Monday, November 25, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:తోడి

ఎచటనున్నది భువన విజయము
ఏదీ అభినవ శ్రీకృష్ణ దేవ
రాయల విజయనగరము
రాజులూ మహరాజులేరీ
ఏరీ కళాపోషకులెచటగలడా భోజరాజు
ఆదరణకు నోచని కళాకారులెందరో
ప్రతిభకు గుర్తింపులేని కవిపుంగలెందరో
మరుగున పడి మగ్గుతున్న సంగీత స్రష్టలెందరో

1.ఎదురయ్యే అనుభవాలే సమసమాజహితాలై
ఎదపొందే అనుభూతులె కవితలు గీతాలై
ప్రతిక్షణం ప్రసవించే సృజనకారులెందరో
జనరంజకమొనరించే సృష్టికర్తలెందరో
ఆశించరే కానుకలను శభాషనెడి ప్రశంసలనె
ఊహించనూలేరు కప్పేదుప్పట్లని కొట్టగచప్పట్లనే

2.గజారోహణాలెక్కడ గండపెండేరాలెక్కడ
స్వర్ణకంకణాలెక్కడ సత్కారసభలెక్కడ
పత్రికలలో అచ్చైతే అదే కీర్తికిరీటం
కవిత చదువ వేదికపై అవకాశమె పురస్కారం
పైరవీలస్థాయి లేక అందుబాటునందలేని ప్రవీణులెందరో
పక్షపాత వాత పడి ప్రభుత వరకు చేరలేని ధురీణులెందరో