Sunday, January 2, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మరులు రేపుతున్నావే మధిరాక్షి

వలపు గెలుచుకున్నావే వనజాక్షి

మౌనమేలనే నా ఎడల మీనాక్షి

కరుణ జూడవేలనే నన్నిక కామాక్షి

నీ పాద దాసుడినై కొలవనా నిను జన్మజన్మలు

నీ ప్రియ భక్తుడనై కోరనా ఇహ పర సౌఖ్యములు


1.నీ నయనాలు దయాపారావతాలు

నీ అధరాలు మకరంద సరోవరాలు

నీ మందగమనాలు తలపించు ఐరావతాలు

నీ అందచందాలు అందగ ఆపాత మధురాలు

నీ పాద దాసుడినై కొలవనా నిను జన్మజన్మలు

నీ ప్రియ భక్తుడనై కోరనా ఇహ పర సౌఖ్యములు


2.నీ సన్నిధి మనగలిగిన మదికి పరవశాలు

ప్రసాదించవే మాతా సంగీత సాహితి కలశాలు

నలుదిక్కుల వ్యాపించిన నవమోహిని నీవె దిక్కు

పలుచిక్కులు తొలగించిన కైవల్యమె నాకు దక్కు

నీ పాద దాసుడినై కొలవనా నిను జన్మజన్మలు

నీ ప్రియ భక్తుడనై కోరనా ఇహ పర సౌఖ్యములు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఉదయ రవి చంద్రిక


ఎక్కడిదా వైభోగం ఏడు కొండలరాయ

మాయమ్మ శ్రీ రాగాన నీ ఎడదను తాను వెలయ

అలవికానిదీ నీ వైభవం అచ్యుతానందమయ

తిరుచానూరున పద్మావతిని ప్రతిరేయీ నువు కలయ

గోవింద గోవింద హరే ముకుంద  మురారి మాధవ పరమానంద


1.కాంతుల కాంచన  శిఖరం కాంచిన నయనానందకరం

బంగారు వాకిళ్ళ నీ మందిరం భావించినను ప్రియకరం

జగన్మోహనకరమైన నీ దివ్య దర్శనం జన్మసాఫల్యకరం

పరమపావన నీ పదతీర్థ సేవనం సర్వదా ఆరోగ్యకరం

గోవింద గోవింద హరే ముకుంద  మురారి మాధవ పరమానంద


2.తల నీలాలొసగినంతనే తొలగును మా తల బిరుసు

కోనేటిలొ మే మునిగినంతనే కరుగును మాలో దురుసు

లడ్డూప్రసాద మహిమను గూర్చి ఎందరికని ఇల తెలుసు

ఇడుములనడ్డెడి ఆపద్బాంధవ ఎన్నలేనిదే నీదొడ్డ మనసు

గోవింద గోవింద హరే ముకుంద  మురారి మాధవ పరమానంద

 https://youtu.be/FWBwDBM9I20?si=H5dwYo203iSfAapH

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ

రాగం : శ్యామ

పద చిత్రాల్లో పొదువుకుంటున్నా

ఎద లోతుల్లో నిన్నేలుకుంటున్నా

మధురానుభూతులే నెమరువేసుకుంటున్నా

మరల మరల చెలీ నీ కలయికనే కోరుకుంటున్నా


1.తూనీగ ఏదైనా నీమీద వాలిందా ఏమైనా చెప్పిందా

తారక ఒకటైనా  పలకరించి నవ్విందా నా మదిని విప్పిందా

నీ పదాలు తాకిన గోదారి నా పెదాలు తడిపింది

నీ కురులు మీటిన చిరుగాలి నా అలసట తీర్చింది


2. కోవెలలో దేవిని సైతం ఏ పూట కన్నా నీవేననుకుంటున్నా

కోనేటి నీటిలోనా కలువ రేకు నీకన్నానా అని మురిసిపోతున్నా

నీ కూనిరాగమేదో నా చెవిని గుసగుసలాడింది

నువు కలగను రసయోగమేదో నను తట్టిలేపింది