రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం:అమృత వర్షిణి
గానానికి పోస్తారు ప్రాణం
గాయనీ గాయకులందరు
గానమే మానవరూపమెత్తితే
మాననీయ మానినీ శ్రియా అది నీవందురు
శ్రవణాలకు మకరందం నీ గాత్రం
నా మనసుకు నవనీతం నువు పాడే ప్రతి గీతం
1 .కోయిల శిలాసదృశమాయే నీ పాటకు
భ్రమరమే భ్రాంతినొందె నీ గళమొలికే తేనె తేటకు
అన్నపానాదులే నాకు నీ పాటలు పూట పూటకు
స్ఫూర్తికారకాలు ఉత్ప్రేరకాలు నా ప్రగతి బాటకు
శ్రవణాలకు మకరందం నీ గాత్రం
నా మనసుకు నవనీతం నువు పాడే ప్రతి గీతం
2.గంధర్వులు గురువుగా నిను స్వీకరించిరి
నారద తుంబురులు నీతో ఓటమి నంగీకరించిరి
సరస్వతి వారసత్వమే నీదని సురలు పురస్కరించిరి
సంగీతామృత సమాగమం నీవుగా నరులు కీర్తించిరి
శ్రవణాలకు మకరందం నీ గాత్రం
నా మనసుకు నవనీతం నువు పాడే ప్రతి గీతం