Tuesday, April 12, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మానవ అవతారమెత్తిన అమ్మోరువో

నిండైన దైవత్వం నింపుకున్న దేవేరివో

కదలదు నా దృష్టి క్షణమైన నీనుండి

కరుణించావు నేకన్న కలలు పండి


1.తిలకము మీద చూపు సారించునంతలో

కనులే చేసేను కనికట్టులేవో

నయనాల మత్తులో మునిగిపోయేంతలో

అధరాల అరుణిమే రేపేను ఆకర్షణలేవో

సాక్షాత్తునీవే సౌందర్య లహరివే

ప్రత్యక్షమైన అపర పరమేశ్వరివే


2.ముక్కెర ఒక్కటే కొక్కెము వేసేను చిక్కగ నా దృక్కులకు

చక్కని నీ నగవే హాయిని గొలిపేను మిక్కిలి హృదయముకే

పంచభూతాత్మికవు ప్రపంచ ఏలికవు

శాంతించిన కాళికవు ఆనందపు గుళికవు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సూదంటురాళ్ళు చక్కని నీ కళ్ళు

చూసేకొద్ది పుట్టు ఎదలో ఎక్కిళ్ళు

కవి తల వెలిసే కవితల పుట్టిళ్ళు

స్వప్న సౌధాలకే అందాల లోగిళ్ళు

దనివారదు నిను గాంచ రేయింబవళ్ళు


1.కొత్తగా చూస్తున్నా కలువలకున్న ముళ్ళు

విస్తుపోతున్నా  మీనాలాయే నీలొ నర్తించే నెమళ్ళు

గులాబీలు పూస్తున్న  చిత్రమైన చెక్కిళ్ళు

అంతలోనె నవ్వుతుంటె బుగ్గల వింత సొట్టళ్ళు

దనివారదు నిను గాంచ రేయింబవళ్ళు


2.నడుమొంపులోనా సెలయేటి పరవళ్ళు

నాభి కనగ సహకరించు దోపిన కుచ్చిళ్ళు

ఆరావళి మేరుగిరుల ఇరుపక్కల ఆనవాళ్ళు

మంటలేక చలికాగగ బాహుబంధ నెగళ్ళు

దనివారదు నిను గాంచ  రేయింబవళ్ళు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పలుకనీ పలుకనీ పలుకని నా నాలిక

పలుకనీ పలుకనీ పలుకలేని గొంతుక

పలుకనీ పలుకనీ భవతారకమౌ నీ మంత్రాలిక

పలుకనీ  సదా పరవశమొలికించెడి నీ నామాలిక

పలుకీయమనుట పలుకనీయమనుట

ఔతుందా స్వామీ గొంతెమ్మకోరిక


1.పలుకనీ నా పలుకులు నిను స్మరియించగా

పలుకనీ నా తలపులు నిను స్ఫురియించగా

పలుకనీ నా చూపులు నిను స్పృశియించగా

పలుకనీ నా పలుకులు నేనిక తరియించగా

పలుకీయమనుట పలుకనీయమనుట ఔతాయా స్వామీ హిరణ్యాక్షవరములిక


2.పలుకనీ నా పలుకులు నీపై తేనియలొలుకగా

పలుకనీ నా పలుకులు నీ మేన గంధము చిలుకగా

పలుకనీ నను నిన్నే మనోవాక్కాయ కర్మలలో

పలుకనీ  నిన్నే అజన్మమొందుదాక జన్మజన్మలలో

పలుకీయమనుట పలుకనీయమనుట 

ఔతుందా స్వామి త్రిశంకు స్వర్గమంటి బ్రాతిక

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గోవిందనాముడు సుందర వదనుడు

అరవింద నేత్రుడు నిజ భక్తవరదుడు

ఎందుగానరానివాడు డెందమందె ఉంటాడు

సందుదొరికితెచాలు బంధనాలు వేస్తాడు

వందనాలు వందనాలు ముకుంద మురారికి

సాష్టాంగ వందనాలు శంఖ చక్రధారికి


1.ఉన్నచోట ఉండనీయడు తిన్నగా యోచించనీయడు

ఎండమావుల వెంట పరుగులు తీయిస్తాడు

 రాయిలాగ ఉలకడు పలకడు రాలుగాయి కొండల రాయుడు

రాగద్వేషాల వలలొ చిక్కుబడగజేస్తాడు

వందనాలు వందనాలు ముకుంద మురారికి

సాష్టాంగ వందనాలు శంఖ చక్రధారికి


2.మాయలెన్నొ చేస్తాడు మత్తులోన ముంచేస్తాడు

చెడ్డదార్లు తొక్కేలా మనల మభ్య పెడతాడు

మా దొడ్డ మారాజు మా వడ్డికాసులవాడు

దీనులకిల దిక్కైన ఆపద మొక్కులవాడు

వందనాలు వందనాలు ముకుంద మురారికి

సాష్టాంగ వందనాలు శంఖ చక్రధారికి