Sunday, September 1, 2019

OK

https://youtu.be/k6HICIGtyKs

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:ఆనంద భైరవి

కన్నిమూల గణపతి-నిను కన్నులార గాంచితి
కాణిపాక గణపతి-నిను వేనోళ్ళ పొగిడితి
రత్నగర్భ గణపతి- నీ మహిమలెన్నొ పాడితి
అష్టసిద్ధి గణపతి-నిన్నదే పనిగ వేడితి

1.నాహృదయ పీఠమెప్పుడు అధీష్ఠించి నిలువగా
నామనో నేత్రమెప్పుడు నిన్నే దర్శించగా
కనికరముతొ వరమీయి వరసిద్ధి వినాయకా
నా కరమును వీడకుమా కరిముఖ గణనాయకా

2.ఐహికమౌ వాంఛలన్ని అంకుశముతొ అణిచివేయి
ఇంద్రియ  విశృంఖలతను పాశముతో కట్టివేయి
నిన్నే నమ్ముకుంటిని-మది నాక్రమించువక్రతుండ
నీ పదమును విడువకుంటి ఏకదంత నీవెఅండ


కలలో నైనా ఊహకైనా ఉత్తుత్తిగానైనా
కలిసే భాగ్యం  మృగ్యమేనా కలతనిద్దురేనా
ఏ వేళ కలిసాయొ కళ్ళు వేసాయిలే చిక్కు ముళ్ళు

1.పదహారు ప్రాయాన  ప్రణయం
ఈనాటికీ అందాల స్వప్నం
ముదిమి పొలిమేరలోనా
ఆలంబనేగా అనురాగం
నువ్వుా నేనూ మనమన్నదీ
ఆహ్లాదకరమైన ఒక కల్పన

2.చేరువయ్యే లోగానే కాలం
పెంచింది ఎనలేని దూరం
మన భాష మౌన ప్రవాహం
తుదిలేనిదీ మన ప్రయాణం
మృతులు చితులు మననాపలేవు
స్మృతులు మతులు గతితప్పలేవు
https://youtu.be/0mG4cJCezQ0

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:నళినకాంతి

నళిన కాంతి నయన నగుమోము శ్రీపతి
ననుగొనిపోవా నీ తిరుమల తిరుపతి
పరమపదమె కాదా నీ పద సన్నిధి
పదిలముగా చేకొనరా ఓ పరమదయానిధి

1.తహతహలాడెడి చకోరి కోరు రీతిగా
తపనలనొందెడి చాతకమ్ము తీరుగా
ఆకలిగొనియున్న అన్నార్తి మాదిరిగా
నీకడ నిలవాలనీ నే కడతేరాలనీ
నిను నెర నమ్మితిరా రమాధవా మాధవా

2.తొక్కుడు బండలాగ ఓపిక నాకు లేదు
ప్రతీక్షణం ప్రతీక్షలో బ్రతుకగ నేనోపలేను
కఠోరమౌ నియమాల పాటించగా లేను
బలీయమౌ సంకల్పమె నా ఏకైక సాధన
నా ప్రార్థన మన్నించర కనికరముతొ కరివరద
https://youtu.be/SXK8f3l18KY

ఎందుకో దయమానినావు
ఏల మొకంచాటేసినావు
ఎలుక వాహనా నవ మోహనా
గజాననా నా ప్రియదైవమా
కినుకనొదిలి ననుబ్రోవరా
తాళజాల నిర్దయ మన్నించరా

1.నిను తలవని క్షణమేదొ చెప్పవయ్యా
నిను మొక్కని ఘటనేదో తెలుపవయ్యా
నిను పూజించని దినమొకటున్నదా
నిను ప్రార్థించక పని మొదలిడితినా
నా దోషమేదో ఎరిగించవయ్యా
నా నేరమేదో ప్రకటించవయ్యా

2.త్రికరణ శుద్ధిగా  నమ్మినది నిన్నేగా
త్రిగుణాతీతుడవని నిన్నే కొలిచితిగా
చవితినాడు ఎప్పుడైన చందురునణ్ణి చూసానా
నీ దర్శించక నీ  గుడిని దాటవేసానా
గుంజీలు తీసెదనిక తప్పులు క్షమియించరా
ఉండ్రాళ్ళు పెట్టెదనిక అలకనింక వీడరా
ఆరోగ్యమే మహాభాగ్యము
అన్న ఆర్యోక్తి అక్షర సత్యము
జబ్బుపడితెగాని ప్రతివారికి
 ఆ సంగతి అనుభవైకవేద్యము
నిర్లక్ష్యపు ఫలితానికి ఎప్పుడో
చెల్లించక తప్పదు మూల్యము
దీపమున్నప్పుడె కాచుకోవాలి
మన దేహదారుఢ్యము
జయహో దృఢభారత్
జయ జయహో ఆరోగ్య భారత్
జయహో జయహో సౌభాగ్య భారత్

1.ఎంత చులకన మేని పట్ల లోకాన
 పూసే రంగులకే విలువ మనిషి మొకాన
లోన లొటార ముంటేనో  పెరుమాళ్ళకెరుక
పైన పటారానికే జనం పట్టంకట్టే  వేడుక
చిన్ననాటినుండే తగిన ఆటలాడాలి
వ్యాయామపాఠాలు విధిగబోధించాలి
జయహో దృఢభారత్
జయ జయహో ఆరోగ్య భారత్
జయహో జయహో సౌభాగ్య భారత్

2.తెలతెలవారగనే మేలుకొని తీరాలి
పిల్లగాలుల స్వచ్ఛదనం ఆస్వాదించాలి
పచ్చదనం పరికిస్తూ నడక సాగించాలి
ప్రకృతి అందాలు పరవశంతొ చూడాలి
వీనులకింపైన సంగీతం వినాలి
తనువంతా తుళ్ళిపడగ సిగ్గుపడక నవ్వాలి
జయహో దృఢభారత్
జయ జయహో ఆరోగ్య భారత్
జయహో జయహో సౌభాగ్య భారత్

https://youtu.be/jdUzmrawUhs?si=Y7mSkWQZIwXiGu7L

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:చెంచురుట్టి


జగన్నాటక సూత్రధారి
అర్ధనిమీలిత నేత్ర మురారి
భక్తజన హృదయ విహారి
భావయామి భజియించెద నిను శౌరి

1.అంతరంగాన చూపావు అఖిలాండ విశ్వాన్ని
యుద్ధరంగాన ఆవిష్కరించావు ఆ విశ్వరూపాన్ని
మామూలు మనిషిలాగ కొంటెపనులు చేస్తావు
మాయతెరలు కప్పేస్తూ భ్రమలో ముంచేస్తావు
లీలామానుష వేషధారి శ్రీ హరి
చిత్తములో నిను నిలిపెద శిఖిపింఛమౌళి

2.నడిపేదినీవే ప్రతిఅడుగు భుక్తి కుడిపేది నీవే
గడిపేదినీతోనె అనుక్షణము అంతరాత్మగానే
కర్తవునీవని కర్మవూనీవని  గీతన బోధిస్తావు
కర్తవ్యపాలనకై మము ఉద్యుక్తులచేస్తావు
జయ జనార్ధనా గోవర్ధన గిరిధారి
నా జీవన సారథీ వనమాలీ చక్రధారి










https://youtu.be/nJ5K_qbTWUQ

కదలిరార గణపతి
ఎలుకనెక్కి ఉధృతి
ఈనాడే నువు పుట్టిన భాద్రపద శుద్ధ చవితి
అందుకొనగ వేంచేయి మా పూజలూ హారతి
జై గణేశ జై గణేశ జైగణేశ దేవా
చేయిపట్టి నడిపించు మము సద్గతి త్రోవ

1.వేనవేల మండపాలు సిద్ధముగా ఉన్నాయి
నిన్ను ఎదుర్కొనుటకై తయారు డోలూ సన్నాయి
కొలుతుమయ్య వినాయకా నిను పగలూ రేయి
నవరాత్రులు నీ భజనలు ఎంతెంతో హాయి
జై గణేశ జై గణేశ జైగణేశ దేవా
చేయిపట్టి నడిపించు మము సద్గతి త్రోవ

2.తీరొక్క పూలతో  అలంకరించేమయా
అందాల మాలలెన్నొ నీ మెడలో వేతుమయా
షడ్రుచుల నైవేద్యాలు నివేదించేమయా
చల్లగ మము చూడుమని నిన్నువేడుకొనెదమయ్య
జై గణేశ జై గణేశ జైగణేశ దేవా
చేయిపట్టి నడిపించు మము సద్గతి త్రోవ