Thursday, November 21, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:శివరంజని

గుండె పెకిలించినా-పీకనులిమేసినా
ఉండదేమొ ఇంతటి ఈ బాధ
చెలి చేయిజారినంత వ్యధ
కాలమా ఏమినీ మాయాజాలం
కనులు సంద్రాలయ్యే ఈ ఇంద్రజాలం

1.తొలిచూపుల ఆ శుభవేళ
ప్రేమ మొలకెత్తిన నిమిషాన
లెక్కవేయలేదు ఏజాతకాలు
ఎంచిచూడలేదు కులమతభేదాలు
సమాజానికెందుకో చెప్పలేని ఉత్సాహం
ఈ పెద్దలకెందుకో మొత్తుకునే రాద్ధాంతం
నిలువునా కాల్చేసినా-కడుపులో కత్తిదించినా
ఉండదేమొ ఇంతటి ఈ బాధ-చెలి చేయిజారినంత వ్యధ

2.ఊరికెంతెంతొ  కడుదూరానా
బ్రతకనీయరామీరు మమ్ము మా మానాన
విడదీయగలరేమో మా ఇద్దరి తనువులను
వేరుచేయసాధ్యమా ఏకమైన మనసులను
గడపాల్సిన రోజుల్లో విషాదాన్ని నింపుతారు
పండంటి జీవితాల్లో దుఃఖాన్ని వంపుతారు
విషము మ్రింగించినా-గొంతు ఖండించినా
ఉండదేమొ ఇంతటి ఈ బాధ-చెలి చేయిజారినంత వ్యధ
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:ఉదయ రవి చంద్రిక

ఎక్కడచూసినా మిక్కిలి చక్కదనం
నీ తనువే ప్రేయసీ జక్కనచెక్కిన శిల్పం
నొక్కులున్న చెంపలు-చిక్కిన నడుమొంపులు
చెలీ నీవే స్వప్న సుందరీ-సఖీ నీవే పుష్ప మంజరి

1.అపురూప శంఖమేమో నీ కంఠాన
పూర్ణకలశాలు నీ విశాల వక్షాన
కిన్నెరసాని హొయలేమో నీకటి వలయాన
అహో బిలమెదురాయే ఉదరావర్తనాన
నూగారు మార్గమాయే అడుగిడ స్వర్గాన
చెలీ నీవే స్వప్న సుందరీ-సఖీ నీవే పుష్ప మంజరి

2.కోడెనాగు బుసలేమో వాలుజడ కదలికల
ఇసుకతిన్నెలేమో వెన్నులోయ అంచుల
హంసల దండు నిన్ను అనుసరించేలా
అమృతమంతా నీ మధుర అధరాల
చంద్రికాపాతమంతా రెండునయనాల
చెలీ నీవే స్వప్న సుందరీ-సఖీ నీవే పుష్ప మంజరి
https://youtu.be/-Nnyy8MCR6Q
రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:లలిత

నమ్మితే నష్టమేమిటీ
సాయీ నినువేడితే కష్టమేమిటి
చీకటైన బ్రతుకులకు వెలుతురు నీవని
మండుతున్న గుండెలకు వెన్నెల నీవని
జయహో సూర్య తేజా జయహో యోగిరాజా
జయహో శీతకిరణా జయహో సాయినాథా

1.విశ్వాసమె నా శ్వాస
నీ ఎడల గురి నా ఊపిరి
నా హృదయమే ద్వారకమాయి
నా జీవితమే నీకంకితమోయీ
జయహో సూర్య తేజా జయహో యోగిరాజా
జయహో శీతకిరణా జయహో సాయినాథా

2.నీ నామమె స్మరణీయం
నీ చరణమే   సదా శరణం
నీ బోధలే ఆనుసరణీయం
నీ మార్గమే ఆచరణీయం
జయహో సూర్య తేజా జయహో యోగిరాజా
జయహో శీతకిరణా జయహో సాయినాథా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మధ్యమావతి

నీతో నీవే ఉన్నావు
అనంతయానం చేస్తున్నావు
పుట్టకముందూ పోయిన పిదప
భువిన ఉన్నఈ నాలుగు నాళ్ళు
భావించరా నేస్తం ప్రతి వాళ్ళూ నీ వాళ్ళు
గడిపేయరా సంతోషంగా బ్రతికినన్నాళ్ళూ

1.ఉండబోవు ఉదయాస్తమయాలు
కానరావు రోదసిలో నదీనదాలు
గమ్యం తెలియని దీర్ఘ ప్రయాణం
చూట్టూ చీకటి అంతా ఏకాంతం
ఆకలి దప్పుల ఊసేలేదు రుచికీ పచికీ దిక్కేలేదు
కాలాన్నెపుడూ జుర్రుకో అనుభూతులనే నంజుకో

2.అందమైన నీరూపం ఉండబోదు ఆత్మకు
పంచేద్రియ పరితాపం కలుగబోదు జీవికి
పలికేందుకు ఎవరూ లేక పిచ్చిలేసిపోతుంది
నీ అధీనంలొ నువ్ లేకా విసుగు ఆవరిస్తుంది
కనిపించని దైవమేదో కనికరించి తీరాలి
క్షణం వృధా పరుచుకోక అనుభవించగలగాలి