Friday, April 1, 2022


https://youtu.be/1kchGwkDQpk


మంజుల గీతమొకటి వినిపించవే పికమా

మంగళ వాద్యమై రవళించునట్లుగా

మల్లెలూ జాజులను కురిపించు పూవనమా

పరిమళాలు విరజిమ్మవె మలయ పవనమా


స్వాగతాలు పలుకవే ఋతురాజుకు

వత్సరాది ఉగాది నేటి పండుగ రోజుకు

శుభములు కూర్చనున్న శుభకృతుకు

సుఖముల నొసగనున్న కాల దేవతకు


1.నిన్న మొన్న గతకాలపు చింతను మరవమని

చేసిన తప్పిదాలతో గుణపాఠం నేర్వమని

రానున్న కాలానికి రాశిఫలం శుభమస్తేయని

అరు రుచుల ఆస్వాదన జీవిత పరమార్థమని

చెప్పకనే చెబుతోంది ఆమని ఎరుగమని

అక్కున చేర్చుకొని పంచనుంది ప్రేమని


2.నెలకు మూడు వానలుగా రైతుకు బాసటగా

బడుగు బ్రతుకు మూడుపూవులారుకాయలుగా

యువతకు చైతన్య స్ఫూర్తి ఇనుమడించినట్లుగా

మహిళకు స్వావలంబన సమకూర్చునట్లుగా

అరుదెంచెను అదిగదిగో  ఆమని

కొనితెచ్చెను కానుకగా చైత్రపు శోభని


https://youtu.be/Kef_7pzE9rE

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం: హంసానంది


నా గార్వమంతా నీదగ్గరే

నా అల్గుడంతా నీ ముందరే

తల్లివి నీవుకాక పరులెలా భరిస్తారు

అమ్మవు నువ్వు కాక అక్కునెవరు జేర్చెదరు

జగదంబా శాంభవీ కైమోడ్పులివె గొనవే

నా ఏడ్పులు నిట్టూర్పులు ఇకనైనా మాన్పవే


1.కడుపే నింపెదవో నా ఆకలి చంపెదవో

బ్రతుకంతా పస్తులుంచి నను పరికించెదవో

అడిగినదిచ్చెదవో ఆశలు త్రుంచెదవో

అప్పచ్చులేవో చూపి సముదాయించెదవో

జగదంబా శాంభవీ కైమోడ్పులివె గొనవే

నా ఏడ్పులు నిట్టూర్పులు ఇకనైనా మాన్పవే


2.సుధనే పోసెదవో వ్యధనే తీర్చెదవో

మదిలో నిండుకున్న గుబులే ఆర్పెదవో

శిఖరము చేర్చెదవో ఫకరే నరికెదవో

పరమ పదము నందించి నందింప జేసెదవో

జగదంబా శాంభవీ కైమోడ్పులివె గొనవే

నా ఏడ్పులు నిట్టూర్పులు ఇకనైనా మాన్పవే