Wednesday, February 10, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సైగతొ రమ్మంటావు-మాటతొ పొమ్మంటావు

వస్తే జారుకుంటావు-పోతే  జాలిగొంటావు

అదేంటో ప్రియతమా నీ వాలకం

నీ హృదయమయ్యిందా ఒక లోలకం


1.చేరువకాబోతే  మూతివిరుపులు

దూరంగా జరిగితే వలపు పిలుపులు

కబురంపుతావు కపోతాలతో

కలలోన దూరుతావు వరమాలతో

 అదేంటో ప్రియతమా నీ వైఖరి

అర్థమై చావదు  నీదైన ఈ శైలి


2.వెళ్ళబోస్తావు నాతో నీ వేదనంతా

సాయపడగ వద్దంటావు ఇసుమంతా

వినకుంటే విసుగేల నీకు

మనసుకింక ముసుగేయకు

అదేంటో ప్రియతమా నీతత్వము

సాంత్వనకోసమేనా ప్రతి నేస్తము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాలు నా లోపాలు నీకె అందించెదరా

రోలు నా చిత్తము నిను బంధించెదరా

వెన్ననే నా మనసు ఇంక అపేక్షించరా

నా కన్నుల యమునవంక విహరించరా

జగన్మోహన కృష్ణా నను గ్రహించరా అనుగ్రహించరా


1.వలువలు నా వాంఛలు సంగ్రహించరా

చిలువలు పలువలు వలపులు నిగ్రహించరా

కాళీయునివంటివి నా కామనలు మధించరా

కబళించే రిపులార్గురు తక్షణమే వధించరా

జగన్మోహన కృష్ణా నను గ్రహించరా అనుగ్రహించరా


2.గోవులు నా ఇంద్రియాలు పాలించరా

కుబ్జయే నా వక్ర బుద్ధి చేరి లాలించరా

రాధికగా ఎంచి నాతో రతి కేళించరా

సుధామునిగ భావించి నన్నుద్ధరించరా 

జగన్మోహన కృష్ణా నను గ్రహించరా అనుగ్రహించరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

*కీర్తన*


పల్లవి:

కామితార్థదాయకా సంకటనాశకా

కనికరముమీర కావరా వరసిద్ధి వినాయకా


చరణం: 

ప్రథమ పూజగైకొనుమా ప్రమథాధిపా

నిరతము నిను మదిని దలుతు వికటరూపా

సాష్టాంగ ప్రణతులివే సామజ వదనా

సంతుష్టిని ప్రసాదించు సంతోషీ నాయనా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


విరహిణి ఈ విరిబోణీ

మురహరినే కూడ కోరి

అరవిరిసిన ఆ విరుల

భ్రమరాలు వాల సంభ్రమంగ

ఆవిరులే రేగిపోగ వేచె అవిరళంగా


1.అలనాటి బృందావన రాధికగా

కలలుగన్న రేపల్లె గోపికగా

ఎదనే పరిచింది పడకగా

యుగాలె వేచింది ఓపికగా

గోవిందుడు రాడేమని విభ్రమంగా

ఆవిరులే రేగిపోగ వేచె అవిరళంగా


2.మీరాలా అనురక్తి మీరగా

అనవరతం భక్తి ఇనుమడించగా

అంతర్యామితో సఖ్యత మించగా

అంతరాన  రక్తితో  రమించఎంచగా

ముకుందుడి జాడగనక అలజడిగా

ఆవిరులే రేగిపోగ వేచె అవిరళంగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అందమైన పాదాలు అతివకు అదనపు మవ్వం

ఆ పాదాలకు మంజీరాలే మరి మరి వైభవం

మంజీరాలకు మంజులనాదం కూర్చేను నవజీవం

మంజులనాదమె ఎదలో రేపును ప్రణయభావం


1.తీర్చి దిద్దిన పారాణి పదముల సొబగు

పారాణి అరుణీమయే ముచ్చట గొలుపు

అరుణిమ బుగ్గల సిగ్గుగ మారి పెంచును సొంపు

సిగ్గులొలికే ముద్దరాలే అయస్కాంతమై ఆకర్షించు


2.గోరింటాకే చరణాలకు ఎంతటి ఇంపు

చరణాల చిత్రించిన చిత్రాలే సొగసుకు పెంపు

చిత్రంగా కోమలి పావర ముద్దాడాలనిపించు

కోమలి కోమల అడుగులకు మడుగులొత్తాలనిపించు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తుర్రు పిట్టలా మాయమౌతావ్ -వచ్చీరాగానే

రామచిలుకలా జారుకుంటావ్-జాతకమిస్తూనే

మెరుపుతీగలాగ నీవు-మెరిసి వెళ్ళిపోతావు

స్వాతి చినుకువైనీవు-కురిసి వెలిసి పోతావు

ఎలా నిన్ను పట్టుకోనూ వలపుల వలన

ఎలా నిన్ను పెట్టుకోను నా ఎదమాటున


1.నువ్వు తోడుగా ఉంటే అనుక్షణం పాటలే 

నువ్వంటూ లేనినాడు  చెప్పని రాని పాట్లే 

అలా అలలా పొంగి వస్తుంది కవ్విస్తూ కవిత్వం

ఇలా ఇలలో నందనవనిలా మారుస్తూ జీవితం

ఎలా నిన్ను పట్టుకోనూ వలపుల వలన

ఎలా నిన్ను పెట్టుకోను నా ఎదమాటున


2.బీడైన గుండెల్లో  పండిస్తుంది కైత కలలు పంటలు 

మోడైన తలపుల్లో  వేయిస్తుంది ఆశల చివురులు

కడలేని ఎడారి దారుల్లో అనునయాల ఒయాసిస్సై

ఎడతెగని చీకటి రాతిరికి ఊరడించు తొలి ఉషస్సై

ఎలా నిన్ను పట్టుకోనూ వలపుల వలన

ఎలా నిన్ను పెట్టుకోను నా ఎదమాటున