Friday, February 12, 2021



తోమాల సేవకు ఏమాలలల్లను

నీ మాలకోసము ఏపూలుచెల్లును

పూలెన్నొ దొరికేటి ఏ తోటకెళ్ళను

నా తోటే నాకుడి నీకే చెల్లింతును

తిరుమలగిరివాస అలసెను నా శ్వాస

నా వపువు వాడకనే మెడను దాల్చు నీవాడిగ 


1.నీమాల నెరుగను నీ నామాలను మినహా

వేదాల నెరుగను నీ దివ్య పాదాలు వినా

మంత్రాలనెరుగను నీ మహిమలు మాత్రమే

ఏ పూజలెరుగను నీ పుణ్య కథా శ్రవణమే

తిరుమలగిరివాస అలసెను నా శ్వాస

నా వపువు వాడకనే మెడను దాల్చు నీవాడిగ 


2.తనువులొ అణువణువు తులసీదళమే

నయనాలు కలువలు సర్వదా నీ పరమే

నా నవ్వుల మల్లెలను కర కమలాలను

ఎద గులాబీని కూర్చి అల్లివేతు మాలలను

తిరుమలగిరివాస అలసెను నా శ్వాస

నా వపువు వాడకనే మెడను దాల్చు నీవాడిగ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మధుర స్వప్నాల తో శుభరాత్రి

నిద్ర చెడగొడుతుందేమో నీ మైత్రి

మూతబడే రెప్పలతో చెప్పరాని తిప్పలు

ముసిరే నీతలపులతో కునుకునకు యాతనలు


1.వ్యసనంగా చేరావు వదలుకోనట్లుగా

అశనంగా మారావు ఆకలే తీర్చునట్లుగా

నా ప్రపంచమంతా కేవలం నీవైనావు

ఆత్మీయ నేస్తంగా ఎదనాక్రమించావు


2.నీ మంజుల గాత్రంలో పరిమళాలెన్నో

నీ నవ్వుల సవ్వడిలో సంగీతాలెన్నెన్నో

నీ సావాసంలో  అనునయాల నవనీతాలు

నీ చెలిమి నాలోనా నింపె మొండిధైర్యాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ పేరులొ మోహన రాగం

నీ ఎదలోనూ అనురాగం

వన స్నేహమే ఒక యోగం

మనకలయికనే ఆమోఘం


1.ఎడారినే వనాలు చేద్దాం

మోడులను చిగురింపచేద్దాం

స్నేహసీమలోనా నిరంతరం విహరిద్దాం

ఆనందాల సందడిలో విందులారగించేద్దాం


2.ఈ జీవన పయనంలో చిత్రంగా కలిసాము

తోడునీడలాగా వెనువెంట నడుద్దాం

కడదాకా బ్రతుకు కడలిని ఒడుపుగ దాటేద్దాం

ఒంటరితనానికే వీడుకోలు పలికేద్దాం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తరించాయి రవికిరణాలు నిన్ను తాకి తాకగానే

హసించాయి చిరుపవనాలు నీ మేను సోకగానే

ప్రత్యూషవేళలో  ప్రత్యక్షమైనావు

నే రాసే కవనాక్షరం నీవే నీవే ఐనావు

జాదూ ఏదొ ఉన్నది నీలో జవరాల

జాజిపూల నవ్వులు నాపై చల్లరాదా


1.నీలో ఉన్న గమ్మతేదో నన్ను చిత్తు చేస్తోంది

చిత్రమైన మత్తేదో నన్ను కమ్మివేస్తోంది

నిన్ను ఉపాసించడమే ఏకైక నా లక్ష్యం

ఎప్పటికి కలిగించేవో నా ప్రేమకు మోక్షం

జాదూ ఏదొ ఉన్నది నీలో జవరాల

జాజిపూల నవ్వులు నాపై చల్లరాదా


2.రామప్ప నాగిని శిల్పం నీ ముందు అత్యల్పం

రవివర్మ మోహిని రూపం నీకంటే ఏదో లోపం

నీ రాణ ఆరాధనే నాదైన కర్తవ్యం

దినదినం నీ నెయ్యం నవ్యాతి నవ్యం

జాదూ ఏదొ ఉన్నది నీలో జవరాల

జాజిపూల నవ్వులు నాపై చల్లరాదా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువులేనిదెక్కడమ్మ నిఖిలలోక జనని

అణువణువున అగుపింతువు మార్చి కనగ దృక్పథాన్ని 

వాక్కులో మేథోరుక్కులో జగతిన ప్రతిదిక్కులో

ధనములో మనములో అవనీ జనవనములో

తెగువలో తేకములో ధరణీ నియంత్రణలో


1.అమ్మగా అక్కగా ఆలిగా చెల్లిగా

కొమ్మగా మదిదోచే పున్నమి జాబిల్లిగా

చెమ్మగా కన్నుల జారే మమతల వెల్లిగా

కమ్మగా కడుపునింపు అనురాగవల్లిగా


2.ఊహగా ఆశగా భవిష్యత్తు స్వప్నంగా

డబ్బుగా డాబుగా దర్పంగా సగర్వంగా

కాంతగా చింతగా విపత్తుగా విత్తపు కవ్వింతగా

కాంక్షగా కామనగా కీర్తిగా అంతులేని ఆర్తిగా


3.చోదనగా చోద్యముగా బ్రతుకే నైవేద్యంగా

వేదనలో వేడుకలో ఓలలాడు మద్యంగా

చూపుల ఆయుధంగ హాస అయస్కాంతంగా

బ్రతికించే బలికోరే అని కారణభూతంగా

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎందుకో ఆ మౌనం, ఏమిటో నీ ధ్యానం

మూగభావనేదో నన్ను చేరకుంది

ఎద నివేదనేదో అంతుపట్టకుంది

దాటేసి వెళ్ళవు చాటైతే కానేకావు

ఏమిటో అంతరార్థం ఎరుగనైతి పరమార్థం


1.గాలికి మబ్బుతొ స్పర్శనే ఒక భాష

భువికి రవి ప్రదక్షణే ప్రేమ వంతెన

కడలి ఖంబులకు దిక్చక్రం అలంబన

చినుకు కిరణ ప్రణయానికి హరివిల్లే వారధి

ఎరుగవా ఈ మాత్రం ప్రకృతిగత వలపు సూత్రం


2.మునులను మించిపోయె నీ తపోదీక్ష

శిలా శిల్పమై తెలుపును మనస్సమీక్ష

బ్రద్దలైపోతుంది నిశ్శబ్ధ అగ్ని పర్వతమైనా

అగాధాలు అధిగమించు జలధి బడబానలమైనా

గ్రహించవా నిగ్రహించ వీలవనిది  అనురాగం