Wednesday, December 11, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:భైరవి

జాబిలి నవ్వింది ఆమని పూసింది
ఆనందం జల్లుగా అవనిపైన కురిసింది
మౌనమే ధ్యానమై నా మనసు మురిసింది

1.ఆటుపోటులన్నిటిని తట్టుకొంది తీరము
కంటిలోని సంద్రానికి వేయలేము యాతము
ఎగసిపడే ఎదమంటకు ఏల వగపు ఆజ్యము
నివురుగప్పుకొంటె నిప్పుకెప్పటికీ సౌఖ్యము

2.నరికి వేయు నరులకూ చెట్లు చేటు చేయవు
మురికి చేయు మనుజులకూ నదులు విషమునీయవు
పంచలేమ నలుగురికీ  ఖర్చులేని నవ్వులను
ప్రకటించలేమ పదిమందికి ప్రేమానురాగాలను
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:కల్యాణి

నా చిత్తపు వ్యవహారము-నీ చిత్తానుసారమే
నా సాహితి వ్యవసాయము-నీ ఆనతి మేరకే
మేధావిని వేదాగ్రణి వాణీ పారాయణీ
నమోస్తుతే సరస్వతి హే భారతి కల్యాణీ

1.అక్షరములు రుచించనీ భావ పథములై
నా పదములు గమించనీ పరమ పదముకై
నవరసములు రంజింపనీ పాఠక హృద్యములై
నా కవన గీతములే నీకు నైవేద్యములై
కదిలించవె నాకలమును అనితర సాధ్యముగా
దీవించవె నారచనలు అజరామరమవగా

2.మనోధర్మ సంగీతము జన మనోహరముగా
తన్మయమౌ రాగతాళ స్వరకల్పన వరముగా
గాయకులే పరవశించి పాడుకొనే గేయముగా
శ్రుతి లయ గతితప్పని అపురూప కీర్తనగా
పలికించవె నా గళమును పదికాలాలు
ఒలికించవే నా పాటలొ  మకరందాలు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:హంసానంది

ఫకీరుగా నిన్ను భావింతురు కొందరు
పరమాత్మగానూ ఎంచెదరింకొందరు
కులమతాలకతీతమౌ నాదమే  నీవు
బైబిల్ ఖురాన్ గీతామృతమౌ  వేదమే నీవు
మానవతకు నిలువెత్తు రూపానివి నీవు
సాయిరాముడవీవు సాయి బాబా నీవు

1.సంకుచితమగు మా బుద్ధికి అందదు నీ తత్వము
గిరిగీసికొని బ్రతికే మాకు బోధపడదు విశాలత్వము
 సద్గురువుగా  నిన్ను స్వీకరించమైతిమి
మహనీయమూర్తిగా అనుసరించమైతిమి
నీ మహిమ నెరుగలేనీ మూర్ఖులమే మేము
నీ లీల లేవీ కనలేని  మూఢులము

2.అభిమతాల కనుగుణంగా మతమునంటగడతాము
నచ్చిన రూపాలలోనే నిన్ను పిలుచుకుంటాము
అవధులలో కుదించలేని అవధూతవీవు
అల్లా జీసస్ కృష్ణులా అవతారమే నీవు
నీ జ్ఞాన జ్యోతిని వెలిగించు మా లోన
సౌహార్ద్ర సౌరభాన్ని వెదజల్లు మా పైన