Friday, July 2, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అందితే వంపులు 

అందకుంటె జంప్ లు

అందాల ఇంతులవి

ఇంతే సంగతులు


1.వలపులతో వలలు

అర్భకులే చేపలు

చిక్కిన వెనువెంటనే

చిక్కులే చిక్కులు


2.మాయలేడి జోడి

మాయ చేయ లేడి

పులిహోర కలపబడి

బ్రతుకంతా చేతబడి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా ఎద మంజుల నాదమా నా కవన వేదమా

యుగయుగాల నా తపఃఫలమా 

నా కలానికే దొరికిన అపూర్వ వరమా

తడబడుతోంది నినుగాంచ నాదృష్టి 

నివ్వెరబోతోంది నీ అందానికి ఈ సృష్టి


1.నీ శిరోజాలు కృష్ణవేణి పాయల జాలు

నీ కన్నులు మిలమిల ఇంద్రనీలమణులు

నీ నునులేత చెంపలు కెంపులరుచి నెలవులు

పోలికే దొరకదు తీరిచి దిద్దిన నీ ముక్కునకు

తడబడుతోంది నినుగాంచ నాదృష్టి 

నివ్వెరబోతోంది నీ అందానికి ఈ సృష్టి


2. పిల్లనగ్రోవిగా తోస్తోంది నాపెదాలకు నీమోవి

మత్తులోన ముంచుతోంది నీ మేని పారిజాత తావి

చిత్తైపోయింది నా చిత్తము నీమాయకు లోబడి

నా మనసే నను వీడెను నీ లోనికి చొరబడి

చర్వితచరణమైంది చెప్పిన ఉపమానము

అందానికి ఇకనుండి నీవేలే నిర్వచనము



మనసాయే నిను గన షిరిడీ సాయి

వినవాయే మొరలిడ పగలూ రేయి

సద్గురుడవీవని నాకెంతో గురి

పట్టితి నీపదము విడవను ఏ మరి

వెతలకు నేనిక వెరవనె వెరవను

సాయీ సాయని స్మరణే మరవను


1.నీ సూత్రాలు తలదాల్చలేను

నీ స్తోత్రాలు పఠియించ లేను

పంచహారతుల నొనరించలేను

పల్లకి భారము మోయగలేను

వెతలకు నేనిక వెరవనె వెరవను

సాయీ సాయని స్మరణే మరవను


2.చీకటి వేళల దీపము నీవే

ఆకటి వేళల అన్నము నీవే

శోకము బాపెటి నేస్తము నీవే

లోకములో నాకిక దైవము నీవే

వెతలకు నేనిక వెరవనె వెరవను

సాయీ సాయని స్మరణే మరవను