Monday, May 3, 2021

 అలరులు అలరిన పొదరిల్లు

నవ్వుల వన్నెల హరివిల్లు

అనురాగం ఆవరించిన మా ఇల్లు

ఆనందంతొ అల్లుకున్న అందమైన బొమ్మరిల్లు


1.గారాల ముద్దులపట్టి మాబొట్టె

సిరులెన్నో కొనితేగ మాఇంట పుట్టె

నట్టింట నడయాడే సాక్షాత్తు మాలక్ష్మి

కూతురే  లోకంగా మా మనస్సాక్షి


2.ఆడింది ఆటగా నడిచిందే బాటగా

ఎదిగింది మా అమ్మాయి విరితోటగా

కోరికలను నొక్కిపెట్టి ప్రతిపైసా చదువుకె పెట్టి

 చదివించాము మా పాప మాటకే పట్టంగట్టి


3. ఉన్నట్టుండి ఉరుమేలేక పడిపోయే పిడుగేదో

ఆకర్షణ మైకంలో వేసింది తనయ తప్పటడుగేదో

మా ప్రేమలొ లోపముందో ఏ దేవుడి శాపముందో

జాలిమాని మా ఎడల పెడ దారిచూసుకుందే

అర్హతే లేనివాడితో అయ్యో లేచిపోయిందే


ఎండిన మండిన పొదరిల్లు

కన్నీళ్ళు పారెడి మా కళ్ళు

వేదనయే ఆవరించిన మా ఇల్లు

విషాదం పరుచుకున్న శిథిలమైన బొమ్మరిల్లు


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రక్తసంబంధమేనా ఇలలో అనుబంధము

మానవీయ బంధమే కదా బంధాలకెల్ల అందము

మందికొరకు పిలుచుకుంటె ఆలంబనమవుతాయా

వావి వరుసలే చెలియలి కట్టను కడతాయా

ప్రతివారిని ప్రేమించే హృదయం చాలదా

బూటకాల నాటకాల వంతెనౌ బంధం కూలదా


1.పైనపటారం లోనలొటారం మోసపు ముసుగులు

ఈర్ష్యాద్వేషాలతో మనిషి మనిషిలో లొసుగులు

దాచుకున్న కత్తులతో వెన్నుపోటు ఆలింగనాలు

అవకాశవాదంతో ఎదుటివాణ్ణితొక్కి ఎక్కు అందలాలు

ప్రతివారిని ప్రేమించే హృదయం చాలదా

బూటకాల నాటకాల వంతెనౌ బంధం కూలదా


2.చేటు లేదు శత్రువుతో మెలిగితే అప్రమత్తులమై

హానిలేది అపరిచితులమైనపుడు అనిమిత్తులమై

పయోముఖ విషకుంభాలే చాపక్రింది బంధాలు

గోముఖ వ్యాఘ్రాలే నమ్మించి వంచించే గంధాలు

ప్రతివారిని ప్రేమించే హృదయం చాలదా

బూటకాల నాటకాల వంతెనౌ బంధం కూలదా

 జాతికి జాగృత గీతమే భగవద్గీత

యువత దిశా నిర్దేశనమే కృష్ణగీత

మానవతా సందేశ యుతమే గీత

హైందవ సంస్కృతికాలవాలమే గీత

గీతను తలనిడి అడుగేస్తే బంగారు భవితరా

గీతాసారమే ఇహపర సౌఖ్యానికి పూబాటరా


1.జీవితమొక రణక్షేత్రం -అనుక్షణం అని అనివార్యం

వెనకడుగే నిషిద్దం సర్వదా యుద్దానికి సంసిద్ధం

నెగ్గినా ఓడినా  శిరోధార్యమేదైనా

ప్రయత్నించు అనవరతం ఫలితం చేదైనా

వ్యక్తులకన్న ముందు పరిస్థితే నీ విరోధి

నిన్ను నీవు గెలవడంలో నిజమైన విజయమున్నది


2.సహానుభూతితో కలుగదు నీకు ఏ అసహనం

విశాల భావాలతొ మారగలదు దృక్పథం

విశ్వసించు నిన్నునీవు సందర్భమేదైనా

అధిగమించు తడబడక ఏ సంకటమెదురైన

కర్తవ్యపాలనయే నువు చేసెడి దైవార్చన

సందేహ నివృత్తికి భగవద్గీతయే ఆలంబన



 తెల్లారుతోంది పొద్దుగ్రుంకుతోంది

కల్లలై పోసాగె నువ్వాడిన సుద్దులన్ని

ముద్దరాలా తగదిది నీకు పలికి బొంకడం

ఓ జవరాలా శోభించదు నీకు ఆడితప్పడం


1.నీ మాటను నమ్ముకొని ప్రతిపూట ఆశపడి

వేచిచూస్తున్నానే పిచ్చివాడిలాగా

నీ ఇబ్బందినేగని పెద్ద మనసు చేసుకొని 

ఓపిక పడుతున్నా నీ హితుడిగా

మాయచేస్తున్నావో మనసుపడుతున్నావో మర్మమే ఇంకా

ఆడుకుంటున్నావో వేడుకుంటున్నావో దైవానికెరుక


2.అనుకోని అతిథిలాగ ఎదురైనావెందుకో

ఆలావచ్చి ఇలావెళితె సరిపోయేది

నా గుండెకి కొక్కెమేసి నీవైపుకి లాగివేసి

గుండుసూదితో గుచ్చేవు న్యాయమా ఇది

పైశాచికానందమా  పడతి తత్వమా అగమ్యగోచరం

అనాదిగా మగజాతికి నాతీనీవల్ల తీరని అపచారం ఘోరం