Thursday, October 15, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కపోతమా నానేస్తమా

మనసెరిగిన ప్రియతమా 

కబురందించవేమే చెలికానికి

తాళజాలకున్నానే విరహానికి


1.శీతాకాలమైనా సెగరేగుతోందని

హేమంతమైనా మంటరగులుతోందని

ఆర్చినా తీర్చినా తానే తగినవాడనీ

ఉపశమనమొసగేది బిగికౌగిలేననీ

పదపడి అందించవే నా విన్నపాలు

పరుగిడి ఎరిగించవే మనోభావాలు


2.ఆరుతున్న నాలుకకు తనముద్దే అమృతం

అదురుతున్న పెదవులకు తనవద్దే మకరందం

చుంబనాలజడితోనే తనువును తడపాలనీ

స్వర్గసీమ అంచులదాకా తోడుగా నడపాలనీ

నచ్చచెప్పి తోడ్కరావే వెనువెంటనే

వెంటబెట్టుక వేగరావే నువు వెంటనే


PAINTING :Sri.  Agacharya Artist

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అష్టసిద్ధులున్నవి నీ అంగాంగాన

చతుషష్టి కళలొలుకును నీ గాత్ర రంగాన

టక్కుటమార విద్దెలు నీ హావభావాలు

కనికట్టు కలిగించును  నీచూపుల ప్రభావాలు

నువ్వో మాయలాడివి నువ్వే మాయలేడివి

నువ్వో మంత్రగత్తెవి నువ్వే తంత్రవేత్తవి


1.వశీకరణమే నీకు వెన్నతొ పెట్టిన విద్య

ఆకర్శణయే నీకు సహజాతమైన విద్య

అయస్కాంతమైది చూపుకు నీ మధ్య

నువుకాదుపొమ్మంటే బ్రతుకే ఒక మిథ్య

నువ్వో మాయలాడివి నువ్వే మాయలేడివి

నువ్వో మంత్రగత్తెవి నువ్వే తంత్రవేత్తవి


2.చిరునగవులు నువువాడే పాచికలు

లయలహొయల నీకులుకులే మరీచికలు

వగల సెగలు రేపుతాయి నీ వలపుల వలలు

నీ గాలిసోకినంతనే  సజీవమౌతాయి శిలలు

నువ్వో మాయలాడివి నువ్వే మాయలేడివి

నువ్వో మంత్రగత్తెవి నువ్వే తంత్రవేత్తవి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చెప్పగలం కబుర్లెన్నొ  కాలుకు మన్నంటకుండ

ఈయగలం సలహాలు ఉచితంగా మేనునొవ్వకుండ

గప్పాలుకొట్టగలం బరిలోకి దిగకుండా

చమత్కరించగలం సహానుభూతిలేకుండా

మనదాకా వస్తేగాని తెలియదు అసలేంటో సంకటం

ఛలోక్తులే విసురుకుంటు హేళనగా  నవ్వటం


1.ఆకలిదేముంది ఉపవాసం సులభమేనంటూ

లేనివాళ్ళనెప్పుడూ ఎగతాళి చేసుకుంటూ

నిలవనీడలేకుండుట సౌధవాసి కెలాతెలుసు

ఆపదలో అర్థించుట సంపన్నులకేమెరుక

మనదాకా వస్తేగాని తెలియదు అసలేంటో సంకటం

ఛలోక్తులే విసురుకుంటు హేళనగా  నవ్వటం


2.వడ్డించిన విస్తరులౌ జీవితాలెరుగవు

నిరుపేదల నిత్య  బ్రతుకు పోరాటాలు

ప్రమాదాలు విపత్తులు మరణాలు నిర్లిప్తాలు

వార్తల్లో కంటూ వింటూ తెల్సుకుంటూ పైశాచిక వినోదాలు

మనదాకా వస్తేగాని తెలియదు అసలేంటో సంకటం

ఛలోక్తులే విసురుకుంటు హేళనగా  నవ్వటం