Thursday, March 31, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కోయిల మూగవోతుంది

కిసలయాలు కరువైతే

నెమలి నాట్యమాగుతుంది

మేఘమాల కనరాకుంటే

వసంతమెలా వస్తుంది

వనమెల్ల విరియకుంటే

నా కవిత ఎలా వెలుస్తుంది

నీతో స్ఫూర్తి పొందకుంటే


1.పావనమని తోస్తుందా

మందిరాన దేవే లేకుంటే

కనులకింపునిస్తుందా

కలువలేని కొలనుంటే

పున్నమైనా వెన్నెలకాసేనా

శశికి మబ్బులడ్డొస్తుంటే

నా కవనమెలా పొడుస్తుంది

నీ ప్రేరణ వరించకుంటే


2.పాల పిట్ట కనరాక

పండగెలా ఔతుంది దసరా

రంగవల్లి ముంగిట లేక

సంకురాతిరి సంబురమా

దివ్వెలే వెలుగని వేళ

దీపావళి అరుదెంచేనా

నా భవిత  గెలుస్తుందా

వెన్నుదన్ను నువు లేకున్న

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కవిత్వమంటే కల్పనా చాతుర్యత

కవిత్వమంటే అతిశయమొలికే సామాన్యత

గోరంతలు కొండంతలుగా మలచితే కవిత

నల్లరాతికి నగిషీలు చెక్కితే అద్భుత భావుకత

ఐనా సరే నీమీద చెప్పిన కవితలన్నీ అక్షర సత్యాలే

నిజమే చెలీ నీ గురించి పాడిన గీతాలైతే ఆణిముత్యాలే


1.దేవకన్యలు పోలికలై వరుస కడతారు

అప్సరసలు ఉపమానాలుగ నిలబడతారు

కావ్య నాయికలంతా జేరి నిను కొనియాడేరు

అలంకారమే కవితకు అలంకారమనియేరు

ఐనా సరే నీమీద చెప్పిన కవితలన్నీ అక్షర సత్యాలే

నిజమే చెలీ నీ గురించి పాడిన గీతాలైతే ఆణిముత్యాలే


2.చిలవలు పలవలుగా ఆకసానికెత్తేస్తారు

ఉబ్బితబ్బిబ్బయ్యేలా ఊదరగొడతారు

నీలా ఇలలో లేనే లేరని ఇట్టే పొగిడేస్తారు

కవితావస్తువు వనితైతే మరి కట్టిపడేస్తారు

ఐనా సరే నీమీద చెప్పిన కవితలన్నీ అక్షర సత్యాలే

నిజమే చెలీ నీ గురించి పాడిన గీతాలైతే ఆణిముత్యాలే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాయీ యను పిలుపులోనె హాయి ఉన్నది

సాయినామ స్మరణలో తన్మయత్వమున్నది

సాయి ఎడల ఎడదలో నమ్మకమున్నది గట్టి నమ్మకమున్నది

సాయిని కోరుకొనగ ఏమున్నది ఇంతకన్న ఏమున్నది

సాయిరాం షిరిడీ సాయిరాం సాయిరాం షిరిడీ సాయిరాం 


1.సాయి కనులలో అపారమైన కరుణ ఉన్నది

సాయి చూపులో విశేషమైన ఆకర్షణ ఉన్నది

సాయి సన్నిధానంలో శాంతి ఉన్నది ప్రశాంతి ఉన్నది

సాయి బోధలందున క్రమత ఉన్నది మానవత ఉన్నది

సాయిరాం షిరిడీ సాయిరాం సాయిరాం షిరిడీ సాయిరాం 


2.సాయి పాదాలలో పావన గంగ ఉన్నది

సాయి చేతిలో అక్షయ పాత్ర ఉన్నది

సాయి ఒసగు విభూతిలో ఔషధమున్నది ఐశ్వర్యమున్నది

సాయి భక్తి భావనలో తృప్తి ఉన్నది జీవన్ముక్తి ఉన్నది

సాయిరాం షిరిడీ సాయిరాం సాయిరాం షిరిడీ సాయిరాం

Wednesday, March 30, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎప్పుడైనా ఎన్నడైనా గుండె గొంతై పలికిందా

ఏ ఘటనకైనా  ఎడద కరిగి కన్నీరై ఒలికిందా

కదిలించక మానదు మదిని మరుగైన మానవత

హృదయాన ఊరక మారదు ఊరకనే ఆర్ద్రత

ప్రార్థించే పెదవులకన్నా సాయపడే చేతులె మిన్న

చెమరించే కన్నులకన్నా అందించే ఆసరా మిన్న


1.వ్యర్థపరచు ఆహారాన్ని చెత్తనుండి ఏరుకొని

 ఆకలికి తాళలేక ఆబగా తినబూనే ఆర్తులనేగని

పాడుబడ్డ పైపులలోన కాపురాలు చేసుకొంటుంటే

వాననీరు వరదైముంచితె పాలుపోని దీనులనే గని

ప్రార్థించే పెదవులకన్నా సాయపడే చేతులె మిన్న

చెమరించే కన్నులకన్నా అందించే ఆసరా మిన్న


2.దిక్కుమొక్కులేకుండా రోడ్డు పక్కనిదురోతూ

చలికి తట్టుకోలేకా ముడుచుకొంటు వణికే బాలలకై

చదువు సంధ్య నోచుకోక పోట్టపోసుకోవడానికి

చిట్టిచిట్టి చేతులతో మోటు పనులుచేసే అనాథలకై

ప్రార్థించే పెదవులకన్నా సాయపడే చేతులె మిన్న

చెమరించే కన్నులకన్నా అందించే ఆసరా మిన్న

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పొగడ్తే పెద్ద అగడ్త

ఆ వ్యసనానికి బానిసనయ్యానా

రోజు రోజుకీ దిగజారుట మొదలెడ్తా

ప్రశంసే వింత నషా

మెప్పుకై తహతహలాడానా

నాకు నేను వ్యతిరేకంగా పరుగెడ్తా

మనసా నాకీయవే భరోసా

మనసా నను నడిపించవే సుగతి దెస


1.తోచినదేదో రాసెయ్యడం 

సోషల్ మీడియాలో తోసెయ్యడం

స్పందించాలని ఆనందించాలని ఆశించడం

ఆవెంటనే ప్రతిచర్య గనక ఆరాట పడడం

పదేపదే ప్రతివారిని ప్రాధేయ పడడం

మనసా అవసరమా నీకీ పోకడ 

మనసా తూగేనా ఈ కప్పల తక్కెడ


2.మసిబూసి మారేడు చెయ్యడం

పసలేకున్నా పరులు మొయ్యడం

ఏ భావన కవనానికి  పురికొలిపిందో

ఏ గీతం హృదయాలను అలరించిందో

ఏ లక్ష్యం సంతృప్తికి నిను దరిజేర్చిందో

మనసా నీకేల కీర్తి కండూతి

మనసా నీకెందుకు దుష్ట సంస్కృతి

Sunday, March 27, 2022

 రచన,స్వరకల్పన&గానం: డా.రాఖీ


రాగం:దర్భార్ కానడ


నా భక్తిని సడలనీకు భక్తవ శంకరా

అనురక్తి నీ ఎడల ఇనుమడించు అర్ధనారీశ్వరా

ఆసక్తిని ద్రుంచు విషయవాంఛలందు అరుణాచలేశ్వరా

ముక్తి ద్రోవ చేర్చు  ప్రభూ వారాణసీ పురపతే నమో విశ్వేశ్వరా


1.ఇల్లూ పట్టుయని మోహపడే సాలీడును

మదము మీరి ప్రవర్తించు మత్తేభమును

బుసలుకొట్టు క్రోధమున్న కోడెనాగును

తిన్నని యోచన లేని క్రూర భిల్లుడను

కడతేర్చి కరుణించు శ్రీ కాళ హస్తీశ్వరా శ్రీశైల మల్లీశ్వరా


2.ఉచితానుచితములసలెంచని రావణుడను

స్వార్థము మూర్తీభవించిన గజాసురుడను

శరణాగతి కోరుకున్న మార్కండేయుడను

గుడ్డిగా  నమ్ముకొన్న దీనుడ శిరియాళుడను

సరగున వరమీయర శ్రీ రాజ రాజేశ్వరా శ్రీరామలింగేశ్వరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అందరిలానా నేను నీకు-అంతలా నన్నసలే అనకు

నేను నీకు ఏకైకం-నేనంటే ప్రత్యేకం

ఇంతకన్న ఇంకెవరున్నా నేను తప్పుకుంటా

పొరపాటే నాదని చెప్పి తప్పు ఒప్పుకుంటా


1.ఎక్కువగా ఊహించానా-ఆత్మలాగ ప్రేమించానా

అనుక్షణం నిను వెంటాడి వింతగా వేధించానా

ఇప్పుడైనా చెప్పరాదే నేను నీకు ఏమీ కానని-కానననీ

తప్పదింక చెరుపుకుంటా నీ జ్ఞాపకాలని-కాలనీ కాలనీ


2.సంశయాలున్నాయి-సంకోచాలున్నాయి

చెప్పనివి మది విప్పనివి ముచ్చటలెన్నో ఉన్నాయి

తేల్చుకో నాస్థానం నీమదిలో- పోల్చుకో నారూపం నీఎదలో

స్పష్టపరచు ఆగుతాను నే చచ్చేదాకా నువు మనసిచ్చేదాకా

Saturday, March 26, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చంద్ర కౌఁస్


కనికరమే గనవా-శ్రీకర శ్రీవిభవా

ఇహపరమీవే కావా-వరదా మాధవా

నను జడునిగ మార్చావు మూఢునిగా చేసావు

ఆంతర్యమేమి సర్వాంతర్యామి సర్వేశా

దీని భావమేమి నమో తిరుమలేశా


1.మన్నుతినే పాములా మిన్నకుంటిని

మిన్ను మీద పడినా కూడ కదలకుంటిని

అనారోగ్యమో ఇది వైరాగ్యమా నాది

ఆంతర్యమేమి సర్వాంతర్యామి సర్వేశా

దీని భావమేమి నమో తిరుమలేశా


2.నిస్తేజమయ్యింది ఉత్సాహమంతా

నిర్వీర్యమయ్యింది నా సత్తువంతా

నిరాసక్తతో ఇది అనురక్తో ముక్తిది

ఆంతర్యమేమి సర్వాంతర్యామి సర్వేశా

దీని భావమేమి నమో తిరుమలేశా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చూడాలని ఉన్నా చూడలేని దీన స్థితి

రావాలని ఉన్నా రాలేని పరిస్థితి

ఎందుకింత ఆరాటం 

ఒడ్డున పడ్డ చేపలాగా

ఏమిటో తాపత్రయం 

చందమామ నందుకొనగ


1.నీ మనసు నాకు తెలుసు

నేనంటే పిచ్చి పచ్చి పులుసు

అందుకే నీకింత నేనలుసు

నీ కంటికి నే నలుసు నీ కంటిలోని నలుసు

ఒక్కసారి కనిపిస్తే మదికెంతో ఊరట

స్పందించి నవ్వితే గెలిచినట్టె ఆట


2.నోరార తెలపాలి నీ ప్రేమను

వదలనంటు చేయాలి నాకు బాసను

తెగువతో దాటాలి నువ్వు గడపను

నీవు లేక నేను ఎలా ఎలా గడపను

మాటవరసకైనా కాదనకు నన్ను

విరిగిపడుతుందపుడు నామీద మిన్ను

Friday, March 25, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కొత్తగా శబ్దం చేస్తోంది

లబ్ డబ్ మానేసి నా గుండె

కేవలం నీ పేరే ధ్వనిస్తోంది

 ప్రేయసీ ప్రేయసీ అని

గారాలు పోతోంది

మారాము చేస్తోంది

ధ్యాసను మళ్ళింప జూస్తే

బెట్టుగా మొండికేస్తోంది


1.మనసెపుడో నీ వశమైంది

చిత్తము నీ మత్తునుగొంది

ప్రేమంటే పిచ్చేనని ఋజువయ్యింది

నిద్దుర లో కలవరింతలు

రోజంతా పలవరింతలు

నీ చింతన తీరనిచింతగ నా వంతైంది


2. మామూలుగ నను జమకట్టకు

అందరితో నను ముడిపెట్టకు

వెంటబడి వేధిస్తానని నన్ను సరిపెట్టకు

ప్రేమించే నా నిజాయితి

నీవే నా బ్రతుకైన సంగతి

ఇకనైనా గ్రహించవే నన్ననుగ్రహించవే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వసంతం విరిసినట్టు

విద్యుల్లత మెరిసినట్టు

చిరుజల్లులు కురిసినట్టు

సిరి మల్లెలు పరిచినట్టు


ఆ నవ్వెంత మధురము

సుధ లొలికె అధరము

ఆ ఆహ్లాద వదనము

మనసానంద సదనము


1.తేనె జాలువారినట్టు

తేటగీతి రాసినట్టు

తేరుమీద సాగినట్టు

తెలతెల తెలవారినట్టు


ఆ నవ్వెంత సుందరము

ఎదురొచ్చే నందనము

ఆ ఆహ్లాద వదనము

మనసానంద సదనము


2.నురగలు చెలరేగినట్టు

సరిగమలే పలికినట్టు

వరములనే పొందినట్టు

ముత్యాలు రాలినట్టు


ఆ నవ్వే మనోహరం

హృదయాన కలవరం

ఆ ఆహ్లాద వదనము

మనసానంద సదనము

Thursday, March 24, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుడ్డివాడినే నిను చూడనినాడు

వెర్రివాడినే నువు కాదని చూడు

ఊపిరైన ఆపివేస్తా నిను తలచుటకోసం

జీవితమే అర్పిస్తా నిను వలచుటకోసం

కోన్ కిస్కాగాడినైనానా నా చెలీ

సర్కస్లో జోకర్ గాడినైనానా  నెచ్చెలీ


1.అదే పనిగ చూస్తున్నా ఎదురువస్తావని

పదేపదే ఊహిస్తున్నా నావైపు చూస్తావని

పట్టపగలు సూరీడున్నా దట్టమైన చీకటి నువులేకా

కళ్ళకు తగుజోడున్నా మసక మసక నిను గనకా

వెన్నెలవై వెలుగులు తేవే నా నీరవ నిశీధిలోనా

గోదారిగ పరుగున రావే నా నెర్రెల బీడు నాన్పగ


2.నాకు నేనే ప్రశ్నించుకొని సమాధాన పడుతున్నా

నాలో నేనె గొణుగుకొని సహనమెంతో వహిస్తున్నా

పిచ్చోడిగ అనుకుంటేమి నువ్వే నను మెచ్చనప్పుడు

మతిభ్రమించి పోతేఏమి భ్రమలో నువు దక్కినప్పుడు

అశ్రువు నువు రాల్చినపుడే  నా చితి సంపూర్తిగ కాలు

ఏడాదికోసారైనా నీ స్మృతిలోనైనా  నే మెదిలితే చాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కసాయికైనా కరుగుతుంది హృదయము

సాయీ నీకింకనూ కరుగకుంటె చోద్యము

ఎలా ఉన్న జీవితాన్ని ఎలా మార్చినావు

ఆనందమె నోచకుండ దిగజార్చినావు

నాకు చేతకాదని ఇపుడైనా ఒప్పుకో

నా ఎదురుగ నిలవక ఇకనైనా తప్పుకో


1.పేరుగొప్ప ఊరు దిబ్బ ఉదాహరణ నీవేలే

తండోప తండాల జనం ఉత్తి అమాయకులే

అభిషేకాలు  అర్చనలు భజనలు నీకు వృథాలే

పంచ హారతులు పల్లకీ సేవలు సర్వం వ్యర్థాలే

ఎవరు ఖండించినా నమ్మి చెడిన నా అనుభవాలివి

ఎంతగ వాదించినా ఎవరు తీర్చలేని నా వెతలివి


2.అదిగో పులియంటే ఇదే ఇదే తోకయనే వైనము

చిలవలు పలువలుగా నీ మహిమల వ్యాపనము

నాకేమీ ఒరుగకున్నా సాయి నీ పాటలెన్నో రాశాను

నయమేమి చేయకున్నా బాబా నీ భక్తుడనయ్యాను

ఔనన్నా కాదన్నా బెల్లంకొట్టే రాయివే సాయి నీవు

ఎవరి బాధలేమాత్రం పట్టించుకోని గోసాయివీవు

Wednesday, March 23, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిద్రపట్టదు నీ నగుమోమును గనక

రెప్పవాలదు నినుగాంచలేదు గనక

బ్రతకమంటావా,చంపుకుంటావా

నీ మనసునడుగు ఒకసారి

ఓపలేకున్నా నీకై వేచిచూచి వేసారి

శుభరాత్రికానపుడు శుభోదయంకాదెపుడు


1.స్ఫూర్తిగలుగ జేస్తుంది

ఆర్తి తీర్చివేస్తుంది

అందాలకే అందం నీ వదనారవిందం

మత్తులో ముంచేస్తుంది

హాయిలో తేలుస్తుంది

అమృతభాండం నీ ముఖబింబం

చూపిస్తె సొమ్మేంపోదు కనిపిస్తె ఖర్చేంకాదు

శుభరాత్రిగ మార్చేయి శుభోదయం కానీయి


2.కలలు కనవచ్చు నినుచూసి

కల్పనే చేయొచ్చు కనుల దాచి

కవితలెన్నొ రాయవచ్చు నాకు వెరసి

మరుల జోరు నాపవచ్చు

మనసు పోరుమాన్పవచ్చు

తెల్లారిపోయేదాకా ప్రశాంతంగ ఉండవచ్చు

శుభరాత్రిక చెప్పవే శుభోదయం తప్పదే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మాట తప్పడం మామూలేగా నీకు

దాట వేయడం అలవాటేగా నీకు

చేసిన బాసలు చెప్పిన ఊసులు నీటిమూటలేనా

వేసిన ఒట్లు మాటల కనికట్లు గాలివాటమేనా

చెప్పిందేమిటి నువు చేసేదేమిటి

ఇస్తానన్నది చెలీ మరుస్తావేమిటి


1.బొట్టు కాటుక పెట్టుకొని

తల్లో పువ్వులు తురుముకొని

సిరిసిల్ల నేతచీరనే సింగారించుకొని

కరినారం వెండి పట్టీలే పాదాలకు పెట్టుకొని

వస్తానంటివే మహలక్ష్మివి నీవై

ఎదురొస్తానంటివే గృహలక్ష్మివి నీవై


2.సిగ్గును బుగ్గన దిద్దుకొని

నగవులు పెదవుల అద్దుకొని

కళ్యాణి రాగాన ఆలాపన జతివై

మంజుల స్వానాల స్వానుభూతివై

ఇస్తానంటివే  కొత్త జీవితాన్ని

వినిపిస్తానంటివే మన ప్రేమగీతాన్ని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కోరుకో చెలీ  ఏ కానుకైనా

ఇచ్చేస్తా అది నా హృదయమైనా

వదులుకుంటా నా ప్రాణమైనా

వదులుకోలేను నిను క్షణమైనా

ప్రేమా ప్రణయం జీవన సర్వం నువ్వే

నేడూ రేపూ జీవిత కాలం నువ్వే నువ్వే


1.పొద్దుపొడిచేది నీతోనే

పొద్దుగ్రుంకేది నీతోనే

పొద్దుపొద్దంతా నాకు నీ సుద్దులతోనే

ఆకలిని నే మరిచానే

నిద్దురను మానేసానే

నీ తలపులలోనే మునకలువేసానే

అచ్చట ముచ్చట నచ్చుట అన్నీ నీతోనే

పచ్చని వెచ్చని మెచ్చిన ఊహలు నీతోనే


2.ప్రతి భావన పంచుకొని

అనుభూతిగ మలచుకొని

ఆనంద నందనాన నీతో విహరిస్తానే

పదములలో పొదువుకుని

పాటలుగా అల్లుకొని

పాడుకుంటూ కడదాకా బ్రతికేస్తానే

ఇష్టము కష్టము స్పష్టముగా నాకు నువ్వే

అదృష్టము సంక్లిష్టమూ నాకు నువ్వే నువ్వే


ఇందు అందు ఎందు వెదకినా దొరకని నా 'ఇందు' అందమేమందు

చిందర వందర గందరగోళపు నా మదికి ఇందు అందమే మందు

వందలాది వత్సరాలు తపముజేసినా పొందలేని వరము నా ఇందు

అందము ఆనందము కలబోసిన అతిలోక సుందరాంగి నా ఇందు


1.ఇందు చెంత ఉంటే ఎంతటి అడవైనా నందనవనమే

ఇందు తోడుగా ఉంటే ఎడారి సైతం అపర బృందావనమే

ఇంద్రపదవి ఇచ్చినా వదులుకుంటా ఇందు నా చేయినందుకుంటే

ఇందు వదన  మందగమన నా ఇందు కనువిందు నా ముందుంటే


2.ఇందు అరవింద పాదానికి అందెగా తగిలిస్తా నా డెందము

ఇందు అరవింద నయనాలను అలరించగ నేనౌతా అంగారము

మందార మకరంద మధురిమ లొలుకును సదా నా ఇందు అధరాలు

మందస్మితాన చంద్రికలే చిలుకును ఆహ్లాద భరితమై  ఇందు హసితాలు



 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక్కసారి కనిపిస్తావా

మనసు గుట్టు చెప్పేస్తావా

యుగాలుగా వీడనిబంధం

ఎరుక తిరిగి కలిగిస్తావా

పెదవులిపుడు విప్పేస్తావా

ప్రేమను ఇక ప్రకటిస్తావా

కొట్టుమిట్టాడే నా ప్రాణం

పోకుండగ చూస్తావా


1.చినుకుగ నను తడిపేస్తావా

మారాకులు తొడిగిస్తావా

ఈ మోడునికనైనా 

చిగురింపజేస్తావా

సంతసాన్ని సొంతం చేసి

సాంత్వననే కలుగగజేసి

ఆకు కొసన జారకుండా

నాలో విలీనమౌతావా


2.మరునిమిషం మాయమౌ

హరివిల్లువు నువుకావొద్దు

అందుబాటులో ఉండే 

అవనివైతె ఎంతో ముద్దూ

చేరువగా తపనలు పెంచే

మరీచికవుగా మారవద్దు

గుక్కెడైన నీరందించే 

చెలమెలాంటి చెలిమిని నాకిద్దూ

Tuesday, March 22, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


క్రీగంట చూసినా చాలు లైలాలా

ఫీలైపోతాను నాకు నేను మజ్నూలా

ఓ పూట హా యన్నా చాలు లవ్ లీగా

సంబరాలు చేసుకుంటా హోళీలా

ఎలిజిబెత్ రాణి వేస్టే నీముందు

క్లియోపాత్రా వరెస్టే నీదే అందమందు


1.దినమానం అరుస్తున్నా వినిపించుకోవేమే

అనుక్షణం అంగలారుస్తున్నా పట్టించుకోవేమే

గొట్టంగాడెవడో నీకెందుకు చుట్టమవ్వాల

బేవార్స్ ఆ టోపీవాల నీకేల సోపతి కావాల

ఓర్చుకోలేను సూర్యుడి పోడ తాకినా సైతం

జీర్ణించుకోలేను వడగాలి సోకినా ఏమాత్రం


2.తలచుకో చాలు నన్ను జీ హుజూరని వాలుతాను

ఆజ్ఞాపించు వేలుకోసుకొమ్మని మెడత్రెంచి నే తెస్తాను

కొండంత నా ప్రేమను ఈజీగా  బలిఇస్తా

పిసరంత నీ ప్రేమను బ్రతుకంతా చవిచూస్తా

నువ్వు నాకే సొంతం ఐతే కాని నాది స్వార్థం

నువ్వే జీవన సాఫల్యం నీ ప్రేమే నా పరమార్థంP

 

https://youtu.be/kFX0nRjYcYM?si=2Ia2ziPFn99zJBPp

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


(మహాకవి శ్రీ శ్రీ గారి ప్రేరణతో)


కుంభవృష్టి కురిసినా చలించని దున్నలం

కుళ్ళి కంపుకొడుతున్న  జీవశ్చవాలం

మనదీ ఒక బ్రతుకేనా బ్రతకలేక బ్రతికేస్తూ

మనదీ ఒక మనుగడనా ఎలాగోలా గడిపేస్తూ


1.తాయిలాల కోసమే చొంగ కారుస్తూ

ఎంగిలి మెతుకులకై అంగలారుస్తూ

ఎరగా  దొరికేటి రాయితీల కోసమై

తేరగా లభించేటి కాటి కూటి కొఱకై

మనదీఒక బ్రతుకేనా అరచేతి బెల్లానికి మోచేయి నాకుతూ

మనదీ ఒక బ్రతుకేనా స్వతంత్ర భారతిలో బానిసలై మసలుతూ


2.ఓటుకొరకు మనని మనం అమ్ముకొంటూ

కులం మతం ప్రాతిపదికగ కుమ్ముకుంటూ

కుడి చేత్తో కుడిపించి ఎడం చేత్తొ లాక్కొనడమెరుగక

కుక్కిన పేనల్లే చిక్కిన చాపలల్లే ఏ మాత్రం కిక్కురుమనక

మనదీ ఒక బ్రతుకేనా శక్తున్నా చేష్టలుడుగి చేవ చచ్చి

మనదీ ఒక బ్రతుకేనా సోయున్నా సోమరులై మనసుపుచ్చి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సగం సగం నమ్మినపుడె భ్రష్టుబట్టి పోతారు

సగం సగం నమ్మనపుడె బొక్కబోర్ల పడతారు

విశ్వాసం అంటేనే వంద శాతం

ఆస్తికతో నాస్తికతో సంపూర్తిగ నవ్మితేనే సజావు జీవితం


1.అన్యధా శరణం నాస్తియంటూ

పొందాలి సర్వస్య శరణాగతి స్వామిని వేడుకొంటూ

ఒడ్డును చేర్చే సరంగు నీవేయని 

సాగిలపడిపోవాలి సర్వం సమర్పణ చేసుకొంటూ

రాకతప్పదప్పుడు కరిరాజ వరదునికి

శాయశక్తులా నువు చేసిన ప్రయత్నానికి

నీకు చేయూతనీయడానికి

దైవం మానుషరూపేణాయని తెలపడానికి


2.చెదరని సంకల్ప బలం

మొక్కవోని ప్రయత్నం అనితరసాధ్యమైన సాధన

గెలువడమే స్థిర లక్ష్యం

ఓటమి ఒక గుణపాఠం ఏకాగ్రత విజయానికి నిచ్చెన

గమ్యమే కాదు సుమా గమనమైన రమ్యమే

కలుపుతుంది ఒక గీత గెలుపును ఓటమిని

తెలుపుతుంది బ్రతుకు విలువ

ఆత్మవిశ్వాసమే ఆనంద హేతువని

Monday, March 21, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కళ్యాణి


కళ్యాణ వేంకటేశ్వరా కళ్యాణమే కూర్చరా

కళ్యాణ వేంకటేశ్వరా జగత్కళ్యాణమే కూర్చరా

కారుణ్య శ్రీనివాసుడా మాపై కనికరము జూపరా

కారుణ్య శ్రీనివాసుడా అభయకరమునందీయరా

వేంకట గిరి శ్రీహరి గోవింద మాధవ హరే మురారి

ధర్మపురిన అలరారే వేంకటపతి నమోనమో శౌరి


1.మంగమ్మను పద్మావతిని సతులుగ చేకొంటివి

రంగరంగ వైభోగముతో సేవలందుకొనుచుంటివి

మేలుకొలుపు మొదలుకొని పవళించు వేళ వరకు

విశ్రమించవు భక్తులబ్రోయుచు కూర్చోవూ చివరకు

వేంకట గిరి శ్రీహరి గోవింద మాధవ హరే మురారి

ధర్మపురిన అలరారే వేంకటపతి నమోనమో శౌరి


2.వలచి వరించినావు  శ్రీమతిగా పద్మావతిని

అప్పుచేసి సైతం అందుకొంటివి శ్రీదేవి చేతిని

నిలువుదోపిడే అడిగేవు ఋణబాధ విముక్తికోసం

దేహమే కాదు స్వామి దోచుకోవయ్య నా మానసం

వేంకట గిరి శ్రీహరి గోవింద మాధవ హరే మురారి

ధర్మపురిన అలరారే వేంకటపతి నమోనమో శౌరి

 రచన,స్వరకల్పన&గానం:  డా.రాఖీ


సొట్టబుగ్గల సొగసెంత - కళ్ళు తిప్పలేనంత

సోగకన్నుల సొబగెంత - కవులు పొగడలేనంత

పలుకులలో పదునెంత- మంత్రముగ్ధులయ్యేంత

నవ్వులలో సుధ ఎంత-మృతులు తిరిగి బ్రతికేంత

నీస్నేహ సౌరభం ఒకవరం- చెలీ నీమనసే అనురాగ సరోవరం


1.మండుటెండలోన నీచెంతన మలయమారుతం

ఎడారిదారులందు ఎదురైతే నీవే ఆమని సంయుతం

కాళరాతిరిలో నీవే వెల్లువయ్యే పూర్ణచంద్రికా పాతం

ఆశల వెలుగుల పొడసూపేటి  తూరుపు సుప్రభాతం

నీస్నేహ సౌరభం ఒకవరం- చెలీ నీమనసే అనురాగ సరోవరం


2. నీవున్న తావులే కమనీయ నందనవనములు

నీసన్నధిలోని క్షణాలే  రాధికాసాంత్వన సమములు

నీ కరస్పర్శ  మరిపించు మయూర పింఛ స్పృశ్యతను

నీ దర్శనమే మురిపించు చకోరి చంద్రికా సదృశ్యతను

నీస్నేహ సౌరభం ఒకవరం- చెలీ నీమనసే అనురాగ సరోవరం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీవే నడయాడే ఒక హరివిల్లు

నీ తనువున అణువణువున హోళీ ఆనవాళ్ళు

ఆపాదమస్తకం సప్తవర్ణ ప్రస్ఫుటమౌ గాజు పట్టకం

నఖశిఖ పర్యంతం వన్నెలు మార్చే కృకలాస సదృశం


1.విరబోసిన కురులలో ఒలికే నల్లదనం

చిరునవ్వున దంతాల మెరిసే తెల్లదనం

సిగ్గులొలుక బుగ్గలలో కురిసే ఎరుపుదనం

సిరిచందన ఛాయ చిలికె నీ సంవాహనం


2.నీ చేతి గాజులలో నిగారించె హరితము

పాదాల సంరక్షగ పరిఢవిల్లె హరిద్రము

వీనుల ఊగాడే బుట్టలదోగాడే ఉదావర్ణము

నయనాల కనుపాపల ద్యోతకమౌ నీలము

Wednesday, March 16, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తలుపులు మూయగలవేమో-తలపుల చొరబడ అడ్డేది

కలవగ వాలాయించెదవేమో - కలలో కలయికెలా చెడేది

ఊపిరిలో ఊపిరినౌతా - ఎదచేసే సవ్వడినౌతా

తప్పుకోగలవా నానుండి - తప్పనిసరే నాతో నీముడి


1.మెడకు పడిన పామైనా కరవకుండునేమో

అడుగు పెడితె ముల్లైనా గుచ్చకుండునేమో

పసుపు తాడునై నీతో జతపడి పోతా

నుదుట కుంకుమనై నేనతుకు పడతా

మనసులో భావమవుతా మాటలో స్పష్టమవుతా

తప్పుకోగలవా నానుండి - తప్పనిసరే నాతో నీముడి


2.నీడైనా ఎపుడైనా నిను వీడిపోవునేమో

నీవైనా ఎన్నడైనా నీ ఆజ్ఞ మీరుదువేమో

తనువు చాలించినా నిను వదలని తోడౌతా

నువు గీచిన గీతనెపుడూ దాటని నీ దాసుడనౌతా

పెదవి మీద నవ్వునౌతా పదముల సిరిమువ్వ నౌతా

తప్పుకోగలవా నానుండి - తప్పనిసరే నాతో నీముడి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ సొమ్మేం జారిపోతుంది 

ఒక్కసారి నాకు నువ్వు హాయ్ చెప్పితే

నీ సోకేం కరిగిపోతుంది 

గుడ్ మార్నింగంటూ పలకరించితే

గజ గమనా ఘనజఘనా నీకిది తగునా

లలనా  మనగలనా నిముషమైన నువు వినా


1.నా అంతట నేనుగా కుదుపాలి నిన్ను

కవితగా నిను మలచగ కదపాలి పెన్ను

పొలమారునట్లుగా తలచాలి నిన్ను ప్రతిపొద్దు

కలనెరవేరేట్లుగా దాటవేల నువ్వు ప్రతి హద్దు

గజ గమనా ఘనజఘనా నీవేలే నా మనమున

లలనా  మనగలనా నిముషమైన నువు వినా


2.గాజుముక్కలే పూలరెక్కలు నీ చూపుల కన్నా

గండశిల సైతం అతిసున్నితం నీ కరకు గుండెకన్నా

నావైపుగా ఆరాటమెంత ఉంటే ఏం ప్రయోజనం

అర్పించినా కరుణించవాయే హృదయ నీరాజనం

గజ గమనా ఘనజఘనా నువ్వే లేక నే కవినా

లలనా  మనగలనా నిముషమైన నువు వినా

 రచన,స్వరకల్పన&గానం: డా.రాఖీ


ఇమ్మని అడుగలేదు ఏనిధిని-ఇస్తే చాలు సాయీ విబూదిని

కోరానా షిరిడీలో నీ సన్నిధిని-తొలగిస్తే మేలు నా దీర్ఘవ్యాధిని

చాలించు ఏకాదశ సూత్ర సోదిని-పరిమార్చు చిరకాల మనాదిని

పట్టించుకోనప్పుడు సాయిబాబా మరి తిట్టించుకొనగ నువ్వు సిద్దపడు


1.గొప్పలకేం కొదవలేదు సన్యాసివైనా

ఘనతకేం తక్కువని అవధూతవైనా

నీ గురించే నీ ధ్యాస చూడవేల మా దెస

ఎందరినినో బాగు చేసావే నాపై సీతకన్ను వేసావే

పట్టించుకోనప్పుడు సాయిబాబా మరి తిట్టించుకొనగ నువ్వు సిద్దపడు


2.మహిమలంటు ఉన్నాయా నిజముగనీకు

లీలలు చూపావంటే  నమ్మశక్యమా నాకు

కనికట్టులు చేసావు గారడీలు చూపావు

వందిమాగధులతో వింతగు ప్రచారాలు నెరిపావు

పట్టించుకోనప్పుడు సాయిబాబా మరి తిట్టించుకొనగ నువ్వు సిద్దపడు

Tuesday, March 15, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాకి: కలడు కలండనగ నీవిక కలవో లేవో

కలనైనా కనిపించక నీవొక కలవూ కావో


ఉన్నావని స్మరించలేనులే

లేనే లేవని విస్మరించలేనులే

ఎంత సందిగ్ధమాయే నీ ఉనికి

సంశయాలె తీరవాయే ఈనాటికి

నిరూపించుకోలేకుంటే నువ్వే హుళుక్కి

స్వామీ నువ్వే హుళుక్కి


1.శిష్టరక్షకుడ వంటారు 

దుష్ట శిక్షకుడవంటారు

తారుమారాయే నేటి తార్కాణాలు

శిష్ట శిక్షకునివైనావు దుష్ట రక్షకునిగ మారావు

ఉన్నావని నిను నమ్ముకోలేను

లేనే లేవని నిర్ధారించుకోలేను


2.ఆపత్తులలో ఆదుకొందువందురు

నీ భక్తుల నీదరికి చేదుకొందువందురు

ఎటమటమైపోయే నీ లక్షణాలు

ఆపదలు కలిగిస్తావు భక్తులను బాధిస్తావు

ఉన్నావని ఎలుగెత్తిచాటను

లేనే లేవని నాస్తికుడనవ్వను

Saturday, March 12, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గోదారి గంగలో తానాలు

నరసిమ్మసామి దర్శనాలు

ఏటేటా జరిగే జాతరా సంబరాలు

మొక్కులుముడుపులు కోరమీసాలు పట్టెనామాలు

గోవిందా గోవిందయని ఎలుగెత్తగ భక్తులు

పిక్కటిల్లు ధరంపురిలొ  నేల అంబరాలు


1.లచ్చిందేవి నరుసయ్యల పెండ్లే కనువిందు

కోనేట్లొ తెప్పదిరుగ సామిది షానా పసందు

డోలాలు ఊగుతుంటె పక్క చూపులే బందు

బుక్కాగులాలు బత్తెరసాల పేర్లు సామికె చెందు

గోవిందా గోవిందయని ఎలుగెత్తగ భక్తులు

పిక్కటిల్లె ధరంపురిలొ  నేల అంబరాలు


2.జోడు రథాలెక్కి కదుల నరహరి హరులు

తోకముడిచి పారిపోర కదాన  దానవ వైరులు

నలుదిక్కుల జైత్రయాత్ర సాగించి పలుమారులు

ఏకాంత సేవలో మునిగెదరు  శ్రీహరి సిరులు

గోవిందా గోవిందయని ఎలుగెత్తగ భక్తులు

పిక్కటిల్లు ధరంపురిలొ  నేల అంబరాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రవ్వలగాజులు చేతులకే రమణీయం

మువ్వల పట్టీల పాదాలే కమనీయం

నవ్వుల రతనాల మోవియే మాధుర్యం

పువ్వుల దండ వాలు జడకే సౌందర్యం

అన్నీ అమరిన నా నెచ్చెలి అందానికే అందం


1.సూర్యకాంతి మించిన మేను విణ్ణానం

చంద్రకాంతి వర్షించే కన్నుల విన్యాసం

అంగారక రంగీనే నుదుటన సిందూరం

గురుతరమై అలరారే యుగ పయోధరం

అన్నీ అమరిన నా నెచ్చెలి అందానికే అందం


2.పాంచజన్యం ప్రతిధ్వనించే కోమల గాత్రం

గాండీవాన్ని స్ఫురింప చేసే అంగ సౌష్ఠవం

సంగ్రామానికి సమాయత్తగా కుడి కురుక్షేత్రం

విజయాన్ని అందించడమే అంతస్సూత్రం

అన్నీ అమరిన నా నెచ్చెలి అందానికే అందం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ గతానికీ భవితకూ నేనౌతా వంతెన మిత్రమా

నీ ప్రగతికి ఆశయానికీ నేనౌతా నిచ్చెన

వేలుపట్టి నడిపించే తోడును నేనౌతా నేస్తమా

వెన్నంటి ఉండేటి చేదోడు వాదోడుగ జతగూడుతా


1.అవసరాలు నెరవేర్చే అద్భుత దీపమౌత

ఆపదలందు కాచు  యోధుని రూపమౌతా

నీ వేదన తొలగించే ఉల్లాసం కలిగించే వినోదమౌతా

కడుపార తినగలిగే కమ్మదనపు అమ్మచేతి ముద్దనౌతా


2.చెలిమిభ్రమలొ త్వరపడగ చెలియలికట్ట నౌత

తుప్పల దారుల తప్పించే కూడలి దిక్సూచి నౌతా

ఆనందం కలిగించే ప్రేరేపించే ప్రశంసకు అచ్చమైన అచ్చునౌత

వికాసాన్ని అందించే మెళకువ నేర్పించే మచ్చునౌత

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సరసిజనాభ హరి పుండరీకాక్ష

ఎన్నాళ్ళు స్వామీ ఈ కఠిన పరీక్ష

సప్తగిరీశా తాళజాల నీకై ఈ ప్రతీక్ష

చాలదా నాకీ జన్మకు ఇంతటి ఘోర శిక్ష

గోవింద గోవింద పాహి ముకుందా

ఆశ్రిత భక్త పోష పావన చరణారవింద


1.ఎవరైనా సుఖించిరా నిన్ను నమ్మి అనాదిగా

సంతోషమునందిరా నిన్ను కొలిచి నిత్యవిధిగా

దశరథుడూ లక్మణుడూ మైథిలీ హనుమంతుడు

త్యాగరాజు రామదాసు అన్నమయా జయదేవుడు

బ్రతుకంతా నీ స్మృతిలో నిరంతరం నీకృతిలో

గోవింద గోవింద పాహి ముకుందా

ఆశ్రిత భక్త పోష పావన చరణారవింద


2.ఎంతటి కష్టానికైన హద్దంటూ ఉండదా

ఏ దోషానికైన ఒక పద్దంటూ ఉండదా

తండ్రివి నీవుగాక తప్పులెవరు మన్నింతురు

దండించిన తదుపరి మము అక్కునెవరు చేర్చెదరు

నడుపుమమ్ము నీగతిలో చేర్చుకో నిర్వృతిలో

గోవింద గోవింద పాహి ముకుందా

ఆశ్రిత భక్త పోష పావన చరణారవింద

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అవధులులేనిది ఏదీ లేదు విశ్వం సహా

అపారమైన  నా ప్రేమ మినహా

పరిధులు కలదే ప్రతిదీయన్నది వ్యర్థపు ఊహ

అనంతమే నా హృదయ విశాలత ఎవరెరుగరు ఈ తరహా

నీవే నాలోకమై నీవంటే మైకమై నీతోనే నాకమై నువు లేక శోకమై


1.వదలను నీచేయి వదులుకోను ఈ హాయి 

వలపులు నీతోనే పగలూ రేయి

అడుగులొ అడుగేసి ఏడడుగులు నడిచేసి

తరిస్తా బ్రతుకంతా నీతో గడిపేసి

నీవే నాలోకమై నీవంటే మైకమై నీతోనే నాకమై నువు లేక శోకమై


2.ముగ్గులోకి ననుదించి  ప్రేమనెంతొ అందించి 

నీ దాసునిజేసావే నను మురిపించి

దాటిపోను నీ గీత జవదాటను నీ మాట

ఆనందనందనమే నాకు నీవున్నచోట

నీవే నాలోకమై నీవంటే మైకమై నీతోనే నాకమై నువు లేక శోకమై

Thursday, March 10, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంతగా పొగిడేను ఇంతీ నీ ఇంతటి  అందాన్ని

దేనితో పోల్చేను సాటిలేని ఈ చినదాన్ని

కొలమానమే లేదు కొలువగ సొగసులని

ఉపమానమే లేదు ఎంచగ  బెళుకులకి

తేరుకోరెవరు  చక్కదనపు నీ నిక్కులకు

ఊరుకోరెవరు  మిక్కిలియగు నీటెక్కులకు


1.జాబిలిదే  సౌందర్యము నినుగాంచ నంతవరకు

వెన్నెలతో ఆహ్లాదము నీ హాస చంద్రిక గనుదాకా

అల్పమైన వాటిని కవులు ప్రామాణిక మనుకొన్నారు

కూపస్థ మండూకాలై భ్రమలు బడసియున్నారు

ఒక్కసారి నిను చూస్తే బిక్కమొకం వేస్తారు

సుందరాంగి నీవేనంటూ అంగలార్చుతారు


2.హిమనగాలు ఎత్తేలే నిన్నమొన్న నిన్ను చూడక

సెలయేళ్ళదే మెలికల నడక నీ హొయలు తిలకించక

మెరుపు తీగ కాంతిహీనమే అంచనాకు నువు అందాక

మంచిగంధమెంతటి వాసన నీ తనువు తావితెలిసాక

ప్రతీకేది నీకై దొరకదు ఎవరెంతగ శోధించినా

సింగారొకతి పుట్టుకరాదు పాలకడలి మధించినా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పలుకే పంచదార పాకం

కులుకే బైర్లుగమ్ము మైకం

ఏంటే నీ సోకుమాడ

ఏడనే కనగ నీజాడ

ఒక్కసారి పలుకవే ఒప్పులకుప్పా

ఒప్పుకొని తీరుతా నీ వంపుల గొప్ప


1.వద్దనబోకే నీవద్దకు వస్తుంటే

కాదనబోకే అదనుకై చూస్తుంటే

మంచిమంచివాళ్ళే మన్ను బుక్కిపోతారు

స్థాయి మరచి నీ చూపుకె బుక్కైపోతారు

మామూలు వాణ్ణి నాకు మతిపోయిందే

మైమరిచి పోయేంతగా శ్రుతి మించిందే


2.చూసీ చూడగనే పడిపోవుట మరి ఖాయం

పరిసరాలు సైతం ఔతాయి మటుమాయం

నీ వెంటబడక పోవడమే నిజమైన అన్యాయం

ముదుసలికీ వస్తుంది నినుగని యవ్వన ప్రాయం

ఫిదానై పోయా నీ పిచ్చెక్కేఅందానికి

సదా నీవే విలాసము పరమానందానికి


PIC courtesy: Sri. AAGACHARYA sir

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మాఎదయే తిరుమల-మా మతియే తిరుపతి

కనులు మూసుకుంటె చాలు కనిపింతువు శ్రీపతి

ధ్యాస నిలిపినంత వరకు అపారమౌ మనశ్శాంతి

వేంకటనాథా అనాధనాథా శ్రీనాథా హే జగన్నాథా


1.అంధకారమే  జగతి సూర్య చంద్రులున్నా

ఏకాకులమే చుట్టూరా బంధుమిత్రులున్నా

నిత్య దరిద్రులమే తరగని సిరి సంపదలున్నా

ఒక్కగానొక్కనీవు ఆత్మజ్యోతివై వెలుగకున్నా

వేంకటనాథా అనాధనాథా శ్రీనాథా హే జగన్నాథా


2.తీర్థాల మునిగితేమి మనసున మకిలుంటే

క్షేత్రాలు తిరిగితేమి చిత్తశుద్ది లేకుంటే

పూజాపునస్కార ఫలమేమి భూతదయే లేకుంటే

తపములేక వరమిత్తువు మాలో మానవత్వముంటే

వేంకటనాథా అనాధనాథా శ్రీనాథా హే జగన్నాథా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అరయవె సరగున  జ్ఞాన సరస్వతి

కురియవె వరముల  విద్యా భారతి

సంగీత మందీయి శ్రీ శారదామణి

నా రాత సరిజేయి నమసము శ్రీవాణి


1.పఠనము కొఱవడె దినచర్యలో

సాధన అడుగంటె ఎద రాపిడిలో

అక్షరమొకటే లక్ష్యముగా మారే

జీవిత చక్రపు కక్ష్యయే తారాడే


2.ఐహికపరమౌ మోహము మెండాయే

పరమార్థ చింతన చింతల పాలాయే

నుతుల ముఖస్తుతుల మతి బానిసాయే

సద్గతి నడుపగ సాయమప సారమాయే

Tuesday, March 8, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అద్దానికైనా ఆతురతే నీ అందమంటే

బింబానికైనా అసూయే నీ చందమంటే

ఎన్నిహృదయాలు జారిపడినాయో నువు నడిచే దారివెంట

ఎన్ని చూపులు వెన్నంటి వెంబడించినాయో ఎరుగవంట

ఎలా కాపాడుకుంటావో నిన్ను నీవు నీరజాక్షి

ఎలా గట్టెక్కుతావో తోడవనీ చెలీ నీకు కర్మసాక్షి


1.పడిగాపులు పడతారు నీ వాలుచూపు కోసం

పిల్లిమొగ్గలేస్తారు కోరి పిసరంత దరహాసం

తహతహలాడతారు మాటకలుప

ఏ నిమిషం

చొంగకార్చుకొంటారు కలిపిస్తే అవకాశం

ఎలా కాచుకుంటావో నిన్ను నీవు నీరజాక్షి

ఎలా దాటవేస్తావో చూపిస్తూ ఒక బూచి


2.పబ్బంగడుచుటకై మునగచెట్టులెక్కిస్తారు

అరచేతిలొ స్వర్గమంటూ గారడులే చేస్తారు

గోముఖాల వ్యాఘ్రాలై  నిలువున కబళిస్తారు

దాటిస్తారని నమ్మితే  నట్టేట ముంచుతారు

ఎలా నడువగలుగుతావో కత్తిమీదే నీ నడక

నొప్పింపక నువు నొవ్వక ఇక తికమక పడక

Saturday, March 5, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పదములు చాలవు మది తెలుప

తపనలు తీరవు  నిను గనక

నా బ్రతుకు నా భవిత నీవే గనక

నను చేకొనమా ఇకనైనా కాదనక


1.విన్నపమొకటే ఆ విధికి

ప్రార్థన చేసెద దేవునికి

నీతో నిలుపగ నా ఉనికి

కలుపగ నీతో నను జతకి


2.నీవే నీవే చెలీ నాలోకం

లేదులే మరియే వ్యాపకం

నీతో ఉన్నదె నాకు నాకం

నిత్యం చేస్తా ప్రేమాభిషేకం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఓడిపోక తప్పదు నీకు ఓ వేంకటేశ్వరా

పోటీగ నిలిచేవా గెలిచేవా జగదీశ్వరా

పెట్టుకో ఎన్నైనా కఠిమైన పరీక్షలు

తట్టుకొనగలిగెదను నీ పాదాలే నా రక్షలు


1.దేహానికే గదా నువు వేసే  శిక్షలు

భౌతికమైనవేగా ఈ ఈతిబాధలు

గాయాలు మానిపోతాయి నీ ధ్యాసలో

కష్టాలు తీరిపోతాయి  నీ నీడలో


2. కొలిమిలో కాల్చేవు తనువు మకిలిని

తపనలో మాడ్చేవు మనసు కొసరును

త్రోవలన్ని  మూసేది నీ దారి చేరుటకేగా

బంధాలు బిగించేది త్వరగా తెగుటకేగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుండెలో  పరవశం నువ్వే నువ్వే

బ్రతుకులో పరిమళం నువ్వే నువ్వే

సఫలీకృత స్వప్నం నువ్వే

ఎదురొచ్చిన స్వర్గం నువ్వే


1.నా మనసును కబ్జా చేసిన రౌడీ నువ్వే

నా తలపులనాక్రమించిన కేడీ నువ్వే

నిలువెల్లా దోచేసావు దోపిడి చేసి

మదినెత్తుక పోయావు మాయజేసి


2.ఊ అంటే బెదిరిస్తావు అలుసుగ నన్నెపుడు

ఊహూ అంటూ వారిస్తావు అలకతొ ఉన్నపుడు

తగ్గదే లేదంటూ తగవే పెడతావు

ఏదేమైనా ఎంతగానో నన్నిష్టపడతావు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అతివలకైనా మతిపోగొట్టే అంగ సౌష్ఠవం

అప్సరసలే అచ్చరువొందే అప్రమేయ సౌందర్యం

దాగుడుమూతల ఉసిగొలిపే వస్త్రధారణం

ఇంతకన్నావలసిందేమిటి దాసుల జేసే కారణం

వందలసార్లు చావొచ్చే చెలీ నీకోసం

తెగింపునిస్తుందెంతగానో నీ దరహాసం


1.తుమ్మెదనై జన్మిస్తా నీ ముంగురుల చందంగా

సీతాకోకచిలుకై పుడతా నీగులాబి చెంపల వ్రాలగ

తేటిగనైతీరుతా నీపెదవుల మకరందం  గ్రోలగ

తూనీగగా మారిపోతా సున్నితమైన నీ మేను తాకగ

వేలసార్లు పుట్టొచ్చే చెలీ నీకోసం

 పడిగాపులు పడవేస్తుంది నీ క్రీగంటి వీక్షణం


2.తమలపాకునేనౌతా నీ పాదాలతొ పోటీపడగ

తామరతూడునైపోతా నీచేతివ్రేళ్ళతొ పోలగ

మెరుపుతీగనైతే మాత్రం నీ మురిపానికి సరిపోతానా

వంపుల సొంపుల వాగునైనా తూగగలనా నీ పొంకానా

ఏలకేళ్ళు బ్రతికేస్తా చెలీ నీకోసం

నీ పంటినొక్కులు పలుకగ నాకాహ్వనం

Wednesday, March 2, 2022

 

https://youtu.be/BCH_j6tuIbs?feature=shared

అంతర్జాతీయ మహిళా దినోత్సవం(08/03/20


స్వావలంబన చేకొనుమా మహిళామణి

సాధికారత సాధించు నీవే నీవే మహారాణి

ఆర్థిక స్వేఛ్ఛ లేకపోవుటే నీకు వెనకబాటు

ఆకాశంలో సగంగ ఎదుగు వద్దంటూ వెసులుబాటు

అబలవు కాదు సబలవు నీవు పరమసత్యం గ్రహించు

శక్తిస్వరూపిణి నీవే సృష్టిలొ మనసారా విశ్వసించు


1.నిక్కచ్చిగా చదువుకొని చదువుల తల్లిగ భాసించు

తల్లి చదివితే తరతరాలు ప్రగతే యని నిరూపించు

ఉద్యోగాలూ చేయాలి ఊళ్ళను సైతం ఏలాలి

అన్ని రంగాల్లొ అభ్యున్నతినే అవలీలగ పొందాలి

అబలవు కాదు సబలవు నీవు పరమసత్యం గ్రహించు

శక్తిస్వరూపిణి నీవే సృష్టిలొ మనసారా విశ్వసించు


2.సిరిసందలకు స్త్రీయే మూలం దర్జాగా ఆర్జించు

 ఆకతాయిల ఆటలు కట్టగ వీరనారిగా విజృంభించు

ఆత్మన్యూనతను అధిగమిస్తూ నీలో ప్రతిభను దీపించు

ప్రపంచ మహిళా దినోత్సవాన మహిలో మహిళగ గర్వించు

అబలవు కాదు సబలవు నీవు పరమసత్యం గ్రహించు

శక్తిస్వరూపిణి నీవే సృష్టిలొ మనసారా విశ్వసించు

 

https://youtu.be/braTYeKZhlk


"కాలవలయం"

కాలచక్రం గిర్రున తిరిగింది

కళ్ళముందుకు మళ్ళీవచ్చింది

ప్రతి ఉగాదికంటే ఎంతో విశేషమైనదిది

అమ్మకడుపున అంకురమై నాడు నే వెలిసినది

శుభములు కూర్చుతుంది శుభకృతు ఉగాది

అరవై ఏళ్ళక్రితం ఇదే ఇదే నా ఉనికికి నాంది


1.అగ్రహారం నదీతీరం  చక్కని వాతావరణం

పచ్చని పైరులు చుట్టూ గిరులు చెక్కుచెదరని పర్యావరణం

నిర్బంధమె లేని విద్యావిధానం వీథి వాడా క్రీడా మైదానం

అమూల్యమైన బాల్యమే ఆటపాటల సన్నిధానం

సంస్కృతి సభ్యత సహితంగా సాగింది అభ్యసనం

శుభములు కూర్చింది నాడు జగతికి శుభకృతు 

శోభను మోసుకొచ్చింది ఆవెనుకే వచ్చిన శోభకృతు


2. మహానగరం గరం గరం అశాంతి వాతావరణం

వాయు శబ్ద కాలుష్యాలతొ విషతుల్య పర్యావరణం

చిత్తడి చిత్తడిగా తీవ్ర వత్తిడితో చిత్తవుతూ చిత్రంగా చిత్తం

లేనిదిలేదు మోదం మినహా యాంత్రికంగా కృతక జీవనం

కవనం గానం ఊపిరిగా మనుగడ సాగును ఆసాంతం

శుభములు తేవాలని ఉంది బ్రతుకున ఈ శుభకృతు

శోభను కలిగించాలని ఉంది వచ్చే ఏటికి శోభకృతు



https://youtu.be/m8SmhdL_XpU?si=FPxGzws0aoVk0pjs

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏకాదశి ఉపవాసమెన్నడుండగనైతి

శివరాత్రి జాగరణ నియతి చేయగనైతి

నడిచి దండిగ నీకొండ నెక్కగానైతిని

పట్టెడైనను అన్నార్తికిని పెట్టనైతిని

ఐనను నను ఆదుకో  అరుణాచలేశ్వరా

కరుణగని చేదుకో  చంద్రమౌళీశ్వరా


1.గోదారి గంగలో మేను ముంచకపోతి

దోసెడు జలమైన లింగాన పోయనైతి

పత్తిరి దళమైన శ్రద్ధగా నీ తలనపెట్టనైతి

భక్తిమీరగ హరహరా యని మ్రొక్కనైతి

ఐనను ఆదుకో నను అరుణాచలేశ్వరా

కరుణగని చేదుకో నను చంద్రమౌళీశ్వరా


2.ననుగన్న నాన్నగను చనువుగనుంటిని

అనురాగమింకను ఆశించుచుంటిని

తప్పులు నావంతు తప్పించమంటిని

గార్వము నీఎడల దూరమోర్వకుంటిని

ఐనను ఆదుకో నను అరుణాచలేశ్వరా

కరుణగని చేదుకో నను చంద్రమౌళీశ్వరా

 కలుసుకున్నాయి హృదయాలు గుంభనంగా

అల్లుకున్నాయి బంధాలు లతల చందంగా

నదివి నీవు కడలి నేను ఏకమైనాము సంగమంగా

పూవు నీవు తావి నేను వనమునకు మనమే అందంగా


1.నా ఉనికి కోల్పోయాను నీలోన లీనమైపోయి

మనుగడను సాగిస్తున్నాను నీకు ఆలంబననేనై

రుచీ గతి వదిలేసాను నేను నీవుగ మారిపోయి

పరిపూర్ణగ తరించినాను నీకు జతగ చేరిపోయి


2.నా పుట్టుక కొండలు గుట్టలు తోబుట్టులు ఇరుగట్టులు

మెట్టింట అడుగెట్టినాను నీ తరగలు సంఘట్టనలు

లావణ్యం సౌందర్యం వరములు నా  సహజాతాలు

నీవు నా తోడైనప్పుడు గుప్పుమనెను గుభాళింపులు

Tuesday, March 1, 2022


https://youtu.be/CdEzKhWnHYw?si=CctAaIqz76QPVyxf

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శివశంకరా అభయంకరా

గిరిజామనోహరా హరా హరహరా

గంగాధరా సుందరా చర్మాంబరధరా

ఈశ్వరా పరమేశ్వరా శ్రీరాజ రాజేశ్వరా

ప్రణతోస్మి ఝర్ఝరీ ధన్యోస్మి దూర్జటీ


1.చెప్పలేనంత ఆకలీ ఉపవాసమెలా సాగాలీ

పగలే నిద్ర ముంచుకొస్తే జాగారమెలా చేయాలి

శివరాత్రి  వ్రతమే తీవ్రతరమాయే కదా కపాలి

నీ ఆనతిలేనిదే పరిపూర్తి సాధ్యమా ఇందుమౌళి

ప్రణతోస్మి ఝర్ఝరీ ధన్యోస్మి దూర్జటీ


2.గుడికైన వెళ్ళనైతిని నా గుండెలోనె ఉన్నావని

కోరికలేవీ కోరనైతిని నా అక్కఱలన్నీ ఎరిగేవని

ప్రతిశ్వాస నీధ్యాసగ నిరంతరం నీ ఉపవాసమే

నా ఎదలయ నీ స్మరణగ అనవరతం జాగారమే

ప్రణతోస్మి ఝర్ఝరీ ధన్యోస్మి దూర్జటీ