Friday, June 3, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

సంకటాలెన్ని స్వామి చిన్ని అంకురానికి

బాలారిష్టాలే బాలాజీ ప్రతి బీజానికి

ఒడుదుడుకులు తట్టుకొని చెట్టుగ గట్టెక్కుటెంత కష్టము 

మనిషి లక్ష్యమే వృక్షపుగతియైతే జన్మధన్యమగుట తథ్యము

తిరుమలేశ నీ రచనా కౌశలాన సృష్టి సమస్తం కడు విచిత్రము


1.క్రిములు తొలిచి ఒళ్ళు గుల్ల చేసే ప్రమాదము

సారవంతమైన నేలన లోతున నాటితేనే పటుత్వము

తగినంతగ జలమందగ మొలకెత్తును జీవిగ విత్తనము

మొక్కగ ఎదుగుతూ మానుగ మనుదారిలొ ఎందరిదో పెత్తనము


2.కంచె ఒకటి పశువుల నోటికందకుండ కుజమును కాయాలి

చీడ పీడలన్నిటిని విధిగా ఎదుర్కొని 

పూలు కాయలు ఫలాలు కాయాలి

తరువు తనువులొ అణువణువు పరుల కొరకె దారపోయాలి

తన కొమ్మలొ భాగమే కామాగా మారి

నరికే గొడ్డిలి  కొమ్ముకాయాలి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎలా తెలుసుకోను నేనంటే నీకు ప్రేమెంతో

ఎలా కొలువగలను నీమదిలో నా విలువెంతో

నీవెరుగనట్టుగా మారుదునా వేగులవాడిగా

నీచుట్టే సంచరించనా చేరినీ

ఊపిరిలో ఊపిరిగా


1.కవిత రాయు సమయాన

 కలం మొరాయించు వేళ

రాయించనా సూచించనా రాయంచనై

గుణదోషాలు నిర్ణయించనా నిస్పక్షపాతినై

నీ భావాల స్పష్టత నేనై

అనుభవాల ద్రష్టను నేనై


2.నీ మేనుకు మెరుగులు దిద్దగా

వలువలు వన్నెలకు నా శ్రద్ధనద్దగా

అందాలు చిందగా డెందమా నందమొందగా

నా వేడుక నీ వాడుకగా పరిణమించగా

నీలో నేను ప్రతిఫలించగా

స్వప్నాలే సతతం ఫలించగా