Sunday, February 21, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పోతపోసిన తెలుగు కవిత నీవు

హృద్యమైన తెలుగు వెలుగు పద్యమె నీవు

అమృత భాష అమ్మభాష తెనుగుకే సొంతము

అష్టావధానమై అలరించు నీ అందము

నీలోని అణువణువు ఒక ప్రబంధమే

నీ ప్రతి కదలిక సైతం అపురూప కావ్యమే


1.వసుచరిత్ర యే స్ఫురించు నీ వదనంలో

శృంగారనైషధాలు నీ కనుసదనంలో

యయాతి చరిత్రయే నీ నీలి కురులలో

స్వారోచిషమను సంభవాలు నీ మేనులో

నీలోని అణువణువు ఒక ప్రబంధమే

నీ ప్రతి కదలిక సైతం అపురూప కావ్యమే


2.పారిజాతాపహరణం నీ ముక్కు చక్కదనంలో

కళాపూర్ణోదమే నీ  నొక్కుల చెక్కిళ్ళలో

రాజశేఖర చరిత్రమే నీ పలుకుల చతురతలో

ఆముక్తమాల్యదే నీ బాహుబంధనంలో

నీలోని అణువణువు ఒక ప్రబంధమే

నీ ప్రతి కదలిక సైతం అపురూప కావ్యమే


(మాతృభాషా దినోత్సవం సందర్భంగా)

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వర్ణించనా నీ అపురూప రూపాన్ని

కీర్తించనా నీ గుణగణ విశేషాలని

అభినుతించనా నీ లీలావిలాసాలని

భజించనా  దివ్య పంచాక్షరీ  మంత్రాన్ని

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


1.పంచముఖా పంచభూతాత్మికా

పంచాక్షర నామాన్వితా ప్రపంచేశ్వరా

పంచామృతాభిషేక ప్రియ పంచప్రాణేశ్వరా

పంచాయుధ ధరా పంచశర హరా

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


2.శివరాత్రి లింగోద్భవ గాథ పాడనా

త్రిపురాసుర వధ కథనే నుడవనా

శ్రీ కాళ హస్తి భక్తి లీలను కొనియాడనా

భూకైలాసమా గోకర్ణ క్షేత్ర మహిమ పొగడనా

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


సింగారాల శ్రీనివాసా

వైభోగాల వేంకటేశా

ఎన్నినోళ్ళపొగడుదు నీ వైభవం

ఎంతని చాటను నీ ప్రాభవం

తిరుపతి బాలాజీ గోవిందా గోవిందా

తిరుమల గిరి విరాజి పాహిముకుందా


1.ఎంతకూ తీరిపోని నీ పెళ్ళి అప్పులు

భక్తుల ఆర్జీలు తీర్చ నీకెన్ని తిప్పలు

సతులిరువురు సాధించే ఒప్పుల కుప్పలు

ఎన్నని కొనియాడుదు స్వామీ నీ గొప్పలు

తిరుపతి బాలాజీ గోవిందా గోవిందా

తిరుమల గిరి విరాజి పాహిముకుందా


2.ఏడుకొండలెక్కితేమి ఎరిగిరార తిరువళ్ళు

మెక్కుబళ్ళుతీర్చుకోను కొట్టింతురు గుళ్ళు

రెప్పపాటులోన దాటు బంగారు వాకిళ్ళు

అనిమేషులౌదురట మూయక రెండుకళ్ళు

తిరుపతి బాలాజీ గోవిందా గోవిందా

తిరుమల గిరి విరాజి పాహిముకుందా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాసుకపూసుక తిరిగేద్దామా

అచ్చిక బుచ్చికలాడేద్దామా

మనసు కవితలెన్నో రాసేద్దామా

మమత గంధమంతా పూసేద్దామా


1.భావానికి మాటలల్లి పాటలే కట్టేద్దాం

అనుభవాల తోటలన్ని హాయిగా చుట్టేద్దాం

నీ చూపులు నాకు సుప్రభాతమైపోగా

నీ చేరువలోనా వసంతమే తోచగా


2.పదాలనే అందెలుచేసి మంజుల సడి పలికిద్దాం

పెదాలనే పువ్వులుచేసి నవ్వుల జడి కురిపిద్దాం

నీ కలకలమే  నన్ను వెన్నుతట్టగా

నీ చెలిమి బలమే నా ప్రగతికి మెట్టుగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎప్పుడెగిరిపోతుందో అహమను హంస

ఐక్యమొందింతువెపుడొ ఓ పరమహంస

దైహిక భావనయే నాకెంతటి హింస

చివికిపోయెనిది ఇంక వదిలించర సర్వేశా


1.తప్పవాయె తనువుకు శీతోష్ణ స్పందనలు

మిక్కిలాయే ఈ మేనుకు సుఖదుఃఖ భావనలు

చిక్కిపోతి చిక్కులబడి కాయముతో ముడివడి

వేడుకొందు చేదుకొనగ నీ కడ సాగిలబడి


2.తెగత్రెంచినాగాని తగులుకొనే బంధాలు

విదిలించినాగాని అతుక్కునే బాధ్యతలు

అంతన్నదిలేదాయే ఎంతనీ ఎంతకనీ జంజాటం

సచ్చిదానంద మొసగు తీరగ నా ఆరాటం