Saturday, June 11, 2022

 కానుకగా నీకీయనా నగిషీలు కలబోసిన పసిడి గాజులను

బహుమతినందీయనా మెరిసే రవ్వలు పొదిగిన హారాలని

అలంకరించనా మంజులమగు నీ పదాల స్వర్ణ మంజీరాలని

మణిమయ మకుటమే తలనుంచనా విశ్వైక సుందరి నీవేనని


1.జాంబవంతునితో పోరి కొనితేనా భామామణీ శమంతకమణిని

బొందితోనే అమరావతి చేరి ఎత్తుకరానా పారిజాత తరువుని

ఇంద్ర ధనుసునే దించి చీరగ అందించి

నందింప జేయనా డెందముని

అలకాపురినే నీపరం చేసి మురిపింపగజేయనా నీ మురిపెముని


2.కోహినూరు వజ్రమే నీవైతే మరొకటెలా సంపాదించను

తాజ్ మహల్ సౌందర్యం సరిరాదే

అద్భుత హర్మ్యమేది నిర్మించను

మానవ సాధ్యమేదైనా తులతూగదు

కానుకనీయగా నీ జన్మదినమును

నభూతోనభవిష్యతి నామతి నీకెపుడో ఇచ్చేసితిగా నా మనమును






 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నాకము నరకమని మరి లేవు నరునికి 

శోకము సౌఖ్యము ఏకమే నీ భక్త వరునికి

నిశ్చింతయు నీ చింతయు అపర స్వర్గ ధామము

ఆరాటము అసంతృప్తి అవనిలొ యమ లోకము

నడుపుము నను గోవిందా నీ దివ్య పథము

తిరువేంకటనాథా నిను వినా వలదే పరమ పదము


1.ఋణము తీర్చుకొనుటకే సతీ సుతుల బంధాలు

వడ్డీకి వడ్డీ వేసి గుంజుకొని నంజుకతిను చందాలు

దృష్టిని నీనుండి మరలించెడి మోహ గంధాలు

నీటి బుడగ నిలుచునంత సేపటి ఆనందాలు

నడుపుము నను గోవిందా నీ దివ్య పథము

తిరువేంకటనాథా నిను వినా వలదే పరమ పదము


2.వ్యాధులుగా బాధించును పూర్వజన్మ పాపాలు

వెంటాడి వేధించును ఆనాటి అర్భకులిచ్చిన శాపాలు

అశాంతి అలజడి వత్తిడి నిలువెల్లా దహించు తాపాలు

అడుసు త్రొక్కి జలము కోరునటుల ఈ పరితాపాలు

నడుపుము నను గోవిందా నీ దివ్య పథము

తిరువేంకటనాథా నిను వినా వలదే పరమ పదము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువు చెప్పిందేమిటి సాయి

మరి చేస్తున్నదేమిటి సాయి

నీ మాటకు చేతకు పొంతన ఐతే లేదోయి

కరుణను మాత్రం వర్షిస్తుంది నీకనుదోయి

సాయిబాబా షిరిడీ సాయిబాబా

ఎంతకాలం నీ గారడీ సాయిబాబా


1.షిరిడీలో అడుగిడితే రావంటివి ఆపదలు

నా సమాధి తాకినంత  తొలగునంటివి వేదనలు

తలువగనే పిలువగనే వచ్చెదవన్నవి అనృతాలు

నమ్మితె కోర్కెలు తీర్చెదవన్నవి కోతలే కోతలు


2.శరణన్నవారికి దక్కేదేముంది నేనే ఉదాహరణం

దిక్కునీవని మ్రొక్కేవారి భారం మోసావ ఏదీ తార్కాణం

ఆదుకున్నదీ చేదుకున్నదీ లేదన్నదే

నా ఆరోపణం

త్రికరణ శుద్ధిగ విశ్వసించాను చేయాలి నీవే నిజనిర్ధారణం