Sunday, July 26, 2020

కడుపే కైలాసం -హరహరా అదే సదా నీ ఆవాసం
ఇల్లే వైకుంఠం- శ్రీహరీ ఇదేకదా నీవుండే సదనం
వెదకబోను వేరెచటా దైవమా నినుకానగ
చంకలొ పాప కనక వృధాగ ఆరాట పడగ
వందే శంభుముమాపతిం-గోవిందం శ్రీపతిం నమామ్యహం

1.అర్ధనారీశ్వరా నీదైన స్థానము
మహాశక్తి కాలవాలము
తరగదింక నా గుండె బలము
శ్రీనివాసమే గోవిందా నీ హదయము
కొదవలేని సిరుల భోషాణము
దరిరాదెప్పుడు దారిద్ర్యము
వందే శంభుముమాపతిం-గోవిందం శ్రీపతిం నమామ్యహం

2.నీవుంటే చుట్టూరా మంచేనంట
చంద్రచూడ తలనెలవంక
వెన్నెల పంచేనంట
నీవున్నతావంతా పాలేనంట
శేషశయన తాపాలనింక
మదినెడ బాపేవంట
వందే శంభుముమాపతిం-గోవిందం శ్రీపతిం నమామ్యహం











ఇల్లు చిన్నబోయింది నీవు లేక
వాడ అడుగుతున్నది నీ రాకపోక
నిన్నమొన్న వెళ్ళావేమో సరిహద్దున యుద్ధంకై
యుగాలల్లె తోస్తోంది  పరితపించ హృదయం నీకై

1 దేశాన్ని భద్రంగా కాచే జవాను నీవు
కంటిమీద కునుకు లేక సంరక్షిస్తున్నావు
నెత్తురైన గడ్డకట్టే మంచుకమ్ము లోయలు కొండలు
ఎండవేడినోర్వలేక ఎడారుల్లొ మండును గుండెలు
జాతికె అంకితమాయే నూరేళ్ళ నీజీవితం
చావంటే బెదురే లేదు ప్రాణమే తృణప్రాయం

2.అనుక్షణం క్షేమం కోరుతు నీ తల్లి దీవిస్తోంది
మనసంతా నీవేనిండగ నీకై అర్ధాంగి ప్రార్థిస్తోంది
వందముప్పైకోట్లమంది వెన్నంటి వెంటున్నారు
మడమతిప్పకుండా నీకు మద్దతెంతొ ఇస్తున్నారు
సైనికుడా ధన్యుడవే నీ జన్మ చరితార్థకమవగా
యోధుడా మాన్యుడవే మాతృభూమి ఋణం తీర్చగా

ఎదుట ఒక కవిత
ఎదలొ ఒక కవిత
హరివిల్లు వర్ణాలు కనుల ముందు
పరవళ్ళ వర్ణాలు హృదయమందు

1.పదములే కదిలాయంటే
 అందెలే రవళించేను
పదములే కుదిరాయంటే
కవనమే వికసించేను
కవిత నడకలన్నీ కలహంసకు పాఠాలు
నాకావ్య గతులన్నీ జవరాలికి భాష్యాలు

2.కవిత  మోములోనా
కలువలు మందారాలు సంపెంగ రోజాలు
కవిత రీతిలోనా
ఉత్పలాలు చంపకాలు ఆటవెలదికందాలు
కవిత వెలయించేను కవితలు వేవేలు
కవితలకు స్ఫూర్తి నిచ్చే కవితకు జేజేలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాజ్యమెందుకు రాజసానికి
మకుటమెందుకు గౌరవానికి
పదవి వల్లనె వెలిగిపోదురు ఎందరెందరొ నేతలు
పదవికే తగు వన్నె తెత్తురు జనహృదయ నేతలు

1.అడ్డదారుల తెచ్చుకొందురు
 తేరగా అధికార యోగం
అర్హతన్నది మృగ్యమైనా
వారసత్వపు రాజకీయం
అంచలంచెలు ఎదుగువారికి ఎదురుండబోదిక ఎన్నడు
వ్యక్తిత్వమే ఆభరణమైతే  వెలిగిపోదురు ఎప్పుడు

2.కులమతాలే అండకాగా
పక్షపాతమే ఆలంబనం
సంపదెంతో లంచమీయగ
అధిరోహింతురు అందలం
భాగ్యమన్నది ప్రాప్తముంటే తలుపుతట్టును భోగము
మేధావులంతా జాతికెప్పుడు సేవచేయగ సిద్ధము
నేనేమో ఉత్తర ధృవం-నీవైతే దక్షిణ ధృవం
అందుకేనేమో ఆకర్షణ పరస్పరం
నాలోని వెలితికి నీ జతయే ఒకవరం
నా కోసమె పుట్టించెను నిన్నా దైవం
ఈనాడే నా శ్రీమతీ గీతా నీ జన్మదినం
ఎన్నో జన్మలుగా అన్యోన్యమైన దంపతులమే మనం
హ్యాప్పీ బర్త్ డే టూ యూ గీతా
విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

1.పనైపోవడమొకటే నా లక్ష్యం
పద్ధతిగా చేయడం నీకు ముఖ్యం
బండవేసి దాటుటే నా కర్తవ్యం
వంతెన నిర్మించడం నీ ఉద్దేశ్యం
అర్ధపూర్ణత్వమే నువులేక జీవితం
అర్ధనారీశ్వరమే మన ఇరువురి కాపురం
హ్యాప్పీ బర్త్ డే టూ యూ గీతా
విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

2.ఇరుగూ పొరుగులతో సఖ్యత నీకిష్టం
ఏకాంతం ప్రశాంతత దొరికితె నా కదృష్టం
ఎముకలేని చెయ్యినీది ఉదారతకు పెన్నధి
నీకెదురు చెప్పలేని అపూర్వ ప్రేమ నాది
నియతి లేక ఎగిరేటి గాలిపటం నేను
క్రమత నడుపు ఆధారం ఆ దారం నీవు
హ్యాప్పీ బర్త్ డే టూ యూ గీతా
విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ