Sunday, April 25, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఖరహరప్రియ


కైలాసగిరి వాస-కాశీపురాధీశ

వేములాడ శ్రీరాజ రాజేశ్వరా

 శ్రీరాజ రాజేశ్వరీవరా

బేడిసములందుకో భీమేశ్వరా

నమసములు నీకివే నగరేశ్వరా

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


1.నందివాహన నీకు కోడెనిచట కట్టింతు

గంగాధరా నీకు అభిషేక మొనరింతు

మారరిపుడవు నీకు మారేడు నర్పింతు

జంగమయ్యానీకు సాగిలబడి నతియింతు

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


2.మాసిద్ధి గణపతిని తొలుతనే దర్శింతు

మాత బద్ది పోచమ్మను తప్పకనే పూజింతు

మావాడివి రాజన్నాయనుచు వేడుకొందు

మహాలింగా నిన్ను ఆలింగనమొనరింతు

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మధువొలుకు పాత్రలే నీ నేత్రాలు

చూపులతో గ్రోలగా నాకు ఆత్రాలు

సుధ గుళికలే నీ అరుణ అధరాలు

నే జుర్రుకోగా అత్యంత మధురాలు

ముక్కెఱతొ చక్కదనం అక్కెఱే తీరేను

చెక్కిళ్ళ మెరుపు గుణం కొక్కెమే వేసేను


1.అపరంజి జిలుగులు చిలికే సాలభంజికవు 

అవనీతలాన వెలసిన గంధర్వకన్యవు

సౌరభాలు విరజిమ్మే కస్తూరి గంధం నీవు

మంజులనాదాలు పలికే సంతూర్ వాద్యం నీవు

ఏపూర్వపుణ్యమో నీవు నా పరమైనావు

ఏ తపఃఫలమోగాని నా పాలిటి వరమైనావు


2.నాగావళి కులుకులన్నీ నీ నడకలో

కిన్నెరసాని వంపులన్నీ నీ నడుములో

వంశధార సుడులెన్నొ నీ నాభిలోయలో

వింధ్యా మేరులు చిరుగిరులే నీ జఘన సీమలో

నీతో సహజీవనాన  బ్రతుకంతా నిత్య వసంతం

నీ సంగమక్షేత్రాన ఆనందమె మనకాసాంతం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అలా చూస్తుండి పోయా-శిలా ప్రతిమనై

కోలుకోలేకపోయా నే మంత్ర ముగ్ధుడనై

ఏమందం నీఅందం ప్రస్తుతించగా అందం

నీ తనువున అణువణువూ పారిజాత సుగంధం


1. ముక్కు ఒక్కటే నా గుండెను నొక్కేయసాగే

చూపపుడే సూటిగ ఎదపై  తూపులు వేయసాగే

అరనవ్వేమో నన్నుక్కిరిబిక్కిరి చేయసాగే

ఎక్కడ నిలపాలో నాదృష్టి తికమకపడసాగే


2.పండునిమ్మవంటి మేను వెన్నెలగా తోచే

నునుపుదేలి దేహమంత సృశించ మది వగచే

స్వప్నమందైననూ మనసు సంగమాన్నిఆశించె

అద్వైత స్థితి గురించి జీవితమే పరితపించె

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కనికరమున ననుబ్రోవుమ

ముకుళిత కరముల నీకు నమః

అన్యథా శరణమని  వేడేద

వరమీయగ నీచరణ యుగళి వేంకటనాయకః


1.పంచేంద్రియముల పంచన చేర్చుకో

నా చపల బుద్దిని నీ..వైపుగ తిప్పుకో

నా గతిని ప్రగతిని నీదిగా మార్చుకో

నా మదిలో స్థిరవాస మేర్పర్చుకో


2.ఎందఱిని దరి జేర్చినావో నన్నొదిలితివే

ఏ విధి మెప్పించిరో తెలుపక పోతివే

దిక్కులేని వాడినై నీ దెస మరలితినే

అక్కున ననుజేర్చి ఆదరించవైతివే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


యోధులం మేము ఆశావాదులం

తలపడతాం వైరులతో వైరస్ లతో

తలపెడతాం పులి నోటైనా కరోనా కాటైనా


1.రక్షణ కవచం మాకు మాసిక

బ్రహ్మాస్త్రమె సానిటైజరిక

పద్మవ్యూహమె స్వగృహనిర్బంధం

భౌతిక దూరమె విజయ నినాదం


2.వంటింటి చిట్కాలే వారుణాస్త్రాలు

యోగాభ్యాసాలే సమ్మోహనాస్త్రాలు

ముక్కు గొంతుల ప్రక్షాళణ పాశుపతాస్త్రం

ఆత్మనిర్భరతే అపూర్వ నారాయణాస్త్రం

 రచన,స్వరకల్పన:డా.రాఖీ

సంగీతం,గానం:లక్ష్మణ సాయి


ఏ కానుకలందీయను ఎంత ఘనంగా జరుపను

మాకతిముఖ్యమైన పండగ నీ పుట్టిన రోజును

ప్రేమమీర ప్రకల్పించు నీ జన్మదిన వేడుకను


"హ్యాప్పీ బర్త్ డే టూ యూ హరీష్ భరద్వాజ

విష్ యూ హాప్పీ బర్త్ డేటూయూ మా యువరాజ"


1.వెలిగిస్తాము  మాచూపుల దీపాలను

దిద్దేస్తాము నుదుటన మురిపాల తిలకమును

తలను చల్లెదము మా దీవెనాక్షంతలను

ఆశీర్వదించేము వర్ధిలగ ఆయురారోగ్యాలను


2.కన్నుల నిను నిలిపేము మా కనుపాపగ

ఎదలోన నింపేము అనురాగపు రూపుగ

తోడుగ నీడగ నీతో నడిచేము నీకు కాపుగ

నువు వృద్దిచెందాలి భవితన తోపులకే తోపుగ


3.ముక్కోటి దేవతలు నిలవనీ నీ అండగా

కొండగట్టు హనుమ నిన్ను కరుణించనీ మెండుగ

ధర్మపురి నరహరి దయగననీ నిను దండిగ

సిద్దీశుడు సోదరునిగ ఎంచనీ నిను తన గుండెగ


మా అబ్బాయి జన్మదిన సందర్భంగా తమ శుభాశీస్సులందజేసిన పెద్దలకు,మిత్రులకు మా హరీష్ భరద్వాజ నమస్సులు!

నా కృతజ్ఞతాభివందనములు..💐😊🌹🙏

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏముని వాకిటనో తారాడే వనకన్యవో

రాముని పదతాడన వరమైన మునిపత్నివో

దేవతలకె మతిచలించు సౌందర్యవతి దమయంతివో

శృంగార రంగాన అంగాంగ ప్రేరకమౌ దేవత రతివో

కవులు నిన్ను పోల్చంగ చవులూరుదురే

లోకాన ఏ పోలిక నీతో సరితూగ బలాదూరే


1.చందమామలోని తునక శ్రీచందన తరువు ముక్క

సింధుభైరవి రాగ రసగుళిక సుధామాధురీ కలయిక

మయబ్రహ్మ హొయలెన్ని ఏర్చికూర్చెనో నీకు లతిక

విశ్వకర్మ అవయవాల మర్మమెంత పేర్చెనో గీతిక

కవులు నిన్ను పోల్చంగ చవులూరుదురే

లోకాన ఏ పోలిక నీతో సరితూగ బలాదూరే


2. చిలుక పలుకు పలుకులనే అందించిరి నీ నోటికి

హంసకున్న వయ్యారాన్ని అమరించిరి నీ కటికి

దృష్టి లాగు అయస్కాంతమతికించిరి నీ నాభికి

కనికట్టుతొ మత్తుచిమ్ము మైమ నిచ్చిరి నీ కంటికి

కవులు నిన్ను పోల్చంగ చవులూరుదురే

లోకాన ఏ పోలిక నీతో సరితూగ బలాదూరే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కరోనా కనుమరుగైతే శుభోదయం

భరోసా బ్రతుకు పట్ల కలిగితే శుభోదయం

జనులంతా జాగ్రత్తలు పాటిస్తే శుభోదయం

అవనియంత ఆరోగ్యమయమైతే శుభోదయం


1.పార్టీలు పదవులనక ప్రజాశ్రేయమెంచితే శుభోదయం

రోజువారి కూలీలకు చేతినిండ పనిదొరికితె శుభోదయం

సరకులలో కల్తీలేక ఆహారం లభియిస్తే శుభోదయం

ఏ లంచం ఇవ్వకున్నా ఆఫీసు పనులైతే శుభోదయం

చక్కని పుస్తక మొక్కటి చదివితె మిక్కిలిగా అది శుభోదయం


2.నిర్భయంగ ఆడవారు ఉద్యోగం చేసొస్తే శుభోదయం

అత్యాశకు పోకుండా మోసాల పాలవకుంటే శుభోదయం

చిన్ననాటి మిత్రులంత అనుభూతులు నెమరేస్తే శుభోదయం

వేచిచూచు లబ్దియేదో ఆపూటనె అందుతుంటె శుభోదయం

మోవిపైన చిరునవ్వు విరిసిన ప్రతి ఉదయం శుభోదయం


సాయీ అన్నాగాని బాబా అన్నాగాని

నువ్వే మా తండ్రివని మేము నీ పిల్లలమేయని

ఆమాత్రమైనా ఎరుగవేలనూ

ఏ మాత్రమైనా ప్రేమ చూపనూ


1.కాదల్చుకొని మమ్ము కష్టాల పాల్జేతువా

కనికరించి ఇకనైనా స్పష్టమైన మేల్జేతువా

నిన్ను చూస్తే మమ్ము చూడటమేమిటి

నీ పిల్లల పాలించగ షరతులేమిటి

కన్న తండ్రి అనురాగం అంతేనా

మా అండనీవని నమ్మితె వింతేనా


2.రెండు రూకలెందుకు గుండెనే నీదైతే

పండో దండో ఎందుకు ఇచ్చేదే నీవైతే

కాలుకు మట్టంటకుండా నీవె మము సాకాలి

మాకంటికి రెప్పలాగ మమ్మలనిక కాచాలి

అనాథలం ఔతామా అక్కున మము జేర్చగా

తప్పులంటు చేస్తామా మా చిత్తమునే మార్చగా