Monday, January 21, 2019

పలుక తగని పలుకులెన్నొ పలికినాను
చేయకూడని పనులెన్నో చేసినాను
అహంకార భావనతో విర్రవీగినాను
కన్నుమిన్నుగానక ప్రవర్తించినాను
దురితములెంచకురా రత్నగర్భ గణపతి
నను మన్నించరా కన్నిమూల గణపతి

1.పిట్టకైన వేయలేదు పిడికెడు మెతుకులు
సాయపడుటె ఎరుగని స్వార్థపు బతుకులు
అవగుణాలు నిండిన మా దారంతా గతుకులు
న్యాయానికి ధర్మానికి పేర్చాము చితుకులు
నేరములెంచకురా కాణిపాక గణపతి
కనికరమున కావరా వాతాపి గణపతి

2.గతజన్మ పాపాల సంచిత ప్రారబ్ధము
తెలిసితెలిసి చేసిన దోషాల ఫలితము
నీ దయావిశేషమె ఈ పశ్చాత్తాపము
నీ కృపాకటాక్షమే ఈ ప్రాయశ్చిత్తము
సన్మార్గము నను నడపర సిద్ది గణపతి
సంకటముల నెడబాపర విఘ్న గణపతి