Monday, October 12, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అనుబంధాలన్నీ ఆర్థికపరమైనవే

భవబంధాలన్నీ అవసరార్థమైనవే

కన్నవారి ప్రేమ ఒకటె హార్ధికమైనది

రక్త సంబంధమే నిస్వార్థమైనది


1.అమ్మ మాత్రమే ఎరుగును పిల్లల ఆకలి

సంపాదనవల్లనే విలువ ఇచ్చు మగనాలి

చీరకూడ కోరదు తల్లి  తనయుని నుండి

చేతిఖర్చుకూ మిగల్చదు సతి జగ మొండి


2.తల్లి ఇచ్చు పిల్లలకు చల్లని దీవెనయే

పత్ని చెలాయిస్తుంది పతిపై ఆధిపత్యమే

ఏకులా ఏతెంచి మేకులా మారుతుంది అర్ధాంగి

భరించాలి భర్తయే సాంతం గుదిబండ భంగి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


(గమనిక: జోడించిన చిత్రానికి కవితకు ఏ మాత్రం సంబంధం లేదు)


మనసు కష్ట పెట్టు కుంది స్పష్టత

చోటులేక వాపోయె పారదర్శకత

మారేడు కాయల కెంత సంబరం

నుసిపూసే వంకకి అవేగా ఆధారం

ఏ హృదయం స్ఫటికమంత స్వచ్ఛదనం

ఏ నయనం వెన్నెలంత ఆహ్లాదం


1.మదికి మాటకు చేతకు పొంతన కనరాదు

సమాచారమందించగ నిబద్ధతే ఉండదు

ప్రపంచయుద్ధాలకు సమాచార అంతరమే లోపం

చెప్పేది చేయక చేసింది చెప్పక పరితాపం

ఏ హృదయం స్ఫటికమంత స్వచ్ఛదనం

ఏ నయనం వెన్నెలంత ఆహ్లాదం


2.కుండబద్దలైతేమి నిజం చెప్పడానికి

అండలేకపోతేమి గుట్టు విప్పడానికి

సత్యానికి ప్రతీకగా హరిశ్చంద్రుడీనాడూ

హాయిగ నిదురించేవు సత్యం పలికిచూడు 

ఏ హృదయం స్ఫటికమంత స్వచ్ఛదనం

ఏ నయనం వెన్నెలంత ఆహ్లాదం


*చిత్రం -గీతం ఇదే సమాచార అంతరానికి ప్రత్యక్ష ఉదాహరణ*

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తెల్లకలువ సొగసుగాంచ -ఎర్రకలువ విరిసింది

ఎర్ర కలువ విలువనెంచ-తెల్లకలువ మురిసింది

గుసగుసలాడాయి మల్లెలు

రుసరుసలాడాయి మందారాలు

వందనాలు నీ అందానికి కుందనపు బొమ్మా

నీరాజనాలు నీ సౌరుకు చందనపు కొమ్మా


1.అరవిందానన అరవిందలోచన

అరవిరిసిన విరిబోడివి నిజముగ నీవేయన

పరిమళాలు వెదజల్లగ పారిజాతమీవేయన

మరువము నీ పరువము  దవనమే జీవనము

వందనాలు నీ అందానికి కుందనపు బొమ్మా

నీరాజనాలు నీ సౌరుకు చందనపు కొమ్మా


2.చామంతులే నీ నయన కాంతులు

పూబంతులే నీసిగ్గుల దొంతరలు

తంగేడు పూలరంగు నీ ఒంటికే హంగు

పున్నాగపూల నునుపు నినుతాక మత్తుగొలుపు

వందనాలు నీ అందానికి కుందనపు బొమ్మా

నీరాజనాలు నీ సౌరుకు చందనపు కొమ్మా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కంటిలోన ఆరని మంట-నెత్తిన మాత్రం గంగంట

గళమునందున విషమంట-తలన సుధాకరుడంట

ఇరువైరుల ధరించేటి భవానీ ధవా

కరకమలాలర్పించెద కనికరించరా భవా


1.ధ్యానమే సదాశివా నీకు నిరంతరం

నాట్యమూ నటరాజా నీకు ప్రియతరం

భస్మ ధరుడవు ఐశ్వర్య వరప్రదుడవు

కాలకాలుడవు ఆయురారోగ్యకరుడవు

ఇరువైరుల ధరించేటి భవానీ ధవా

కరకమలాలర్పించెద కనికరించరా భవా


2.దేవతలకే దేవుడవు నీవు మహాదేవుడవు

పంచభూత నాథుడవు పంచప్రాణేశుడవు

భోళాశంకరుడవు ప్రళయకాల రుద్రుడవు

నామరూప రహితుడవు సర్వనామయుతుడవు

ఇరువైరుల ధరించేటి భవానీ ధవా

కరకమలాలర్పించెద కనికరించరా భవా

 రాఖీ-బాలగేయాలు-3


చెట్టు జట్టు


చెట్టూ చెట్టూ ఓ చెట్టు

మా మంచి పచ్చని చెట్టు

నీతోనే మేమెపుడు జతకట్టు

నీవే మాకు మంచి తోవ చూపెట్టు


1.నీలా జనులకు నీడను పంచేట్టూ

ఏ వేళా పూలో పళ్ళో ఇచ్చేట్టు

నినుకొట్టే మనిషిని కాయడం

మనుషులందరికి చెంప పెట్టు


2.వేరూ కాండం బెరడు పనికొచ్చినట్టు

నీ వల్లనె భూసారం నిలిచినట్టు

పిట్టలు నీపై గూళ్ళు కట్టినట్టు

మా కన్ను నెత్తురు పరుల ప్రాణం నిలిపేట్టూ

 రాఖీ బాలగేయాలు-2


*భావి పౌరులు*


బాలలం మనం

వీరులం మనం

భావి భరత పౌరులం


జై జవాననీ

జై కిసాననీ

ఎలుగెత్తి చాటుదాం


జాతిపితా బాపూజీ

జాగృతికి నేతాజీ

అడుగులలో సాగుదాం


స్వతంత్రులం మనం

వీణా తంత్రులం మనం

దేశప్రగతి పాటపాడుదాం

 రాఖీ బాలగేయాలు-1


🙏దండం🙏


తెలవారగనే అమ్మకు దండం

లాలించే మా నాన్నకు దండం


నను మోసే భూమాతకు దండం

కనిపించే దేవుడు రవికీ దండం

బోధనచెసెడి గురువుకు దండం

తోచినదొసగే దాతకు దండం

ప్రజలను కాచే నేతకు దండం


దనుజుల దునిమెను కోదండం

ఆ విల్లును ఎక్కిడిన రామునికో దండం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అంతరార్థమెరుగలేని ఆచారాలు

పరమార్థం గ్రహించని సాంప్రదాయాలు

ముందరికాళ్ళుకు ఔతాయి బంధనాలు

ఎందరి క్షోభకో కారణాలీ దారుణాలు


1.దేశకాల పరిస్థితుల కనుగుణాలు సంస్కృతులు

సంకటాల నధిగమింప సహజాలు సవరింపులు 

సర్దుబాటె కరువైతే ప్రతిబాటలొ కంటకాలు

ఆనందమె పరమావధి కావాలి జీవితాలు


2.న్యాయ సూత్రమేది లేదు ఇదమిద్దమైనదంటు 

ధర్మరాజు పలికెబొంకు ధర్మసూక్ష్మమిది యంటూ

రాజ్యాంగాలే మారేను సవరణలే నోచుకుంటు

కులమతాల రివాజులూ పట్టువిడుపులుంటూ


3.మూర్ఖమైన వాదనలతొ వివాహాల్లొ వివాదాలు

మూఢమైన నమ్మకాలె వధూవరుల శాపాలు

ఇరుమనసుల కలయికకే ఇన్ని వేదమంత్రాలు

ఇరుసుకాని బంధంతో ఇరుకౌను కంఠసూత్రాలు