Saturday, May 14, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గంటలు మ్రోగుతాయి ఎదలో-ఎదురుగా నీవొస్తే

మంటలు రేగుతాయి మదిలో - గోముగా నువుచూస్తే

అందమన్నదొకటే కాదు అందుకు కారణం

నీ మనసుకు నా మనసుకు  ప్రేమ తోరణం


1.పూలపట్టుగా చెట్టుని కనుగొని కోసినపుడు

పూలబుట్టగా పట్టు పావడను చేసినప్పడు

చిటారుకొమ్మన విరులుకోయ నిను మోసినప్పుడు

వెచ్చని మెత్తని నీ తనువే నాకొరిసినప్పుడు

ఉద్వేగంతో ప్రతిధ్వనించెనే చెలీ నా గుండె చప్పుడు


2.మామిడి తోపులో తాడుతొ ఊయల వేసినప్పుడు

నిలబడి ఎగబడి అల్లంతగ నువ్వూగినప్పుడు

విరబోసిన నీ నీలి కురులు గాలికి రేగినప్పుడు

పట్టుతప్ప నిను పట్టుకొనగ నా ఒడి చేరినప్పుడు

ఉద్వేగంతో ప్రతిధ్వనించెనే చెలీ నా గుండె చప్పుడు


https://youtu.be/8yrScsuhq_Y

 రచన,స్వరకల్పన&గానం: డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:ధర్మవతి


శుభములు చేకూర్చు నీ జయంత్యుత్సవాన

అఘముల నోకార్చు నీ ఆవిర్భవ సమయాన

శుభాకాంక్షలే నెరవేర్చు సర్వులకీ పర్వాన

శుభఫలాలనందించు మేమానందించు విధాన

ధర్మపురి నరహరీ మా హృదయ విహారి

దండంబులు నీకివే శంఖ చక్రధారి దుష్టసంహారి


1.హరిఏడని వదురుచుండ ప్రహ్లాద వరద

సరి గానరా యని కంబాన వెలిశావుగద

వరగర్వుడా హిరణ్యకశిపు నొనరించావు వధ

సవరించర మా బ్రతుకుని సరగున గోవిందా

ధర్మపురి నరహరీ మా హృదయ విహారి

దండంబులు నీకివే శంఖ చక్రధారి దుష్టసంహారి


2.పాపిగ నను నిర్ణయించి ఇపుడే రూపుమాపు

సంచిత పుణ్యముంటె సత్వరమే ఆర్తిబాపు

నిర్లిప్తతనికమాని ఉగ్రతనే బూనీ నీ ఉనికినే జూపు

నను ముంచినా తేల్చినా నాకు ముక్తి  నీ ప్రాపు

ధర్మపురి నరహరీ మా హృదయ విహారి

దండంబులు నీకివే శంఖ చక్రధారి దుష్టసంహారి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చారుకేశి


నమ్మితిని వేంకటపతి-నింపితి నిను నా మతి

చూసెదవని అతీగతి-నిలిపెదవని పరపతి

రానీ నను తిరుపతి-నీ చరణాలే నాకుగతి

గోవిందగోవింద శ్రీపతి-త్రికణశుద్ధిగా నీవే శరణాగతి


1.హాయిగొలుపు తిరుమల ప్రకృతి

బంగారు శిఖరాల మందిర నిర్మితి

ముగ్ధ మనోహరమే స్వామీ నీ సుందరాకృతి

పొగడగ నా తరమా నమోనమో రమాపతి


2.బండగమారె నా గుండెన కనగ ఆర్ద్రమే

గండములెన్నొ చేరె అడుగిడ కడు సాంద్రమే

కొండమీద సంద్రముంది నీ దయా సంద్రమే

అండకోరు వారిఎడల నీ కడ సౌహార్ద్రమే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తీయగా మూల్గుతోంది నా మనసు

నీ అందాలు ఆస్వాదించమని

ప్రబందాల కందని నీ పరువాలని

పదిలంగా పాటలో కుదించమని

వెతుకుతోంది నా మది కుతకుతలాడే  వెతకు మూలమేదని

ఆతురతగా ఉంది హృదయానికి 

తనుసాంతం నీసొంతం కావాలని


1.చెక్కణాల చక్కదనం కొక్కెమేయ వెక్కుతోంది

కక్కలేక మ్రింగలేక బిక్కచచ్చిపోతోంది

పక్కచూపులేవొ చూస్తూ ఫక్కున నవ్వుతోంది

లెక్కకు మిక్కిలిగా చిక్కుల చిక్కుతు చీకాకు పడుతోందీ

వెతుకుతోంది నా మది కుతకుతలాడే  వెతకు మూలమేదని

ఆతురతగా ఉంది హృదయానికి తను సాంతంనీకే సొంతంకావాలని


2.ఎద దాటదు ఏ భావన కలవరపెడుతున్నా

పెదవికైన తెలియదు కనులు కతలు పడుతున్నా

తలపెట్టిన ప్రతిసారీ పీకనొక్క ఆగిన మరులెన్నో

పుట్టిన ప్రతి తలపుకు కట్టిన తాజ్ మహలులెన్నెన్నో

వెతుకుతోంది నా మది కుతకుతలాడే  వెతకు మూలమేదని

ఆతురతగా ఉంది హృదయానికి తను సాంతంనీకే సొంతంకావాలని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అడ్డాలనాడే మన బిడ్డలు

గడ్డాలనాడు సెగ గడ్డలు

మమకారపు భావన మనది

బాధ్యత గర్జులన్న వాదన వారిది

తరాల అంతరాలలో నలుగుతున్న జీవులం

సతాయింపు సణుగుడులో సతమతమౌతున్న నిస్సహాయులం


1.మాటనుటకు వీలులేదు దాటవేయగా మరి దారిలేదు

తండ్రులకు కొడుకులకు జడవక గడవని మన

తీరు చేదు

భయము భక్తి గౌరవాలు ఫెద్దలకందించినాము

ఎదురుతిరిగి ఈసడించినా పిల్లలనాదరించినాము

మితమగు సంతతే ఈ గతికి కారణం

అతిగా ప్రేమించుటే దుస్థితి దర్పణం


2.ఆస్తులమ్మి అమెరికా చదువుకు  సాగనంపినాము

నెలకైనా తలవకున్నా కడుపుతీపితో మిన్నకున్నాము

తమ బ్రతుకే తమదనుకొన మద్దతుగా నిలిచాము

చరమాంకపు జీవితాన ఏకాకులమై

వగచాము

మారుతున్న కాలానికి మారాలి మనమే

చిరునవ్వుతొ స్వాగతించి కోరాలి మరణమే