Tuesday, March 24, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

"ఉగాది శుభాకాంక్షలు-సకారాత్మకతయే జీవితం"

అగత్యమే శార్వరి ఉగాదికీ స్వాగత గీతం
తథ్యమే ప్రతి కాళరాత్రికీ ఓ సుప్రభాతం
శుభకృతును చేరాలంటే శార్వరిని దాటక తప్పదు
పునఃసృష్టి కావాలంటే మృత్యువీణ మీటక తప్పదు
దేశం కోసం ప్రతిపౌరుడు పాటించక తప్పని వైపరీత్యం
కరోనాను కాలరాయగ నిర్భందిత గృహమే ఆయుధం

1.పాపం పండే రోజొకటి రానేవచ్చింది
బలిదానంకోరే తరుణమెప్పుడో తప్పనిది
కోయిలపాటే కాకికూతగా కర్ణకఠోరమౌతోంది
గుణపాఠంనేర్పగ కాలం యుగాంతమైపోతోంది
దేశం కోసం ప్రతిపౌరుడు పాటించక తప్పని వైపరీత్యం
కరోనాను కాలరాయగ నిర్భందిత గృహమే ఆయుధం

2.మూడు వారాల గ్రహచారం ఆరుఋతువుల సంచారం
ఎవరికివారై క్రమశిక్షణగా నడవగ తెలుపును పంచాంగం
చేదుమ్రింగితె చాలు అర్ధమండలం ఏడాదంతా మకరందం
చావూ బ్రతుకూ ఇరుచేతుల్లో చేతలే మార్చేను జీవితం
దేశం కోసం ప్రతిపౌరుడు పాటించక తప్పని వైపరీత్యం
కరోనాను కాలరాయగ నిర్భందిత గృహమే ఆయుధం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

తాకితె అల్లన మోవి
పలికేను రాగాలు పిల్లనగ్రోవి
నల్లనయ్య నన్నుచేరి మేను మీటగా
గమకాలనొలుకుతు మారిపోదు నేను పాటగా

1.బండరాయి సైతం సజీవశిల్పమౌతుంది
ఎండినమోడైనా చివురుతొడుగుతుంది
యదునందనుని ఎదుట నిలువగా
 హృదయమే యమునౌతుంది
మాధవుణ్ణి మతిలో నిలుపగ
మనసు మధువనమౌతుంది

2.కుబ్జవంటి వక్రజీవితం సుందరమౌతుంది
మీరాకోరుకున్న తత్వం నిత్యత్వమౌతుంది
సుధాముడైమెలిగామంటే
గాఢ మైత్రి దొరుకుతుంది
తులసిదళమైపోతేనో
భక్తి  సిరులు తూచుతుంది
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నాన్నంటే ప్రాణము
నాన్నంటే జ్ఞానము
నాన్నంటే లోకము
నాన్నేగా దైవము

1.నాన్న బీజము అమ్మ క్షేత్రము
కమ్మని కలల పంటనే సంతానము
నాన్న జీవము అమ్మ దేహము
ఇద్దరి వలపుల ఫలితమే జీవితము
నాన్నంటే మార్గము-నాన్నంటే దుర్గము
నాన్నంటే గోప్యము-నాన్నేగా ధైర్యము

2.నాన్న భద్రత అమ్మ ఆర్ద్రత
వెన్నంటి తోడుండేదే కుటుంబము
నాన్న మేలుకొలుపు అమ్మజోలపాట
ఇరువురి అనురాగమే మాధుర్యము
నాన్నంటే వైద్యము నాన్నంటే హృద్యము
నాన్నంటే ఆరాధ్యము నాన్నే సర్వస్వము
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఇల్లే జైలు ఇపుడైతేనే మేలు
ఎవరికివారైతేనే తప్పేను చావులు
ఆషామాషీ కాదు నేస్తమా కరోనాకు విరుగుడు
ఇంటిపట్టునుంటేనే వైరసిక ఆగుడు
వెర్రిమొర్రి ధీమాతో విచ్చలవిడి తిరుగకు
కరోనావ్యాప్తి చేయగ తెలికనే సమిధవకు

1.చెవిముందు శంఖమూదినా పట్టించుకోవేల
కంటిముందు కనబడుతున్నా వింతపోకడేల
దుర్దినము దూరములేదు అజాగ్రత్త వీడకుంటే
ఆత్మహత్యయేకాదు హత్యలౌను నువు వినకుంటే
వెర్రిమొర్రి ధీమాతో విచ్చలవిడి తిరుగకు
కరోనావ్యాప్తి చేయగ తెలికనే సమిధవకు

2.దేశ సరిహద్దులైనా  మూసివేసినారు
రాష్ట్రాల మధ్యనా కంచెవేసినారు
ప్రాణాలు ఉగ్గబట్టి ప్రయత్నించ ప్రభుత్వాలు
కొంచమైన జంకులేకా సంకనాకి పోతావు
వెర్రిమొర్రి ధీమాతో విచ్చలవిడి తిరుగకు
కరోనావ్యాప్తి చేయగ తెలికనే సమిధవకు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మోహన

పరమ దయాళా పరమేశ్వరా
కరుణతొమము కావుమయ్య కాలకాలుడా
మించిపోతున్నది మనగలిగే తరుణం
ముంచుకొస్తున్నది అకాల మరణం
కరోనా చెలరేగె అన్యధా శరణం నాస్తి
ఈశ్వరా నువు వినా మానవజాతికి స్వస్తి

1.చదువు లేని మూఢులమే మేమందరం
చదువుకున్న మూర్ఖులమే ప్రతి ఒక్కరం
కష్టకాలమందైనా ఇష్టారాజ్యమె మాది
నియమాల నతిక్రమించు నైజము మాది
పనులుచక్కబెట్టమంటె వంకలతో మానేము
ఇంటిపట్టునుండమంటే బేఖాతరు చేసేము
కరోనా చెలరేగె అన్యధా శరణం నాస్తి
ఈశ్వరా నువు వినా మానవజాతికి స్వస్తి

2.ఆయువు మూడినా అవినీతినొదలము
ప్రళయము కబళించినా నిర్లక్ష్యము వీడము
ఇతరులకన్నా మేమే అతీతులనుకంటాము
చేయిదాటిపోయాకా నెత్తికొట్టుకుంటాము
మా వంకర బుద్ధులింక సరిజేయర శంకరా
మా తింగరి చేష్టలనే అరికట్టర హరహరా
కరోనా చెలరేగె అన్యధా శరణం నాస్తి
ఈశ్వరా నువు వినా మానవజాతికి స్వస్తి