Monday, December 14, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కమలమేదో ముఖ కమలమేదో

మందారమేదో అధరారుణమేదో

ఒయ్యారి నీ ఒంటి నిండ ప్రకృతి

సౌందర్యానికి నీవే సరైన ఆకృతి


1.నీలిమేఘమాల నీ కురులలో

కొలనులోని కలువలు నీ కన్నులలో

రాలిపడే మల్లెలే నీ మోవిలో

విరిసిన విరితోటయే నీ మోములో


2.గిరులు నీ వక్షస్థలమ్ములో

ఝరులు నీ కటిప్రదేశమ్ములో

లోయలో అగాధాలొ అరణ్యాలో

ఎదురౌతుంటాయి నీ మేనిలో

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చిక్కుజడల జడదారి

చిక్కునాకు ఝర్ఝరి

నా చిక్కుల పరిహారి

చిక్కితి నిను కోరి కోరి

నమో నమస్త్రిపురారి

నమోస్తుతే మదనారి

శరణు శరణు నెలదారి

కరుణాకర పాహి భూరి


1.నిండిపో నా చిత్తమందు

ఉండిపో గుండెయందు

నా మనసే కైలాసమందు

భవ రుజలకు నీవె మందు

నమో నమస్త్రి పురారి

నమోస్తుతే మదనారి

శరణు శరణు నెలదారి

కరుణాకర పాహి భూరి


2.అర్పించితి నా మదే

రసనపై నీ నామమదే

పలవరింతు పదేపదే

నీఎడభక్తి నాకుసంపదే

నమో నమస్త్రి పురారి

నమోస్తుతే మదనారి

శరణు శరణు నెలదారి

కరుణాకర పాహి భూరి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అందనివే లలనామణుల అందాలు

అవి గగన కుసుమ సమములు

అనుభూతించవే అంగనల పొంకాలు

అవి తావిలేని విరుల చందాలు

ఆరాధించాలి అపురూప సౌందర్యాన్ని

తరింపజేయాలి ఆస్వాదనలో జీవితాన్ని


1. కట్టు బొట్టులలో చక్కని సాంప్రదాయము

ఆకట్టుకొనే విధములో తెరచాటు సోయగము

సిగ్గులమొగ్గలౌతు మేనంతా సౌకుమార్యము

చూసిచూడగనే కలుగు ఎదనేదోచేసే ఆహ్లాదము

ఆరాధించాలి అపురూప సౌందర్యాన్ని

తరింపజేయాలి ఆస్వాదనలో జీవితాన్ని


2.మిసమిసలతొ  కసిరేపే నెరజాణతనము

ఉసిగొలిపే పరువాల మదన రంగస్థలము

కవ్వింపు చేష్టలతో మతినేమార్చు గుణము

అచ్చికబుచ్చికలతొ బుట్టలోపడవేసే మాటకారితనము

ఆరాధించాలి అపురూప సౌందర్యాన్ని

తరింపజేయాలి ఆస్వాదనలో జీవితాన్ని

 రచన,స్వరకల్పన&గానం :డా.రాఖీ


రాగం:చారుకేశి


చల్లనివాడే రేపల్లియవాడే

చిత్తముపై  మత్తునింక చల్లెడివాడే

నల్లనివాడే అల్లరివాడే

మెలమెల్లగ ఉల్లములే దోచెడివాడే


1.కల్లాకపటమే ఎరుగనట్టుంటాడు

ఎల్లలోకాలు నోట చూపెడుతుంటాడు

కల్లబొల్లిమాయల్లో పడగొడుతుంటాడు

వల్లమాలిన మైకంలో ముంచుతుంటాడు

అహం మమ భ్రమలందుంచుతాడు


2.జాడాపత్తాకలేక దొరకనేదొరకడు

జగమంతా తానే నిండి ఉంటాడు

జనన మరణాల చక్రం తిప్పుతుంటాడు

శరణాగతులకెపుడు వరమౌతుంటాడు

తానే ఇహపరమౌతుంటాడు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా కవితలా మారిపో ప్రతి రోజు

నిను స్ఫూర్తిగా గొనడమే నాకు రివాజు

నీ మృదుమంజుల భాషణతో

పరుగులిడును నా కలము

నీ పద మంజీర రవముతో

నా పదములౌను మంజులము


1.తలపున మెదులును నినుగాంచగ తులసికోట

భావనలో ఊరును  పలుకరించ తేనె తేట

నువు గాత్రం విప్పినంత ప్రతిఋతువున కోయిలపాట

నీ సన్నిధి అనవరతం పరిమళించు పూదోట


2.తూరుపు సింధూరం నీ నుదుటన మెరిసింది

చుక్కలదండు మల్లెచెండై నీ జడన అమరింది

అరవిరిసిన మందారం అధర మాక్రమించింది

గోదావరి గలగలయే నగవుల రవళించింది



నిను అర్చించుటకే నాకున్నవీ అవయవాలు

సాష్టాంగ ప్రణామాల అవినీ పదముల వాలు

నీ పదముల పొగడగ  పదములకే సవాలు

తిరుమలరాయా కలిగించు దివ్యమౌ అనుభవాలు

నమో వేంకటేశా  సంకట నాశా

ప్రభో శ్రీనివాసా శ్రితజన పోషా


1.ఉఛ్వాస నిశ్వాసల నిన్నే స్మరించనీ

మూసినా తెరచినా కనుల దర్శించనీ

ప్రతివస్తువు నీవేనను భావనతో స్పృశించనీ

నే చేరెడి ప్రతితావు తిరుమలగా ఎంచనీ

నమో వేంకటేశా  సంకట నాశా

ప్రభో శ్రీనివాసా శ్రితజన పోషా


2.నే పలికెడి పలుకల్లో గోవిందే ధ్వనించనీ

నా చేతలన్నీ నీ సేవలుగానే పరిణమించనీ

నిమిత్తమాత్రుడనై నీ ధ్యానమందే తరించనీ

నా చిత్తములో కేవల నీ ధ్యాసనే అవతరించనీ

నమో వేంకటేశా  సంకట నాశా

ప్రభో శ్రీనివాసా శ్రితజన పోషా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


లేవక ఆగునా నిను చూసిన క్షణానా

కాటికి కాళ్ళుచాచు ముదుసలైనా

మానక సాగునా అతి ఘోర తపమైనా

నీవెంట పడక ఎటువంటి తాపసైనా

మెరుపు తీగ నీ అందం చెలీ అందించవే

జలపాతం నీపరువం  ప్రేయసీ ననుముంచవే


1.పడి ఛస్తాను నీకోసం బ్రతికినంతకాలం

కళ్ళప్పగిస్తాను కలకాలం నీవే ఇంద్రజాలం

 తలదించుతాయి కుంచెలు నినుదించలేక

కలవరమొందుతాయి కలములు భావమందించలేక

మెరుపు తీగ నీ అందం చెలీ అందించవే

జలపాతం నీపరువం  ప్రేయసీ ననుముంచవే


2.హంపిశిల్ప సౌష్ఠవం బలాదూరు నీముందు

ఖజరహో వైభవం దిగదుడుపే నీవీయ పొందు

ఖంగుతింటారు నినుగని వాత్సాయనాదులు

వెలితనుకొంటారు నీ ఊసెత్తని అష్టపదులు

మెరుపు తీగ నీ అందం చెలీ అందించవే

జలపాతం నీపరువం  ప్రేయసీ ననుముంచవే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రాణం పోతే మాత్రమేమి-ఇచ్చిన మాటకోసం

బ్రతుకే బూడిదైతే ఏమి-చేసిన బాస కోసం

ఆడితప్పక ఆలిని సైతం అమ్మాడు హరిశ్చంద్రుడు

పలికి బొంకక సుతునివండె సిరియాళుని పితరుడు

పెదవిదాటనీయనేల నీపలుకే ఫలించలేకుంటే

వాగ్దానమీయనేల చేతల కసాధ్యమయ్యేదుంటే


1.చేప్పిందేదైనా తప్పక చేయటం సత్యవ్రత సాధన

చేసిందేదైనా ధైర్యంగా చెప్పటం సూనృత పాలన

ఆత్మసాక్షికే నీవు జవాబుదారునిగా

ఆత్మవంచన చేసుకోని ధీరునిగా

మూణ్ణాళ్ళుంటె చాలు జన్మకోసార్థకత

సంతృప్తిని పొందుచాలు శాంతీ సౌఖ్యత


2.అబద్దాలు వింతైన అంతులేని అంటువ్యాధులు

అసత్యాలు ఎంతగ నరికినా పుట్టుకొచ్చు దైత్యులు

హానిచేస్తే చేయనీ వాస్తవమెరిగించగా

ప్రాప్తమైందె దొరకనీ నిజాలనే తెలుపగా

నిదురిస్తే చాలు నేడిక నిశ్చింతగా

గడిపేస్తే చాలు బ్రతుకు యధేచ్ఛగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వదలలేని తంట-చల్లనైన మంట

నీడలా మనవెంట స్నేహితమంట

మేలుకొలుపు పాట-అమ్మ సద్ది మూట

బ్రతుకు పూలబాట-స్నేహితమే ఏ పూట


1.నా కోసమె నీవనే గట్టి నమ్మిక

నీ కోసమె నేననూ చెలిమి గీతిక

అనుక్షణం పరస్పరం బాగోగుల కోరిక

వెన్నుతట్టి చేయిపట్టి నడిపించే పూచీయిక


2.ఆత్మనేనూ పరమాత్మ నీవుగా

త్వమేవాహమనే తత్త్వ రీతిగా

నేను దేహమై నీవు ప్రాణమైన తీరుగా

మైత్రిని నిర్వచించలేమను వెలితి తీరగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రేమను టాక్సీగ వాడటం నీకు బాగా తెలుసు

గుండెను మిక్సీలొ రుబ్బడం నీకు మరిమరి తెలుసు

కల కందామన్నా కునుకును దోచేయడం

కలుసుకుందామన్నా మాట దాటేయడం

నీకు బాగా తెలుసు మరిమరి తెలుసు


1.తన్నుక వస్తాయి పదాలెన్నొ నువు తలపుకు వస్తే

తపనలు మొలుస్తాయి ఎదన నీవెదుటికొస్తె

తప్పించక పోమాకే ఒయ్యారి  చుప్పనాతి

గొప్పలన్ని నీవల్లే నువులేక నేనధోగతి


2.ఉడికించుట కోసమే ఉవ్విళ్ళూరుతావు

నన్నే మార్చుటకే నాటకాలాడుతావు

పడిపోయానెప్పుడో  నీ ప్రణయ పథకానికి

నీకధీనమైనానే  మూడుముళ్ళ బంధానికి