Monday, May 31, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గండుకోయిలే తలదించుతుంది

నిండుగ నువు పాడుతుంటె

పారిజాతమే ఇలరాలుతుంది

పరవశాన నువు నవ్వుతుంటె

 ప్రియా గానమే ప్రాణము నీకు నాకు

కలిసి చనెడి దొక మార్గమే ఇరువురకు


1.ఇలవంక వచ్చినారు నారదతుంబురులు

నీ కడ పాటనేర్చేందుకు

నీకొరకే వెతుకుతున్నారు దేవ గంధర్వులు

నిను గురువుగ ఎంచుతూ

కఛ్ఛపి వీణియకున్న జతులు గతులు నీవి

అనాలంబ మధురిమలా నీ గాత్రపు నెత్తావి


2.తరియించగ నీగాన లహరే అల ఆకాశ గంగయై

నను పావన మొనరించు

ఎలుగెత్తిన నీ గళ రావమే కడు ఉత్తేజభరితమై

నను ఉరకలు వేయించు

సాటిరారు భువినెవ్వరు నీసరితూగ

సంగీతపు చిరునామా ఎప్పటికీ నీవవగ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నెత్తిమీద శివ గంగ నీకంట

ఎత్తిపోతల శోకంగ నా కంట

నివురు గప్పి ఉండె నీ నుదుటి కంటి మంట

ఎగసిపడుతున్న గుండె మంటతొ మేమంట

చిక్కని చిక్కుతొ మిక్కిలి తంట విధిరాతంట

త్వమేవాహం త్వమేవాహం  శివోహమేనంట


1.చంద్ర వంకనీకు అలంకారము

బ్రతుకు వంక నాకు బాధాకరము

గొంతైతే దిగకుంది నీకు కాలకూటము

ఒళ్ళంత పాకింది విషము నాకెంత కష్టము

చిక్కని చిక్కుతొ మిక్కిలి తంట విధిరాతంట

త్వమేవాహం త్వమేవాహం  శివోహమేనంట


2.మరుభూమే నువు మసలేటి స్థానము

మా ఇల్లు సైతం వల్లకాడుతో సమానము

బొచ్చె గలిగియున్న  బిచ్చగాడివి నీవాయే

తెరిచిన జోలెతొ వరములడగుతూ నేనాయే

చిక్కని చిక్కుతొ మిక్కిలి తంట విధిరాతంట

త్వమేవాహం త్వమేవాహం  శివోహమేనంట

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తరగని గని ప్రియా నీ అందం

నవరత్నాలకు అది భాండారం

నా వెంటే నీవుంటే జీవితాంతం

కొదవనేది ఉండనే ఉండదు సాంతం


1.ఇంద్రనీల మణులే కనులు

కెంపులు నీ ఇంపైన చెంపలు

పగడాలే  అరుణాధరాలు

పలువరుసే ముత్యాల పేరు

పలుకుల్లో రతనాలు రాలు


2.వజ్రమే కమనీయ కంఠము

మరకతమే  బిగుతు పేరణము

పుష్యరాగమే నీ కౌశేయము

గోమేధికమే నీ మధ్యవృత్తము

వైఢూర్యమే ప్రియా నీ మేనిఛాయ

Friday, May 28, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అభిసారికవో అభినవ రాధికవో

రసమయ నవ గీతికవో మదనుని సుమ వేదికవో

విరహవేదనతొ గుమ్మమానుకొని వేచితివో

మధుర కలయికల ఊహచేసుకొని సైచితివో


1.జాము గడచినా జాడలేని ప్రియుడి చింతన

జాలిమాని ఆ జాబిలేలనో తారకల చెంతన

జన్నమాయే నీ మేని సెగలతో వాడ వేడినొందె

జంగమయ్య జగదంబ మెదల మనసు కలత చెందె


2. మరుమల్లెలే ఉరులోసినా కురులకందమిచ్చె

నీ గాజులే విదిలించినా మంజులమై రవళించే

ఉక్కబోసి తడిసిన రవికె మత్తును మరిపెంచే

జారుతున్న పయ్యెద సైతం జావళీలు ఆలపించె

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంత సొబగు నీది నువు పాలరాతి శిల్పమే

ఎంత సొగసు నీది తూచితే అనల్పమే

ఎదుటికొచ్చి నిలిచిన కవి కల్పనవే

కనులకు మిరుమిట్లుగొలుపు సౌదామినివే


1.ప్రాగ్దిశ గళాన అరుణ స్వరానివే

పూరెక్కన ప్రత్యూషపు తుషారానివే

పూనికతో కూర్చిన మౌక్తిక హారానివే

అయాచితంగ నా కందిన అమరవరానివే


2.అపరాణ్ణమందున పూర్ణ వటచ్ఛాయవే

 మీరిన తపనలకై మలయ సమీరమీవే

బీడును పులకింపజేయు దివిజలధారవే

హాయిగొలుపు పికగానపు పూలకారువే

Thursday, May 27, 2021

 తిరుమలేశు మేలుకొలుపు మేలుకొలుప శుభోదయం

పంచాయతన  గుడిగంటలు చెవినబడగ శుభోదయం

నరసింహుని అభిషేకపు వేదఘోష వినబడితే శుభోదయం

అరచేతిని కళ్ళకద్ది గణపతినే తలచుకొనగ శుభోదయం


1.గోదారిలొ మునకలేసి అర్ఘ్యాలొదిలితే శుభోదయం

దోసెడు నీళ్ళైనా లింగంపై ధారపోస్తె శుభోదయం

శ్రీ దత్తుని పాదుకలకు ప్రణమిల్లగ శుభోదయం

శ్రీరాముని కోవెలను భక్తిమీర దర్శిస్తే శుభోదయం


2.రావిచెట్ట చుట్టూరా ప్రదక్షణాలొనరిస్తే శుభోదయం

హనుమాన్ చాలీసా తన్మయముగ పాడితే శుభోదయం

నవగ్రహ స్తోత్రాలను శ్రద్ధగ పఠియిస్తే శుభోదయం

శారదాంబ కృపనందగ కుంకుమ ధరియిస్తే శుభోదయం

 ధర్మం దారి తప్పిన వేళ

హింస పెచ్చరిల్లిన చోట

జనుల వెతలు పంకించి

జనన కారణాలెంచి

జరామరణాల యోచించి

జ్ఞానసిద్ధి పొందాడు భోదివటచ్ఛాయలో

బుద్ధునిగా మారాడు సిద్ధార్థుడు గయలో


1.ఆలుబిడ్డలని వదిలేసాడు

రాజ్యమే త్యజియించాడు

బౌధ్ధ ధర్మాన్ని బోధించాడు

బౌద్ధమతమునే స్థాపించాడు

బుద్ధం శరణం గచ్ఛామి

ధర్మం శరణం గచ్ఛామి

సంఘం శరణం గచ్ఛామి


2.అహింసనే పాటించాడు

సన్యాసిగనే జీవించాడు

వేలమంది శిశ్యులతో 

ప్రవక్తగా సూత్రాలే ప్రవచించాడు

బుద్ధం శరణం గచ్ఛామి

ధర్మం శరణం గచ్ఛామి

సంఘం శరణం గచ్ఛామి

Tuesday, May 25, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ 


మధురమె నీ తలపు

మూయకే మది తలుపు

నా మనసే కడు తెలుపు

నా కవితలు అది తెలుపు


1.వయసే ఉసిగొలుపు

వగరే తొలి వలపు

ఆకర్షణయే కలుపు

నిజప్రేమనే మనల  కలుపు


2.నీ పరిచయమొక మలుపు

నీ నవ్వే మేలుకొలుపు

నా బ్రతుకున నువు గెలుపు

అనుమానపు బూజు దులుపు

 రచన్వరకల్పన&గానం:డా.రాఖీ


ఊయలూపనా జోల పాడనా

తలను నిమరనా జోజోకొట్టనా

అదమరిచి నిదురోవగ నేస్తమా

నా ఎదలో ప్రవహించే రక్తమా


1.తలపుల్లో నువు మెదిలితె కవనము

కనులముందు కదలాడితె గీతము

నభూతోనభవిష్యతి మన స్నేహితం

కడతేరనీ ఒకరికి ఒకరమై ఇలా జీవితం


2.నేను కన్నకలలన్ని కుప్పబోయనా

అనుభవాలు నెమరువేసి కథలు చెప్పనా

వేలుపట్టి నడిపిస్తా యుగాల అంచులదాకా

నమ్మకంగ తోడొస్తా విశ్వపు అవధులదాకా

 https://youtu.be/l55-Ax52aOQ

రచన,స్వరకల్పన&గానం:డా రాఖీ


జయ జయహో నారసింహ-

జయతు జయతు జయతు

త్రికరణ శుద్ధిగా నిన్నే నమ్మి కొలుతు

స్వామీ నీవే మా ధర్మపురి వేలుపు

ఆపద్బాంధవా ఆలకించు ఈ దీనుని పిలుపు


1.మృగవదన జ్వలిత నయన శ్రీధరా

క్రూరదంష్ట్ర తీక్షణ నఖ చక్రధరా

భీకరాకారా భయనివార ఉగ్రనారసింహా

శ్రీకరా శీఘ్రవరద యోగనారసింహా


2.హిరణ్యకశ్యపాంత దుర్జన నాశకా శ్రీహరీ

ప్రహ్లాద సంరక్షక సజ్జన పోషకా నరహరీ

స్తంభ సంభవా స్వామి అంబుజ చరణా

సాష్టాంగ వందనాలు కరుణాభరణా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ కన్నులే మధువొలుకే దొన్నెలు

నీ పల్వల్వలే మగ్గిన పనస తొనలు

నీ బుగ్గలే సిగ్గులే సింగారించే చిన్నెలు

ఎన్ని ఉన్నాయో నీలో ఎనలేని వన్నెలు

సరళరేఖలా ఎదలో కాలుమోపావే

సరస కేళిలో సాంతం చిచ్చు రేపావే


1.జీరాడే ముంగురులతో రాజీపడి

ఊగాడే జుమ్కాలతొ పేచీపడి

ముక్కెర చక్కదనం కొనియాడి

పాపిటి బిళ్ళనే తనివార ముద్దాడి

మచ్చిక చేసుకుంటి అచ్చికబుచ్చికలాడి

తనుకానిగ నే మన తరమా వగలాడి


2.నీరుగారి పోకుండా నీ వంపులకు

రసాభాస కాకుండా కవ్వింపులకు

లొంగదీసుకోవాలి నీ వయసు పొంగులను

కట్టడిసేయాలి మిడిసిపడే హంగులను

నీ వ్యూహం ఛేదించే సవ్యసాచినవ్వాలి

నీ దాడిని తిప్పికొట్టి యోధుడిగా గెలవాలి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చావనన్న చావనీయవు

నా బ్రతుకు నన్ను బ్రతుకనీయవు

నను కాదు పొమ్మంటే ఒకటే నిశ్చింత

నువు వద్దని చెప్పేస్తే నాచావు నేఛస్తా


1.సద్దుమణిగి ఉన్నవేళ అలజడి రేపుతావు

నిద్దరోతున్న మాపు కలలో దూరుతావు

ఊరించకమానవు ఉడికించక ఆగవు

చచ్చేచావు నీతోటి నువు వచ్చేదాకా

ఎలా మసలుకోనే నువు మెచ్చేదాకా


2.అందమంత ఆరబోసి ఆశలు కలిపిస్తావు

విందు మందు ముందరుంచి నోటిని కుట్టేస్తావు

తప్పుకోను మనసురాదు తిప్పలతో బ్రతుకు చేదు

బజారుపాలాయే నాకున్న బింకము

కైజారై గుచ్చింది గుండెలొ నీపొంకము

Monday, May 24, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తల్లడిల్లజేస్తోంది ఉల్లిపొర తెల్లచీర

ఉత్సుకత పెంచుతోంది కుట్లుతెగు బిగుతు రవిక

జారుతున్న కొంగు పాడె జావళి గీతిక

నంగనాచి నాభివేసె లొంగదీయు పాచిక

తట్టుకొన తరమౌనా తాపసులకైనా

తరించనీయవె నీ   దాసునిగా నైనా


1.గుండెదడ హెచ్చుతుంది నీ అందెలు కన్నా

రక్తపోటు పెరుగుతుంది నీ గాజుల సడివిన్నా

తడబాటే మాటల్లో కంటిముందు నువ్వుంటే

ఎడబాటే నాకునాతొ ఎదురుగ నీ నవ్వుంటే

తట్టుకొన తరమౌనా తాపసులకైనా

తరించనీయవె నీ   దాసునిగా నైనా


2.మనసు చెదరగొడుతుంది పిరుదులపై నీ జడ

ఆశలేవొ రేపుతుంది దూంముడి చోళీ నాడ

చూపుతిప్పనీకుంది నడుం ముడత మతిచెడ

పద్మినీజాతి స్త్రీల పొంకాలన్ని  నీ కడ 

తట్టుకొన తరమౌనా తాపసులకైనా

తరించనీయవె నీ   దాసునిగా నైనా


https://youtu.be/6-NR3AXYgZ8

 నేడు నరసింహ జయంతి ,

అందరికీ స్వామివారి కృపాదృక్కులతో

🙌


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అంతర్యామి శ్రీహరి

భక్తాంతర్యామి నృకేసరి

సర్వాంతర్యామి ధర్మపురీ నరహరి

ప్రహ్లాద వరదా ప్రణతోస్మి పాహిపాహి దనుజారి


1.అణువణువున కలిగిన నీ ఉనికి

ఋజువు పరచి చూపించ లోకానికి

నరమృగ రూపాన గోదావరి తీరాన

మము పరిపాలించగ మా ధర్మపురాన

సంభవించావు ప్రభూ శిష్ట రక్షణకై

ఉద్భవించావు స్వామి దుష్ట రక్షణకై


2.వరగర్వితుడా హిరణ్య కశిపుని

సంహరించినావు నరసింహాకృతిని

అక్కునజేర్చినావు గ్రక్కున ప్రహ్లాదుని

మిక్కిలి ప్రేమతో శాంతము చేకొని

కటాక్షించినావు శేషప్పను సైతం

అనుగ్రహించు అందించు మాకు నీ ఊతం

Sunday, May 23, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వేసవిలో చలి పుట్టిస్తుంది నీబిగి కౌగిలి

హిమగిరిపై సెగ రగిలిస్తుంది నీబాహులోగిలి

నీవే అధినాయికవు శృంగార లోకానికి

నీవే సామ్రాట్టువు రసానంద రాజ్యానికి


1.స్నానమాడుదాం ముద్దుల జడిలో

 ఈదులాడుదాం  స్వేదపు నదిలో 

 జగడమాడుదాం జతకూడికలో

 మునిగితేలుదాం రతివేడుకలో


2.పాలుపంచుకుందాం యుగళగీతిలో

పందెమేసుకుందాం సరసమైన రీతిలో

కరిగినీరైపోదాం వేడివేడి నిట్టూర్పులలో

తిరిగి చేరువౌదాం పరస్పరం ఓదార్పులలో

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గులాబీల రెక్కలన్ని ముద్దగ చేసి

మంచిగంధమ్మునే మిళితంచేసి

తేనెలో సుధలోను రంగరించి

వెన్ననూ వెన్నెలను జతగజేసి

సృష్టించాడు అపూర్వంగ నిన్ను విరించి

తలవంచాడు నీకన్న అందాలను సృజించడం మరచి


1.భువికి రాగ జంకే రంభకూ ఊర్వశికి

పున్నమైన తడబాటే నిను గని శశికి

దమయంతికి చింతనే నీతో పందానికి

వరూధినీ వివశయే నీ సౌందర్యానికి

సృష్టించాడు అపూర్వంగ నిన్ను విరించి

తలవంచాడు నీకన్న అందాలను సృజించడం మరచి


2.కవుల కలల సుందరివే నీవు

చిత్రకారుల కైనా సవాలువే నీవు

నిను చెక్కగ శిల్పి ఒకడు ఇలలో లేడు

నీతోడు కోరుకోకున్న మనిషే కాడు

సృష్టించాడు అపూర్వంగ నిన్ను విరించి

తలవంచాడు నీకన్న అందాలను సృజించడం మరచి

Saturday, May 22, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పేరుకు మాత్రం మానవుడు

ప్రవర్తనకైతే  పశు సమానుడు

పుణికిపుచ్చుకున్నాడు అవలక్షణాలను

ఆవుతోలుకప్పుకున్న పులిగుణాలను


1.నక్క వినయాలు నత్త  నడకలు

కుక్కతోకవంకర బుద్ధులు కప్పదాటులు

గుడ్లగూబ చూపులు గబ్బిలంలా వ్రేలాడటాలు

నల్లికుట్ల చేష్టలు పిల్లిలా తోకముడవటాలు


2. ఎలుకలా దాగడాలు ఏనుగల్లె ఆగడాలు

వానపాము పౌరుషాలు కాకుల గోలలు

మేకపోతు గాంభీర్యాలు ఆంబోతు క్రౌర్యాలు

గొర్రెదాటు పోకడలు గంగిరెద్దు తల ఊపడాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అంతరించనీ నను తరించనీ  అంతకహరుడా

అవతరించనీ నీ పదపీఠిగ నీలకంఠుడా

వివరించనీ నా వెతలను త్రిపురాంతకుడా

సవరించరా నా గతులను సదానందుడా

శంభో హరా శంకరా సాంబసదాశివ అభయంకరా


1.తోసితివి నను భవసాగర తోయముల

వేసితివి చిక్కుల చిక్కెడు బంధనముల

మరచితివి కనికరమేలనో ఈ దీనుని ఎడల

చూసితివి చోద్యము నే మునుగ సుడుల

శంభో హరా శంకరా సాంబసదాశివ అభయంకరా


2.జాగిక సేయకు జాలిమాని  జాబిలితాల్పుడ

జటాఝూటధర జగడమ నాతో జంగమదేవర

జలధార ప్రియ జపమిక చేయుదు ఫాలనేత్రుడా

జింకతాల్పరి నా వంకలెంచకురు జయంతుడా

శంభో హరా శంకరా సాంబసదాశివ అభయంకరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తెల్లచీర రమ్మంటోంది

మల్లెపూలు తెమ్మంటోంది

దాగలేని పరువాలు ఆగం చేస్తున్నవి

ఆగలేని మరులన్ని మారాం చేస్తున్నవి

ఝాము గడిచిపోనీకు ప్రాణసఖా

జాగుచేసి చంపబోకు నా కోరిక


1.వలపునంత వండి పెట్టినాను

విందారగించ వేడిగ వడ్డించినాను

చల్లారిపోనీకు  నా మది సెగలు

తెల్లారిపోనీకు వగరైన వగలు

ఝాము గడిచిపోనీకు ప్రాణసఖా

జాగుచేసి చంపబోకు నా కోరిక


2.గులామునై పోయాను నీ మగటిమికి

సలామునే చేస్తాను నీ రసికతకు

నవాబుగా రమ్మంటిని పడకటింటికి

రివాజుగా దివి సవారికై తయారుంటిని

ఝాము గడిచిపోనీకు ప్రాణసఖా

జాగుచేసి చంపబోకు నా కోరిక


దివ్య మోహన విగ్రహం

అనూహ్యకరం పరానుగ్రహం

వేంకటాచల నిలయం వేదవేద్యం

వందే పంకజానన శోభితం పరమపూజితం


1.శంఖ చక్ర యుగధారిణం భవ తారణం

దశవిధావతారిణం రమా రమణం

భక్త వశీకరణం విష్ణుం ఆర్త త్రాణ పరాయణం

శరణాగత బిరుదాంకితం శరణం శరణం శరణం


2.శ్రీధరం ఇభరాజ వరదం మాధవం

గోవిందం గోవర్ధ గిరిధరం ముకుందం

సదానందం పరమానందం సచ్చిదానందం

హరిం మురహరిం నరహరిం కరుణాకరం

Friday, May 21, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


విద్వత్తు సదనం మేధస్సు

కళలకు నిలయం మనస్సు

బ్రతుకునకతి ముఖ్యం విద్యా వినోదం

నమోస్తుతే భారతీ నా కవి నీ ప్రసాదం


1.అక్షయమౌ అక్షరాలు నీ వరాలు

మధువొలికే పదాలు నీ పదాలు

సీతాకోకచిలుకలు మధుర భావ వీచికలు

తలపున నీ కదలికలే  కవన సూచికలు

నమోస్తుతే భారతీ నాకీవే శరణాగతి


2.దేహచక్ర సప్తకమే సప్తస్వరాలు

ఆహ్లాద దాయకము  అనురాగ రాగాలు

ఉల్లముకుల్లాసమే లయ విన్యాసాలు

సాయుజ్యాన్వితమె సంగీత గీతాలు

నమోస్తుతే భారతీ నీ దయతో సంప్రాప్తాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పదహారణాల అసలు సిసలు తెలుగుదనం 

పదహారు ప్రాయాన మిసిమి మిసల పడుచుదనం

తెలుగింటి అమ్మాయి సంక్రాంతి సన్నాయి

కంటికింపు మనవారికి కంటగింపు పరులందరికి


1.పొడుగాటి నాగంటి వాలుజడ 

నప్పేటి జడకుప్పెలు ఊగాడ

జఘన మృదంగంమీద

లయవిన్యాస విలాసమాడ

కుర్రకారు గుండెల్లో దడ దడ

మావయ్యలు సైతం తడబడ


2.చారడేసి కన్నుల్లో కలువల జాడ

నిగారింపు బుగ్గలే పెరుగు ఆవడ

తేనెపట్టు గుర్తొచ్చే పెదవులు చూడ

గుట్టు బట్టబయలవుతూ చోలి కడ

పట్టుదలే పట్టుతప్పే పట్టు పావడ

మువ్వల పట్టీలతో జవ్వని తిరుగాడ

Tuesday, May 18, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కొండలరాయుని మేలుకొలుపులలో భూపాలం శుభోదయం

గరుడస్తంభపు చిరుచిరుగంటల సడి హిందోళం శుభోదయం

కోవెల గోపుర సమీరాలలో మలయమారుతం శుభోదయం

కోనేటి తామరతూడులు కొసరేటి హంసనాదం శుభోదయం

రసోదయం రాగోదయం నవోదయం శుభోదయం


1.కొక్కొరకో కోడికూతల ఉదయరవిచంద్రిక శుభోదయం

కువకువ ధ్వనులతొ పల్లెను లేపే చక్రవాకం శుభోదయం

ఎద్దుల మెడలో రవణులు చేసే దేశ్ రాగం శుభోదయం

లేగలు మేకలు మందలొ అరుపుల ఆర్తిముల్తాన్ శుభోదయం


2.తూరుపు వాకిట భానుడి కిరణం చంద్రకౌన్స్ శుభోదయం

పచ్చికమీద తళుకులీనే తుషారమయే వలజే శుభోదయం

నేలకు దుమికే జలపాత హోరగు రేవతిరాగపు శుభోదయం

మంగళకరమౌ కర్పూరహారతి మధ్యమావతి శుభోదయం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రెక్కలే పుట్టుకొస్తె ఎంత బాగుండు

చుక్కలా వెలిగిపోతే ఎంత బాగుండు

వాలిపోనా ఈక్షణమే నీ ఎదుటన

మారిపోనా తిలకమై నీ నుదుటన

నా స్ఫూర్తి వైనావు నా ఆర్తివైనావు

కాలాల అంచులదాకా ఈదాడుతుందామా

లోకాలు మరిచేలాగా ముద్దాడుకొందామా

చెలీ ప్రియా  ఓ చంద్రముఖి

నాకోసమే జన్మించిన ప్రాణసఖీ


1.నా ప్రేమ తెలపడానికి ఏ భాష చాలదు

అది నిన్ను చేరేవరకు నా శ్వాస ఆడదు

ఒక ముద్దుకోసం హద్దులన్ని దాటగలను

రససిద్ది కోసం తనువంత మీటగలను

అనురాగం పలికిస్తూనే నవలోకం చేరుస్తాను

ఆరాధన చేస్తూనే తమకాలిక తీరుస్తాను

అనుమతించుదాకా మతిచలించునే చెలీ

బహుమతీయరాదే నులి వెచ్చని కౌగిలి


2.స్వర్గాన్ని ఉన్నఫళంగా భువిపైకి దింపేస్తాను

అమరులైన పొందలేని అమృతాన్ని వంపేస్తాను

దేహాల ఊయలలో దిశలకొసలు చూపిస్తాను

మోహాల మాయలలో కరిగినీలో ప్రవహిస్తాను

రసనతో చిత్రమైన చిత్రాలను వేయవే

ఆగిపోని యోగమందున మన ఆయువే

ఇరువురము గెలిచేందుకు వైరులమై పోరనీ

కాయాల లోయలలోనా స్వేదనదులు పారనీ

Monday, May 17, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కొంచం కొంచంగా ఎంతో నచ్చావు

నీ వాడిచూపులతో ఎదనే గుచ్చావు

సీదాసాధాగానే ఉన్నా నన్ను నన్నుగా మెచ్చావు

నిద్రాణమైన  ప్రణయాన్ని ఉల్కిపడేలా గిచ్చావు

కోరికోరి వలచావు ప్రియా నా మనస్సునే గెలిచావు


1.చిరుబురులాడే కోపంలో నీమోము

ఎంతగా కందిపోయేనో చెప్పలేము

వెక్కిరించీ వేడెక్కించును నీ బుంగమూతి తీరు

ముద్దాడగలిగానా నిన్ను  నా ఆశలన్నీ తీరు

కోరికోరి వలచావు ప్రియా నా మనస్సునే గెలిచావు


2.కావాలని నను కలవాలని నీకెందుకలా

నా ఒడిలో నువు వాలాలని ఏవేళా నా కలా

ఆవలించనీకుండా కావలించుకుంటుంటే అలకలా

చెదిరిపోని మనబంధం ఆదర్శమవనీ చిలకాగోరింకలా

కోరికోరి వలచావు ప్రియా నా మనస్సునే గెలిచావు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నడిఈడు లోనా సడిచేసెనే వలపులు 

పడిలేచు అలలా మిన్నుకెగిసెనే మరులు

పురులు విప్పినాట్యమాడెనే తీపిరేపు తలపులు

కోడెనాగులై బుసలుకొట్టెనే తనివి తీరని తపనలు

ఆ నందనందనుడే ఆనందమందించనీ

నా డెందమందున్న సెగనంతమొందించనీ


1.మధించకుంటె నాడు క్షీర జలధిని

సాధించతరమయేన నిధులనీ సుధని

చిలికితేనేకదా పాలనీ ఎద మురిపాలనీ

వెలికితేగలిగేము వెన్ననీ మది వేడుకనీ

ఆ నందనందనుడే ఆనందమందించనీ

నా డెందమందున్న సెగనంతమొందించనీ


2.అణువణువున గిరిధారి కను రాధను

క్షణమైన సైచలేను నాలో విరహ బాధను

దాచి ఉంచాను మ్రోయించగా యవ్వనవీణను

రాసలీలలాడువేళ రసికతనెరపుటలో ప్రవీణను

ఆ నందనందనుడే ఆనందమందించనీ

నా డెందమందున్న సెగనంతమొందించనీ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అనురాగమే పొడసూపనీ  శుభోదయం

అనుబంధమే పెనవేయనీ శుభోదయం

అనుభూతులే మధురమవనీ శుభోదయం

అనుకూలమై ఇక కాలమే చెలఁగనీ శుభోదయం


1.అనుమతించనీ ఎద ఎద మైత్రినీ శుభోదయం

అనుసరించనీ సాంప్రదాయలనీ శుభోదయం

అనుకరించనీ పురుషోత్తములని శుభోదయం

అనుగ్రహించనీ ఆ దైవమే మనని శుభోదయం


2.అనుయోగమే కొనసాగనీ నెగ్గేదాకా శుభోదయం

అనుమానమే వసివాడనీ కడదాకా శుభోదయం

అనునయమే సమకూరనీ వెతలందునా శుభోదయం

అనుస్మృతులే రంజింపనీ హృదయాలనే శుభోదయం

Sunday, May 16, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిను చూడాలని నాకెంతో తహతహ

ఒక్కసారి కనిపిస్తే యమహో యమహ

అపూర్వమౌ నీ అందం దేవకన్య తరహా

ఆ అందం అందినంత బ్రతుకంతా ఆహాఁ


1.ఎత్తగలను ఎన్ని జన్మలైనా  

నీ అధరామృతమునేనందగ

మరణించగలను ఈక్షణమైనా

ఒకే ఒక సారి నీ పొందుపొందగ

ననుబ్రతికించుట నీచేతిలోనే 

బుగ్గల నునుసిగ్గు చాటు భామా

ఇంతకన్న ఎలాతెలుపగలను 

చాటుమాటు నాఘాటు ప్రేమా


2.ప్రతి నిమిషం నీజపమే నామది

వరమిచ్చే వరకు నిను వదలనంటిని

నా మనోనివేదనే నమ్మవే ఇది 

అనుకోకు చెలీ నాదొక గాలి పాటని

ఒక్కసారి తెలుపవే నీ ప్రేమని

ఐపోతా బ్రతుకంతా నీ బానిసని

సుందరీ నా ఎదురుగ నీవుంటే

కవితలు వెల్లువెత్తు నినుకంటే

 

https://youtu.be/Vo8sDPJ5O20?si=HhFWV2Y55VhmPPHG

(విశ్వకవి రవీంద్రుని కవిత ఆధార నా స్వేఛ్ఛాగీతిక)


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఇప్పుడే తెలుపు నేస్తం నా మరణ సంతాపం

వెంటనే వెళగ్రక్కు నేస్తం నా వెలితి పరితాపం

బ్రతికుండగా నే ఎరగాలి  నీ ఎద విలాపం

నీ కనుకొలుకుల నుండి నువు చేసే అశ్రుతర్పణం


1.పోయినోళ్ళందరూ మంచివాళ్ళే అనుకుంటే

నా గురించి చెప్పు భాయి నాల్గు మంచిముక్కలు

నేను లేనిలోటును అనుభూతి చెందుతుంటే

ఈ క్షణం తేల్చుకోవోయి జమాఖర్చు లెక్కలు


2.తదనంతరమిచ్చేటి బిరుదులేవొ ఉటంకించు

ఫోటోకు ఎందుకు దండ నా మెడకే తగిలించు

ఎవరెవరు పొగిడేరో ఎంతగా నా వెనక తెగడేరో

నాముందే వక్కాణించక పాడెముందు పాడేరో


3.పోయాక రానేరాదు నీకు నాకు అవకాశం

మనసువిప్పి కుప్పవేద్దాం మన భావావేశం

శ్రద్దాంజలి నాఎదుటే ఘటించనీ సమావేశం

చేజారక ముందే  విలువనెంచమని నా సందేశం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ మాటలన్నీ నీటిమూటలే

నీ బాసలన్నీ గాలిపాటలే

నమ్మితే వంచించే నయవంచకివి

నట్టేట ననుముంచే ఘరానా హంతకివి


1.బూటకాల నీప్రేమకు నేనే దొరికానా

నాటకాలు ఆడుకునుటకు నేనో బకరానా

వన్నెలెన్నొ కుమ్మరించి ఎరగా వేసావు

అన్నెంపున్నె మెరుగని నన్ను తేరగా దోచావు


2.వెలుగుకై ఆశపడితే శలభమై కాలాను

నీ ప్రేమలొ మునిగిపోయి శవంలాగ తేలాను

అగ్గిపాలు చేసావే పండంటి బ్రతుకును

బుగ్గిచేసి వేసావే నా బంగరు భవితను

Saturday, May 15, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:భీంపలాస్


కైలాసనాయకా కైవల్యదాయకా

కైమోడ్పులివి నీకే కైంకర్యము నా బ్రతుకే


1. కైరవమే ననుకానీ నీకై చేసే అర్చనలో

కైవారము సేయనీ నాకైతల గుఛ్ఛముతో

కైరవై కురియనీ నీ శీతల దృక్కులు నాపై

కైవశమైతిని శివా నీ భక్తిసుధే నాకు కైపై


2.కైశికమందు గంగ కావించనీ నను పునీతం

కైలాటకమాయే స్వామి నా జీవిత నాటకం

కైటభవైరి సఖా హరహరా ననుగావర తక్షణం

కైతవాలు వెతకకిక శరణం శరణం నీ దివ్య చరణం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:నీలాంబరి


మహాదేవా పరమశివా

మహాకాలకాల భక్తపాలా

మహామృత్యుంజయా నమోస్తు అవ్యయా

నటరాజా రాజరాజేశ్వరా నమామి ఈశ్వరా


1.భవా భవానీధవా ఆత్మసంభవా విభవ

వామదేవా కాకోలగ్రీవా ఖరువా భార్గవా

రుద్రా వీరభద్రా విరూపాక్షా నమోస్తుకాలాభైరవా

కపర్ది కామారి త్రిపురారి నమామి శంభో సాంబశివా


2.రాజరాజేశ్వరీ వరా హరా భక్తవశంకరా

నగరేశ్వరా స్థిరా వేములాడ భీమేశ్వరా

గంగాధరా చంద్రమౌళీశ్వరా నమోస్తు బాలేశ్వరా

వృషభ వాహనా విషకంధరా నమామి విశ్వేశ్వరా౹

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిను తలవని క్షణమే లేదు

నిను కలవక బ్రతుకే చేదు

పెంచిపోషిస్తున్నా నీ ప్రేమ పాదు

వస్తే రానీ నా మీద అపవాదు


1.గాలివాటుగా పరిచయమైనాము

ఏటవాలుగా పయనిస్తున్నాము

కాలం కట్టింది మన మధ్యన వారధి

దైవం వరమిచ్చింది స్నేహమనే పెన్నిధి


2.ఏదో కావాలని ఎదకు ఉబలాటం

చెప్పడానికెంతగానో నాకు మొహమాటం

చెప్పలేక చెప్పలేక ఎప్పుడూ ఆరాటం

నీతో చెలిమి  వయసుకు మనసుతొ చెలగాటం

 కన్నుల కురిసెను వర్షం

పెదవుల విరిసెను హర్షం

జీవితాన ప్రతి నిమిషం

ఆనందామృతం విషాద సంయుతం


1.కరోనా అంటినందుకు దుఃఖం

గండం గడిచినందుకు ప్రశాంతం

వ్యాక్సిన్ దొరికినందుకు మోదం

మరోసారి వేయనందుకు ఖేదం


2.దిన దినం క్షణక్షణం కరోనా భయం

ఎప్పుడు కడతేరుతుందో అయోమయం

రాకతప్పదను మాటే అందరికీ ఖాయం

బతికి బట్టకట్టామా అది అంతిమ విజయం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గోరుచుట్టు ఒక బాధ

రోకటిపోటదే గోటిపై ఎంతటి బాధ

పుండువల్లనే ఎంతో నొప్పి

పుండుమీద పుట్రవల్ల ఇంకెంత నొప్పి

కరోనా కాటుతోటె చేటనుకుంటే

నల్లబూజు(బ్లాక్ ఫంగస్)మోపై

కబళించసాగె వెనువెంటే


1.పరిసరాలనన్ని పాడుచేసిన పాపం

పర్యావరణానికే కీడు చేసిన దోషం

జీవవైవిధ్యానికే హానిచేసిన నేరం

ప్రకృతే ప్రకోపించినా విపత్తులే విరుచుక పడినా

గుణపాఠాలే నేర్వం మానవులెవరం మారం


2.తమదాకా వస్తుందా అన్న నిర్లిప్తత

మొక్కబడిగా పాటించే తూతూ జాగ్రత్త

కనీసమైనా పట్టింపులేని జాగరూకత

తెగేదాక లాగుతూ తెగిందంటే వెక్కుతూ

నెత్తినోరుకొట్టుకుంటాం,దీనంగా మొత్తుకుంటాం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శుభోదయం నేస్తమా ప్రియనేస్తమా

నీ నిలువెల్లా సుప్రభాతం ప్రాప్తమా

నిదురలేచు శుభవేళ ఎదురుగా నీ మోమే

అదిరిపాటు చెందేలా నా మోవితొ నీమోవే

శుభోదయం రసోదయం హసోదయం


1.నీలికురుల మబ్బుల మధ్యన

పారాడే పాపిట బిళ్ళనే ప్రత్యూషం

కనుబొమల కనుమల నడుమన

వెలిగే సిందూర తిలకం రవిలా విశేషం

అధరసుధా సాగరాన అలలపై తేలే

నవ్వుల కిరణాలతో హర్షోదయం

శుభోదయం రసోదయం హసోదయం


2.తలకునీళ్ళోసుకుని ఒడుపుగా విదిలిస్తే

నా ఒళ్ళుఒళ్ళంతా తుషారోదయం

కావాలనిలేదంటూ కావలించుకుంటుంటే

పొద్దంతా హద్దులుదాటే పరవశోదయం

మనసెరిగిన ఆలిచేసే చిలిపి అల్లరులే

ఉవ్వెత్తు ఉత్తేజంతో ఉల్లాన ఉల్లాసోదయం

శుభోదయం రసోదయం హసోదయం



శిష్ట రక్షకా దుష్టశిక్షకా కలియుగ వరదా

దీనబాంధవా ప్రేమ సింధువా ఆర్తత్రాణబిరుదా

ఎందుకు నీమౌనం దేనికి నీజాప్యం

పంచాయుధ పాణీ కరోనా అల్ప ప్రాణి

అంతమొందించవేమి గోవిందా నమోనమామి


1.వాడి వాడి వాడి వీడెనా  సుదర్శనానిది

ఊదిఊది నెర్రెవాసెనా పాంచజన్యానిది

చిలుంపట్టి బలం తగ్గెనా కౌమోదకిది

వధించగ పదను ఒగ్గెనా నందకానిది

ఎక్కిడగ పటిమ ఉడిగెనా సారంగానిది

పంచాయుధ పాణీ కరోనా అల్ప ప్రాణి

అంతమొందించవేమి గోవిందా నమోనమామి


2.గజేంద్రమోక్షగాథ నెరనమ్మియున్నాము

ప్రహ్లాదు గాచిన చరిత్రనే విశ్వసించుచున్నాము

ద్రౌపదీ మానసంరక్షణ కథవినియున్నాము

ధ్రువుడిని సరగున బ్రోచినగతి నెరిగినాము

నీ ఉనికే కల్పనయని భావించకున్నాము

పంచాయుధ పాణీ కరోనా అల్ప ప్రాణి

అంతమొందించవేమి గోవిందా నమోనమామి

Tuesday, May 11, 2021

 రచన, స్వరకల్పన&గానం:డా.రాఖీ


(నేటి {10th  MAY}మా  వివాహ 31 వ వార్షికోత్సవం సందర్భంగా నా ప్రియమైన శ్రీమతి 'గీత'కు ప్రేమకానుక)


భార్యకు సరియైన   పర్యాయపదమీవే

దేవేరికి ఉచితమైన నిర్వచనం నీవే

అర్ధాంగికి అసలైన అర్థమూ నీవె

ఇల్లాలుకు ఇంపైన రూపకమూ నీవే

ఓ చంద్రముఖీ నా ప్రాణసఖీ నా భాగ్యమీవే

ఓ చామంతీ నా దమయంతీ నా బ్రతుకు నీవే


1.నీ గొప్పతనమేలే నను భరించడం

ఘనమైన నీగుణమేలే నను సహించడం

క్షణమైన నువులేక యుగమౌ నిరీక్షణం

నీతో దాంపత్యం నిత్యనూతనం విలక్షణం

ఓ చంద్రముఖీ నా ప్రాణసఖీ నా భాగ్యమీవే

ఓ చామంతీ నా దమయంతీ నా బ్రతుకు నీవే


2.సీత సైతం దాటలేని నాపాలిటి గీతనీవే

జీవితగతికే ప్రగతిని కూర్చే కృష్ణ గీతనీవే

ఏడేడు జన్మలకు విధిలిఖిత నా నుదుటిగీతవే

నా కలం ఆలపించే ప్రతి మధుర గీతమీవే

ఓ చంద్రముఖీ నా ప్రాణసఖీ నా భాగ్యమీవే

ఓ చామంతీ నా దమయంతీ నా బ్రతుకు నీవే

Saturday, May 8, 2021

 "మాతృదినోత్సవ శుభాకాంక్షలతో"-


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ధర్మవతి


కాలం మారింది వయసు మీరింది

ఏ మాత్రం మారంది అమ్మా  నీ మనసే

చెక్కుచెదరకుంది ఇప్పటికీ నీ ప్రేమే

నా పాలిటి దేవతవే అమ్మా పాదాభివందనాలు

"ననుగన్న దినమిది" మన్నించి కురిపించు దీవెనలు


1.కథలెన్నో చెప్పమని వేధించా  చిననాడు

నిత్యం నిను పాడమనీ సతాయిస్తి అలనాడు

మౌనంగా ఉండమంటినిపుడు ఆయాసపడవద్దని

ధ్యానించమంటిని నిరతము ఐహిక ధ్యాస వద్దని

నా పాలిటి దేవతవే అమ్మా పాదాభివందనాలు

"ననుగన్న దినమిది" మన్నించి కురిపించు దీవెనలు


2.ఊతకర్ర కొనియిస్తిని చేయిపట్టి నడిపించిన నీకు 

చేరువైన మనకపోతిని కనురెప్పగ ననుకాచిన నీకు

పథ్యమంటు నీనోరుకట్టివేస్తిని రుచులు కొసరితినిపిస్తివే

ప్రతిదినం పలకరించనైతిని చీటికిమాటికి నన్నే పలవరిస్తివే

నా పాలిటి దేవతవే అమ్మా పాదాభివందనాలు

"ననుగన్న దినమిది" మన్నించి కురిపించు దీవెనలు



శ్రీశ్రీనివాసం శ్రితపారిజాతం

మా ప్రణతులివే గైకొనుమా సతతం

పద్మావతి అలమేలు మంగా సహితం

చేకూర్చర  సర్వదా మహి మహితహితం

గోవింద గోవింద పాహి ముకుందా

నారాయణ వాసుదేవ రమానందా పరమానందా


1.కట్లుబాట్లు మాకుంటే భరించుకోలేము

మా స్వేఛ్ఛను హరిస్తే సహించగాలేము

ఆంక్షలన్నవెపుడు మాకు   ఆకాంక్షలు కాబోవు

విచ్చలవిడి బ్రతుకె మాకు సంబరాల తావు

ఐనా సరె మమ్ములను నీవె ఆదుకోవాలి

కరోనా బారిబడితె నీవే చేదుకోవాలి॥గోవిందా॥


2.గాలిలోన దీపముంచి నీ ఉనికిని ప్రశ్నిస్తాం

చేతులైన కాపుంచక నీ మహిమను ఆశిస్తాం

చిత్తశుద్ది మావద్ద ఎంత మాత్రమూ లేదు

దైవభక్తి అంటేనే మామనసుకు కడుచేదు

మాపని ఏదైనా నీ పని మము సాంతం కావడమే

నీవిక చక్రం సంధిస్తే కరోనా అంతం కావడమే॥గోవిందా॥

Thursday, May 6, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చిన్న చిన్న విషయాలకె పొంగిపోతాం

కాస్త గుర్తింపుకే సంబరపడతాం

చిన్నపాటి వెన్నుతట్టి ప్రోత్సహిస్తే 

ఏమాత్రమైన ప్రయత్నాన్ని ప్రశంసిస్తే

అదే ఘనవిజయమనీ ఉప్పొంగుతాం

రంధ్రాన్వేషణతో నొప్పిస్తే కృంగిపోతాం

అల్పసంతోషులం కవులం-అనల్ప సంతుష్టులం

అలుపెరుగని సాహితీ సేవకులం-కవన హాలికులం


1.ఉన్నదాన్నే ఎల్లరూ ఎరిగినదాన్నే

సరికొత్తగా ఆవిష్కరిస్తాం,పరిష్కరిస్తాం

విప్పినదాన్నే ఎవరో చెప్పినదాన్నే 

మాదైన పంథాలో స్పర్శిస్తాం,సృజియిస్తాం

కర్చీఫ్ కప్పినా కాశ్మీర్ శాలువగా భావిస్తాం

చాక్లెట్ నిచ్చినా నోబెల్ బహుమతిగా ఆనందిస్తాం

అల్పసంతోషులం కవులం-అనల్ప సంతుష్టులం

అలుపెరుగని సాహితీ సేవకులం-కవన హాలికులం


2.స్పర్ధనే మాకెందుకొ సమకాలీనులంటె

ఈర్ష్యనే లోలోన మా సాటి కవులంటే

నభూతో న భవిష్యతి మాదైన కవితంటే

తప్పులెన్న తహతహనే పరుల రాతలంటే

గురువుగా భావిస్తే చేయిపట్టి నడిపిస్తాం

అగ్రతాంబూలమిస్తె ఆకసానికెత్తుతాం

అల్పసంతోషులం కవులం-అనల్ప సంతుష్టులం

అలుపెరుగని సాహితీ సేవకులం-కవన హాలికులం

Tuesday, May 4, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉషస్సులో రవి బింబం

నిశీధిలో శశి బింబం

సుందరమేనీ ముఖారవిందం

తొలిచూపులోనే వేసింది బంధం

అణువణువు నను తాకనీ నీ తనువు

మనసుకు మనసుకు జరుగనీ మనువు


1.నీ వాల్జడలో పూలమాలను నేనై

నీ పాపిట మెరిసే సిందూరము నేనై

నుదుటన వెలిగే తిలకము నేనై

నీ చెవులకు ఊగేటి జూకాలు నేనై

అణువణువు నను తాకనీ నీ తనువు

మనసుకు మనసుకు జరుగనీ మనువు


2.నీ సోగ కన్నులకు కాటుక నేనై

సంపంగినాసికకూ ముక్కుపుడకనై

నీ సొట్ట బుగ్గలకూ నునుసిగ్గు నేనై

మందార పెదవులకూ చిరునవ్వునై

అణువణువు నను తాకనీ నీ తనువు

మనసుకు మనసుకు జరుగనీ మనువు


3.శంఖమంటి కంఠాన నే వజ్రహారమై

నిను హత్తుకోగా బిగుతు రవికనేనై

నిన్నల్లుకోగా నేనే చెంగావి చీరనై

నీ నడుము చుట్టకోగా వడ్డాణమునై

అణువణువు నను తాకనీ నీ తనువు

మనసుకు మనసుకు జరుగనీ మనువు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బ్రతుకు మీద ఆశపుట్టగలదు 

కాటికి కాళ్ళు జాపుకున్న వారికైనా

రతిపట్ల ధ్యాస మరలగలదు

ఎటువంటి ఘోటక బ్రహ్మచారికైనా

యతిరాజుకైనా మతితప్పునే

యువతి నీరీతి అందగత్తెవల్ల

నీ పాదాక్రాంతులవరన్నది ఒప్పనే

పురుషజాతి సాంతం పుడమెల్లా


1.ప్రతి కాంత సృష్టిలోనె ఒకవింత

కాంచినంతనే కలుగును కవ్వింత

చెంతచేర్చుకోవాలని నిరంతరం చింతననే

చేరువైతె పులకింతనే దూరమైతె పెనుచింతనే

సౌగంధీ  ఆనందీ పరిమళ భరితమే నీ సౌందర్యం

విశ్వమంత విస్తరించె  నీ సోయగ సమ్మోహన సౌరభం


2.సుమ కోమల స్నిగ్ధ లావణ్యము 

మాలతీ లతా ముగ్ధ సౌకుమార్యము

చకితమె నీసొగసు అతులితమే నీ హొయలు

మంజులమే నీ గాత్రము నా కల నువు కళత్రము

సొంతమైతివా జీవితమంతా అనంతమౌ సంతసము

బ్రాంతివైతివా బ్రతుకంతా అవధులే లేని పరితాపము

Monday, May 3, 2021

 అలరులు అలరిన పొదరిల్లు

నవ్వుల వన్నెల హరివిల్లు

అనురాగం ఆవరించిన మా ఇల్లు

ఆనందంతొ అల్లుకున్న అందమైన బొమ్మరిల్లు


1.గారాల ముద్దులపట్టి మాబొట్టె

సిరులెన్నో కొనితేగ మాఇంట పుట్టె

నట్టింట నడయాడే సాక్షాత్తు మాలక్ష్మి

కూతురే  లోకంగా మా మనస్సాక్షి


2.ఆడింది ఆటగా నడిచిందే బాటగా

ఎదిగింది మా అమ్మాయి విరితోటగా

కోరికలను నొక్కిపెట్టి ప్రతిపైసా చదువుకె పెట్టి

 చదివించాము మా పాప మాటకే పట్టంగట్టి


3. ఉన్నట్టుండి ఉరుమేలేక పడిపోయే పిడుగేదో

ఆకర్షణ మైకంలో వేసింది తనయ తప్పటడుగేదో

మా ప్రేమలొ లోపముందో ఏ దేవుడి శాపముందో

జాలిమాని మా ఎడల పెడ దారిచూసుకుందే

అర్హతే లేనివాడితో అయ్యో లేచిపోయిందే


ఎండిన మండిన పొదరిల్లు

కన్నీళ్ళు పారెడి మా కళ్ళు

వేదనయే ఆవరించిన మా ఇల్లు

విషాదం పరుచుకున్న శిథిలమైన బొమ్మరిల్లు


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రక్తసంబంధమేనా ఇలలో అనుబంధము

మానవీయ బంధమే కదా బంధాలకెల్ల అందము

మందికొరకు పిలుచుకుంటె ఆలంబనమవుతాయా

వావి వరుసలే చెలియలి కట్టను కడతాయా

ప్రతివారిని ప్రేమించే హృదయం చాలదా

బూటకాల నాటకాల వంతెనౌ బంధం కూలదా


1.పైనపటారం లోనలొటారం మోసపు ముసుగులు

ఈర్ష్యాద్వేషాలతో మనిషి మనిషిలో లొసుగులు

దాచుకున్న కత్తులతో వెన్నుపోటు ఆలింగనాలు

అవకాశవాదంతో ఎదుటివాణ్ణితొక్కి ఎక్కు అందలాలు

ప్రతివారిని ప్రేమించే హృదయం చాలదా

బూటకాల నాటకాల వంతెనౌ బంధం కూలదా


2.చేటు లేదు శత్రువుతో మెలిగితే అప్రమత్తులమై

హానిలేది అపరిచితులమైనపుడు అనిమిత్తులమై

పయోముఖ విషకుంభాలే చాపక్రింది బంధాలు

గోముఖ వ్యాఘ్రాలే నమ్మించి వంచించే గంధాలు

ప్రతివారిని ప్రేమించే హృదయం చాలదా

బూటకాల నాటకాల వంతెనౌ బంధం కూలదా

 జాతికి జాగృత గీతమే భగవద్గీత

యువత దిశా నిర్దేశనమే కృష్ణగీత

మానవతా సందేశ యుతమే గీత

హైందవ సంస్కృతికాలవాలమే గీత

గీతను తలనిడి అడుగేస్తే బంగారు భవితరా

గీతాసారమే ఇహపర సౌఖ్యానికి పూబాటరా


1.జీవితమొక రణక్షేత్రం -అనుక్షణం అని అనివార్యం

వెనకడుగే నిషిద్దం సర్వదా యుద్దానికి సంసిద్ధం

నెగ్గినా ఓడినా  శిరోధార్యమేదైనా

ప్రయత్నించు అనవరతం ఫలితం చేదైనా

వ్యక్తులకన్న ముందు పరిస్థితే నీ విరోధి

నిన్ను నీవు గెలవడంలో నిజమైన విజయమున్నది


2.సహానుభూతితో కలుగదు నీకు ఏ అసహనం

విశాల భావాలతొ మారగలదు దృక్పథం

విశ్వసించు నిన్నునీవు సందర్భమేదైనా

అధిగమించు తడబడక ఏ సంకటమెదురైన

కర్తవ్యపాలనయే నువు చేసెడి దైవార్చన

సందేహ నివృత్తికి భగవద్గీతయే ఆలంబన



 తెల్లారుతోంది పొద్దుగ్రుంకుతోంది

కల్లలై పోసాగె నువ్వాడిన సుద్దులన్ని

ముద్దరాలా తగదిది నీకు పలికి బొంకడం

ఓ జవరాలా శోభించదు నీకు ఆడితప్పడం


1.నీ మాటను నమ్ముకొని ప్రతిపూట ఆశపడి

వేచిచూస్తున్నానే పిచ్చివాడిలాగా

నీ ఇబ్బందినేగని పెద్ద మనసు చేసుకొని 

ఓపిక పడుతున్నా నీ హితుడిగా

మాయచేస్తున్నావో మనసుపడుతున్నావో మర్మమే ఇంకా

ఆడుకుంటున్నావో వేడుకుంటున్నావో దైవానికెరుక


2.అనుకోని అతిథిలాగ ఎదురైనావెందుకో

ఆలావచ్చి ఇలావెళితె సరిపోయేది

నా గుండెకి కొక్కెమేసి నీవైపుకి లాగివేసి

గుండుసూదితో గుచ్చేవు న్యాయమా ఇది

పైశాచికానందమా  పడతి తత్వమా అగమ్యగోచరం

అనాదిగా మగజాతికి నాతీనీవల్ల తీరని అపచారం ఘోరం

Sunday, May 2, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:షణ్ముఖ ప్రియ


అభయకరం నీ శుభనామం శివశంకరం

భవభయహరం శివా నీ ధ్యానం పురహరం

అపమృత్యునివారణకరం వందే విశ్వేశ్వరం

సర్వవ్యాధి వినాశనకరం ప్రణతోస్మి పరమేశ్వరం

కేవల పంచాక్షరీమంత్రం రక్షాకరం మోక్షకరం 

ఓం నమః శివాయ ఓంనమః శివాయ ఓం నమంశివాయ


1.భూతనాథం లోకైకనాథం దిక్పతిం

అనాథనాథం శ్రీవైద్యనాథం  వృషపతిం

దీననాథం కాశీ విశ్వనాథం అహర్పతిం

భగీరథీ ప్రాణనాథం గంగాధరం ఉమాపతిం

కేవల పంచాక్షరీమంత్రం రక్షాకరం మోక్షకరం 

ఓం నమః శివాయ ఓంనమః శివాయ ఓం నమంశివాయ


2.నాగభూషణమ్ చర్మధారిణం త్రయంబకమ్

యోగి వేషిణం భక్తపోషణం విషాంతకమ్

శూలపాణినం పంచాననం త్రిపురాంతకమ్

శశిభూషణం మోదదాయినం కరోనాంతకమ్

కేవల పంచాక్షరీమంత్రం రక్షాకరం మోక్షకరం

ఓం నమః శివాయ ఓంనమః శివాయ ఓం నమంశివాయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గడిచింది గతమంతా- ఎదిరిచూపులోనే

కరిగింది యవ్వనమంతా-ఎడబాటులోనే

ప్రియతమా నా నేస్తమా

మన అడుగులు సాగేదెపుడో-బ్రతుకు బాటలో

పదిలమైన నా హృదయమా

మాధుర్యం చిలికేదెపుడో-నాతో జతగ పాటలో


1.సేదదీరు శుభఘడియేదో నీ ఎదపై

పవళించు పరవశమెపుడో నీ ఒడిలో

పసిపాపలాగా లాలించవే నన్ను

కనురెప్పలాగా పాలించవే నన్ను

అక్కున జేర్చుకోవే మిక్కిలి గారాబంగా

గ్రక్కున అరుదెంచవే అలరులు కురియంగా


2.ప్రణయ గోదారిలో నన్ను ఓలలాడనీ

  పాలకడలిలోన తలమునకలవనీ

కవ్వించి నన్ను కలతల్లో ముంచకు

ఊరించి నాలో ఉద్వేగం పెంచకు

మనసనేది నీకుంటే మరిజాగు సేయకు

ప్రాధేయ పడుతోంటే ఇక జాలిమానకు




నీ సుప్రభాతాలు గాలియలల తేలియాడి

చెవుల సోక పావన శుభోదయం

నీ కోవెల గరుడ ధ్వజ చిరుగంటల సవ్వడులే

మేలుకొలుప మంగళ శుభోదయం


1.శేషశైలవాసా శ్రీ శ్రీనివాసా నీదివ్య

దర్శమమవగా ధన్యమౌ శుభోదయం

గోవింద గోవింద యను నీ నామఘోష

భక్తి భావ మినుమడించ ఆహ్లాద శుభోదయం


2.నీ కరుణా కటాక్ష వీక్షణాలు మాపై

రోజంతావర్షించగ ఆనంద శుభోదయం

ఆయురారోగ్యాలు అందరికీ ప్రసాదించ

ధన్వంతరిరూపా జగానికే నవోదయం

మానవాళికే మహోదయం శుభోదయం

నేడే మేడే కార్మిక దినోత్సవగీతం



ఎత్తిన పిడికిలి సుత్తికొడవలి

చక్రం బాడిస కత్తి గొడ్డలి 

సమస్త కార్మిక సహస్ర రీతుల ఎత్తళి

ఘర్మజలాన్నే కందెనచేసి

యంత్రపుకోఱలు శ్రద్ధగతోమి

మానవ జీవన సౌకర్యానికి

 లోకుల విలాస  సౌలభ్యానికి

రక్తమునంతా చెమటగ వడిపే

 శ్రమైక కృషితో  ఫ్యాక్టరి నడిపే

ప్రపంచ కార్మికులారా మీకు సలాం

అహరహ శ్రామికులారా మీకు జయం


1.గనిలో పనిలో  కార్ఖానాలో

క్రీకర భీకర రణగొణ ధ్వనిలో

కనీస వసతులు కొఱవడుతున్నా

భరించలేని వేడికి వెఱవక

సహించలేని చలికీ జడవక

విషవాయువులనె శ్వాసగ పీల్చే

దుర్గంధముతో  రుచులను మరచి

ప్రమాదాలతో చెలిమే చేసే

మరణపు అంచులు నిత్యం చూసే

ప్రపంచ కార్మికులారా మీకు సలాం

అహరహ శ్రామికులారా మీకు జయం


2.చెల్లాచెదురౌ కార్మిక జాతిని

వివిధ వర్గాల శ్రామిక తతిని

ఒక్కతాటిపై నడువగ జేసి

సంఘటితంగా ముందుకి నడిపి

కార్మిక హక్కుల పోరే సలుపగ

ప్రపంచ కార్మిక ఐక్యత నెరుపగ

కార్మికోద్యమం క్రమతగ జరిపి

బలిదానాలకు వెనకడుగేయక

ఎగురెను నేడే మేడే అరుణ పతాక

రెపరెపలాడేను నేడే విజయ పతాక

ప్రపంచ కార్మికులారా మీకు సలాం

అహరహ శ్రామికులారా మీకు జయం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిద్దురపోతే కల్లో కొచ్చి

మెలకువలోను తలపులజొచ్చి

నిండిపోయావే నా మనసంతా

నేనే నీవైపోయానేమో అనేంత


1.చీమ చిటుకుమన్నా నీవే అనుకుంటున్నా

గాలితాకిపోతున్నా నీ కబురేదంటున్నా

ప్రాణవాయువై నన్ను బ్రతికించమంటున్నా

హృదయలయగ మారి నినదించమంటున్నా


2. వెచ్చించగ నాకోసం నిమిషమైన నీకుందా

యోచించగ నాకై క్షణమైన వీలౌతుందా

నూరేళ్ళ జీవితాన్ని నీ కంకిత మిచ్చేస్తా

మరుజన్మలోనైనా నీజతకై జన్మిస్తా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పగలు గడిచి పోయింది 

రేయి కరిగి పోతోంది

జాడైన కనరాదు జామురాతిరైనా

పాటైన వినరాదు గాలివాటుగానైనా

ఓపలేను నా ప్రియా నీ ఎడబాటు

తాళలేను నే చెలియా ఒక లిప్తపాటు


1.సరదానా ననుడికిస్తే ఓ చినదానా

నన్నాట పట్టిస్తే సంబరమా నచ్చినదానా

గుండె కోసి తెచ్చాను నీకిస్తా కానుగగా

వలపు మూట గట్టాను కుమ్మరిస్త శుల్కంగా


2.రోజులెన్ని మారాయో  తగ్గలేదు మోజసలు

దూరమెంత పెరిగిందో సడలలేదు మోహమసలు

తాడోపేడో తేల్చుకంటా ఈ పూటనే

తెగిపోతె అనుకుంటానే గ్రహపాటనే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ అందానికి పడిపోందెవ్వరూ?!

నీ పరువానికి దాసులే అందరూ

దివినుండి దిగివచ్చావో

కవిగుండె కల్పన నీవో

మనోహరి సుధామయి నీదృష్టి పడనీ నాపై

మిసమిసల మదాలసా సృష్టికే అపూర్వమై


1.వెన్నెలొలుకు కన్నుల్లో నను స్నానమాడించు

తేనెలూరు పెదవులనే తనివార అందించు

 విరులు తలవంచగా ఎన్ని వన్నెలో నీలో

మరులు కురిపించగా నాకెన్నెన్ని సైగలో

చూపుల్తొ రాసేస్తున్నావు ప్రేమలేఖలు

మాటల్లొ పలికిస్తున్నావు ప్రణయవీణలు


2.మాట ఇచ్చి తప్పకు ఎన్నడు నాతో

బాస చేసి మరువను ఎప్పుడు నీతో

ఆశగా వేచేనులే నీకై నా మనసు

అర్తిగా వగచేనని నీ కెలా తెలుసు

గొంతునులిమినట్లుండే నా తీవ్ర బాధ

గుండె మిక్సీలొ నలిగే విపరీతమైన వ్యధ



ఎంతగ నిను పొగిడాను

ఎన్నని  నిన్ను నేనడిగాను

ఉలకవు పలకవు నీవు ఓ బెల్లంకొట్టిన రాయి

కదలవు మెదలవు నీవు శ్రీ షిరిడీపుర సాయి

గుడిలోన కొలువైవున్న నీవో కొండరాయి

కన్నీటికైనా కరగని కరకు గుండెనీదోయి


1.నిత్యం అభిషేకాలు అందమైన వస్త్రాలు

గురువారమైతే చాలు ఊరేగ అందలాలు

షిరిడిసంస్థానమందు ఎన్ని రాజభోగాలు

ఊరూరా మందిరాలల్లో ఉత్సవాలె ఉత్సవాలు

ఫకీరువే నీకేలా సంబరాలు ఆర్భాటాలు

అవధూతవు నీకవసరమా ఈ వైభోగాలు


2.నమ్ముతూనె ఉన్నాను ఊహతెలిసి నప్పటినుండి

వేడుతూనె ఉన్నాను కష్టంవచ్చినప్పటినుండి

 ఏ విన్నపాన్ని విన్నదైతె ఎన్నడు లేదు 

 ఏ కోరిక తీర్చిన దాఖలాయే కనరాదు  

 అడుగడుగున ఆటంకాలు నోటికందకుండా

అనుభవించు గతిగనరాదు లేకనే నీ అండ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిత్యం పలకరింపులే లేక

నగవుల చిలకరింపులూ లేక..

ఊపిరాగి పోతోందే..గొంతునొక్కినట్టూ

గుండె నలిగిపోతోందే రోట దంచినట్టూ

నేస్తమా నీవే నా సమస్తము

అనుకుంటే ఇంతేనా నా ప్రాప్తము


1.ఊసైనా వినలేక ,ఊహైనా కనరాక..

పట్టలేకా విడవలేకా దూరమౌతూ భారమౌతూ

సతమతమైపోంది పండంటి బ్రతుకే

చేరుతుంది చేరువలోనే మండేటి చితికే

నేస్తమా నీవే నా సమస్తము

అనుకుంటే ఇంతేనా నా ప్రాప్తము


2.తమాషగా ఏర్పడలేదు మన మధ్య బంధము

అషామాషీ అనుకోలేదు నీతోటి స్నేహము

విధిమనని కలిపింది పరమార్థమేదో ఉంది

మన సంగమ నిమిత్తమేదో ఉత్కృష్టమవనుంది

నేస్తమా నీవే నా సమస్తము

అనుకుంటే ఇంతేనా నా ప్రాప్తము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీళ్ళొదులుకుంటే మేలు నీతో స్నేహానికి

చరమగీతం పాడితె ఇకచాలు మన చెలిమికి

పట్టించుకోనపుడు  పట్టుబట్టి పట్టిపట్టి వెంటపడతావు

పరిచయాన్ని పెంచుకోబోతే ముఖం కాస్త చాటేస్తావు


1.ఎండమావిలోనైనా నీరుండవచ్చేమో

ఇంద్రధనుసునైనా అందుకోవచ్చేమో

ఉసూరనిపిస్తుంది నీతో చేసే మైత్రి

వృధాప్రయాస మాత్రమే నా అనురక్తి


2.చేయీచేయి కలిపితేనే అది స్నేహితం

మనసు మనసు ఒకటైతేనే భవ్య జీవితం

ఉబుసుపోక కట్టేవన్నీ గాలి మేడలే

సరదాకై గడిపితె బ్రతుకులు చట్టుబండలే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సైచలేను నేను సై అనని నీ మౌనాన్ని 

మరచిపోలేను జన్మల మన ప్రణయాన్ని

ఓపలేను విరహాన్ని మానలేను నీ ఊహల్ని

ఎంతకష్టం ఈ ప్రేమికుడిది ఓ చెలియా

బ్రతుకలేక చావలేక అనుక్షణం నా ప్రియా


1.తటపటాయిస్తావు ఔననడానికి 

వెనకంజవేస్తావు కాదనడానికి

అనురాగం నిండిన నీహృదయం

మానసమేమో డోలాయమానం

తాత్సారమెందుకు పచ్చ జెండాకై

తర్కించగా తగదు స్వచ్ఛమైన ప్రేమకై


2.బంధనాలు త్రెంచుకో మన అనుబంధానికి

రెక్కలను విప్పుకో నింగికి నీవెగరడానికి

చేరుకుందాము సరికొత్త స్వర్గాలే

మనంవేసె అడుగుల్లో మల్లెపూల మార్గాలే

మేడకడతా మనకై స్వప్నాల పొలిమేరల్లో

పడకనౌతా నీకై పండువెన్నెల రాత్రుల్లో