Monday, November 28, 2022

 https://youtu.be/yzNyKKr7wNo?si=JCrC9Vpr6fpIopT9

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఆనంద భైరవి


మంగళ హారతిదే మాధవా

కర్పూర హారతిదే రమాధవా

జయ మంగళ హారతిదే సత్యదేవా

శుభ మంగళ హారతిగొని

శుభములు మాకీవా


1.నియమముతో ఏటేటా చేసెదము సత్య వ్రతము

నీ దయతో దూరమగును గతములోని మా దురితము

ఐదు కథలు గలిగిన నీ మహిమ మహితము

ఇహపర సాధకము స్వావి నీ దివ్యచరితము


2.ధనధాన్యాదులు కురిపించు మా ఇంట సిరులు

ఇడుములు దుఃఖములు కడతేర్చు మా బాధలు

అసత్యమే పలుకము ఆదుకొనగ స్వామీ నీవే గద

శ్రీ సత్యనారాయణ త్రికరణశుద్ధిగా నిన్నే నమ్మెద

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అద్దంలో ప్రతిబింబం అది నీ హృదయం

ఎదురుగా నిలువెత్తు చెలీ నీ సౌందర్యం

నిన్ను నీకు చూపించే నేనే నీ నిజనేస్తం

బహుజన్మల పుణ్యఫలం నాకు నీ సంప్రాప్తం


1.జీవితాన నువులేక జీవితమే కడుచేదు

నీ తోడు లేక  స్వర్గమైనా సఖీ అది ఖైదు

నీ మాట నటనయని ఊహకైనా రాదు

నీ కొరకై భరియిస్తా తెగువతొ అపవాదు


2.నీ సహచర్యముంటె నాకెంతో ధైర్యం

నీ సాంత్వన మాన్పేను నా ఎదగాయం

నీ పెదవుల మధువనిలో నిత్య వసంతం

నీ పలుకే  హాయి గొలుపు మంజుల గీతం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నోచాను నీకై ప్రణయసార వ్రతము

వేచాను విరహాన ఈ సాయంత్రము

కొలను కలువల ఎడబాటు తీరెను

గగనమున జాబిలి ఆగమనమున

అభిసారికనైతి ప్రియా నీరాకను కనరాకను

కామనము తీరక వగచితి నా మనమున


1.ప్రశాంతమైన పూవన ప్రాంతమున

ఏకాంతమే దొరికిన ఈ సమయమున

నిను వలచిన కాంతనై చింతాక్రాంతమున

వలపులు చిలుకు వన్నెల ప్రాయమున

అభిసారికనైతి ప్రియా నీరాకను కనరాకను

కామనము తీరక వగచితి నా మనమున


2.మల్లెల మాలనే వాలుజడలో తురిమి

తెల్లని చీరతో పెంపొందించగ కూరిమి

రమించగ శ్రమించగ నశించు నీ ఓరిమి

లాలించగ పాలించగ చేసుకో నను మాలిమి

అభిసారికనైతి ప్రియా నీరాకను కనరాకను

కామనము తీరక వగచితి నా మనమున

 https://youtu.be/vOEfVUTJ-VE?si=kAJpV6Ws6WQXVscf

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మధ్యమావతి


సతీదేవి గతించగా చలించెగా నీమతి

పరితపించి అయితివిగా నీవొక యతి

మరలా జనియించి వరించినది మా పార్వతి

అర్ధదేహమిచ్చావని తృప్తినొందెనీ శ్రీమతి

హరా హరహరా భవహరా శివశంకరా

పరా పరాత్పరా ప్రణతులివే పరమేశ్వరా


1.గంగని సిగనిడితివి గంగాధరా

సోముని తలదాల్చివి సోమేశ్వరా

మూడుకన్నులున్న త్రయంబకేశ్వరా

నాగులే నగలు నీకు నమో నాగేశ్వరా

హరా హరహరా భవహరా శివశంకరా

పరా పరాత్పరా ప్రణతులివే పరమేశ్వరా


2.గరళము గళమునగల నీలకంఠేశ్వరా

ఉరమున విశ్వమున్న విశ్వేశ్వరా

కరమున శూలముగల రుద్రేశ్వరరా

ఢమరును మ్రోయించెడి నటేశ్వరా

హరా హరహరా భవహరా శివశంకరా

పరా పరాత్పరా ప్రణతులివే పరమేశ్వరా


3.భస్మాంగరాగా భవా రామలింగేశ్వరా

చర్మాంబరధరా  శివా రాజరాజేశ్వరా

మర్మతత్వ బోధకా శంభో మహేశ్వరా

ధర్మస్థల దీపకా శ్రీ మంజునాథేశ్వరా

హరా హరహరా భవహరా శివశంకరా

పరా పరాత్పరా ప్రణతులివే పరమేశ్వరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిండు పున్నమి నిశిలో 

వెండి వెన్నెల శశినీవే

కవన గగన తారా రాశిలో

వెలుగులీను ధృవతారవే

రెప్పలమాటున నను దాచేయగా

స్వప్నలోకాల విహరింపజేతువే హాయిగా


1.అవశ్యమై ఎదనావరించు పారవశ్యము

నీ కవితనుంది మదినేదోచేసే రహస్యము

ఆసాంతం ఆస్వాదింపజేయు బిగువే నీ సొంతం

అభిమానిగ మార్చేసే పాటవమే నీ సహజాతం


2.కవిత్వ మాధుర్యం నీకు కరతలామలకం

నీ మేని సౌందర్యం అప్సరసలకే తలమానికం

రెంటిగొప్ప తేల్చుటలో నా గుండెయె లోలకం

నచ్చుతుంది నాకెపుడూ నగవుల నీ వాలకం

 https://youtu.be/C12ZhlMd9_0?si=8l8n3svtM32hQJcX


1)గోదాదేవి తొలిపాశురగీతం-స్వేచ్ఛానువాదం

30రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధన


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:దర్బార్ కానడ


గొల్లభామలారా-రేపల్లె లేమలారా

మార్గశిర మాసమెంతొ మేలైనది

మన నందబాలునర్చించే వేళైనది

మార్గళి స్నానముకై  చనుచుంటినే నది

చెలులార ఆలకించరో మేలుకొనగ గోదా పిలుపిది


1.ఘనశ్యామ సుందరుడు నంద కిశోరుడు

డెందాలను మురిపించే బృందావిహారుడు

రవి తీక్షణుడు శశి వీక్షణుడు సర్వసులక్షణుడు

అన్యధా శరణం నాస్తి మనకు శ్రీమన్నారాయణుడు

అనవరతము తపించ శ్రీ వ్రతఫలమీయును కృష్ణుడు


2.వలువలు దాచేసే నవనీతచోరుడు

వదులుకొనే తెగువుంటే మదినే దోచువాడు

ఆనందవర్దనుడు అహంకార మర్దనుడు

జగన్మోహనాకారుడు జగదుద్ధారుడు జనార్ధనుడు

అనవరతము తపించ శ్రీ వ్రతఫలమీయును కృష్ణుడు

 

https://youtu.be/C12ZhlMd9_0?si=8l8n3svtM32hQJcX

(2)గోదాదేవి రెండవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధన


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:నీలాంబరి

(రాగ ఆధారం జంటిల్ మెన్ సినిమా పాట- నా ఇంటి ముందున్న పూదోటనడిగేనూ)


ధనుర్మాస శుభవేళ తిరుప్పావై వ్రతదీక్ష

నీమాల నాచరించ నిక్కము ఒక పరీక్ష

పురుషోత్తమ మాధవా పుండరీకాక్ష

శరణంటిమి పరిసమాప్తి చేయగ మాకీవె రక్ష


1. చేసెదము మబ్బుననే కావేటి స్నానము

సతతమూ  రంగనాథ మదిలో నీ ధ్యానము

పలికెదము గోవిందా మా నోట నీ నామము

ఆచరించెదము ఆర్తిమీర మార్గళి సిరినోము


2.కంటికి నిను అంటించి-కృష్ణా కాటుక మానేము

కమలాక్షుడ తలనిడి నిను- పూలకొప్పు ముడువము

నెయ్యిని పాలను నీనెయ్యముకై మేమారగించము

ప్రియమగు సత్యమగు నుడుగులనే నుడివెదము


3.పాలకడలి శయనించే పద్మనాభ మంగళము

విబుధవరేణ్యుల కొసగెదము విరళ దానము

సాధు సంతులకు బ్రహ్మచారులకు నిత్య సమారాధనము

క్రమతను మము నడుపగ స్వామీ నీకు వందనము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సారమతి


నిరంతరం నీగానము

అంతరాన నీధ్యానము

నీ ఎరుకయె నిజ జ్ఞానము

స్వామీ నా ఎడ ఇక వీడు మౌనము

జగన్నాథ జగదీశా జనార్ధనా శ్రీరమణా

తప్పనీకు స్వామీ నను నీ మననము


1.నీకే అంకితము ఈ ప్రాణము

ఉద్ధరించనీ ననునీ కథాశ్రవణము

మది నీవు మెదిలితివా జన్మ ధన్యము

నను గాచు దైవమేది నువువినా అనన్యము


2.నీ మీది భక్తే నాకు ప్రాధాన్యము

భవ జలధిని దాటించగ నీదే ప్రావీణ్యము

నీ మహిమలు నీలీలలు ఎంతో ప్రాచుర్యము

ఇహమున పరమున నీ అండయె నా ధైర్యము