Friday, October 28, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎన్నో తెలుసు అన్నీతెలుసు

అయినా వినదీ పిచ్చి మనసు

తప్పూ తెలుసూ ఒప్పూతెలుసు

అసలే మానదు ఎందుకింత అలుసు

మనసు మాట వినదు

అది నీదై పోయినందుకు


1.నిన్ను తలవగనే పురులు విప్పుతుంది

నిన్ను చూడగానే మరులు గుప్పుతుంది

పరిధులు మీరమని నొక్కి చెప్పుతుంది

ఎడబాటు భారమని ఏడ్చి రొప్పుతుంది

ఈ మనసు మాటవినదు నీదై పోయినందుకు


2.ఎన్నిసార్లు దాటవేసినా నీ వెంటపడుతుంది

గుట్టుగా దాచ జూసినా ఓ కంటకనిపెడుతుంది

కొస ఊపిరి దాకా ఆశ వదలుకోనంటుంది

పట్టువదలక పదేపదే జట్టుకట్ట మంటోంది

నా మనసు మాటవినదు నీదైపోయినందుకు

https://youtu.be/7TiH1v7Marw

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:రేవతి


శశిధరా గంగాధరా

జటాధరా నీలకంధరా

భస్మధరా చర్మాంబరధరా

త్రిశూలధరా ఢమరుధరా

ఖట్వాంగధరా పురంధరా

వందనాలు గొనరా సుందరా

నా డెందమందు మనరా మనోహరా

1.రాజధరా విషధరా మృగధరా

కుముద ధరా అజకావగ ధరా

నాగాభరణధరా శితికంధరా

కపాలధరా ఖండపరశుధరా

అనాలంబిధరా అర్ణవతూణీర ధరా

వందనాలు గొనరా సుందరా

నా డెందమందు మనరా మనోహరా


2.పశుపతి గౌరీపతి మదనారి

కపర్దీ ధూర్జటీ ఝర్ఝరీ

పినాకి పురారి భూరీ

విలాసీ ముక్కంటి మల్లారీ

జ్వాలి కపాలి పింగళి

వందనాలు గొనరా సుందరా

నా డెందమందు మనరా మనోహరా

*ఇది నా 3000 వ గీతం🌹😊💐🙏*


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:శివరంజని


పల్లవి: 

వీణా నిక్వణ మాధురి ఆహ్లాదమే

గమనింతురా తెగిన వ్రేలికొసల గాయాలు

వేణువాద్య వాదన మెంతో హృద్యమే

ఎరుగుదురా ఎవరైనా ఊపిరితిత్తుల ఆర్తనాదాలు

నవ్వులు పూసే పెదవుల మాటున

హృదయ విదారాలు

మెరిసే కన్నుల వెనకగ దాగిన

అశ్రు సాగరాలు…


చ.1.కమ్మని కవితల కావ్యపఠన కమనీయమే

అనుభూతుల ప్రసవవేదన అనుభవ గ్రాహ్యమే

ఇంపగు దృశ్యపు వర్ణచిత్రాలు రమణీయమే

ఊహకు రూపకల్పనలోని సృజనా అనూహ్యమే

నవ్వులు పూసే పెదవుల మాటున

హృదయ విదారాలు

మెరిసే కన్నుల వెనకగ దాగిన

అశ్రు సాగరాలు…


చ.2.ఎలుగెత్తి ఆలపించే గానం శ్రవణానందమే

స్వరతంత్రులు పెగిలించగా రేగే యాతన విదితమే

హావభావ విన్యాసాల నాట్యం నయనానందమే

ధరణి తాడనతొ పదముల పీడన వ్యధాబరితమే

నవ్వులు పూసే పెదవుల మాటున

హృదయ విదారాలు

మెరిసే కన్నుల వెనకగ దాగిన

అశ్రు సాగరాలు…


*ఇది నా 3000 వ గీతం🌹😊💐🙏*