Monday, May 25, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

తొట్రుబడితి నీ చూపులు వశపడక
ఆగనైతి నీ చెలిమికై  నేనాశపడక
బెట్టుచేయనైతినే నీ ప్రేమకు వశపడక
నిమిషమైన మనలేను నీవెంటపడక

1.వాస్తవాలు కాస్తా మ్రింగుడుపడక
కలలు కనుటకోసమే రోజూ నా పడక
మనసుకూ బుద్ధికీ ఎప్పూడూ పడక
నిన్నెంచుకున్నా ఏమాత్రం తడబడక

2.తగని తాళిబంధం ముడిపడక
నగవులపాలై ముందడుగే పడక
ఇంతేలే నా బ్రతుకంటూ దిగులే పడక
చేయందుకోవే చెలీ సందేహపడక
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఉండీలేని నల్లబొట్టు
కనుపాపలొ తేనెబొట్టు
చూపులేమొ బెదిరినట్టు
పెదాలు వదలనట్టు
ఎన్నెన్ని భావాలో జవరాల
తెలుపవెనీ అంతరంగ వివరాల

1.నటనల తింగరిబుచ్చి
సయ్యాటల నంగనాచి
ప్రతిసారీ నీతో ఇదే పేచీ
దరిజేరనీయవే ఓబూచి
నోట్లో వేలెట్టినా కొరకనోణ్ణి
కట్టావే కడకొంగున అమాయకుణ్ణి

2.మంత్రమేదొ వేసేసీ
చేయాల్సిందంతా చేసేసి
నా  మనసునే దోచేసి
నవ్వబోకు పిచ్చోణ్ణి చేసి
నట్టేట నను ముంచబోకే
ఉత్తుత్తిప్రేమలు పంచబోకే

PIC capture courtesy:TIKTOK
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:  యమన్ కళ్యాణి

శివ శివ శివ శివ శివ శివ శివోహం
భావయామి అహరహం త్వమేవాహం
ఉఛ్వాసనిశ్వాసల  నా ఊపిరి ఓంకారం
ప్రాణజ్యోతి నీ పరమే పరమేశ్వరమ్

1.నా గుణత్రయాలూ నీ మూడు నేత్రాలు
 నా ఈ త్రికరణాలు నీకై త్రివిధములౌ మార్గాలు
  నాపంచేంద్రియాలు నీవగు పంచాననాలు
  నా ప్రపంచమంత నీవైన పంచభూతాలు

2.అరిషడ్వర్గాలు కాలాత్మా నీ ఆరుకారులు
ప్రలోభపరచు షడ్రుచులు షడ్విధ నరకాలు
నా సప్త వ్యసనములు సప్త సముద్రాలు
నాలోని నవరసాలు  నవవిధ భక్తులు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మధువంతి

దాహం ఊహాతీతం
దాహం మోహాన్వితం
దాహం జీవనామృతం
దాహం ప్రాణికోటి వాంఛితం
ప్రణయ దాహం విరహం
జీవాత్మ దాహం పరమపదం

1.ఎడారిలో బాటసారి అనుభవైక వేద్యం
వేసవిలో పశుపక్షులు అల్లాడే కడుదైన్యం
పిడచకట్టుకున్న గొంతు తపనల ఆరాటం
నీటి విలువ బోధించే సద్గురువు పాఠం

2.ఆకర్షణ ప్రేమగా తలపోసే వ్యామోహం
అనుభవమే నోచక ఆర్జించే ధన దాహం
పదవికొరకు పతనమయే అధికార దాహం
గుర్తింపును కోరుకొనే వింత కీర్తి దాహం