Sunday, May 15, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎప్పుడు నీ మూల్యం కుటుంబాన శూన్యమై పోతుందో

ఎప్పుడు నీ ఉనికి నీ ఇంట కంటగింపుగా మారుతుందో

ఎరగుమా నేస్తమా ఆరంభమైనదని నీ మహాప్రస్థానం

తెలుసుకో మిత్రమా నువు చేరావని నీ చరమాంకం


1.అవసరాలు నెరవేర్చే ఆర్థిక వనరుగా

ఇంటిపనుల తీర్చేందుకు నీవో నౌకరుగా

పరిగణింపు ఎప్పుడు మొదలౌతుందో

దబాయింపు అదే పనిగ నసపెడుతుందో

ఎరుగుమా నేస్తమా నీవిక ఒంటరి బాటసారివేనని

తెలుసుకో మిత్రమా నీవొక శాశ్వత పనివాడివైనావని


2.సుద్దులు నేర్పుతుంది రోజూ నీ శ్రీమతి

హద్దులు పెడుతుంది నిన్నన్నిట నీ సంతతి

నీ ప్రతిచర్యను విసుక్కొంటు నీవారెన్నడు తలచేరో

వదిలించుకునే గుదిబండగ నిను సతిసుతులెపుడెంచేరో

ఎరుగుమా నేస్తమా నువు చనుటకు వేళయ్యిందని

తెలుసుకో మిత్రమా నీ కనుమరుగే ఇలకు

మేలయ్యిందని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆత్మన్యూనత మనకు అతిపెద్ద రుగ్మత

ఆత్మస్తుతి పరనింద కాదు సభ్యత

యథాతథపు జీవితం తథాగతుని ప్రశాంతం

ఆచరణాత్మకం అనునిత్య సాధనతో సుసాధ్యం


1.ప్రతిభ ఎంతొ దాగి ఉంది ప్రతివారిలో

సానబెడితె వజ్రమై వెలుగులీను జగతిలో

తటపటాయింపులే మానుకోవాలి ఇక

మొహమాటాలకు ఏనాడూ తావీయక

ఉన్నదేదొ ఉన్నది జన్మతః అబ్బినది

చొరవవల్లనే కదా ఎల్లరకూ ఎరుకయేది


2.సహృదయులే కదా మనతోటి వారంతా

ప్రోత్సహించు మిత్రులుండ మనకేల చింత

సహజమే ఎవరికైన గుణదోషాలిలోనా

తలదాల్చగ సిద్ధమే సద్గురువుల సూచన

సంగీతము సాహిత్యము కవలపిల్లలు

ఆనందం పంచుటకై లేవు మనకు ఎల్లలు


PIC courtesy: Agacharya Artist sir