Thursday, July 2, 2020


"తస్మాత్ జాగ్రత జాగ్రత"

అనుకోని అతిథి కాదు
అనూహ్యమైన ఆగంతకుడూ కాదు
రాక తప్పని మృత్యుదూత
పడక తప్పదు దానివాత
వస్తుందా ఛస్తుందా అనుకోకు మిత్రమా
నాకైతే సోకదని భావించకు నేస్తమా
మినహాయింపేమి లేదునీకు ప్రియతమా
కనికరం లేనిదే కరోనా
నిర్లక్ష్యానికి మరణమే జరిమానా

1.జాగ్రత్తగ ఉన్నా తప్పుకొనగ కష్టము
ఏమరుపాటైతే కరోనా కడు స్పష్టము
నవ్వులాట కాదు నీదీ నీవారి జీవితం
తిరిగిరానిదొక్కటే మనిషి ప్రాణము
కనికరం లేనిదే కరోనా
నిర్లక్ష్యానికి మరణమే జరిమానా

2.మొక్కుబడిగ పెట్టుకొనే మూతి మాస్కులు
ముక్కువరకు తెరిస్తే తొలగవసలు రిస్కులు
చీటికి మాటికి బయటకొచ్చి ఏల వేస్ట్ హస్కులు
అత్యవసరాలు వినా మాను అన్ని టాస్కులు
కనికరం లేనిదే కరోనా
నిర్లక్ష్యానికి మరణమే జరిమానా

3.నువ్వులు ఆవాలు తప్పని సరి డైట్ కై
నిమ్మ నారింజలు తినాలి  విటమిన్ సి కై
పెంచుకొనే కృషిచెయ్యి  బాడీ ఇమ్యూనిటి కై
భౌతికదూరమొకటె కరోనరహిత కమ్యూనిటి కై
కనికరం లేనిదే కరోనా
నిర్లక్ష్యానికి మరణమే జరిమానా

4.వెంటాడి అంటకునే వింతవ్యాధిది సునో నా
అంటుకుంటె అంతుచూచు వైరసీ కరోనా
లంగ్స్ పగిలి ఊపిరాగి  చిత్రవధతొ  మరో నా
హెచ్చరికలు ఆచరిస్తే కిసీసే కభీ భీ డరో నా
కనికరం లేనిదే కరోనా
నిర్లక్ష్యానికి మరణమే జరిమానా



సాయీ అని పిలిచిచూడు
ఓయీ యని పలుకుతాడు
బాబా అని శరణు వేడూ
కంటికి రెప్పలా కాపాడుతాడు
సాయీ సాయీ సాయీ
బాబా బాబా బాబా

1.మనసారా సాయిని స్మరించు
తక్షణమే నీముందు అవతరించు
నోరారా బాబా యని భజించు
జన్మాంతర పాపాలూ అంతరించు
సాయి ధ్యాసయే ఒక యోగము
చేసుకో అనుక్షణం సద్వినియోగము
సాయీ సాయీ సాయీ
బాబా బాబా బాబా

2.సాయి సేవచేయుచూ తరించు
సకల భాగ్యాలు తాముగా వరించు
బాబా బోధలనే సదా ఆచరించు
బ్రతుకు నల్లేరు నడకయని గ్రహించు
సాయి సన్నిధే పరమ పెన్నిధి
బాబా అనుగ్రహమే జీవిత పరమావధి
సాయీ సాయీ సాయీ
బాబా బాబా బాబా
మొకమే సూపించక సాటేయ వడ్తివి
మొత్తుకున్నా పెడసెవిన మాట పెట్టవడ్తివి
రంగమ్మా నీ నంగనాచి నాటకాలు సాలుసాలు
నా గుండెకాయ నీదేనని తెల్సుకుంటె మేలుమేలు
మూణ్ణాళ్ళ ముచ్చటాయే ముద్దుమురిపాలు
నూరేళ్ళ పంటకదే అల్లుకుంటె మన బతుకులు

1.మోటబావికాడ నాకు సైగలేవొ జేస్తివి
సేనుగట్టుకాడ నీ సేయినాకు తగిలిస్తివి
ఏపసెట్టు నీడలోన నడుమొంపును సూపిస్తివి
మంచెమీద నీ పెయ్యిని మంచమల్లె పరిస్తివి
మూణ్ణాళ్ళ ముచ్చటాయే ముద్దుమురిపాలు
నూరేళ్ళ పంటకదే అల్లుకుంటె మన బతుకులు

2.మావితోపుకాడికైతె మరిమరి రమ్మంటివి
 దాచుకున్న రెండు పళ్ళు నాకని తీసిస్తివి
ముద్దుగుమ్మ గుమ్మపాలు కమ్మగ తాపిస్తివి
సావకుండ సర్గమేంటో సవిసూపిస్తివి
మూణ్ణాళ్ళ ముచ్చటాయే ముద్దుమురిపాలు
నూరేళ్ళ పంటకదే అల్లుకుంటె మన బతుకులు