Sunday, March 15, 2020


https://youtu.be/0w41gD_9WRY?si=tZxxsdJwUzjL6AxS

చేపరూపుదాల్చి సోమకుణ్ణి జంపి
వేదాలను కాచావు వేదవేద్యా వేంకటేశా
సాగరాన్ని మథించగా మంథరగిరిని మోయగా
కూర్మావతారివై కూర్మికూర్చినావు దేవతారాధ్యా శ్రీనివాసా
ఎత్తక తప్పదిపుడు నరజాతిని రక్షింపగా
ఏదో అవతారం ఏకాదశావతారం
ధన్వంతర మూర్తివై సంజీవని మాత్రవై
ఉద్భవించి నెరపాలి కరోనాది వ్యాధుల సంహారం

1వరాహమూర్తివై  హిరణ్యాక్షు వధియించి
భువి చెఱ విడిపించావు వడ్డికాసులవాడా
నరకేసరి రూపుదాల్చి హిరణ్య కశిపు దునిమి
ప్రహ్లాదుని బ్రోచావు ఆపదమ్రొక్కులవాడా
వామన భార్గవ అవతారములెత్తి దాన ధర్మ
వైశిష్ట్యము తెలిపావు వకుళా నందనా
ఎత్తక తప్పదిపుడు నరజాతిని రక్షింపగా
ఏదో అవతారం ఏకాదశావతారం
ధన్వంతర మూర్తివై సంజీవని మాత్రవై
ఉద్భవించి నెరపాలి కరోనాది వ్యాధుల సంహారం

2.సీతా రామునిగా మానవీయ విలువలనే
జగతికి తెలిపావు జగదానందకారకా
శ్రీ కృష్ణ మూర్తిగా జగద్గురువు నీవై
గీతను బోధించావు గోవింద ప్రియ నామకా
బుద్ధ కల్క్యి రూపుడవై లోకోద్ధరణ జేసి
ప్రసిద్ధికెక్కినావు తిరుమల గిరి దీపకా
ఎత్తక తప్పదిపుడు నరజాతిని రక్షింపగా
ఏదో అవతారం ఏకాదశావతారం
ధన్వంతర మూర్తివై సంజీవని మాత్రవై
ఉద్భవించి నెరపాలి కరోనాది వ్యాధుల సంహారం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

చిన్ని చిన్ని జాగ్రత్తలు
తీర్చివేసేను మన చింతలన్నీ
వస్తే రానీ ఆపత్తులు
తిప్పికొడదాము చిత్తశుద్ధితోని
కలిసి పోరుదాం మనవంతు బాధ్యతగ
కలియబడదాం కరోనా మహమ్మారినణిచేయగా

1.దరిరావు ఏ క్రిములు వైరస్ లూ
పరిశుభ్రతను పాటించినపుడు
మనలేవు ఏ రోగాలు వ్యాధులు
పరిసరాలు స్వఛ్ఛగా ఉంచుకొన్నప్పుడు
నిర్లక్ష్యమే మనకు ఆత్మహత్య వంటిది
నిగూఢతే మనిషిని మట్టుబెడుతుంది

2.పదేపదే చేతులని ప్రక్షాళణ చేసుకుందాం
దగ్గుతమ్ము జలుబుల్లో మాస్కుల్నే వేసుకుందాం
ఏమాత్రం జ్వరమున్నా ఆసుపత్రికి వెళదాం
చికిత్సదాకా ఎందుకు ముందస్తు చర్యలు చేపడదాం
కరచాలనాలే కరోనాకాలవాలం
నమస్కారమొక్కటే రోగవ్యాప్తి పరిష్కారం

3.అంటువ్యాధి కరోనా అన్నది మరువొద్దు
గుంపులుగా పొరపాటుగను కూడిఉండవద్దు
అరికట్టే వరకైనా కట్టుబాట్లు పాటించాలి
చావోరేవో  కరోనాను తుదముట్టించాలి
ప్రపంచానికే ఇది ఒక సవాలయ్యింది
ఘోరకలేదైనా సరే మానవాళే గెలుస్తుంది