Friday, January 26, 2024

 

https://youtu.be/ZUz06ccSf1A?si=NJ_p_ujEYiSmrxKe

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

కోలాటమాడరమ్మ కోమలాంగులారా
చిందేసి ఆడరమ్మ ముద్దుగుమ్మలారా
సరదాల బతుకమ్మ  సంబరమొచ్చె అమ్మలార
గౌరమ్మ తల్లిని కొలువరమ్మ కొమ్మలారా

1.చక్కని చుక్కలంటి అక్కయ్యలారా
   చిన్నారి అల్లరి చెల్లెమ్మలారా
   వన్నె చిన్నె లెన్నొ ఉన్న వదినమ్మలారా
   నిండు ముత్తైదువ లత్తమ్మలారా
   రండిరండి ఇరుగు పొరుగు రత్తమ్మలారా
   ఆడి పాడి బతుకమ్మ కారగింపు నీయరమ్మ

2.పట్టు పావడాలను దిట్టంగా కట్టినారు
సిల్కు సిల్కు కోకలను పొందిగ్గ చుట్టినారు
మెడల నిండ నగలెన్నొ అమరించినారు
పూమాల కొప్పునెట్టి సొగసు కుమ్మరించినారు
అవనికంతటికి అందంచందం అతివలేగా మెండుగ
పండుగలన్నిటికి అందం ఆనందం బతుకమ్మ పండుగ

 


https://youtu.be/5ElylbfKntQ?si=WJF11Iwl85T8fB4m

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:మాయా మాళవ గౌళ

తుమ్మెదా తుమ్మెదా తుమ్మెదా
బతుకమ్మ తెలంగాణ సంస్కృతీ సంపదా
తుమ్మెదా తుమ్మెదా తుమ్మెదా
భామలకే సొంతమైంది బతుకమ్మ పండగా
పూలన్నీ  పలుకుతాయి తుమ్మెదా
ఎదఎదలో సొదలెన్నొ తుమ్మెదా
అందాలు చిలుకుతాయి విరులన్ని తుమ్మెదా
రంగులెన్నొ ఒలుకుతాయి మురిపెంగ తుమ్మెదా

1.తనకూ ఒక రోజొచ్చేను తుంటరి తుమ్మెదా
తంగేడు పువ్వు కూడ నేడు హాయిగ నవ్వె కదా
గుట్టుపట్టు వెతికి పట్టుకొస్తిమా తుమ్మెదా
గునుగు పూవూ సైతం తానూ గర్వించదా
గాలికి పెరిగిన గుమ్మడిపూవు తుమ్మెదా
రాణలెన్నో కుమ్మరించదా తుమ్మెదా
బురదలొ పుట్టిన కలువ కమలం తుమ్మెదా
బతుకమ్మగా ఒదగవా బంగారు తుమ్మెదా

2.హరి  చేరువ నోచని బంతులు తుమ్మెదా
సరి నలంకరించునే బతుకమ్మను తుమ్మెదా
గులాబీ చేమంతులూ  చిన్నారి తుమ్మెదా
తమవంతుగా అలరించవా బతుకమ్మను తుమ్మెదా
అమ్మగా ఆడపడుచుగా తుమ్మెదా తుమ్మెదా
బతుకమ్మను తలచేమిట తుమ్మెదా
ఆది దేవతగా గౌరమ్మగా తుమ్మెదా తుమ్మెదా
ఆడిపాడి అందరమూ కొలిచేము తుమ్మెదా