Saturday, August 11, 2018

వీణాపాణీ శ్రీ వాణీ సుహాసిని సదా
సుహృదయ నివాసిని దేవీ శారదామణి గీర్వాణీ

1. సృష్టికర్తయే నీ పతి
నీవే కాదా జ్ఞాన భారతి
కనులు మూసినా కనులు తెఱచినా
అణువణువునా నా కగుపించవే

2. చదువుల మాతవు నీవే కదమ్మా
స్వరముల నేతవు నీవే కదమ్మా
సకల కళలను సర్వ విద్యలను
అనుక్షణము నా కందించవమ్మా

3. నా నాలుక పైనా వసియించవే
నాలోని కల్మషము తొలగించవే
అజ్ఞానతిమిరము రూపుమాపి
జ్ఞాన దీప్తులే  వెలిగించవే

https://youtu.be/pD2wPoquiBE?si=KgTUwr58I9i37Uua


పదములతో కొలిచాడు అన్నమయ్యా
పరమ పదమొసగెడి నీ దివ్యపదములను
కీర్తనలతొ కీర్తించెను త్యాగయ్యా
నీ అతులిత మహిమాన్విత గుణగణాలను

నీ లీలల నెరుగని నేనెంతటి మందమతి
తోగువేంకటాపురపతి చూపర ఇక సద్గతి

1.వాల్మీకి వాసిగా వ్రాసినాడు నీ చరిత
వ్యాసుడు వెలయించినాడు మహితమౌ నీ ఘనత
శుకుడూ సూతుడూ ప్రవచించిరి నీ గాథ
ప్రస్తుతించ నాతరమా ఇసుమంతయులేదు ప్రతిభ

నీలీలలు లిఖించని నెనెంతటి మందమతి
తోగువేంకటాపురపతి చూపర ఇక సద్గతి

2.జయదేవుడు నుడివినాడు నిరతిన నీ రమ్యరతి
పురంధరుడు ఆలపించె కృతుల నీ ప్రతీతి
నారద తుంబురులు నుతియించిరి నీ గణుతి
అలవిగాదు నాకు తెలుప అద్భుతమౌ నీ ఖ్యాతి

నీలీలలు పాడుకోని నేనెంతటి మందమతి
తోగువేంకటాపురపతి చూపర ఇక సద్గతి

https://www.4shared.com/s/f2b1UQEwAgm
గడ్డిపూవైతెనేమి భక్తితో పూజిస్తే
రేగుపండైతె నేమి శ్రద్ధగా నివేదిస్తె
పిడికెడటుకులైన చాలు ప్రీతిగా బహుకరిస్తె
తులసీదళమైతె నేమి విశ్వసించి కొలిస్తే

భౌతికమేదైనా భావనయే ప్రధానం
ఎద నెప్పుడు చేయాలి స్వామి సన్నిధానం

1.సతతము స్మరియించే హృదయ పీఠాలు
స్వామి అధిష్ఠించే పసిడిసింహాసనాలు
దర్శించగ ధారలుగా ఆనంద భాష్పాలు
స్వామికి అందించే అర్ఘ్యపాద్యసలిలాలు

భౌతికమేదైనా భావనయే ప్రధానం
ఎదనెప్పుడు చేయాలి స్వామి సన్నిధానం

2.తీయని పలుకుల స్తవనమైతె చాలు
స్వామిని అభిషేకించే తేనియలు పాలు
ధ్యానమందు ప్రజ్వలించు ఉచ్వాసనిశ్వాసలు
ప్రభుని ఎదుట వెలిగించే ధూపదీపాలు

భౌతికమేదైనా భావనయే ప్రధానం
ఎదనెప్పుడు చేయాలి స్వామి సన్నిధానం

3.నయనాలు కలువలు కరములు కమలాలు
స్వామి అలంకరణకై పూవులూ మాలలు
అనవరతము సోహమై ప్రభవించే ఆత్మజ్యోతి
పరమాత్మకు అర్పించే కర్పూర హారతి

భౌతికమేదైనా భావనయే ప్రధానం
ఎదనెప్పుడు చేయాలి స్వామి సన్నిధానం