Monday, August 26, 2019

మోముదాచుకున్న ఓ మోహనాంగి
నీ మేని మెరుపు దబ్బనిమ్మపండుభంగి
మబ్బుచాటు చందమామ చూశాడు తొంగితొంగి
గులామయీ సలాముచేసె వంగి వంగి

1.నీ నవ్వులు సంతూరు సంగీతం
నీ పలుకులు కుంతాల జలపాతం
నీ అధరాల ఆస్వాదన అమృతం
నిను పొందితె నా బ్రతుకే సరసగీతం

ముట్టుకుంటె ముడుచుకునే కోమలాంగి
నీ మేని నునుపు లేత తమలపాకు భంగి
తుళ్ళిపడే నిన్నుతాకి  గులాబి రేకు
రాలిపడే తనకుతానే తాళలేక నీ సోకు

2.లోకాన అతి మధురం నీతో ఏకాంతం
గడిచేను క్షణమోలె యుగాలు సాంతం
ప్రత్యక్షమవవే  నాకై సఖీ అమాంతం
అంకితమైపోతానే నాజీవిత పర్యంతం

చిలిపి లిపితొ  చూపువిసురు చిత్రాంగి
నీకంటి భాష అంతుపట్టలేని భంగి
మతిచలించి పోయింది భారతిపతికి
నా మీద ప్రయోగిస్తే నే చేరేద నేగతికి
పోతపోసిన పసిడిబొమ్మా ఓముద్దుగుమ్మా
ఆశరేపకు మర్మమెరుగని వాడనమ్మా నే మోడునమ్మా
పరికిణీ ఓణీలతో ఇనుమడించెను నీ అందం
తెలుగుదనమే ఉట్టిపడగా చూసినంతనె ఆనందం

1. పొడుగాటి జడకు జడకుప్పెలు
తలనిండ తురిమిన సిరి మల్లెమాలలు
నర్తించి మురిసెడి చెవి బుట్టలు
పాదాల ఘలు ఘల్లనెడి పట్టీలు
బ్రహ్మ అచ్చెరువొందు శిల్పమే నీవు
బాపు కుంచెన చిందు చిత్రమే నీవు

2.క్రీగంటి నీ చూపులే మన్మథుడి తూపులు
సిగ్గులొలికెడి నగవులే ముత్యాల జల్లులు
నిదుర హరియించు నీ తలపులు
మధువులే చిలుకును నీ పలుకులు
అందబోకమ్మ నాకెపుడు ఓ చందమామా
ఆరాధించెదను సౌందర్యరాశిగ ఓ దివ్యభామ

శంభో  హరహరా
మనోహర హరా
త్రిపురాసుర సంహరా హరా
త్రిభువనైక ఈశ్వరా భవహరా
కరుణాకరా శంకరా
అంజలింతు నీకిదే శుభకరా

1.మురిపెము తోడ పార్వతమ్మ
నలుగుపిండితో చేసెగ బొమ్మ
ఆయువునొందే ఆ బాలకుడై
అమ్మ ఆనతిన కాచె ద్వారపాలకుడై
ఎరుగక నిన్నే నిరోధించగా
ఆగ్రహమును నువు తలను ద్రుంచగా
ఆలి దుఃఖమును బాపగబూని
కరిశిరమతికి కనికరించితివి గణపతిని

2.దేవగణముల  వినతి మేరకు
కుమారసంభవ శుభ కామనకు
చెఱకు వింటి వేలుపు
వేయగ నీపై సుమాల తూపు
తపోభంగముతొ సోకక నీచూపు
కాముని దహించె నీ కనునిప్పు
పరమేశ్వరా నా అరిషడ్వర్గము తెంపు
దోషము బాపి కలిగించ కనువిప్పు