Monday, August 30, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏడేడు పదునాల్గు భువనాలు

అద్వితీయ తేజోమయ నయనాలు

నవరసాల నొలికించే ఆ నేత్రాలు

తిలకించ నా మనసుకు ఆత్రాలు


1.ప్రేమను దయను వర్షించే ఆ కళ్ళు 

ఆనందమయమైన వాకిళ్ళు

తీర్చేను లోకాన దీనుల ఆకళ్ళు

కనినంతనే మదిలోన పరవళ్ళు


2.దివ్యమౌ భవ్యమౌ ఆలోచనాలు

పూయించును అధ్యాత్మికాలోచనలు

విధాతనే విస్తుబోయే విశ్వంకరాలు

విశ్వానికంతటికి నిత్య శుభంకరాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువు తాజా పుస్తకానివి

నువు అద్భుత సౌధానివి

నువు తాత్విక దర్పణానివి

నువు నా వాస్తవ స్వప్నానివి


1.ముఖపత్రం వద్దనే మునకలేస్తున్నాను

సాంతం నేనిక ఎప్పుడు చదవను

గుమ్మంలోనే చతికిలపడ్డాను 

మొత్తం భవనం ఎప్పుడు చూడను


2.పవిత్ర వేదం నువ్వు గంధర్వనాదం నువ్వు

నా ఎదచేసే మంజుల రావం నీవు

నాలో కదలడే జీవం భావం నువ్వు

ఆరాధ్యదైవం నువ్వు అనుభవైకవేద్యం నువ్వు


3.అమరులు గ్రోలే అమృతం నువ్వు

రాగాలు రంజిల్లే వాద్యం నువ్వు

నువ్వు కానిదంటూ ఏవీ లేనే లేవు

నీఊసు లేనిదంటూ ఇక రోజులు రావు


https://youtu.be/7Wsdbu_qs4E?si=ulZ-79RGsrOyD7wc


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:శివరంజని 


కొంచం కొంచంగా నను చంపకే-పీక లోతులో ననుముంచకే

అందరిలా నన్నెంచకే-నీ ప్రేమను పరులకు పంచకే

గ్రహించలేవా నా మనసును

అనుగ్రహించలేవా నీ అనురాగమును


1.ఒడ్డున పడ్డ చేపలా గిలగిలలాడేను

చిల్లులు పడ్డ నావలా కడలిలొ మునిగేను

ఉగ్గబట్టుకుంటాను ప్రాణాలను సైతం

ఊపిరాపుకుంటాను నీ ఆనతి కోసం

ఔననలేవా అడియాస చేయక

నే మనలేనే నువు బాసచేయక


1.ప్రతిసారీ నీతో నాకు ఒక పరీక్షనే

కలవాలను కున్నపుడల్లా కడు నిరీక్షణే

తిరుమలేశు దర్శనమే సులభసాధ్యం

నీ వీక్షిణ భాగ్యమే గగన సదృశం

తపస్సులే చేస్తున్నా కనికరించవే

నీకొరకే జీవిస్తున్నా నను స్వీకరించవే


https://youtu.be/J7XsIdp8jhc?si=x14QVZAKj8-r7JjN

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:ఆనందభైరవి

వస్తానయ్యా కుస్తాపూరు రామలింగయ్యా
ఇస్తేమేలయ్యా మస్తకానికి స్వస్థత చాలయ్యా
తోచినట్టు వచ్చినట్టు నీ పూజచేతునయ్య
సంతృప్తిని కలిగించి నను సాగనంపవయ్య

1.గంగనీళ్ళు మోసుకొచ్చి నీకు తానంబోతునయ్యా
తుమ్మిపూలు ఏరుకొచ్చి నీమీద పోసెదనయ్య
మారేడు పత్తిరిదెచ్చి లింగంపైన పెడుదునయ్యా
గంగయ్య లింగయ్య సాంబయ్య అంటూ వేడెదనయ్యా

2.మంత్రాలు కొలుపులు నాకెరుకలేవయ్యా
పాటలు భజనలైతే నే చేయగ లేనయ్యా
తెల్సింది ఒక్కటే శివా శివా శివా శివా అనుడే
ఎప్పుడు తప్పక కాచేవంటూ గుడ్డిగ నిన్నూ  నమ్ముడే


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అరుణ కలువ నీవు

కరుణ నొలుకు తావు

నీ మోము అనందాల తావు

నీ మోవి చిరునవ్వుల రేవు

మాతా శ్రీ లలితా పరాంబికవీవు 


1.సౌందర్య లహరి నీవు

శివానంద లహరివౌతావు

భవరోగ తిమిర దీపికవు

మాధవ హృదయ రాధికవు


2.సకల విశ్వవేషిణివి 

నవరస పోషణివి

నిత్య సంతోషిణివి

మృదుమంజుల భాషిణివి