Thursday, September 10, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఊహల ఊయలలో ఊగుతున్నావో
ఆశల పల్లకిలో ఊరేగుతున్నావో
కనవేమి ముందు నిలుచున్నా వాస్తవాన్నై
పట్టించుకోవేమి వెంటపడుతున్నా నీ నీడనై
నీ దారి దక్షిణం నా తావు ఉత్తరం
కలిసామంటే మాత్రం ఇలలోనే విచిత్రం

1.గాలిమేడలు కోరు వాలకం నీది
పూరిగుడిసెలొ లోలకం నామది
స్వప్న ప్రపంచంలో నీ విహారం
ఒడిదుడుకులతో నా సంసారం
నీ దారి దక్షిణం నా తావు ఉత్తరం
కలిసామంటే మాత్రం ఇలలోనే విచిత్రం

2.పట్టేవదలని మొండిఘటం నీవు
పట్టూవిడుపుల గాలిపటం నేను
అలభ్యతన్నది ఎరుగదు నీ నిఘంటువు
పొందిన దానితొ తృప్తి పడటమే నా రేవు
నీ దారి దక్షిణం నా తావు ఉత్తరం
కలిసామంటే మాత్రం ఇలలోనే విచిత్రం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

దగ్గరకే రాబోకు ఓ దగ్గమ్మా -కరోనాతో నువు కూడి మరీ
త్వరబడకే ఊరికే తుమ్మమ్మా-కోవిడ్ తో చేరి ఈ తూరీ
తోకను చూసి  బెదరాలి బెబ్బులిగా -బలిపశువై పోవద్దంటే
అప్రమత్తంగ మెలగాలి-బ్రతికి బట్టకట్టాలంటే

1.ఎర్రతివాచీ పరుస్తుంది శరీరాన పెరిగే జ్వరము
గొంతంతా తిమతిమలాడును దగ్గుతొ సత్వరము
ఊపిరేభారమౌతు ముక్కుమూసినట్టౌతుంది
చమటలే పట్టేస్తూ ఉక్కిరిబిక్కిరైపోతుంది
వేళమించిపోకముందే మేలుకుంటె మేలుమేలు
చేజార్చుకోకుండా చక్కబర్చుకోవాలి పరిస్థితులు

2.పోరునే గెలిపిస్తుంది బలవర్థక ఆహారం
ఎదురొడ్డినిలుస్తుంది అనునిత్య వ్యాయామం
అవిరులు కషాయాలు శ్వాసనే తేలిక పరచు
ఆత్మవిశ్వాసం వీడకుంటే అదే గట్టునెక్కించు
స్వీయగృహనిర్బంధమే శ్రీరామరక్ష ఎల్లరకు
ఆచితూచి అడుగేస్తే అంతమేగా కరోనాకు