2.పంజరాన్ని వదిలేసి ముంగిట వాలింది

మంజుల గానాలతో రంజిలజేసింది

తాను నేను చెరిసగమౌ రంగుల చిత్రమొకటి గీసింది

మా ఇరువురి కాపురపు లోకానికి తలుపు మూసింది

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కలల వాకిట వేచి ఉంటా

తరలిరా నా నేస్తమా

మరులనెన్నో దాచి ఉంచా

జాగు సేయకు ప్రియతమా


1.తెరిపి లేని ఒరిపిడాయెను

పగలు మదిలో సెగలు రేపెను

వగరు వయసున వగపు లేల

వలపు పిలుపుకు బదులు పలుక


2.తలుపు తట్టెను తలపులన్ని

గెలుచుకొమ్మని ముద్దుగుమ్మని

ఊహలే ఊరించ సంగమ హాయిని

ఉల్లమేల చెలియకై  ఊపిరే ఇమ్మని

 రచన్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:అమృత వర్షిణి


నను నడిపించరా నా అడుగులు తడబడె

చేయందించరా బ్రతుకు కడలి సుడిబడె

ఎందరిలోనో నేనొకడినని సందియమెంతో ఉండెడిది

అందరిలోను నినుగనినంత నా డెందమానంద మొందినది


1. కలివిడిగా నీవిచ్చినవే స్వామి నా కష్టసుఖాలు

ఇబ్బడిముబ్బడిగా ఎందుకు అందులొ కష్టం పాలు

నా లోపాలు పాపాలు కోపాలే కారణాలై ఈ శాపాలు

తాళజాలనీ పరితాపాలు తీర్చరా ప్రభూ భవతాపాలు


2.అన్నీ ప్రసాదించావు స్వామీ నాకు ఆఒక్కటి దప్ప

పరమదయాళా ప్రభో ఇదియేనా  నీదైన గొప్ప

దయచేయి దయచేసి నాకినైన  మనశ్శాంతి

నా హృదయాన దయచేసి వరమీయి నివృత్తి