Saturday, March 12, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గోదారి గంగలో తానాలు

నరసిమ్మసామి దర్శనాలు

ఏటేటా జరిగే జాతరా సంబరాలు

మొక్కులుముడుపులు కోరమీసాలు పట్టెనామాలు

గోవిందా గోవిందయని ఎలుగెత్తగ భక్తులు

పిక్కటిల్లు ధరంపురిలొ  నేల అంబరాలు


1.లచ్చిందేవి నరుసయ్యల పెండ్లే కనువిందు

కోనేట్లొ తెప్పదిరుగ సామిది షానా పసందు

డోలాలు ఊగుతుంటె పక్క చూపులే బందు

బుక్కాగులాలు బత్తెరసాల పేర్లు సామికె చెందు

గోవిందా గోవిందయని ఎలుగెత్తగ భక్తులు

పిక్కటిల్లె ధరంపురిలొ  నేల అంబరాలు


2.జోడు రథాలెక్కి కదుల నరహరి హరులు

తోకముడిచి పారిపోర కదాన  దానవ వైరులు

నలుదిక్కుల జైత్రయాత్ర సాగించి పలుమారులు

ఏకాంత సేవలో మునిగెదరు  శ్రీహరి సిరులు

గోవిందా గోవిందయని ఎలుగెత్తగ భక్తులు

పిక్కటిల్లు ధరంపురిలొ  నేల అంబరాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రవ్వలగాజులు చేతులకే రమణీయం

మువ్వల పట్టీల పాదాలే కమనీయం

నవ్వుల రతనాల మోవియే మాధుర్యం

పువ్వుల దండ వాలు జడకే సౌందర్యం

అన్నీ అమరిన నా నెచ్చెలి అందానికే అందం


1.సూర్యకాంతి మించిన మేను విణ్ణానం

చంద్రకాంతి వర్షించే కన్నుల విన్యాసం

అంగారక రంగీనే నుదుటన సిందూరం

గురుతరమై అలరారే యుగ పయోధరం

అన్నీ అమరిన నా నెచ్చెలి అందానికే అందం


2.పాంచజన్యం ప్రతిధ్వనించే కోమల గాత్రం

గాండీవాన్ని స్ఫురింప చేసే అంగ సౌష్ఠవం

సంగ్రామానికి సమాయత్తగా కుడి కురుక్షేత్రం

విజయాన్ని అందించడమే అంతస్సూత్రం

అన్నీ అమరిన నా నెచ్చెలి అందానికే అందం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ గతానికీ భవితకూ నేనౌతా వంతెన మిత్రమా

నీ ప్రగతికి ఆశయానికీ నేనౌతా నిచ్చెన

వేలుపట్టి నడిపించే తోడును నేనౌతా నేస్తమా

వెన్నంటి ఉండేటి చేదోడు వాదోడుగ జతగూడుతా


1.అవసరాలు నెరవేర్చే అద్భుత దీపమౌత

ఆపదలందు కాచు  యోధుని రూపమౌతా

నీ వేదన తొలగించే ఉల్లాసం కలిగించే వినోదమౌతా

కడుపార తినగలిగే కమ్మదనపు అమ్మచేతి ముద్దనౌతా


2.చెలిమిభ్రమలొ త్వరపడగ చెలియలికట్ట నౌత

తుప్పల దారుల తప్పించే కూడలి దిక్సూచి నౌతా

ఆనందం కలిగించే ప్రేరేపించే ప్రశంసకు అచ్చమైన అచ్చునౌత

వికాసాన్ని అందించే మెళకువ నేర్పించే మచ్చునౌత

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సరసిజనాభ హరి పుండరీకాక్ష

ఎన్నాళ్ళు స్వామీ ఈ కఠిన పరీక్ష

సప్తగిరీశా తాళజాల నీకై ఈ ప్రతీక్ష

చాలదా నాకీ జన్మకు ఇంతటి ఘోర శిక్ష

గోవింద గోవింద పాహి ముకుందా

ఆశ్రిత భక్త పోష పావన చరణారవింద


1.ఎవరైనా సుఖించిరా నిన్ను నమ్మి అనాదిగా

సంతోషమునందిరా నిన్ను కొలిచి నిత్యవిధిగా

దశరథుడూ లక్మణుడూ మైథిలీ హనుమంతుడు

త్యాగరాజు రామదాసు అన్నమయా జయదేవుడు

బ్రతుకంతా నీ స్మృతిలో నిరంతరం నీకృతిలో

గోవింద గోవింద పాహి ముకుందా

ఆశ్రిత భక్త పోష పావన చరణారవింద


2.ఎంతటి కష్టానికైన హద్దంటూ ఉండదా

ఏ దోషానికైన ఒక పద్దంటూ ఉండదా

తండ్రివి నీవుగాక తప్పులెవరు మన్నింతురు

దండించిన తదుపరి మము అక్కునెవరు చేర్చెదరు

నడుపుమమ్ము నీగతిలో చేర్చుకో నిర్వృతిలో

గోవింద గోవింద పాహి ముకుందా

ఆశ్రిత భక్త పోష పావన చరణారవింద

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అవధులులేనిది ఏదీ లేదు విశ్వం సహా

అపారమైన  నా ప్రేమ మినహా

పరిధులు కలదే ప్రతిదీయన్నది వ్యర్థపు ఊహ

అనంతమే నా హృదయ విశాలత ఎవరెరుగరు ఈ తరహా

నీవే నాలోకమై నీవంటే మైకమై నీతోనే నాకమై నువు లేక శోకమై


1.వదలను నీచేయి వదులుకోను ఈ హాయి 

వలపులు నీతోనే పగలూ రేయి

అడుగులొ అడుగేసి ఏడడుగులు నడిచేసి

తరిస్తా బ్రతుకంతా నీతో గడిపేసి

నీవే నాలోకమై నీవంటే మైకమై నీతోనే నాకమై నువు లేక శోకమై


2.ముగ్గులోకి ననుదించి  ప్రేమనెంతొ అందించి 

నీ దాసునిజేసావే నను మురిపించి

దాటిపోను నీ గీత జవదాటను నీ మాట

ఆనందనందనమే నాకు నీవున్నచోట

నీవే నాలోకమై నీవంటే మైకమై నీతోనే నాకమై నువు లేక శోకమై