Friday, July 31, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎన్నాళ్ళైందో గుండెనిండా గాలిపీల్చి
ఎంతకాలమైందో బ్రతుకుపట్ల భయం మరచి
అడుగుతీసి అడుగువేస్తె కరోనా పంచన
ఏమరుపాటేమైనా మరణం అంచున
మనదీ ఒక బ్రతుకేనా నిత్యం ఛస్తూ
మనకూ ఇక భవితుందా ఆంక్షలన్ని భరిస్తూ

1.రోజు గడుపుతున్నాం గతస్మృతులను నెమరువేస్తు
బ్రతుకువెళ్ళదీస్తున్నాం అద్భుతాలనూహిస్తూ
విందులూవినోదాలు ఎపుడో బందైనాయి
బంధాలు ఇంటికే బంధీలైపొయినాయి
మనదీ ఒక బ్రతుకేనా శ్వానాల్లా స్వేఛ్ఛేలేక
మనదీ ఒక బ్రతుకేనా శవాల్లా ఇఛ్ఛే లేకా

2.పండగ పబ్బము పెండ్లీ పేరంటాలన్నీ మృగ్యము
ఎన్నడూలేనంతగా శ్రద్ధవహించాలి ఆరోగ్యము
సినీహాళ్ళు షికార్లు దుర్లభమైనాయి
స్నేహాలు మోహాలు పరిమితమైనాయి
మనదీ ఒక బ్రతుకేనా లక్ష్యమే శూన్యమై
మనదీ ఒక బ్రతుకేనా  గమ్యమే దైన్యమై

SRI.V.JANAKIRAMARAO' POST inspiration

https://m.facebook.com/story.php?story_fbid=4169565813118855&id=100001964310859
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:ముల్తాన్

కొడుకునైనా కాచలేక తల్లికెంత తపన
అమ్మ ఆతృత కానలేక బిడ్డకెంతటి వేదన
సంసార సాగరంలో ఉన్నఫళమున పడవ మునక
బిక్కుబిక్కని బిక్కచచ్చిరి దిక్కుదెసనే తోచక

1.కార్చిచ్చే కాల్చివేసెనొ-వరదలొచ్చే ఊరు ముంచెనొ
అయినవారికి దూరమైనా-బ్రతుకు వారికి భారమైనా
భవిత సంగతినెరుగకున్నా-దారితెన్నూ తెలియకున్నా
పయనమైరీ కాలమే చేర్చు తీరానికి
సాగసాగిరి దైవమే కూర్చు గమ్యానికి

2.ఒంటిపైని బట్టమినహా-చేతబట్టిన పొట్టతోసహా
గడిపితీరాలిక పోరుతీరు అనుదినం వెతలేలా తీరు
మానవతపై ఆశచావక-మనుషులంటే వెర్రి నమ్మిక
పయనమైరీ కాలమే చేర్చు తీరానికి
సాగసాగిరి దైవమే కూర్చు గమ్యానికి

For AUDIO plz contact whatsapp no.9849693324
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:బృందావన సారంగ

పుట్టింది ఎక్కడో పెరిగింది ఎక్కడో
చేసే పని ఏమిటో తెలిపే నీతేమిటో
ఎక్కడ తానున్నా ఆనందనందనం
ఏ పనిచేస్తున్నా మహిమాన్వితం
వందే గోకులబాలం వందే నందకిశోరం

1.గోపికల చీరలే ఎత్తుకెళ్ళినా
ద్రౌపదికి చీరలెన్నొ అందించినా
ఎంతగానొ వెన్ననే దొంగిలించినా
సుధాముని అటుకులే ఆశించినా
ప్రతిచర్యలోను అంతరార్థమెంతొ ఉంది
నమ్ముకున్న వారికెంతొ ప్రతిఫలముంది
వందే గోపికాలోలం వందే యశోదానందనం

2.రాసలీలలో మునిగి తేలినా
రాయభారమే చెలగి చేసినా
సారథిగా ధర్మ యుద్ధం నడిపించినా
జీవన సారమున్న గీతను బోధించినా
ప్రతికర్మలోను పరమార్థముంది
ప్రభావవంతమైన తాత్వికత ఉన్నది
వందే గోవర్ధన గిరిధరం వందే కృష్ణం జగద్గురుమ్
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అతిథిగా వస్తేనే ఆ కాస్త ఆదరణ
ఏకైవచ్చి మేకైపోతే ఎవరికైనా ఛీత్కరణ
కరోనా నువు వచ్చిన కొత్తలొ మాకెంత జాగరూకత
పాతబడిపోయావిపుడిక  నువుకాదు వింత
లేనే లేదు మా జనాలకు చింతాకంత చింత

1.తొలుదొలుత ఆనాడు చప్పట్లు తప్పెట్లూ
ఉత్సాహపూరితంగా హారతులు లైట్లూ
దేశమంతా లాక్డౌన్లు మూసాము ఇంటిగేట్లు
వార్తల్లో నీ గొప్పలు కూడళ్ళలొ నీ కటౌట్లు
పాతబడిపోయావిపుడిక  నువుకాదు వింత
లేనే లేదు మా జనాలకు చింతాకంత చింత

2.మా మొహాల మాస్కులు ఆన్లైన్ల టాస్కులు
సానిటైజర్ యూజర్లు ఫిజికల్ గ్యాప్ సిటిజన్లు
బ్రతికితే చాలనుకొంటూ బలుసాకు భోజనాలు
అలవాటైనావు కదా మాకు నీతో సహజీవనాలు
పాతబడిపోయావిపుడిక  నువుకాదు వింత
లేనే లేదు మా జనాలకు చింతాకంత చింత

INSPIRATION:ATTACHED VIDEO
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అడ్డుకాదు మూతిగుడ్డ అందానికి
కనులు చాలు భావాలను తెలుపడానికి
మహరాణులు వాడలేద జలతారు ముసుగులు
మాస్క్ లతో స్కార్ఫ్ లతో మరుగౌను లొసుగులు

1.దుమ్ము ధూళి నాపుటలో సాధనాలు
వాహనదారులకు కాలుష్య రోధకాలు
వైద్యవృత్తి వారికైతె నిత్యాభరణాలు
పారిశుధ్యకార్మికులకు రక్షణ కవచాలు
మాస్క్ లతో స్కార్ఫ్ లతో కట్టడౌను వ్యాధులు

2.ఎదలోని వేదనలను దాచుటకై నగవులు
సుందరీకరణనైతె ఇనుమడించ రంగులు
రాతిరి చీకటిని కప్పిపుచ్చగా వెన్నెలలు
బహుళార్థ సాధకాలు అలనాటి బురఖాలు
మాస్క్ లతో స్కార్ఫ్ లతో మట్టికఱచు వైరస్ లు
రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

సాయి నామం జపించరా
సాయి కోసం తపించరా
సాయినాథుని విశ్వసించర
సాయి సాయని శ్వాసించరా
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి॥

1.షిరిడి ధాముని చిత్తాన నిలుపు
సాయి రాముని దీవెన గెలుపు
సాయి గాధలు మేలుకొలుపు
సాయి బోధలు బ్రతుకున మలుపు
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి॥

2.సాయికర్పణ చేయి కర్మలు
సాయి ఇచ్చును సత్ఫలితములు
సాయిని శరణన సకల శుభములు
సాయి చరణముల అక్షయ సుఖములు
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి॥

Wednesday, July 29, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మదన పంజరం మంజరీ నీ శరీరం
ఒక్కొక్క అవయవం పదునైన  విరి శరం
వంపువంపులోనూ వలపు వలల పన్నాగం
చిత్తుచిత్తైపోదా మత్తుగొంటు ప్రతి చిత్తం

1.పరువాల పందెంలో వస్త్రాలకె పరాజయం
పొంకాల బింకంలో హస్తాలకె పరాభవం
పట్టులాగ జారుతుంది పట్టుబోతే నీ నడుము
తోకముడుస్తుందేమో పట్టలేకనే ఉడుము

2.ఎత్తైన కొండలు లోతైన లోయలు
ప్రకృతికే ప్రతిరూపం నీ మేని హొయలు
మొదలు పెడితె చాలు నీ ఒడిలో సరసాలు
కడతేరు వేళ మధురమౌ సుధా రసాలు

FOR audio,u may whatsapp to 9849693324
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ప్రేమ అనురాగం ఆకర్షణ ఆరాధన
పేరేదైనా పెట్టుకో నను మాత్రం నీగుండెల్లో పెట్టుకో
ఎంత అందం మూటగట్టుక వచ్చావే చెలీ
నిను చూసి పడిపోని ధీరుడెవ్వడే జాబిలీ

1.నువ్వడిగితె స్వర్గమైనా నేలకు దించుతా
తారలమాలగ గుచ్చి జడనలకరించుతా
నువు కోరితె ప్రపంచాన్నే ఇప్పుడే జయించుతా
నువ్వు హుకుంజారీ చేస్తే యోధులనే బంధించుతా
నీకు ఫిదా కానిదెవ్వరె ఈ జగాన
ప్రాణాలూ ధారపోతురె ఏ క్షణాన

2.ఏడువింతలేమోగాని ఏకైక వింతనీవు
సొంతమైతెగానీ నా చింతలన్ని తీరిపోవు
నగుమోము కంటుంటే కడుపునిండిపోతుంది
నయగారం ఒలికిస్తుంటే బ్రతుకు గడిచిపోతుంది
వర్ణించగాలేదు ఏ కలము నిన్ను
తిలకించగానే స్థాణువౌను నమ్ము
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:తిలాంగ్

నీకున్నది తరిగిపోదు
వేరొకరిది నీకు రాదు
ఎంతటి నిష్ప్రయోజనం అసూయ అన్నది
ఓర్వలేకపోవడం అతివిచిత్రమైనది

1.చెప్పకనే నీ న్యూనత చెప్పినట్లౌతుంది
గొప్పెవరో నీకు నీవె ఒప్పినట్లౌతుంది
స్పర్ధే ప్రేరకమై  నీ ఔన్నత్యం వర్ధిల్లాలి
ఈర్ష్య ఏ కోశానానూ నీవై వర్జించాలి

2. ప్రజ్ఞంటూ నీకుంటే కీర్తి తలుపు తడుతుంది
నీ కడ ఉన్న ప్రతిభ రేపైనా వెలుగుతుంది
ఎదుటివారి పట్ల  కినుక గౌరవ భంగమే
తుఛ్ఛమైనదే మచ్చరమున్న అంతరంగమే
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

సాటివారి పట్ల సానుభూతి
అపన్నుల ఎడల సహానుభూతి
సాయం చేయగలుగు సన్మతి
సోనూ సూద్ లాగ ఉమాపతి
దయచేయగ మనసారా నా వినతి
ఇదేనా ప్రణుతి అందుకో నాప్రణతి

1.సంపద  ఉండీ ఏమిటీ ప్రయోజనం
అలమటించి పోతుంటే ఆర్తజనం
తృణమో ఫణమో చేయూత నీయగా
ఆస్తిపాస్తులేవీ తరగనే తరగవుగా
దైవం మానుష రూపేణా సోనూ సూద్ గా
మానవతా విలువలనే మాకు చాటి చెప్పగా

2.అరిషడ్వర్గాలలో లోభమే ఘనవైరి
ఆర్జింతుము తరతరాల మనుగడ కోరి
రేపటికై చింతించగ నేడూ చేయి జారి
మేము కుడువమొరులకైన పెట్టము ఏమారి
పుణ్యపురుషులున్నారు సోనూ సూద్ తీరున
వితరణే ప్రేరణగా మము జేర్చుము ఆ  సరసన

Sunday, July 26, 2020

కడుపే కైలాసం -హరహరా అదే సదా నీ ఆవాసం
ఇల్లే వైకుంఠం- శ్రీహరీ ఇదేకదా నీవుండే సదనం
వెదకబోను వేరెచటా దైవమా నినుకానగ
చంకలొ పాప కనక వృధాగ ఆరాట పడగ
వందే శంభుముమాపతిం-గోవిందం శ్రీపతిం నమామ్యహం

1.అర్ధనారీశ్వరా నీదైన స్థానము
మహాశక్తి కాలవాలము
తరగదింక నా గుండె బలము
శ్రీనివాసమే గోవిందా నీ హదయము
కొదవలేని సిరుల భోషాణము
దరిరాదెప్పుడు దారిద్ర్యము
వందే శంభుముమాపతిం-గోవిందం శ్రీపతిం నమామ్యహం

2.నీవుంటే చుట్టూరా మంచేనంట
చంద్రచూడ తలనెలవంక
వెన్నెల పంచేనంట
నీవున్నతావంతా పాలేనంట
శేషశయన తాపాలనింక
మదినెడ బాపేవంట
వందే శంభుముమాపతిం-గోవిందం శ్రీపతిం నమామ్యహం











ఇల్లు చిన్నబోయింది నీవు లేక
వాడ అడుగుతున్నది నీ రాకపోక
నిన్నమొన్న వెళ్ళావేమో సరిహద్దున యుద్ధంకై
యుగాలల్లె తోస్తోంది  పరితపించ హృదయం నీకై

1 దేశాన్ని భద్రంగా కాచే జవాను నీవు
కంటిమీద కునుకు లేక సంరక్షిస్తున్నావు
నెత్తురైన గడ్డకట్టే మంచుకమ్ము లోయలు కొండలు
ఎండవేడినోర్వలేక ఎడారుల్లొ మండును గుండెలు
జాతికె అంకితమాయే నూరేళ్ళ నీజీవితం
చావంటే బెదురే లేదు ప్రాణమే తృణప్రాయం

2.అనుక్షణం క్షేమం కోరుతు నీ తల్లి దీవిస్తోంది
మనసంతా నీవేనిండగ నీకై అర్ధాంగి ప్రార్థిస్తోంది
వందముప్పైకోట్లమంది వెన్నంటి వెంటున్నారు
మడమతిప్పకుండా నీకు మద్దతెంతొ ఇస్తున్నారు
సైనికుడా ధన్యుడవే నీ జన్మ చరితార్థకమవగా
యోధుడా మాన్యుడవే మాతృభూమి ఋణం తీర్చగా

ఎదుట ఒక కవిత
ఎదలొ ఒక కవిత
హరివిల్లు వర్ణాలు కనుల ముందు
పరవళ్ళ వర్ణాలు హృదయమందు

1.పదములే కదిలాయంటే
 అందెలే రవళించేను
పదములే కుదిరాయంటే
కవనమే వికసించేను
కవిత నడకలన్నీ కలహంసకు పాఠాలు
నాకావ్య గతులన్నీ జవరాలికి భాష్యాలు

2.కవిత  మోములోనా
కలువలు మందారాలు సంపెంగ రోజాలు
కవిత రీతిలోనా
ఉత్పలాలు చంపకాలు ఆటవెలదికందాలు
కవిత వెలయించేను కవితలు వేవేలు
కవితలకు స్ఫూర్తి నిచ్చే కవితకు జేజేలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాజ్యమెందుకు రాజసానికి
మకుటమెందుకు గౌరవానికి
పదవి వల్లనె వెలిగిపోదురు ఎందరెందరొ నేతలు
పదవికే తగు వన్నె తెత్తురు జనహృదయ నేతలు

1.అడ్డదారుల తెచ్చుకొందురు
 తేరగా అధికార యోగం
అర్హతన్నది మృగ్యమైనా
వారసత్వపు రాజకీయం
అంచలంచెలు ఎదుగువారికి ఎదురుండబోదిక ఎన్నడు
వ్యక్తిత్వమే ఆభరణమైతే  వెలిగిపోదురు ఎప్పుడు

2.కులమతాలే అండకాగా
పక్షపాతమే ఆలంబనం
సంపదెంతో లంచమీయగ
అధిరోహింతురు అందలం
భాగ్యమన్నది ప్రాప్తముంటే తలుపుతట్టును భోగము
మేధావులంతా జాతికెప్పుడు సేవచేయగ సిద్ధము
నేనేమో ఉత్తర ధృవం-నీవైతే దక్షిణ ధృవం
అందుకేనేమో ఆకర్షణ పరస్పరం
నాలోని వెలితికి నీ జతయే ఒకవరం
నా కోసమె పుట్టించెను నిన్నా దైవం
ఈనాడే నా శ్రీమతీ గీతా నీ జన్మదినం
ఎన్నో జన్మలుగా అన్యోన్యమైన దంపతులమే మనం
హ్యాప్పీ బర్త్ డే టూ యూ గీతా
విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

1.పనైపోవడమొకటే నా లక్ష్యం
పద్ధతిగా చేయడం నీకు ముఖ్యం
బండవేసి దాటుటే నా కర్తవ్యం
వంతెన నిర్మించడం నీ ఉద్దేశ్యం
అర్ధపూర్ణత్వమే నువులేక జీవితం
అర్ధనారీశ్వరమే మన ఇరువురి కాపురం
హ్యాప్పీ బర్త్ డే టూ యూ గీతా
విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

2.ఇరుగూ పొరుగులతో సఖ్యత నీకిష్టం
ఏకాంతం ప్రశాంతత దొరికితె నా కదృష్టం
ఎముకలేని చెయ్యినీది ఉదారతకు పెన్నధి
నీకెదురు చెప్పలేని అపూర్వ ప్రేమ నాది
నియతి లేక ఎగిరేటి గాలిపటం నేను
క్రమత నడుపు ఆధారం ఆ దారం నీవు
హ్యాప్పీ బర్త్ డే టూ యూ గీతా
విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ






Saturday, July 25, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పిడికెడు మెతుకుల కోసమని
రెక్కల కష్టం నమ్ముకొని
ఒకరికి చేయి సాచకూడదని
ఎవరి పంచనో చేర బోమని
చిరువ్యాపారం చేసుకొని బ్రతికే అభాగ్యులెందరో
బేరసారాలు చూసుకొని జీవించే వ్యథార్థులెందరో

1.బుట్టెడు ఫలాలు మోసుకొని-తట్టెడు పండ్లే అమ్ముకొని
పొద్దంతా శ్రమకోర్చి వచ్చినదానితొ తృప్తి పడి
నిజాయితీగా నడుచుకొని బ్రతికే అభాగ్యులెందరో
ఎండావానల వీథిన బడుతూ జీవించే వ్యథార్థులెందరో

2.గీచిగీచి బేరమాడే గిరాకినైనా వదల లేక
ఆచితూచి చిల్లర కోరే పినాసినైనావెళ్ళగొట్టక
గిట్టుబాటే గిట్టకున్నా ఏదో ధరకు విక్రయించే అభాగ్యులెందరో
మామ్మూళ్ళెన్నో ఇచ్చుకొని గిరిగిరి వడ్డీ కట్టుకొనే వ్యథార్థులెందరో


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ప్రేమ మీర నను స్పృశించగా
నీ చేతి స్మార్ట్ ఫోనైనా కాకపోతి
నా హృదయ ధ్వనినే వినిపించగా
నువు వాడే హెడ్ ఫోనైనా అవకపోతి
వస్తువుకున్న విలువ ఆప్తులకూ కరువాయే
వాస్తవికత నొదిలివేయ మిథ్యా బ్రతుకాయే

1.చేదబావే లేక బోర్వెల్ కరెంటు బిచ్చమాయె
  వీచు గాలినోచక సీలింగ్ ఫ్యాన్లే దిక్కాయే
  సహజవనరులన్నీ తత్వాలను కోల్పోయే
  యాంత్రికత గుప్పిట ప్రకృతి  నీరుగారిపోయె
  వస్తువుకున్న విలువ ఆప్తులకూ కరువాయే
  వాస్తవికత నొదిలివేయ మిథ్యా బ్రతుకాయే

2.మనిషి మనిషి మధ్యలో అంతర్జాలమాయే
కాలక్రమేణా ఎన్నో పనిముట్లే మాయమాయే
అనుబంధం ఆత్మీయత మొక్కుబడిగ మారెనాయె
సాంప్రదాయమంటేనే పురావస్తు శిథిలమాయే
వస్తువుకున్న విలువ ఆప్తులకూ కరువాయే
వాస్తవికత నొదిలివేయ మిథ్యా బ్రతుకాయే
రచన,స్వరకల్పన & గానం:డా.రాఖీ

జడత్వమే ఆదరువు నియంత్రణే నాకు కరువు
శాఖోపశాఖలై విస్తరిల్లె నా కవన తరువు
నిమిషమైన మోయలేను నాలో భావాల బరువు
గీతమై వెలువరించ నా మనసే ఆపోవు
కవనమే నాకు జీవనం గీతమే ప్రియతమం

1.పగలు లేదు రాత్రి లేదు ఇపుడపుడని లెక్కలేదు
భక్తీ రక్తీ ముక్తీ దేశానురక్తిగా విషయమొక్కటని కాదు
అనుకోని అతిథిగా ఏదెపుడెద తడుతుందో
ఏ రూపుదిద్దుకొని ఎలా వెలుగు చూస్తుందో
కవనమే నాకు జీవనం గీతమే ప్రియతమం

2.ఊపిరాడని ఒత్తిడి ఎన్నెన్నో సవాళ్ళ  దాడి
రచనచేయ అడుగడుగున అవాంతరాల సుడి
దొరికిన సమయాన్ని లిప్తపాటు వదలను
అనుకున్న అనుభూతి వచ్చు వరకు వదలను
కవనమే నాకు జీవనం గీతమే ప్రియతమం

3.ప్రశంసలు విమర్శలు ఏవైతేం స్పందనలు
సత్కారం బహుమానం కావు తూచు తూనికలు
పాఠకుల ఎదలోన స్థిరపడాలి పదిలంగా
అభిమానుల మన్నలు పొందాలి ఘనంగా
కవనమే నాకు జీవనం గీతమే ప్రియతమం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వేదాంత మెంతగ చెప్పితేనేం చట్టాలనెన్ని గుప్పితేనేం
తన్నుమాలిన ధర్మమేది ఉండబోదుర సోదరా
పనికిమాలిన సొల్లుకబురులు వాగడం తగదురా

ధర్మ పన్నాల్ వల్లించితేనేం మూల్యమే చెల్లించితేనేం
తన్నుమాలిన ధర్మమేది ఉండబోదుర సోదరా
వంచనల పంచన చేరగ మినహాయింపే లేదురా

నీతులే బోధించితేనేం న్యాయముగ వాదించితేనేం
తన్నుమాలిన ధర్మమేది ఉండబోదుర సోదరా
తమదాక వస్తే నియమాల మాటే చేదురా

బాసలెన్నైనను చేసితేనేం ఆశలే కల్పించితేనేం
తన్నుమాలిన ధర్మమేది ఉండబోదుర సోదరా
పదవి వరకే పలుకు విలువ నిజం చెబితె బాధరా

సాంత్వనలు కల్పింతేనేం ఉచితసలహాలిచ్చితేనేం
తన్నుమాలిన ధర్మమేది ఉండబోదుర సోదరా
నొప్పి తీవ్రత చెప్పతరమా రాఖీ లోకం వినదురా

Friday, July 24, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

తలపుల తోటలో వలపుల పాటవే
తపనల బాటలో తరగని ఊటవే
తన్మయమొందగా అందాల విందువే
తమకము తీరగా పరువాల పొందువే
చేజారిన మణిపూస రాలేవే నా దెస
ఏమారిన వేళలో ఎదురైందీ అడియాస

1.బ్రతుకునకొక్క మారె చావన్నది బూటకం
క్షణక్షణం ఛస్తున్నా నీ ప్రేమే పితలాటకం
నీతో జతగా నీ ప్రతి ఊహా కర్పూరం
వెలిగి కరిగి పోయింది బంగారు జీవితం
చేజారిన మణిపూస రాలేవే నా దెస
ఏమారిన వేళలో ఎదురైందీ అడియాస

2.నిస్సహాయమైననీ చూపేనా గుండెకోత
డోలాయమానమైన నీ మనసే విధివంచిత
ఎదురొచ్చి ప్రతిసారి ఇరువురిలో కలవరం
పొరపాటో గ్రహపాటో ఎరుగమైతిమే వివరం
చేజారిన మణిపూస రాలేవే నా దెస
ఏమారిన వేళలో ఎదురైందీ అడియాస
అమ్మ మీద రాయనా కమ్మని పాట
అమ్మ అన్న మాటలోనె తేనెల ఊట
అమ్మే దైవము అమ్మే లోకము
అమ్మ చెంత ఉంటే దరిచేరదు శోకము

1.నాన్నకు నాకు రాయబారి అమ్మ
వీథి గొడవలేవైనా నా వకీలు అమ్మ
దాచినాకు రొక్కమిచ్చు మహాదాత అమ్మ
పూచికత్తు తానై నా తప్పుకాయు అమ్మ

2.తీరొక్క రుచులతో కడుపునింపు అమ్మ
ఉన్నదూడ్చి మూటకట్టి సాగనంపునమ్మ
లేదను మాటనదు చేతికెముక లేని అమ్మ
అమ్మంటె నాకే కాదు ఊరంతకు తాను అమ్మ
శ్రీ వాణీ పార్వతీ సేవితే
శ్రీచక్ర రాజ సింహాసనీ శ్రీ లలితే
శ్రీ విద్యా పరాంబికే పరదేవతే
శ్రీ మాతా భువనేశ్వరీ నమోస్తుతే

 1.ఏకమేవా బ్రహ్మ రూపితే
    ద్విజ తతి నిత్య సంపూజితే
    త్రిమూర్తి సహిత భృత్య వందితే
    చతుర్వేదాంతర్గత ప్రతిఘోషితే
 
2.పంచకోశ మాయా నిగూఢితే
  షడ్చక్ర ఛేదనానంతరప్రకటితే
  సప్త స్వర సంగీత గానలోలితే
  అష్టాంగ యోగసిద్ధి ప్రసాదితే

Thursday, July 23, 2020

నేటి నిజం దిన పత్రిక
మేటిదైన మన వార్తా పత్రిక
బైస దేవదాసు మానస పుత్రిక
పాఠక జనులకైతె నిత్య వేడుక

1.నిక్కచ్చి నిజాల కిది వేదిక
వాస్తవాల్నె ఘోషించే గొంతుక
పూర్తిగా పక్షపాతరహితమైనది
ఏ రాజకీయ పక్షానికి చెందనిది
పాత్రికేయ విలువలకు పేరొందినది
నమ్మిన సత్యానికే కట్టుబడినది

2.సారస్వతానికిచట పెద్దపీట
గురువారం సాహితీ కెరటాలె ప్రతిపుట
వర్ధమాన కవులకిచ్చు తగు బాసట
ఉత్తమ కవితలకు చోటు దొరికేనిట
తెలుగు రాష్ట్రాల ప్రభావవంతమైంది
పత్రికాలోకంలో మకుటాయ మానమిది

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:దర్బార్ కానడ

పటాపంచలే చేయి సాయి
మా అజ్ఞాన తిమిరము
మనస్థైర్య మందించవోయి
నెగ్గునటుల బ్రతుకు సమరము
సాయిరాం షిరిడీ సాయిరాం
సాయిరాం ద్వారకమాయి రాం

1.కులమతాల నంటగట్టు నీకో గిరిగీసిపెట్టు
కుంచితమౌ మనోభ్రమలు మావి
మనిషివో దేవుడివో మర్మమునే ఎరుగనట్టి
సంచితమౌ దుష్కర్మలు మావి
సాయిరాం షిరిడీ సాయిరాం
సాయిరాం ద్వారకమాయి రాం

2.నమ్మిక తక్కువ భయమే ఎక్కువ
దైవమంటె మా మదిలో భావము
వంచనలే మించిపోయి లంచాలే వ్యసనమై
ప్రాయశ్చిత్తమటుల నీ శరణము
సాయిరాం షిరిడీ సాయిరాం
సాయిరాం ద్వారకమాయి రాం

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:అమృత వర్షిణి

యతులకైన మతిచలించు
మునుల దీక్షనే ముంచు
ఋషులైనా పరవశించు
యోగుల భోగులగావించు
నీ అందానికి వందనాలు  వన్నెల సుందరీ
నీ పరువానికి ప్రణామాలు సొగసుల మంజరీ

1.కలములనే కదిలించు
కుంచెలైన  పులకించు
ఉలులింక ఉరకలెత్తు
అందెలు ఆరాటమొందు
నీ అందం బంధించగ వన్నెల సుందరీ
నీ పొంకం ప్రకటించగ సొగసుల మంజరీ

2.కుర్రకారు వెర్రెక్కు
దంపతుల కొంపముంచు
ముదుసలికే కసిరేపు
ముదితలైన మోహించు
నీ చక్కదనం అతి మిక్కిలి వన్నెల సుందరీ
నీ రూపం ఎదతాపం సొగసుల మంజరీ
https://youtu.be/SM5s3sOrcJ8?si=9Oqn5VEqWkvpgsrU

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:భూపాలం

హాయిగొలుపు శ్రీ నరహరి సుప్రభాతం 
ధర్మపురి జనులకది అనునిత్య జాగృతం
మబ్బుననే మేలుకొని గోదారికి పయనం
స్నానానుష్ఠాలతొ ప్రతి దినం పావనం
మదినూయలనూపుతాయి మాఊరి(ధర్మపురి) జ్ఞాపకాలు
మధురానుభూతులతో కూడుకున్న వైభవాలు

(రాగం:మోహన)

1.ఆండా గాగిరుల నిండ స్వఛ్ఛమైన నదీజలం
దారంతా పలుకరిస్తు పరుల కుశల ప్రస్తావనం
ఇల్లుచేరి పూలు వత్తులతో మందిరాలకు చనడం
నరహరి హర బ్రహ్మలను ఆర్తి మీర అర్చించడం
ప్రదక్షిణాలు చండీలు సాష్టాంగ ప్రణామాలు
స్తోత్రాలు కీర్తనలు వేదోపనిషత్తుల పారాయణాలు

(రాగం:షణ్ముఖ ప్రియ)

2.పొద్దస్తమానం తమతమ పనులలో మునగడం
పురాణాలు హరికథలు ఇష్ఠాగోష్ఠుల మాపు గడపడం
పండుగలు పబ్బాలు బోయనాలు వాయనాలు
ప్రతి రోజూ ఉత్సవాలు ఆధ్యాత్మిక అనుభవాలు
నోములు వ్రతాలు దంపతీ సహితమైన ఆతిథ్యాలు
దానధర్మాలు ఆచార సంస్కృతీ సంప్రదాయాలు

(రాగం:సింధు భైరవి)

3.ఊరంతా బంధువులు పరమతాల స్నేహితులు
పెండ్లి పేరంటాలకు సకల జనులు ఆహూతులు
రుద్రాభిషేకాల వాడవాడ శివ పంచాయతనాలు
బతుకమ్మల ఆటలు  పీర్లు లాల్ సాబులు
జమ్మిపత్రాల దసరా ఆలింగనాలు అభివాదాలు
కడతేరాలి ధర్మపురిలో మాజీవితాలు జన్మజన్మలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కాళ్ళక్రింద ఉన్న నేల కదిలిపోతున్నప్పుడు
నీ అవయవాలేవీ సహకరించకున్నప్పుడు
జగమంతా నిండి ఉన్న గాలి నీకు అందనపుడు
ఉక్కిరిబిక్కిరేంటొ అనుభవానికొచ్చి నపుడు
కళ్ళుతెరుచుకున్నా అప్పుడేమి ప్రయోజనం
ముందస్తు జాగ్రత్తతొ బ్రతికి బట్ట కట్టు జనం

1.నెత్తినోరు మొత్తకొని చెప్పినా వినరాయే
ఎదుట జరుగు భీభత్సం ఏ మాత్రం కనరాయే
తమదాకా వస్తెగాని పట్టించుకోరాయే
తబ్బిబ్బైపోతె వినా తీవ్రతనెరుగరాయే
కళ్ళుతెరుచుకున్నా అప్పుడేమి ప్రయోజనం
ముందస్తు జాగ్రత్తతొ బ్రతికి బట్ట కట్టు జనం

2.తమ కాయమైనా సరె శ్రద్ధన్నదే మృగ్యం
కాసింత వ్యాయామం మెరుగు పరచు ఆరోగ్యం
రోగాలకు దూరముంటే అదే కదా సౌభాగ్యం
జీవించుటకై త్యజించుటే మనుజాళికి యోగ్యం
కళ్ళుతెరుచుకుంటేనే కలుగుతుంది ప్రయోజనం
ముందస్తు జాగ్రత్తతొ బ్రతికి బట్ట కట్టు జనం
నట్టింట తిరుగాడే మహలక్ష్మి మా చెల్లెమ్మ
కనురెప్పలాగా నను కాచు మా అన్నయ్య
సోదరిసోదరుల పండగే రక్షాబంధనం
అనురాగం యోగంగా నడిపించే ఇంధనం

1.హరివిల్లు విరిసేను నా చెల్లి నవ్వులలో
అమృతమే కురిసేను నా అన్న చూపులలో
చెదరనిది మరవనిది తోబుట్టుల అనుబంధం
సృష్టిలోన తీయనైనది ప్రేగు పంచుకున్న బంధం

2.యమద్వితీయ నాడు  భగిని నీ హస్త భోజనం
రాఖీ పున్నమి రోజు అన్నా నీకు నీరాజనం
రక్తసంబంధం మనది ఎన్నడు వీడిపోనిది
ఆత్మీయ గంధం మనది ఎన్నడు వాడిపోనిది

Tuesday, July 21, 2020

ప్రేమ భిక్ష పెట్టవే ప్రియురాలా
జాలి చూపెట్టవే జవరాలా
బానిసగానైనా నన్నట్టిపెట్టుకో
నీదాసుడనేనని గుర్తుపెట్టుకో

1.కనుకొలుకుల జారే కన్నీరే
తలపిస్తోంది వరద గోదారే
ఫక్కున నవ్వతూ రెచ్చగొట్టు నీతీరే
చంద్రహాసవీక్షణ నీమోముకనగ తీరే

2.నీపాదం బొటనవేలు నావేణువు
ఊదేను నా పెదాలు తాకనివ్వు
నీ గుండెనే నా కిక ఏకైక తావు
నువుకాదంటే మిగిలింది నాకిక చావు

Monday, July 20, 2020


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ప్రలోభాలు ప్రలోభాలు ప్రలోభాలు
మనిషి బలహీనతపై స్వారిచేసె మత్తేభాలు
జ్వాలల మోజులో కాలిపోవు నెన్నో శలభాలు
వేటగాళ్ళ ఉచ్చులో చిక్కేను బేల శరభాలు

1.స్వేఛ్ఛను హరింపజేసే ఓట్ల బేరసారాలు
విచ్చలవిడిగా పంచేటి నోట్లు సారాలు
ఇఛ్ఛను భ్రమింపజేసే మతబోధ సారాలు
లౌకికతే భ్రష్టుబట్టు విషమయ కాసారాలు
తార్పిడులకు మార్పిడులకు తావా మన మానస వసారాలు

2.ఆత్మను అమ్ముకొనుటె తీసుకుంటె లంచం
డబ్బిస్తే నాకడమేనా  ప్రతివాడి ఎంగిలి కంచం
కష్టార్జితానికే విలువనీయగలదు ఈ ప్రపంచం
పరాన్నబుక్కులు దొంగల బ్రతుకే నీచాతినీచం
తలతెగితేనేం మనుషుమైతె మనం ఎవరికి తలవంచం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:కళావతి

పొన్నచెట్టు పొదలమాటు
ఏకాంతమైన చోటు
కన్నయ్యకోసమే కాచుకుంది
అన్నులమిన్న వేచిఉంది
తమకం కమ్ముకున్న అభిసారిక
తపనలనోర్వక అభినవ రాధిక

1.నల్లనయ్యకోసమని పిల్లనగ్రోవి గొని
వేణుగాన మాధురిలో పరవశమొందాలని
మువ్వలపట్టీలు కట్టి నాట్యమాడాలని
మువ్వగోపాలుని మురియగ జేయాలని
తహతహలాడుతోంది అభిసారిక
తపనలనోర్వక అభినవ రాధిక

2.కలువల కళ్ళతోని   పూజించాలని
ఆధరసుధారసములనే నివేదించాలని
తనువు కర్పూరమవగ హారతి పట్టాలని
మనసు మనసు సంగమించ స్వర్గం ముట్టాలని
తరుణముకై తొందరించె అభిసారిక
తపనలనోర్వక అభినవ రాధిక
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:శివరంజని

తల్లిగర్భములోని పిండానికి అండదండెవ్వరో
ఇహలోక బంధాలు అవలీలగా ముడివేయునెవ్వరో
పురిటిగుడ్డుకు రోదనలు నేర్పింది ఎవ్వరో
అమ్మరొమ్మును కుడువ బోధించెనెవ్వరో
అట్టి పరమేశునికి నా అభివందనం
అఖిల విశ్వేశ్వరునికి నా ఆత్మ వందనం

1.ఆకలిదప్పులు అంగాంగ నొప్పులు శిశువుకెవ్వరు తీర్తురో
ఆహార లభ్యతను స్వీయ సంరక్షణను పశువుకెవ్వరు కూర్తురో
పక్షులకు చేపలకు ఎగరగా ఈదగా ఎవరు శిక్షణ నిత్తురో
క్రిమికీటకాదుల మనుగడకు ఏర్పాటు నెవరుకావింతురో
అట్టి పరమేశునికి నా అభివందనం
అఖిల విశ్వేశ్వరునికి నా ఆత్మ వందనం

2.మనిషికీ మనిషికీ నిమిషనిమిషానికీ బుద్ధినెవ్వరు మార్తురో
బహువింతరోగాలు ఉన్నతులు దుర్గతులు ఎవరంటగడ్దురో
విపరీతపోకడల పైశాచ కృత్యాల పురికొల్పు దాతెవ్వరో
పంచభూతాల భీభత్సకాండతో లోకమే హరియించు నేతెవ్వరో
అట్టి పరమేశునికి నా అభివందనం
అఖిల విశ్వేశ్వరునికి నా ఆత్మ వందనం

Saturday, July 18, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ప్రకృతి పార్వతి కాలమే అహర్పతి
అర్ధనారీశ్వరమే సర్వం సహా జగతి
క్షితిజగామి భగవతి ఊర్ధ్వగామి పశుపతి
సంతులన సాధనయే సమకూర్చును సద్గతి
శ్రీవిద్యాన్విత ప్రాణాయామమే  శివశక్తుల సంగమము
ఓం నమఃశివాయ శ్రీ మాత్రే నమోనమః

1.పంచకోశమయమీ పాంచభౌతిక దేహం
అరిషడ్వర్గాలతొ సతతం అతలాకుతలం
ఉద్దీపనకావాలి నిద్రాణమైన కుండలినీ శక్తి
శ్రీచక్రోపాసనతో సంప్రాప్తమౌను నరజన్మకు ముక్తి
శ్రీవిద్యాన్విత ప్రాణాయామమే  శివశక్తుల సంగమము
ఓం నమఃశివాయ శ్రీ మాత్రే నమోనమః

2.అద్వైత భావనయే పరయోగ పథము
ఆత్మైక దర్శనమే  పరాశక్తి వరప్రదము
మూలాధారాన జాగృతమై షడ్చక్ర చైతన్యమై
 నిర్వికల్ప సమాధిగా సహస్రారమే ఛేదనమై
శ్రీవిద్యాన్విత ప్రాణాయామమే  శివశక్తుల సంగమము
ఓం నమఃశివాయ శ్రీ మాత్రే నమోనమః
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

బృందావన సంచారా యమునా తీర విహారా
రాధికా హృదయ చోర మీరా మానస పచేరా
నీ అష్టభార్యలే అష్టవిధ శృంగార నాయికలు
పదారువేల గోపికలు రసకేళికే దివ్యదీపికలు

1.స్వాధీన పతిక నీకు ప్రియసతి సత్యభామ
వాసక సజ్జికయే సలక్షణ ధర్మపత్ని లక్షణ
విరహోత్కంఠిత ఏకాంత విరిబోణి సుదంత
విప్రలబ్ద విజయలబ్ద సుదతి జాంబవతి
అష్టభార్యలే అష్టవిధ శృంగార నాయికలు
పదారువేల గోపికలు రసకేళికే దివ్యదీపికలు

2.ఖండిత విరహజ్వలిత ఉవిద మిత్రవింద
కలహాంతరిత నీ సహధర్మచారిణి రుక్మిణి
ప్రోషిత భతృక ఇంతి పాలుషి కాళింది
అభిసారిక సంగమగీతిక నీ కళత్రమౌ భద్ర
అష్టభార్యలే అష్టవిధ శృంగార నాయికలు
పదారువేల గోపికలు రసకేళికే దివ్యదీపికలు

Friday, July 17, 2020


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అందమంటే నీలా ఉంటుందా
అందమంటే అందనంటూ పందెం వేస్తుందా
అందలం ఎక్కిస్తాను అందుబాటులో ఉంటే
అందరికీ చెప్పేస్తాను బంధం పెనవేస్తానంటే

1.అందెలు నీపాదాల సుందరంగ అమరాయి
చిందులు వేస్తుంటే గుండెలెన్నొ అదిరాయి
కందిపోతాయేమో  సుకుమారం నీ అరికాళ్ళు
అందనీయవే నాకు నీ సొగసులు సోయగాలు

2.అరవిందాలే చెలీ సంకెళ్ళువేసే సోగకళ్ళు
మకరందాలే సఖీ నీళ్ళూరించే నీ మోవిపళ్ళు
ఏ డెందమైనా మందిరమయ్యేను దేవి నీవుగా
ఆనందనందనమే జీవితమంతా నీతొ మనువుగా

(చిత్రం కవితకు ప్రేరణ,ఆలంబన మాత్రమే-వ్యక్తిగతమైన ఏ సంబంధం ఈ గీతానికి చెందని గమనించ ప్రార్థన)
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పట్టించుకోకుంటె పరితాపం
పట్టిపట్టి చూసామా ఎంత కోపం
అందాలన్ని ఆరబోసే ఆ వైనం
కనువిందనుకొన్నామా సంస్కార హీనం
ప్రాణాలు తోడేసే  విషకన్యలు
శవాలకూ జీవం పోసే అమృతగుళికలు

1.అల్లార్పే కన్నులు బుగ్గన సొట్టలు చుబుకం నొక్కులు
క్రీగంటి చూపులు మునిపంటినొక్కులు అన్నీచిక్కులు
మామూలు బాణమైన ఛేదించగలిగేను హృదయము
దివ్యాస్త్రాలైతేనో నిలువెల్లా దహియించు తథ్యము
అత్తిపత్తులే నత్తగుల్లలే అతివలు అందని ద్రాక్షలు

2.చిచ్చుపెట్టే చిట్కాలెన్నో వెన్నతో పెట్టిన విద్యలు
రెచ్చగొట్టే ఆయువు పట్లే  కరతలామలకాలు
మెండైన ప్రలంబాలు నిండైన నితంబాలు
ప్రధానమే సదా వగలాడికి ప్రతారికా ప్రదర్శనం
పృష్ఠము కటి వళి అంగమేదైనా అయస్కాంతము
మందిరాలు గోపురాలు అవసరమా
సర్వాంతర్యామివి కదా స్వామి నీవు
విగ్రహాలు ముక్కోటి పేర్లేల దైవమా
నామ రూప రహితుడవే స్వామీ నీవు
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
నమో తిరుమలేశా నమో పాపనాశా

1.విన్నవించుకోవాలా మా వినతులు
జగముల కన్నతండ్రివే నీవైనప్పుడు
విడమరచి చెప్పుకోవాలా మాకున్న వెతలు
సర్వజ్ఞుడివే స్వామీ నీవైనపుడు
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
నమో తిరుమలేశా నమో పాపనాశా

2.కలతచెందాలా మేం పుట్టుక మరణాలకై
కర్తా కర్మా క్రియా అన్నీ నీవై నప్పుడు
బాధ్యతల వహించాలా నిమిత్తమాత్రులమై
జగన్నాటక సూత్రధారివే నీవై నప్పుడు
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
నమో తిరుమలేశా నమో పాపనాశా







Wednesday, July 15, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పొగిడితే పొంగవు తెగిడితే కృంగవు
ఏ ప్రలోభాలకూ లొంగనే లొంగవు
కలుషితాలు తొలిగించే పావన గంగవు
దత్తాత్రేయుని అవతారమేనీవు
షిరిడీ సాయిగ మాకై వెలిసావు
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆశ్రితజనాభీష్ట వర ప్రదాయకా

1.సాయి నీనామం నిరంతరం మా స్మరణం
బాబా నీ రూపం అనవరతం మా ధ్యానం
పగలూ రేయీ కలలో ఇలలో నీపై ధ్యాస
పీల్చిన వదిలిన నీదేనీదే నా ప్రతి శ్వాస
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆశ్రితజనాభీష్ట వర ప్రదాయకా

2.ఆపదలోను సంపదలోను ఆప్తుడవీవే
వేదనలోనూ మోదములోనూ నేస్తము నీవే
తల్లిదండ్రి గురువూ దైవము సర్వము నీవే నీవే
అన్యధాశరణం నాస్తి ఆదుకోగ వేగ రావే
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆశ్రితజనాభీష్ట వర ప్రదాయకా

రచన,స్వరకల్పన&గానం:డా రాఖీ

పాలకావడి పట్టుకొచ్చా పళనిమలవాసా
పంచదార మోసుకొచ్చా పార్వతి ఔరసా
ఆయురారోగ్యాలకు  నీదేలే స్వామి భరోసా
నమ్మికొలుచుకుంటున్నాను చేయకయా అడియాసా

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం స్వామినాథా సుబ్రహ్మణ్యం

1.మార్గశీర్ష శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యా నీ జన్మదినం
మనసారా చేయుదు నీకు అభిషేకం అర్చనం
అగ్నితోజోమూర్తీ వర్ణించ నా వశమా నీ కీర్తీ
నీవే ఇక నెరవేచ్చాలి తీరని నా హృదయపు ఆర్తి

2.గుహ్యతరమైనది నీ జన్మ వృత్తాంతం
భవ్యమయమైనది నీ దేవ సేనాధిపత్యం
శ్రీ వల్లీ ప్రియ మనోహరా హర కుమారా
సంతానం నీ వరప్రసాదం షణ్ముఖా కావరా

3.కుక్కుటధ్వజానీకు బహుపరాక్ బహుపరాకు
శిఖివాహన స్కందా వేలవందనాలు నీకు
వేలాయుధపాణి నీకు శతకోటి దండంబులు
కార్తికేయ శరవణభవ నీకివె నా శరణార్థులు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:ఉదయ రవిచంద్రిక

చిదిమి దీపం పెట్టుకోవచ్చు బహు చక్కని రూపం
మదిని చిత్రం నిలుపుకోవచ్చు సంశయించక ఏమాత్రం
అందానికే నీవు అసలైన కొలమానం
ఏ కవీ ఉపయోగించని అపురూప ఉపమానం

1.కళ్ళలో ఏదో అద్భుత దివ్యత్వం
చూపుల్లో జింకపిల్లలా  అమాయకత్వం
చెంపలింక సిగ్గులొలికే మంకెన మొగ్గలు
కురులైతే కారుకొనే పట్టుకుచ్చులు
దొండ పళ్ళు మరిపించే నీ పెదవులు
కౌముదే కలత చెందే నీ నగవులు

2.తలని నిమురాలనిపించే ముగ్ధత్వము
తెలవారువేళలో విరుల స్నిగ్ధత్వవము
ముట్టుకుంటె మాసిపోయే సౌందర్యము
పట్టుకుంటె కందిపోయే సౌకుమార్యము
అపరంజి బొమ్మవు నీవు లేలేత కొమ్మవు నీవు
ఆహ్లాదం కురిపించే ఏడురంగుల నింగి విల్లువు


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎద తలుపు తట్టేదెవరో
నా కవి తలపు కొచ్చేదెవరో
అతిథిగా వేంచేసేది ఏ వస్తువో
తానుగా స్పృశియించేది ఏ విషయమో
ఏ రసం వర్షిస్తుందో ఎంతగా అలరిస్తుందో

1.అన్నమయ్య ఆవహించి భక్తి వెలువరించేనో
క్షేత్రయ్య ప్రేరేపించి శృంగారం కురిపించేనో
వేమనే స్ఫూర్తినీయ సమాజమే స్ఫురించునో
దేశమాత బోధించ జాతీయత నినదించేనో
ఏ రసం వర్షిస్తుందో ఎంతగా అలరిస్తుందో

2.తొలి ప్రేమలోని బిడియాలు ఒలికేనో
దాంపత్యమందలి అనురాగం చిలికేనో
స్నేహబంధంలోని మధురిమే పలికేనో
మగతలోని మానవతనే మేలుకొలిపేనో
ఏ రసం వర్షిస్తుందో ఎంతగా అలరిస్తుందో
రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

అన్నం పరబ్రహ్మ స్వరూపం
అన్నమో రామచంద్ర అని ఘోషిస్తోంది నిరుపేద ప్రపంచం
ఆకలి ప్రేగుల నులిమేస్తుంటే
పట్టెడుమెతుకులకై  పాట్లెన్నొ పడుతోంది కడు దయనీయం

1.తలదాచుకోనడానికి పంచనేది దొరకక
కడుపుకింత తినడానికి మట్టికంచమూ లేక
కునుకైన తీయుటకొక కుక్కిమంచమూ నోచక
బ్రతుకొక శాపంగా భవిత ప్రశ్నార్థకంగా
దినదినగండం నూరేళ్ళ ఆయువుగా
కూడూ గూడూ లేని జనం గోడు వెళ్ళగ్రక్కుతోంది

2.తింటే అరగని రోగం వండి వృధాపర్చు వైనం
విందూవినోదాల్లో విచ్చలవిడి పదార్థాల వ్యర్థం
జనం విదిలించు తాలు నిలుపునెన్నొ జీవితాలు
అదుపు చేయు విలాసాలు ఏర్పరచును విలాసాలు
అందించే చేయూతలు మార్చగలుగు తలరాతలు
మనిషి కొరకు మనసుపెడితె  మనిషిలో ఋషిత్వాలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కవినైనాను నేను నీ చలవవల్లే చెలియా
కవితలే రాస్తున్నాను నా అనుభూతులే ప్రియా
కనులముందుకొస్తే ప్రణయైక కవిత
కనుమరుగైతేనో విరహాగ్నే కవిత
అహరహమూ నీదే ధ్యాస
అనవరతము నీమీదే ఆశ

1.గూఢంగా నిన్నే ఎపుడూ వెంబడించాను
మౌనంగా నిన్నే   ఆర్తితో ఆరాధించాను
చెలరేగిన భావాలన్నీ మదిలొ దాచుకున్నాను
ఏరుకొన్న నీగురుతులను పదిలపరచుకున్నాను
మనువాడగ కలలే కంటూ తాత్సారం చేసాను
రెప్పపాటులోగా నిన్ను  పరభార్యగ చూసాను

2.నాహృదయ గోదావరిని వరదలే ముంచెత్తాయి
ఊహలన్ని ఊడ్చిపెట్టి ఎడారిగా మార్చేసాయి
యాంత్రికంగ నా బ్రతుకేదో అలా గడిచి పోతోంది
నువ్వు ఎదురైనపుడల్లా లావా పెల్లుబుకుతోంది
నవ్వులనే పులుముకున్న జీవశ్చవాన్ని నేను
మరుజన్మకైనా నీవాడిగా వరము కోరుకుంటున్నాను
రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

గార్హపత్యాయ నమో
ఆవహనీయాయనమో
దక్షిణాగ్ని సంయుతా
త్రేతాగ్ని రూపాయ నమో నమో
అగ్ని దేవాయా నమో నమో నమో నమో

1.తమసోమా జ్యోతిర్గమయా వహ్నిదేవాయ నమో
యజ్ఞయాగాది క్రతు అధిప హవ్యవాహనాయ నమో
సూర్యచంద్ర తేజో ప్రదాయకాయ అనలాయనమో
అరణి మథన ఆవిర్భవ కృశానాయ నమో నమో

2.ఖాండవ వన దహనాయ ధూమధ్వజాయనమో
సర్వభక్ష ద్విశీర్శాయ స్వాహా పతయే నమో
సీతా పునీత శీలపరీక్ష సాక్షీభూతాయతే నమో
బ్రహ్మ జ్యేష్ఠ పుత్రాయ దిక్పాలక శ్రేష్టాయ హుతాశనాయ నమో
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నా ప్రతిగీతం ఒక సుప్రభాతం
నా భావావేశం జోగ్ జలపాతం
జీవధార ప్రవహిస్తుంది
ఆత్మఘోష నినదిస్తుంది
అనవరతం నామనోరథం కవనపథం
నవనవోన్మేషం  నవరసభరితం ఎద ఎదకూ శుభసందేశం

1.ఉపమానాలు ఉత్పేక్షలు నాకు అపేక్షలు
పొంతనలేని ప్రతీకలు పునరుక్తులు నాకుపేక్షలు
అన్నిపాటలు అన్నిపూటలు నాకు విషమ పరీక్షలు
విద్యాబుద్ధులు గేయ సిద్ధులు వాగ్దేవి భిక్షలు

2.ఏ వస్తువు ఎదురైనా నోచేను నా ఆదరణ
ఏ విషయం పలకరించినా చేరున నాఅక్కున
మనోధర్మ మనుసరించి రూపొందును స్వరరచన
అనురాగం రంగరించగా రంజకమౌ నా కీర్తన
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

లేనివాణ్ణి ఉన్నాడన్కొని
విన్నపాల నెన్నో వేడ్కొని
వలసినన్ని పేర్లతో పేర్కొని
నమ్మినాను సేవలే చేస్కొని
తెలుసుకో మనసా నీ సమయం హుళ్ళుక్కి
ఎరుగవే మనసా దొరికిందింతే బ్రతుక్కి

1.మంగళవారం గణపతి మారుతి నరహరి యని కొలిచి
బుధవారం వాణీ మణికంఠుల ప్రణుతించి
గురువారం సాయిబాబా శరణాగతి జొచ్చి
శుక్రవారం జగన్మాతనే యథోచితంగా కీర్తించి
ఖంగుతిన్నాను మనసా ఎంతగానో భ్రమించి

2.శనివారం వేంకటపతినే కొనియాడి
ఆదివారం ఆదిత్యుని శ్రీరాముని శ్రీకృష్ణుని పాడి
సోమవారం సదాశివునితో మొరలిడి
అహోరాత్రాలు దైవచింతనే తలపులనిడి
భంగపడినాను మనసా గుడ్డిగా బోల్తాపడి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

జన్మదిన శుభవేళ శ్రీమతి Manjula Surya కు-
-డా.రాఖీ చిరుకానుక

పాలకడలి మథనాన క్షీరజ నీవై
మానస సరోవరాన నీరజ రూపై
ఆవిర్భవించితీవు  నేడే మంజులమౌ మంజులా
పరిణమించె పరవశాన అవనియే మధువనిలా

శుభాకాంక్షలందుకో మంజుల సూర్యా
శుభాశీస్సులివిగో హృదయ ఔదార్యా
హ్యాపీ బర్త్ డే టూయూ మంజులా
విష్యూ హ్యాపీ బర్త్ డే టూయూ ఈశుభవేళా

1.మందహాసమే మణిహారం
మధుర భాషణే సుధారసం
దయార్ద్రమౌ వీక్షణే పూర్ణిమ శరత్తు
కపోలాల తీక్షణే గులాబీ తటిత్తు
ఎంత శ్రద్ధ కనబరచాడో నీ సృజనలొ బ్రహ్మ
చక్కగా ముడిపెట్టాడు సంజయ్ తో నీ జన్మ

శుభాకాంక్షలందుకో మంజుల సూర్యా
శుభాశీస్సులివిగో హృదయ ఔదార్యా
హ్యాపీ బర్త్ డే టూయూ మంజులా
విష్యూ హ్యాపీ బర్త్ డే టూయూ ఈశుభవేళా

2.విరులకున్న సౌందర్యం నీ సొత్తు
కవనంతో చేస్తావు చిత్తాలనే చిత్తు
గాత్రానికి చేయాలి న్యాయం కించిత్తు
ఆపత్తులొ సంపత్తులో వీడబోకు మైత్రి పొత్తు
సౌశీల్యం సౌహార్ద్రం సమపాళ్ళుగ నీకు సంపద
శతమానం భవతిగ వర్ధిల్లు ఆదర్శమూర్తివై సదా

శుభాకాంక్షలందుకో మంజుల సూర్యా
శుభాశీస్సులివిగో హృదయ ఔదార్యా
హ్యాపీ బర్త్ డే టూయూ మంజులా
విష్యూ హ్యాపీ బర్త్ డే టూయూ ఈశుభవేళా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చరమగీతం పాడుతోంది ధరణీతలం
మన నరజాతి సమస్తం మృత్యుదూత బాధితులం
తర్కించకు నేస్తమా మనం వెక్కుతున్న వెతలం
చితికిన బ్రతుకులతో చితికి చేరుకొనే కతలం

1.ఎటుచూడు కరోనా మృత్యు పాశమౌతోంది
ఏమరుపాటైతే మరణశాసనం రాస్తోంది
ఆరోగ్యవంతుణ్ణీ రోగిగా మారుస్తోంది
శుభ్రత పాటించకుంటే ప్రాణాల్ని కబళిస్తోంది

2.పదే పదే గుర్తు చేసినా ఏ మాత్రం చికాకుపడకు
అదే పనిగ హెచ్చరించినా బేఫికరుగ వ్యవహరించకు
కరోనా కోరల చిక్కక మూసుకోర ముక్కూమూతి
భౌతిక దూరం జరుగుతు తప్పించుక తిరుగర సుమతి

PIC courtesy:Agacharya Artist

Thursday, July 9, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎన్ని కలాలు రాస్తాయో నిన్నుచూడగానే
 కలలెన్నెన్ని వెలుస్తాయో నువ్వు చూడగానే
 ఎలా వర్ణించాలో ఎప్పుడూ తికమకనే
కుదించి చెప్పడానికి గీతికైతె సతమతమే

1.కలువరేకులైతే నీ కన్నుల బోలు
కృష్ణవేణిపాయలే నీకురుల చేవ్రాలు
కనుబొమలు మాత్రం మన్మథుడి విల్లు
మేను మేనంతా వెన్నెలఝరి పరవళ్ళు

2.ఏ శిల్పి చెక్కాడో చక్కనైన నీ ముక్కు
ఎంతటివాడైనా నీ నవ్వుల వలలో చిక్కు
అనిమేషులమౌతామే నిశ్చలమై మాదృక్కు
చుబుకాన పుట్టుమచ్చా లాగుతుంది తనదిక్కు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పూలబాలవో
శృంగార హేలవో
రసరమ్యలీలవో
అభినవ శకుంతలవో

1.ఊహాసుందరివో
ఉత్పలమాలవో
దివ్యగాన మంజులవో
ఉదయరాగ మంజరివో
అల్లసాని వరూధినివో

2.నింగి జాబిల్లివో
భవ్య హరివిల్లువో
నా స్వప్న దేవతవో
హరిత లలిత ప్రకృతివో
అతిలోక సుందరివో
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వీడ్కోలు నేస్తమా
సెలవింక మిత్రమా
మన స్నేహం సాక్ష్యంగా
నీ సుఖమే లక్ష్యంగా
కడసారి ఈ గీతం నీకేలే అంకితం
నువులేక శూన్యమే మిగిలున్న జీవితం

1.పదేపదే ఇకనిన్ను విసిగించబోను
అదేపనిగ ఎప్పుడూ కల్లోల పర్చను
ఎలా వచ్చినానో అలా తప్పుకుంటాను
అగుపించిన మాదిరే మాయమైపోతాను
నాజ్ఞాపకాలు సైతం మదినుండి చెరిపెయ్యి
నాగురుతులేవైనా చెత్తబుట్ట పాలు చెయ్యి

2.వరదలో కొట్టుకవచ్చె పుల్లలుగా కలిసాము
క్షణకాలమైనా ఎందుకొ తోడుగా సాగాము
ఏజన్మ బంధమో ఆపాటిదైనా ఋణము
పదిలపరచుకుంటాను నీతో ఉన్న ప్రతిక్షణము
మన్నించు మనసారా ఎదగాయ పర్చానేమో
మరచిపో ఎప్పటికి నిన్ను ఏమార్చానేమో
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

గుండె ఉన్నవాళ్ళకే నొప్పి వస్తుంది
మనసు ఉన్నచోటనే ప్రేమ పుడుతుంది
బండారాయికేముంటుది ఆకారం అస్థిత్వం
చెక్కితే విగ్రహమై మొక్కబడుతుంది
తొక్కితే తొక్కుడు బండగ కడతేరుతుంది

1.అనుభూతులెన్నో పేర్చి నిర్మించా ప్రణయ సౌధం
స్వప్నాలను సమీకరించి ప్రకటించా అనురాగం
తుఫానులో చిక్కింది సహచర్య నావ
శిథిలమైపోయేలా బ్రతుకునే చేసినావ
ఆరాధన ఫలితం చివరకు ఆవేదనేనా

2.పరాచికమై పోయింది  వలపు నీకు కేళి
చిరాకైపోతోంది  నీ వ్యవహార సరళి
కాలరాచివేయకే మనవైన గురుతులను
నేలపాలు చేయకే మన భవితలను
మించిపోయిందిలేదు ఇకనైనా మేల్కొంటే

Wednesday, July 8, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఏ శిల్పి చెక్కినాడో
బ్రహ్మనే మలిచాడో
అంగాంగ సౌష్ఠవం చొంగకారేలా
దేహసోయగం కనినంత గుండె జారేలా

1.పాలరాయిని వాడాడో
పాలకడలిన ముంచాడో
వెన్నెలనే లేపనంగా ఒళ్ళంతా పూసాడో
మల్లెలనే బతిమాలి తనువుకే అద్దాడో
వంపుసొంపులెంతగానో ఇంపాయెగా
వన్నెచిన్నెలెన్నెన్నో అన్నీ సమకూరెగా

2.జఢుడైన చెలరేగేను
యతికైన మతిపోయేను
యవ్వనం వనమల్లే పచ్చగా విరిసింది
పరిమళం మనసంతా  ఆక్రమించింది
విరహోత్కంఠితయై స్వాగతించగా
జన్మయే తరించదా సంగమించగా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ప్రమద సామీప్యం కనులకు దేదీప్యం
సుదతి సావాసం మనసున మధుమాసం
అతివ సాన్నిధ్యం శుక్లపక్ష కార్తీకం
ముదిత సౌరభం జీవితానికే శుభం

కంజముఖిని కాంచగా మది రంజిస్తుంది
అలివేణి అగుపిస్తే దివే భువికి వస్తుంది
సుజఘనను చూడగా మతిచలించిపోతుంది
కలశస్తని కలికిని తిలకిస్తే శ్రుతి మించిరాగమౌతుంది

వనితే తలపున వెన్నెల్లో ఆడపిల్ల
మగువే కలలో మధుర రసగుల్ల
కోమలి ఊహలొ ప్రియబాంధవి
తరుణే ఎదుటన జగముల జనని

చిత్రాలు:మా ప్రియతమ గురువు గారు శ్రీ ఆగాచార్య( Agacharya Artist)
గాజు కన్నా పారదర్శకం
గంగ కన్నా పరమ పునీతం
వజ్రాన్ని మించిన దృఢతరం
మన స్నేహితం అది శాశ్వతం

1.అశించుటకేమి లేనిది
పంచుకొనగ ఎంతో ఉన్నది
ఎద గానం కోరుకున్నది
మన మైత్రి అన్నది చితిదాటనున్నది

2.ప్రణాళికతొ సాధ్యపడనిది
అనూహ్యంగ ప్రాప్తమైనది
నిర్వచించ వీలుకానిది
మనదైన చెలిమి అదే మనకు కలిమి

3.కృతజ్ఞతను కాంక్షించనిది
మన్నింపును వాంఛించనిది
అభ్యర్థనలే అపేక్షించనిది
మన సౌరభం సదా సులభం

Monday, July 6, 2020

మరీచికవో మలయవీచికవో
నా మనోనావ దిక్సూచికవో
విధి చేతి పాచికవో నా బ్రతుకు సంచికవో
అపురూప సాలభంజికవో
ఎన్నాళ్ళు నాకు ప్రతీక్ష ఎందుకే ప్రేమ పరీక్ష
లక్ష్యపెట్టట్టానికేల లలనా నీకీ వివక్ష

1.నింగి నీవు నేల నేను
దిక్చక్రమల్లె తోచే మన సంగమం
ఎండ నీవు వాన నేను
సింగిడినే తలపించే మన ప్రణయం
ఊహలకే పరిమితమైతే
మనుగడకు ఊతమేది
ఆశించుటె దోషమైతే
చితికి పోని జీవితమేది

2.ముంచవూ తేల్చవూ
వినోదిస్తావూ నే మునకలేస్తుంటే
ఔననవూ కాదనవూ
ఆనందిస్తావు నే సతమతమైపోతుంటే
ఒప్పుకుంటే ఇలయే నాకం
తప్పుకుంటె భవితే నరకం
కొట్టుమిట్టాడుతున్నా
నేనున్నది త్రిశంకు స్వర్గం
ఉన్నదో లేదో తెలియని స్వర్గమంటె ఇఛ్ఛయేల
పరికించు ప్రకృతిని భువి దివియై దిసించదేల
అందనిదానికై అర్రులు సాచనేల
పరిసరాలు రమతిగా మలుచుకోవేల

1.ఎదుటివారుండరెపుడు నీకనుకూలంగా
పట్టువిడుపునీకుంటే ఆప్తులే జనమంతా
మార్చలేవు పరిస్థితులు నీకనుగుణంగా
పరివర్తన చెందగలవు నీవె తగిన విధంగా

2.స్పందించరెవరని వగపునీకెందుకు
పరుల ఎడల ప్రథమంగా నీవే చేయిసాచు
ఇతరులకీయగలదె ఆశించుట సబబు
ప్రశ్నించుట సరెగాని చెప్పెదవా జవాబు


Sunday, July 5, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:రేవతి

నుతించినా గతిగానవైతివి గంగాధరా
నిందాస్తుతికైనను స్పందించవైతివి సతీవరా
ఎందరెన్ని తీరుల నిను మును కొనియాడిరో
ఎవ్వరేమి ఆశించి నిను మది ప్రణుతించిరో
నన్నేల సదాశివా చేరనీవు నీదరి
నాకేల మహాదేవ వేదనలీ మాదిరి

1.భగీరథుని మనోరథము నెరిగితివే
లంకేశుడహంకరించ ఒప్పితివే
పాశుపతమునర్థించ పార్థుని బ్రోచితివే
మార్కండేయుని మృత్యువు బాపితివే
నన్నేల సదాశివా చేరనీవు నీదరి
నాకేల మహాదేవ వేదనలీ మాదిరి

2.పావురాల పరిక్రమకు పరసౌఖ్యమా
శునకానికి శివరాత్రిన సాయుజ్యమా
కరినాగుల అర్చనకూ కైవల్యమా
కన్నప్ప మూఢభక్తి ముక్తిదాయమా
నన్నేల సదాశివా చేరనీవు నీదరి
నాకేల మహాదేవ వేదనలీ మాదిరి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఆది గురువు నీవే-పరమ గురువు నీవే
జగద్గురువు నీవే-సద్గురుడవు నీవే
గురు దక్షిణామూర్తియే నమః
ఓం శ్రీగురు దక్షిణామూర్తియే నమః

1.తొలి పలుకులు నేర్పించిన అమ్మరూపు నీవే
ఓనమాలు దిద్దించిన ప్రథమ గురువు నీవే
సందేహాలు తీర్చిన అధ్యాపకుడవు నీవే
బ్రతుకు తెఱువు చూపించిన మార్గదర్శి నీవే
గురు దక్షిణామూర్తియే నమః-ఓం శ్రీగురు దక్షిణామూర్తియే నమః

2.వేదవాఙ్మయ దాత వ్యాసుని ఆత్మనీవె
ఆదిశంకరునిగా జన్మించినదీ నీవే
గురు రాఘవేంద్రునిగా వెలసింది నీవే
మహావతార్ బాబావై ఉదయించినదీ నీవె
గురు దక్షిణామూర్తియే నమః-ఓం శ్రీగురు దక్షిణామూర్తియే నమః

3..అజ్ఞానము నెడబాపే ఆత్మగురువు నీవే
బ్రహ్మావిష్ణుమహేశ్వర స్వరూపుడవీవే
గురుదేవ దత్తుని మూల తత్వమీవే
సద్గురు సాయినాథ అవతారము నీవే
గురు దక్షిణామూర్తియే నమః-ఓం శ్రీగురు దక్షిణామూర్తియే నమః

Saturday, July 4, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మోహన

పరులకోసం బ్రతుకడ మన్నమాట అటుంచు
నీకోసమె నీకు నీవుగ ఇకనైనా జీవించు
కోల్పోతే తిరిగిరాదని తెలుసుగా సమయం
నీఎడల నీవే శ్రద్ధగా చేసుకో కాలాన్ని వినిమయం

1.ఎన్నాళ్ళైనదో నిలువుటద్దం ముందు నిలిచి
తేరిపార ఆసక్తిగా నిన్ను నీవే పరికించి చూచి
ఎన్నిమార్పులు చేర్పులో నీదైన దేహస్థితిలో
వన్నెలెన్ని తరిగెనో వడిగ సాగే కాలగతిలో
ఎపుడుతీరునొ బ్రతుకు పరుగున ఆయాసం
ఎపుడుదొరుకునొ నీది మాత్రమే ఐన నిమిషం

2.నీలొకి నీవే తొంగిచూసిన సందర్భమే లేదు
నీతొ నీవే గడుపగలిగిన క్షణమొక్కటైన లేదు
చల్లగాలిని చందమామను అనుభూతి చెందావా
వాన ధారను వాగు ఈతను ఆస్వాదించావా
సమయమేదను సాకును నీకోసమైనా మరచిపో
బాల్యమిత్రుల స్నేహితాన్ని ఇపుడైన అందిపుచ్చుకో
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:కళ్యాణి

నిష్కామకర్మలే ఉత్కృష్టమైనవి
కర్మఫలాలేవైనా అన్నీ దైవానివి
కర్తవ్యపాలనయే కర్మానుష్ఠానము
నిస్పక్షపాతమే ఆచరించ శ్రేష్ఠము
వెంటాడును జన్మలు దాటి మన కర్మలు
వేధించును వ్యాధులతోని దుష్కర్మలు

1.యథాతథంగ స్వీకరించు జీవితం
అతిగా ఆశిస్తే అడియాసయె సంప్రాప్తం
వెతలన్నీ కతలేలే కలతల జతలేలే
అహమునొదల ఇహమున సుఖమేలే
వెంటాడును జన్మలు దాటి మన కర్మలు
వేధించును వ్యాధులతోని దుష్కర్మలు

2.సమర్పణ భావనే శిరోధార్యము
స్వీయాపాదనే ఫలితమందు వ్యర్థము
వికసించాలి ఎద ఎద ఔదార్యము
వసుధైక కుటుంబమే మనుగడ ఔషధము
వెంటాడును జన్మలు దాటి మన కర్మలు
వేధించును వ్యాధులతోని దుష్కర్మలు

Friday, July 3, 2020

నిన్ను చూడాలనుంది ఎన్నో చెప్పాలనుంది
మనసు విప్పాలనుంది మాట కలపాలనుంది
దాగుడుమూతలేల ధవళాంగి
గుండెలో గోప్యమేల కోమలాంగి

1.పొద్దుపొడుపు చూడగ నీ నుదుటిబొట్టు గుర్తొచ్చే
నింగిలో సింగిడి గాంచ  నీ హంగులే స్ఫురించే
గోరింటాకు కనగ నీ అరిచేతుల ఎరుపు తోచె
సెలయేటి గలగలలే నీ నవ్వులు స్మృతికి దెచ్చె
ప్రకృతిలో ప్రతిదృశ్యం తలపించె నీ రూపం
ఓపలేను ఇక జాప్యం నీ దర్శనమవశ్యం

2.నా కోసం  ఎంతగా ఎదిరిచూస్తున్నావో
మన ఎడబాటును ఎలా సహిస్తున్నావో
శుకమును చేరలేని శాపగ్రస్త శారికనే నేను
నా రాకను ప్రతీక్షించె అభిసారిక నీవైనావు
ఓర్వలేని విధి మనలను ఈ విధి వేధించే
జ్ఞాపకాలె కాలుతున్న విరహాగ్నిని చల్లార్చే

Thursday, July 2, 2020


"తస్మాత్ జాగ్రత జాగ్రత"

అనుకోని అతిథి కాదు
అనూహ్యమైన ఆగంతకుడూ కాదు
రాక తప్పని మృత్యుదూత
పడక తప్పదు దానివాత
వస్తుందా ఛస్తుందా అనుకోకు మిత్రమా
నాకైతే సోకదని భావించకు నేస్తమా
మినహాయింపేమి లేదునీకు ప్రియతమా
కనికరం లేనిదే కరోనా
నిర్లక్ష్యానికి మరణమే జరిమానా

1.జాగ్రత్తగ ఉన్నా తప్పుకొనగ కష్టము
ఏమరుపాటైతే కరోనా కడు స్పష్టము
నవ్వులాట కాదు నీదీ నీవారి జీవితం
తిరిగిరానిదొక్కటే మనిషి ప్రాణము
కనికరం లేనిదే కరోనా
నిర్లక్ష్యానికి మరణమే జరిమానా

2.మొక్కుబడిగ పెట్టుకొనే మూతి మాస్కులు
ముక్కువరకు తెరిస్తే తొలగవసలు రిస్కులు
చీటికి మాటికి బయటకొచ్చి ఏల వేస్ట్ హస్కులు
అత్యవసరాలు వినా మాను అన్ని టాస్కులు
కనికరం లేనిదే కరోనా
నిర్లక్ష్యానికి మరణమే జరిమానా

3.నువ్వులు ఆవాలు తప్పని సరి డైట్ కై
నిమ్మ నారింజలు తినాలి  విటమిన్ సి కై
పెంచుకొనే కృషిచెయ్యి  బాడీ ఇమ్యూనిటి కై
భౌతికదూరమొకటె కరోనరహిత కమ్యూనిటి కై
కనికరం లేనిదే కరోనా
నిర్లక్ష్యానికి మరణమే జరిమానా

4.వెంటాడి అంటకునే వింతవ్యాధిది సునో నా
అంటుకుంటె అంతుచూచు వైరసీ కరోనా
లంగ్స్ పగిలి ఊపిరాగి  చిత్రవధతొ  మరో నా
హెచ్చరికలు ఆచరిస్తే కిసీసే కభీ భీ డరో నా
కనికరం లేనిదే కరోనా
నిర్లక్ష్యానికి మరణమే జరిమానా



సాయీ అని పిలిచిచూడు
ఓయీ యని పలుకుతాడు
బాబా అని శరణు వేడూ
కంటికి రెప్పలా కాపాడుతాడు
సాయీ సాయీ సాయీ
బాబా బాబా బాబా

1.మనసారా సాయిని స్మరించు
తక్షణమే నీముందు అవతరించు
నోరారా బాబా యని భజించు
జన్మాంతర పాపాలూ అంతరించు
సాయి ధ్యాసయే ఒక యోగము
చేసుకో అనుక్షణం సద్వినియోగము
సాయీ సాయీ సాయీ
బాబా బాబా బాబా

2.సాయి సేవచేయుచూ తరించు
సకల భాగ్యాలు తాముగా వరించు
బాబా బోధలనే సదా ఆచరించు
బ్రతుకు నల్లేరు నడకయని గ్రహించు
సాయి సన్నిధే పరమ పెన్నిధి
బాబా అనుగ్రహమే జీవిత పరమావధి
సాయీ సాయీ సాయీ
బాబా బాబా బాబా
మొకమే సూపించక సాటేయ వడ్తివి
మొత్తుకున్నా పెడసెవిన మాట పెట్టవడ్తివి
రంగమ్మా నీ నంగనాచి నాటకాలు సాలుసాలు
నా గుండెకాయ నీదేనని తెల్సుకుంటె మేలుమేలు
మూణ్ణాళ్ళ ముచ్చటాయే ముద్దుమురిపాలు
నూరేళ్ళ పంటకదే అల్లుకుంటె మన బతుకులు

1.మోటబావికాడ నాకు సైగలేవొ జేస్తివి
సేనుగట్టుకాడ నీ సేయినాకు తగిలిస్తివి
ఏపసెట్టు నీడలోన నడుమొంపును సూపిస్తివి
మంచెమీద నీ పెయ్యిని మంచమల్లె పరిస్తివి
మూణ్ణాళ్ళ ముచ్చటాయే ముద్దుమురిపాలు
నూరేళ్ళ పంటకదే అల్లుకుంటె మన బతుకులు

2.మావితోపుకాడికైతె మరిమరి రమ్మంటివి
 దాచుకున్న రెండు పళ్ళు నాకని తీసిస్తివి
ముద్దుగుమ్మ గుమ్మపాలు కమ్మగ తాపిస్తివి
సావకుండ సర్గమేంటో సవిసూపిస్తివి
మూణ్ణాళ్ళ ముచ్చటాయే ముద్దుమురిపాలు
నూరేళ్ళ పంటకదే అల్లుకుంటె మన బతుకులు

Wednesday, July 1, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ముంగురులు చెప్పే ముచ్చట లేమిటో
ముసిముసి నవ్వులు పూసే ఘటనలు ఏవిటో
ఏ జ్ఞాపకాలు బుగ్గల సిగ్గుల నద్దేనో
ఏ వింతమైకాలు ఒంటిని కమ్మేనో
నీలో నీవే నేనుగా నాలో నేనూ నీవుగా
తడిసేము రేయి పగలు తలపులు ముంచగా

1.నీరెండ పోల్చుకుంది నీ మేని మెరుపుని
బొండుమల్లె తేల్చుకుంది తను కాస్త నలుపని
పచ్చదనం నినుమెచ్చి అలుముకుంది కోకగా
పసిడిగుణం తనువిచ్చి అల్లుకుంది అలవోకగా
నీలో నీవే నేనుగా నాలో నేనూ నీవుగా
నా ఊహల రూపం నీవేగా నీ కలల కల్పన నేనేగా

2.చిత్తరువయ్యాను నీ చిత్తరువు గని నేను
గమ్మత్తుగ చిత్తైనాను కించిత్తు స్పందిస్తేను
ఆషాఢ మాసాలు  పడుచుజంటలకు శాపాలు
కరోనా అంతరాలు చేరనీవు మన తీరాలు
నీలో నీవే నేనుగా నాలో నేనూ నీవుగా
నన్నావరించే సౌగంధి నీవు నిన్నలరించే గాంధర్వం నేను

మరచిపోతే ఎలా నా చెలీ
నను విడిచిపోకే ఓ జాబిలీ
మగువకే సాధ్యమౌనేమో నిర్లక్ష్యము
పడతికే అలవాటేమో ఈ టక్కరితనము

కాలిబంతిలాగా నన్నాడుకుంటున్నావే
పూలచెండులాగా ననువాడుకుంటున్నావే
తగదెనీకు తుంటరితనము-మానవే నెరజాణతనము
నన్నుంచుకోవే నీ తలపులోనా-నన్నుండనీవే నీ గుండెలోనా

మదిలోన మంటలు రేపి జారుకుంటావు
బ్రతుకంతా అలజడిరేపి తుర్రుమంటావు
అనురాగం అన్నదే యోగం-మనలేనే నీ వియోగం
మృతివరకు నిన్నే నే కోరుకుంటా-చితి చేరినాగాని నినువదలనంటా
రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:రేవతి

ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినం
చాతుర్మాస్యదీక్షకు ఈనాడే శ్రీకారం
అలసిన శ్రీహరి విశ్రమించు శుభతరుణం
పరిశుభ్రత శమదమ నియమ పాలన ఆచరణీయం

1.ఆరోగ్యానికే అగ్రతాంబూలం ఏకాదశి మర్మం
జాగరణ ఉపవాసం పండగ అంతరార్థం
చలవ పదార్థాల విస్మరించుటే పరమార్థం
వ్యాధులు ప్రబలకుండ చేపట్టే చర్యలసారం

2.విష్ణునామ సంకీర్తన శ్రేయోదాయకం
విష్ణుప్రియ కన్యను సేవించుట పుణ్యప్రదం
విష్ణుతత్వ జిజ్ఞాస చేర్చునులే పరమపదం
విష్ణు భక్తులమై పొందాలి జన్మసాఫల్యం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మోహన

ప్రధాని పదవే వచ్చింది తానుగా వరించి
ఆర్థిక సంస్కర్తగ నవభారత విరించి
నేడు జగమెరిగిన పీవిగారి శతజయంతి
జేజేలు పలుకుతోంది తెలుగుజాతి గర్వించి
జయహో పాములపర్తి వేంకట నరసింహారావు
జోహార్ నీకిదే తొలి తెలుగు ప్రధానిగా మరపురావు

1.బహుభాషా ధురీణుడు అపర చాణక్యుడు
తెలంగాణ మాగాణి పుత్రుడు రాజకీయ పవిత్రుడు
కాంగ్రేస్ విశ్వసనీయుడు గాంధీ పరివార విధేయుడు
కవిగా పండిత ప్రకండునిగా పేరొందిన వరేణ్యుడు
జయహో పాములపర్తి వేంకట నరసింహారావు
జోహార్ నీకిదే తొలి తెలుగు ప్రధానిగా మరపురావు

2.నిదానమే ప్రధానమని ఆచరించినవాడు
ఆచితూచి అడుగేసిన మంత్రాంగ యోధుడు
ముభావమే సర్వదా భావ ప్రకటనైనవాడు
పక్కా నిర్ణయాలె ప్రతీతిగా కలిగినవాడు
జయహో పాములపర్తి వేంకట నరసింహారావు
జోహార్ నీకిదే తొలి తెలుగు ప్రధానిగా మరపురావు

3.నిరాడంబరుడు నిగర్వి తాను నిస్పక్షపాతి
ప్రపంచాన ఇనుమడింపగచేసె భరతఖ్యాతి
తెలంగాణ మకుటంలో పివి కలికితురాయి
భారతరత్నమై వెలుగొందుటె తరువాయి
జయహో పాములపర్తి వేంకట నరసింహారావు
జోహార్ నీకిదే తొలి తెలుగు ప్రధానిగా మరపురావు