Wednesday, November 13, 2019

నమ్మితినయ్యా నెమ్మనమ్మున
మా అమ్మను అన్నిట నమ్మినట్లుగా
అడిగితినయ్యా ఆదుకొమ్మని
మా నాన్నను యాగితొ అడిగినట్లుగా
కడుపునింపకా తప్పదునీకిపుడు
కలియుగవరదా వేంకటరమణా
కోరినదొసగకా గతిలేదిప్పుడు
కమలనాభా స్వామీ కరుణాభరణా

1.క్షణము విత్తము క్షణము చిత్తము
నా బ్రతుకే నువు రాసిన పొత్తము
భక్తపాలకా భవబంధమోచకా
శరణాగత వత్సల మోక్ష దాయకా
కడుపునింపకా తప్పదునీకిపుడు
కలియుగవరదా వేంకటరమణా
కోరినదొసగక గతిలేదిప్పుడు
కమలనాభా కరుణాభరణా

2.లిప్తపాటె గద మనిషి జీవితం
అంతలోనే నీ జగన్నాటకం
కేళీలోలా శ్రితజనపాలా
దురితనివారణ ధూర్తశిక్షకా
కడుపునింపకా తప్పదునీకిపుడు
కలియుగవరదా వేంకటరమణా
కోరినదొసగక గతిలేదిప్పుడు
కమలనాభా కరుణాభరణా

మౌనమె నా భాష
నగవే నా కవనం
చూపులు ఒలుకును కరుణరసామృతం
మానవతే నా హృదయధ్వానం

1.మనిషికి మనిషికి మధ్యన ఎందుకు
అపరిచిత భావనలు
భూగ్రహవాసులమేకదా దేనికి
వైరులమన్న యోచనలు
నేడోరేపో ఏక్షణమో ఎప్పటిదాకో
చెల్లగ నూకలు
ఉన్నన్నాళ్ళు తిన్నదరుగక
కాలుదువ్వడాలు
నా ఊపిరి వేదమంత్రం
నా గమనం భవ్యమార్గం

2.వేదించి పీడించి మ్రింగుడెందుకు
నెత్తుటికూడు
తేరగవచ్చినదేదైనా బిచ్చంతో
సరి ఏనాడూ
మిద్దెలు మేడలు ఏవైతేం
నీవా ఆస్తిపాస్తులు
ఆరడుగులలో కప్పెడినాక
నేలపాలే అస్తికలూ
నా గీతం తత్వసారం
నా లక్ష్యం స్నేహతీరం

రాగం:యమన్ కళ్యాణి


అడుగడుగూ నీ సంకల్పం
ప్రతిపదమూ నీ నామజపం
సద్గురు సాయినాథా
నీవేలేనా గతము భవిత వర్తమానము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

1.నా బ్రతుకున ఎలా ప్రవేశిస్తావో
దేనికొరకు నను నిర్దేశిస్తావో
ఏ పనినాకు పురమాయిస్తావో
ఏదిశగా నను నడిపిస్తావో
అంతానీదే భారం
జీవితమే నీ బోధలసారం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

2.సచ్చరిత్ర నాతో చదివిపిస్తావో
సత్సంగములో నను చేర్పిస్తావో
షిరిడీకెప్పుడు  నను పిలిచేవో
నీదయనెప్పుడు కురిపించేవో
అంతానీదే భారం
జీవితమే నీ బోధలసారం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి